Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

'సుప్రీం' న్యాయం దూరాభారం!

గౌరవంగా వినడం, తెలివిగా సమాధానం చెప్పడం, ఉదారంగా వ్యవహరించడం, నిష్పక్షపాతంగా తీర్పు చెప్పడం న్యాయమూర్తికి తెలిసి ఉండాలంటాడు సోక్రటీసు. దేశంలో వివేచన, విశ్వసనీయత కలిగిన న్యాయమూర్తులకు కొదవలేకపోయినా- కొండల్లా పేరుకుపోతున్న అపరిష్కృత కేసులు ఎప్పటిలోగా కరుగుతాయన్న ప్రశ్నకు ఎంత పెద్ద జడ్జీ అయినా జవాబు చెప్పే పరిస్థితి లేదు. న్యాయం ఎంత గొప్పదైనా అది దేశంలో అందరికీ అందే పరిస్థితి లేనప్పుడు చట్టబద్ధ పాలన అర్థం లేనిదిగానే మిగులుతుంది. ఇకమీదట ఒక్క కొత్త కేసు కూడా దాఖలు కాని పక్షంలో- ప్రస్తుతం పెండింగులో ఉన్నవాటిని పరిష్కరించేందుకు భారత్‌లోని కోర్టులకు మరో 350ఏళ్లు పడుతుందని అంచనా! న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తున్న పరిణామమిది. న్యాయాన్ని గాడినపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణ, పెండింగ్‌ దస్త్రాల డిజిటలైజేషన్‌ వంటి అనేక ప్రత్యామ్నాయాలు తెరమీదకు వచ్చాయి. వాటిలో ఏ ఒక్కటీ పూర్తిగా కార్యరూపం దాల్చకపోవడంతో న్యాయం ఇప్పటికీ చాలామందికి అందని మానిపండుగానే మిగిలిందన్నది వాస్తవం. సాంకేతిక సంపత్తి, భారీ నిధులతో ముడివడిన ఆ పరిష్కారాలు భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో సత్వరం పట్టాలకెక్కుతాయనుకోలేం! అయితే భారీ ఖర్చుతో నిమిత్తంలేని బలమైన పరిష్కారాలనూ ఏవో సిద్ధాంతాలపేరిట ఏలినవారు తిరగగొడుతుండటమే విచిత్రం. పెండింగ్‌ కేసులను తెగ్గోసి, సామాన్యుడికి న్యాయాన్ని చేరువచేసే ప్రాంతీయ సుప్రీం కోర్టుల ప్రతిపాదనను సర్వోన్నత న్యాయస్థానంతోపాటు ప్రభుత్వమూ ఒక్కపెట్టున తిరస్కరించడమే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం!

వికేంద్రీకరణ అవశ్యం

'సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడంకోసం కేరళ, మణిపూర్‌, గుజరాత్‌, కశ్మీర్‌ వంటి సుదూర ప్రాంతాలనుంచి దిల్లీకి రావడం సామాన్యులకు శక్తికి మించిన పని. దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో 'సుప్రీం' బెంచీలను ఏర్పాటు చేస్తే న్యాయార్థులకు డబ్బు, సమయం కలిసిరావడంతోపాటు న్యాయమూ చేరువవుతుంది'- దేశంలో సుప్రీంకోర్టు బెంచీలు ఏర్పాటు కోరుతూ ఎ.ఎం.కృష్ణ అనే న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌లో చేసిన వ్యాఖ్యలవి. 'ఆలోచన బాగానే ఉందిగానీ... ఇలాంటి ప్రతిపాదనలను గతంలో సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కొట్టివేసింది. ప్రత్యేక బెంచీల ఏర్పాటుకు ప్రధాన న్యాయమూర్తికి వీలు కల్పిస్తున్న 130అధికరణను ఇప్పటికిప్పుడు ఉపయోగించలేం'- పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.ఎల్‌.దత్తు వెలిబుచ్చిన అభిప్రాయమది. దేశంలో న్యాయంకోసం ఎదురుచూస్తున్న లక్షలమంది కక్షిదారులను, న్యాయార్థులను ఉస్సురుమనిపించిన తీర్పు అది. లా కమిషన్‌లు, వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాలు 'సుప్రీం బెంచీ'ల ఏర్పాటు ఆవశ్యకతపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తూనే వస్తున్నాయి. కానీ ఏ దశలోనూ వాటి విజ్ఞప్తులకు ప్రభుత్వంనుంచి, కోర్టులనుంచి మన్నన దక్కలేదు. ఎన్నిసార్లు తిప్పిపంపినా దేశవ్యాప్త మేధావులు, న్యాయవాద సంఘాలు, న్యాయార్థులనుంచి అదే డిమాండ్‌ పదేపదే వెల్లువెత్తడం తేలిగ్గా కొట్టిపారేయాల్సిన అంశం కాదు. నిరుడు ఇదే డిమాండుతో దాఖలైన ఓ పిటిషన్‌పై స్పందిస్తూ ఆరు నెలల్లోగా 'సుప్రీం బెంచీ'ల వ్యవహారంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే మోదీ ప్రభుత్వం ప్రాంతీయ బెంచీల ఏర్పాటుకు తాము సుముఖం కాదంటూ 2015 ఏప్రిల్‌లో అభిప్రాయం వ్యక్తంచేయడంతో ఆందోళన చెలరేగింది. సుప్రీంకోర్టుసహా సర్కారుసైతం ప్రాంతీయ కోర్టుల ఏర్పాటు కూడదని కరాఖండీగా తేల్చేయడంతో సామాన్యుడికి 'న్యాయం' దక్కేదెలాగన్న గళాలు బలం పుంజుకొన్నాయి.

రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లోని 39(ఎ) అధికరణం న్యాయం పొందడాన్ని అత్యంత ముఖ్యమైన మానవ హక్కుగా వ్యాఖ్యానిస్తోంది. దురదృష్టవశాత్తూ దిల్లీదాకా వెళ్ళి పోరాడే స్థోమతగలవారికే దేశంలో ఇప్పుడు న్యాయం 'అందుబాటు'లో ఉంది. ప్రయాణ ఖర్చులు, దిల్లీలో కేసు వాదించగల న్యాయవాదిని మాట్లాడుకోవడం, రెండు మూడు రోజులకు తగిన వసతి ఏర్పాట్లకోసం న్యాయార్థులకయ్యే వ్యయం అంతా ఇంతా కాదు. పైపెచ్చు కేసు వాయిదా పడినకొద్దీ తక్కువలో తక్కువ లక్ష రూపాయల దాకా అదనంగా ఖర్చు పెరుగుతూ ఉంటుంది. డబ్బున్నవారు తప్ప న్యాయం పొందలేని ఈ దురవస్థ కొనసాగడమంటే మానవ హక్కులకు నేరుగా తూట్లు పొడవడమే! హైకోర్టుల్లో న్యాయం జరగలేదని భావించిన చాలామంది ఖర్చులకు భయపడి దిల్లీవరకూ వెళ్ళేందుకు సాహసించడం లేదు. తాజా సర్వే ప్రకారం ఉత్తరాది హైకోర్టులనుంచే సర్వోన్నత న్యాయస్థానానికి అధికంగా 'అప్పీళ్లు' వెళుతున్నాయి. దిల్లీనుంచి 14శాతం, పంజాబ్‌-హరియాణాలనుంచి 9.8శాతం, ఉత్తరాఖండ్‌నుంచి ఏడుశాతం, హిమాచల్‌ప్రదేశ్‌నుంచి 4.3శాతం అప్పీల్‌ కేసులు సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలవుతున్నాయి. 'సుప్రీం'దాకా వెళుతున్న కేసుల్లోదక్షిణాది రాష్ట్రాల వాటా మరీ తక్కువగా ఉంది. కేరళనుంచి 2.5శాతం, ఆంధ్రప్రదేశ్‌(ఉమ్మడి)నుంచి 2.8శాతం, తమిళనాడునుంచి 1.1శాతం కేసులు మాత్రమే సర్వోన్నత న్యాయస్థానంలో నమోదవుతున్నాయి. ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రాల వాటా మరీ తీసికట్టుగా ఉంది. దిల్లీకి దూరంగా ఉన్న రాష్ట్రాలు 'న్యాయాని'కీ దూరమవుతున్నాయని చెప్పేందుకు ఇంతకుమించిన తార్కాణం లేదు. డబ్బు, తాహతు ఉన్నవారు మాత్రమే దిల్లీ వెళ్ళి; ఎన్ని వాయిదాలు పడినా వేచి ఉండి న్యాయం సాధించుకోగల ఈ వాతావరణం- బడుగులకు నిర్ద్వంద్వంగా న్యాయాన్ని నిరాకరిస్తోంది! ప్రాంతీయ కోర్టుల ఏర్పాటును తిరస్కరిస్తూ ప్రభుత్వం, 'సుప్రీం' వినిపిస్తున్న అభిప్రాయం జాతి వాస్తవ అవసరాలను ప్రతిబింబించడం లేదన్న వాదన ఉంది. సుప్రీంకోర్టును విభజించి వివిధ ప్రాంతాల్లో 'బెంచీలు' ఏర్పాటు చేస్తే భిన్నత్వంలో ఏకత్వ భావనకు విఘాతం కలుగుతుందని; సర్వోన్నత న్యాయస్థానం గౌరవానికి భంగం వాటిల్లుతుందన్న వాదన చెవినబడుతోంది. పాలన సౌలభ్యంకోసం ప్రపంచ దేశాలన్నీ వికేంద్రీకరణ బాటపట్టి ఎక్కడికక్కడ స్థానిక స్వపరిపాలన స్ఫూర్తిని కదం తొక్కిస్తున్న తరుణంలో ఈ వాదన హేతుబద్ధమా అన్నది అనుమానమే. కేసుల భారం పెరగడంతో ఏ అంశంపైనా లోతుగా చర్చించే వాతావరణం ప్రస్తుతం దేశంలోని కోర్టుల్లో లేదన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి తరుణంలో సర్వోన్నత న్యాయస్థానాన్ని రాజ్యాంగపరమైన, చట్టపరమైన విభాగాలుగా వర్గీకరించాలన్నది న్యాయకోవిదుల అభిప్రాయం. లెక్కకు మిక్కిలి ట్రైబ్యునళ్లు, 24 హైకోర్టుల నిర్ణయాలపై దాఖలైన అప్పీళ్లను పరిష్కరించే పనిలో తలమునకలై రాజ్యాంగపరమైన కోర్టుగా వాస్తవ విధులను నిర్వర్తించడంలో సర్వోన్నత న్యాయస్థానానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయనడంలో సందేహం లేదు. ఈ పరిస్థితుల్లో వివాహ సంబంధ వ్యవహారాలు, అద్దె నియంత్రణ, కార్మిక అంశాలు, పేదల సమస్యలు, భూసేకరణ వంటి 140రకాల కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ప్రాంతీయ బెంచీలను ఏర్పాటు చేయాలన్న వాదనను తేలిగ్గా కొట్టిపారేయలేం. ప్రాంతీయంగా ఏర్పాటు చేసే నాలుగు 'సుప్రీం' బెంచీలకు ఈ కేసుల బాధ్యతను అప్పగిస్తే- దేశ ప్రయోజనాలు, రాజ్యాంగానికి భాష్యం చెప్పే చట్టాలు, హైకోర్టుల మధ్య భిన్నాభిప్రాయాల పరిష్కారం, కేంద్ర-రాష్ట్ర చట్టాల చెల్లుబాటు, రాజ్యాంగ సవరణలపై న్యాయ సమీక్ష, రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలు వంటి కీలక అంశాల బాధ్యత దిల్లీలో కొలువైన రాజ్యాంగ కోర్టుకు దఖలుపడుతుంది. కేసుల భారం మోయలేనిదిగా మారుతున్న ప్రస్తుత తరుణంలో- జడ్జీల సంఖ్యను పెంచడం, వారి పదవీ విరమణ వయసును పొడిగించడం, ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ వంటి చర్యలను చేపట్టడంతోపాటు- దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సుప్రీంకోర్టు బెంచీలను నెలకొల్పడమూ అత్యవసరం.

అందుబాటులో 'న్యాయం'!

ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో భాగంగా ప్రపంచంలోని అనేక దేశాల అవసరాలకు తగినవిధంగా న్యాయవ్యవస్థలో మార్పులు చేసుకుంటున్నాయి. రాజ్యాంగపరమైన అంశాల విచారణ కోసం ప్రపంచంలోని 55దేశాలు ప్రత్యేక కోర్టులను నెలకొల్పుకొన్నాయి. దైనందిన కేసులను, కీలక రాజ్యాంగ అంశాలను ఒకే చోట కేంద్రీకరిస్తే సరైన న్యాయం జరగదని గ్రహించిన ఆస్ట్రియా 1920లోనే ఆమేరకు విడిగా న్యాయస్థానం ఏర్పాటు చేసుకొంది. రాజ్యాంగ విషయాల సమీక్ష, దిగువ కోర్టుల తీర్పులపై సమీక్షల కోసం ఇటలీ విడివిడిగా న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకొంది. సువిశాల భారతంలో న్యాయాన్ని నలు చెరగులా విస్తరింపజేయాలంటే సుప్రీంకోర్టును భిన్నమైన బాధ్యతలతో వికేంద్రీకరించడం అనివార్యం. తద్వారా న్యాయార్థులకు సకాలంలో మేలు జరగడంతోపాటు- దేశంలోని వివిధ ప్రాంతాల్లో న్యాయశాస్త్రంలో సుశిక్షితులైన, మెరికల్లాంటి న్యాయనిపుణులు ఆవిర్భవించడానికీ అవకాశం ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి గురించి పరితపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిసారించాల్సిన అంశమిది. రాష్ట్రాలకు మునుపటికంటే మెరుగైన నిధులు, విధుల బదలాయింపు ద్వారా దేశవ్యాప్తంగా సుపరిపాలనకు లాకులెత్తే లక్ష్యంతో కేంద్ర సర్కారు సంస్కరణలకు సమకడుతున్న సందర్భమిది. పేదలు, బడుగులు, సామాన్యుల ముంగిటకు 'న్యాయాన్ని' తీసుకువెళ్ళే మహత్తర కార్యక్రమానికీ- ఆ సంస్కరణల్లో భాగం కల్పిస్తే దేశ పురోగతికి అది మేలిమలుపు కాగలుగుతుంది.

(రచయిత - ఉల్చాల హరిప్రసాదరెడ్డి)
Posted on 22-08-2015