Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

మేక్‌ ఇన్‌ ఇండియా

పారిశ్రామిక వస్తూత్పత్తి రంగంలో పెట్టుబడులు పెంచినప్పుడు మాత్రమే భారతదేశ గ్రామీణ జనాభాలో గణనీయ భాగాన్ని అధికాదాయం ఇచ్చే, అధిక నైపుణ్యాలు అవసరమయ్యే ఆర్థిక కార్యకలాపాలకు తరలించడం సాధ్యమవుతుంది. దీనివల్ల భారత్‌ మళ్ళీ అధిక వృద్ధిరేటు నమోదు చేసుకోగలుగుతుంది. గడచిన ముప్ఫై సంవత్సరాలుగా స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో పారిశ్రామిక ఉత్పత్తి వాటా ఎదుగు బొదుగూ లేకుండా 16శాతం వద్దే నిలిచిపోయింది. 2011లో వెలువరించిన జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి విధానం(ఎన్‌ఎంపీ), 2022నాటికి ఈ వాటాను 25శాతానికి పెంచి పది కోట్ల కొత్త ఉద్యోగాలు సృష్టించాలని లక్షించింది. ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తూ, ఉత్పాదక వస్తువులు తయారుచేస్తూ, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న పరిశ్రమలను ఎన్‌ఎంపీ ప్రోత్సహిస్తుంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ప్రభుత్వరంగ పరిశ్రమలపైనా దృష్టి కేంద్రీకరిస్తుంది. జాతీయ పెట్టుబడులు, పారిశ్రామిక ఉత్పత్తి మండలాలు(ఎన్‌ఐఎంజడ్‌లు) సృష్టించడం ద్వారా పారిశ్రామికాభివృద్ధికి వూతమివ్వాలని ఎన్‌ఎంపీ ఆశిస్తోంది.

కొత్త అడుగులు

ఎన్‌ఎంపీ అమలు వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా (భారత్‌లో తయారు చేయడం) విధానాన్ని ముందుకు తెచ్చారు. భారతదేశాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక వస్తుతయారీ కేంద్రంగా మార్చడానికి మోదీ కంకణం కట్టుకున్నారు. ఈ విధానం మీద పెట్టుబడిదారులు, అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థలూ ఆసక్తి చూపుతున్నాయి. దీర్ఘకాలంలో భారత్‌ దశ దిశ మార్చే సత్తా మేక్‌ ఇన్‌ ఇండియాకు ఉంది. హరిత విప్లవం, క్షీర విప్లవం ద్వారా భారత్‌ అన్ని వర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందేలా చూసింది. అదేవిధంగా మేక్‌ ఇన్‌ ఇండియా కూడా పారిశ్రామిక వస్తూత్పత్తి రంగాన్ని రూపాంతరం చెందించగలదు. కొత్త ఉద్యోగాలు సృష్టించి, స్వదేశంలో వస్తుసేవలకు గిరాకీ పెంచగలదు. తక్కువ స్థాయి నైపుణ్యాలు కలిగిన కార్మికులకూ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. యువతలో వ్యవస్థాపక సామర్థ్యాలు పెంపొందిస్తుంది.

ఈ విధానం విజయవంతం కావాలంటే మొదట వ్యాపారానికి విధానపరంగా, నియంత్రణపరంగా ఎదురవుతున్న అడ్డంకులు తొలగించాలి. వ్యాపార సౌలభ్యపరంగా దేశాలకు ర్యాంకులిస్తూ ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో భారత్‌ ఎక్కడో 134వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితిని తక్షణమే మార్చాలి. భారత్‌లో శీఘ్రంగా వ్యాపారం ప్రారంభించడానికి వీలుగా కేంద్ర, రాష్ట్రాలు ఏక గవాక్ష విధానాన్ని చేపట్టాలి. ఇలాంటి విధానం ఉన్నప్పుడు వ్యాపార సంస్థలు ప్రభుత్వ నిబంధనల్ని సక్రమంగా పాటిస్తాయి. తనిఖీ ప్రక్రియలకు సహకరిస్తాయి. పారిశ్రామిక వివాదాల సత్వర పరిష్కారానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా పరోక్ష పన్నుల క్రమబద్ధీకరణకు వస్తుసేవల పన్ను(జీఎస్‌టీ) ఎంతో తోడ్పడుతుంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్‌)నూ తగ్గిస్తే, పరిశ్రమలపై పన్ను భారం తగ్గుతుంది. మోదీ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవడం స్వాగతించాల్సిన పరిణామం. ముడిసరకులు, విడిభాగాలపై పన్నుల్నీ తగ్గిస్తే, ఉత్పత్తులు చౌకగా లభ్యమవుతాయి. స్వదేశంలో విలువ జోడించిన పారిశ్రామిక వస్తూత్పత్తి వూపందుకొంటుంది. కార్మిక చట్టాలు, నిబంధనల్లో పట్టువిడుపులు ఉంటే ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయి. దీనికోసం 44 కేంద్ర, 160 పైచిలుకు రాష్ట్ర కార్మిక చట్టాలను నాలుగు విభాగాలుగా- పారిశ్రామిక సంబంధాలు, వేతనాలు, ఉపాధి ప్రమాణాలు, సామాజిక భద్రతల కింద వర్గీకరించాలి. కార్మిక చట్టాలు లోపభూయిష్టంగా రూపొందిస్తే కార్మిక మార్కెట్‌ చీలిక పేలికలవుతుంది. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి సాధించడం వీలుపడదు. అంతర్జాతీయ అనుభవాలు నేర్పుతున్న పాఠాలివి. కార్మిక చట్టాల్లో పట్టువిడుపులు ఉంటే కార్మిక శక్తికి, పరిశ్రమల ప్రయోజనాలకు మధ్య సమతూకం ఏర్పడుతుంది. ఉపాధి అవకాశాలు, ఆదాయాలు పెరుగుతాయి.

భూమి, విద్యుత్‌, మౌలిక వసతులు పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభాలుగా నిలుస్తాయి. కనుక పరిశ్రమల స్థాపన కోసం ప్రతి రాష్ట్రంలో భూ బ్యాంకులు ఏర్పాటు చేయాలి. వ్యవసాయ భూములను పరిశ్రమలకు ఉపయోగించుకునే విధంగా నిబంధనలు సడలిస్తే, భూ సేకరణ ప్రక్రియ సులువవుతుంది. భూ సేకరణ చట్టానికి కేంద్రం ఇటీవల సవరణలు చేయడం పారిశ్రామికవేత్తల్లో ఉత్సాహం నింపుతోంది. విద్యుత్‌ గ్రిడ్‌ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు బొగ్గు, ఇనుము, ఉక్కు, విద్యుత్‌ ప్లాంట్‌ సామగ్రి ఉత్పత్తినీ పెంచాలంటే స్తంభించిపోయిన విద్యుత్‌ ప్రాజెక్టులను వెంటనే పునరుద్ధరించాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సొంత విద్యుత్‌ ప్లాంట్లు స్థాపించుకునే సామర్థ్యం ఉండదు. వీటికి గ్రిడ్‌ నుంచే కరెంటు సరఫరా చేయాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) ద్వారా రైలు, రోడ్డు, రేవు సౌకర్యాలను పెంపొందించవచ్చు. దీనివల్ల మౌలిక వసతుల కల్పనకు లక్ష కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించవచ్చు. ఎన్‌ఐఎంజడ్‌ విధానం కూడా పారిశ్రామిక వస్తూత్పత్తికి ఆధునిక మౌలిక వసతులను సమకూరుస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) విధానమూ భారతదేశ పారిశ్రామిక వస్తూత్పత్తిని వృద్ధి చేస్తుంది. అధిక విలువ జోడించడానికి ఆస్కారమున్న జౌళి, విద్యుత్‌వస్తు ఉత్పత్తి వంటి రంగాలకు వూపు ఇవ్వడానికి వీలుగా మేక్‌ ఇన్‌ ఇండియా విధానంతో విదేశీ వాణిజ్య విధానాన్ని సమన్వయం చేయాలి. అంతర్జాతీయ విపణుల్లో పోటీపడగలిగే విధంగా భారతీయ ఉత్పత్తుల నాణ్యత పెంచాలి. కేంద్రం స్థాపించబోతున్న 3పీ (పీపీపీ) ఇండియా సంస్థ మేక్‌ ఇన్‌ ఇండియా విధానంలో ప్రైవేటు రంగం పాలుపంచుకునేలా చేయాలి.

నైపుణ్యాలతోనే ప్రగతి

కార్మిక ఉత్పాదకత పెంచి, పెట్టుబడులు ఆకర్షించడానికి మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడం అవసరం. ఐటీఐ శిక్షణకు పారిశ్రామిక అప్రెంటిస్‌షిప్‌ను కూడా జత కలిపితే నిపుణులైన శ్రామికులు లభ్యమవుతారు. పరిశ్రమలు, విద్యారంగ నిపుణులు చేతులు కలిపితే దేశంలో పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలు వూపందుకొంటాయి. భారతదేశంలో పకడ్బందీ న్యాయవ్యవస్థ ఉండటంతో విదేశాలు మనకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి సుముఖంగా ఉన్నాయి. విధానపరంగా విస్తృత మార్పులు చేయడానికితోడు, భారత్‌కు ఆధిక్యం ఉన్న నిర్దిష్ట రంగాలపై శ్రద్ధాసక్తులు కేంద్రీకరించాలి. ఉదాహరణకు వ్యవసాయం తరవాత అత్యధికులకు ఉపాధి కల్పించే జౌళి రంగం నుంచి ఎగుమతులకూ అపార అవకాశాలు ఉన్నాయి. వడ్డీరేట్లు తగ్గించి, వలస కార్మికులకు బస ఏర్పాటు చేసి, క్లస్టర్‌ పద్ధతి అనుసరిస్తే జౌళి పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతుంది. సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ ప్లాంట్ల సామగ్రిని భారత్‌ సొంతగా తయారు చేసుకోవాలి. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలి. ఐటీ, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పరిశ్రమలకు సానుకూల సుంకాల వ్యవస్థను వర్తింపజేయాలి. పన్ను రాయితీలు ఇవ్వాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి క్లస్టర్‌ పద్ధతి చేపట్టాలి. ఈ విషయంలో భారత్‌, తూర్పు ఆసియా దేశాలకన్నా వెనకబడి ఉంది. రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లో భారత్‌ స్వావలంబన పెంపొందించుకోవాలి. ఇందుకు ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి.

భారతదేశానికి వయోజనాధిక్య ప్రయోజనం ఉంది. ఇక్కడ విద్యావంతుల సంఖ్యా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. వీరందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే సత్తా పారిశ్రామిక వస్తూత్పత్తి రంగానికి ఉంది. ఈ సత్తాను ఆచరణలోకి తెస్తే భారతదేశం చరిత్రలో కనీవినీ ఎరుగనంత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.

(రచయిత - పీవీ రావు)
Posted on 09-01-2015