Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

జై జవాన్‌... హే భగవాన్‌!

* పింఛనుపైనే వంచన
సందేశమివ్వడానికీ అర్హత కావాలి. సర్వసంగ పరిత్యాగం చేసిన గౌతమబుద్ధుడు, విషం కలిపారనీ తెలిసీ స్వీకరించిన సోక్రటీసు, ఏకచ్ఛత్రాధిపత్య సాధన ప్రయత్నాన్ని విజయపరంపర మధ్య ఉద్దేశపూర్వకంగా విరమించిన అశోకుడు, నమ్మిన సిద్ధాంతం ప్రకటించినందుకు మరణశిక్ష పొంది కూడా 'నాకు బతుకులేకుండా చేయగలరేమోగానీ, నా విశ్వాసాలను చెరిపివేయగలరా' అని నినదించిన బ్రూనో వంటివారే సర్వకాలాలకూ, సమస్త ప్రపంచానికీ వర్తించే సందేశమివ్వగలరు. కానీ ఇప్పుడు అడ్డమైనవాళ్లంతా తమను తాము పెద్దమనుషులుగా నిర్ధారించేసుకొని జాతికి సందేశాలు దంచేస్తున్నారు. ఒక ర్యాంకు అధికారులందరికీ ఒకే పింఛను విధానం అమలు చేయాలంటూ 'జంతర్‌మంతర్‌'వద్ద నిరాహార దీక్షకు దిగిన పదవీ విరమణ చేసిన సైనికాధికారులకు మద్దతుగా మాట్లాడిన రాహుల్‌గాంధీ- రిటైర్డ్‌ జవాన్లను గౌరవించుకోవాల్సిన అవసరాన్ని ఉద్బోధిస్తూ జాతికి సందేశమందించారు. ఉన్న వూరిని, అయినవాళ్లనూ వదిలి సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడి అలసిన రిటైర్డ్‌ సైనికుల మనోభావాలను ముప్ఫయ్యేళ్లుగా గాయపరచి- విపక్షంలోకి చేరాక తీరిగ్గా ఓ కన్నీటి బొట్టు రాల్చి పాపాలు కడిగేసుకోవాలనుకునే బాపతు దివాళా రాజకీయమది. మేలు జరగాలన్న నోళ్లేగానీ.... మేలు చేసే మనుషులు కనిపించకపోవడంతో రిటైర్డ్‌ సైనికోద్యోగులు వీధులకెక్కి 60రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. న్యాయం సంగతి తరవాతి మాట... కనీసం నిరసన తెలిపే హక్కూ లేదన్నట్లుగా 'జంతర్‌మంతర్‌' వద్ద దీక్షచేస్తున్న వృద్ధ సైనికాధికారులను మొన్నటి స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజున దిల్లీ పోలీసులు ఈడ్చి అవతలపారేశారు, మెడలుపట్టి గెంటేశారు. శత్రుమూకలపై తిరుగులేని సాహసంతో తుపాకి గుళ్లు సంధించిన సైనికులు ఇవాళ తమ గుండెలను ఎంతటి బాధ మెలిపెట్టకపోతే రోడ్లమీదకు వస్తారు! వారికి ఆ అవసరం కలిగించినవారు అందుకు సిగ్గుపడి, దీక్ష విరమణకు అనుగుణంగా తమ ప్రవర్తనను చక్కదిద్దుకోవాల్సిందిపోయి- దానికి విరుద్ధంగా జవాన్లపట్ల అమానుషంగా ప్రవర్తించడాన్ని మించి దేశంపట్ల ఘోరాపచారం మరొకటి ఉంటుందా?

దేశ ప్రతిష్ఠ పాతాళానికి...

'ఎప్పుడైతే సైనికుడు తనకు న్యాయంగా రావలసిన భత్యాలకోసం గొంతెత్తి నినదించే పరిస్థితి తలెత్తుతుందో... నాటినుంచి నువ్వు రాజుగా కొనసాగే అన్ని నైతిక హక్కులూ కోల్పోయినట్లే' రెండువేల ఏళ్లక్రితం చంద్రగుప్త మౌర్యుడిని ఉద్దేశించి చాణక్యుడు చేసిన వ్యాఖ్యలివి. పదమూడు లక్షల సైన్యం, 30లక్షలమంది రిటైరయిన జవాన్లు, ఏటా 60వేలమంది పదవీ విరమణ పొందుతున్న భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకత్వం ఈ వ్యాఖ్యలను అనుక్షణం మననం చేసుకోవాల్సి ఉందిప్పుడు. ఒకే హోదాలో, నిర్దిష్ట కాలంపాటు పనిచేసిన సైనికోద్యోగులందరికీ ఒకే రకమైన పింఛను మొత్తం చెల్లించే పద్ధతిని మూడో వేతన సంఘం సిఫార్సులమేరకు 1973లో ఇందిరాగాంధీ హయాములో కొట్టివేసింది మొదలు అలజడి ఆరంభమైంది. పనిచేయగల కీలక దశలో రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమించిన ఉద్యోగులను జీవిత చరమాంకంలో గాలికి వదిలెయ్యకుండా వారికి సామాజిక ఆర్థిక న్యాయం చేకూర్చడంకోసం ఉద్దేశించిందే 'పింఛను'! పౌర ఉద్యోగుల్లా 58ఏళ్లకు కాకుండా 35సంవత్సరాలకే పదవీ విరమణ చేసే సైనికులకు 'పింఛను' ప్రాణావసరం! కుటుంబ జీవనం అప్పుడప్పుడే స్థిరపడుతూ, పిల్లల అవసరాలు విస్తరిస్తున్న తరుణంలో రిటైరయి, నెలనెలా చేతికందే మొత్తం సగానికి కోసుకుపోయి ప్రతి పైసా లెక్కేసుకొనే దశలో- పదవీ విరమణ పొందిన జవాన్లు వినిపిస్తోంది నిక్కంగా న్యాయమైన నినాదం. ఎంతకాలం పనిచేశారు, ఏ 'ర్యాంకు'వద్ద రిటైరయ్యాన్నదే పదవీ విరమణ భృతికి ప్రాతిపదిక. ఆ ప్రకారం ఒకే కాలానికి, ఒకే ర్యాంకువద్ద రిటైరయిన జవాన్లు తమకు అందుతున్న పెన్షన్‌లో భారీ తేడాలుండటాన్ని మొదటినుంచీ వ్యతిరేకిస్తూ పింఛను సొమ్ము ఏకరీతిగా ఉండాలని 31ఏళ్లుగా వినిపిస్తున్న డిమాండ్‌ను పట్టించుకుంటున్న నాథుడే లేడు. సరిహద్దు రేఖల వెంబడి ప్రాణాలకు తెగించి పోరాడే సిపాయిల న్యాయబద్ధ డిమాండును నెరవేర్చడంలో వెనకడుగు వేయడాన్ని గతంలో ప్రభుత్వాలే నియమించిన అనేక కమిటీలు తప్పుపట్టాయి. శరద్‌ పవార్‌ కమిటీ (1991), అంతర్‌ మంత్రిత్వ కమిటీ (2003), మంత్రిత్వ బృంద కమిటీ (2005), క్యాబినెట్‌ కార్యదర్శి కమిటీ (2009), కొషియారీ కమిటీ(2011)లు 'ఓఆర్‌ఓపీ'ని అమలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. ఈ విషయమై భారత ప్రభుత్వం వర్సెస్‌ మేజర్‌ జనరల్‌ వెయిన్స్‌ల మధ్య కేసులో 2009లో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఎప్పుడు రిటైరయ్యారన్న దానితో నిమిత్తం లేకుండా ఒకే కాలానికి, నిర్దిష్ట ర్యాంకులో బాధ్యతలు నిర్వహించి పదవీ విరమణ చేసిన జవాన్లందరికీ ఒకే పెన్షన్‌ ఇచ్చి తీరాల్సిందేనని కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీచేసింది. ఆ తీర్పును అయిదేళ్లపాటు అమలు చేయకుండా నాన్చిన యూపీఏ ప్రభుత్వానికి సరిగ్గా ఎన్నికలకు ఏడాది ముందు 'ఓఆర్‌ఓపీ' అమలు గుర్తుకు వచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో 'పింఛను' అంశం చేర్చి, తూతూమంత్రంగా రూ.500కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకున్న నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, అంతకుమించి ఒక్క అడుగైనా ముందుకు వేయకుండానే ఎన్నికల్లో ఆ అంశాన్ని ఘనంగా ప్రచారం చేసుకొంది. కాంగ్రెస్‌ ఏలుబడిలో రిటైర్డు సైనికోద్యోగులకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రశ్నించిన భాజపా సైతం- అధికారంలోకి వచ్చి 15నెలలు దాటుతున్నా 'ఇప్పుడు అప్పుడు' అనడం తప్ప అమలుకు అల్లంత దూరంలోనే నిలిచిపోవడంతో సైనికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. జవాన్ల ధర్మాగ్రహానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులంతా చేతులు కలుపుతున్న సందర్భమిది. మోదీ సర్కారు ఇకనైనా శషభిషలు వీడి రంగంలోకి దిగితే మేలు!

'నాకు అనుభూతుల్లేవు... చంపడం, చావడం మీసం దువ్వడం అలవాటైంది... కనిపించే ఈ యూనిఫారం కింద ఒక పెద్ద నిరాశ' 'అమృతం కురిసిన రాత్రి'లో సైనికుడి ఆవేదనను వెల్లడిస్తూ తిలక్‌ చెప్పిన కవిత అది. మూడు నిమిషాల్లో మూజువాణి ఓటుతో పార్లమెంటు సభ్యుల వేతనాలను రెట్టింపు చేసుకోవడానికి, పొగతాగేందుకు పార్లమెంటులో ప్రత్యేక గదిని పట్టుబట్టి సాధించుకోవడానికి, విమానాశ్రయాల్లో వీవీఐపీ హక్కులు దఖలుపరచుకోవడానికి లేని అడ్డంకులు రిటైర్డ్‌ సిపాయిల పింఛను విషయంలో తలెత్తుతుండటమే బాధాకరం. 2006కు ముందు పదవీ విరమణ పొందిన మేజర్‌ జనరల్‌ స్థాయి అధికారితో పోలిస్తే అంతకు ఎన్నో ర్యాంకులు కింద ఉన్నప్పటికీ కల్నల్‌ స్థాయి అధికారికి ఆ తరవాత రిటైరయితే 'పింఛను' ఎక్కువ రావడం ఏమాత్రం సహేతుకం కాదు. 2015 ఫిబ్రవరిలో రక్షణ శాఖ అధికారులతో సంప్రదించి 'ఓఆర్‌ఓపీ' అమలుకు రూ.8,300కోట్లు ఖర్చవుతుందని నిర్ధారించిన ఎన్డీయే ప్రభుత్వం- ఆ వెన్వెంటనే ప్రకటించిన బడ్జెట్లో అందుకోసం కేవలం వెయ్యికోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం అందరినీ నిర్ఘాంతపరచింది. 'ఇంకేముంది కొన్ని వారాల్లో ఓఆర్‌ఓపీ అమలవుతుంది' అంటూ 2015 ఏప్రిల్‌లో రక్షణ మంత్రి పారీకర్‌ అరచేతిలో స్వర్గం చూపించీ అప్పుడే అయిదునెలలవుతోంది. కళ్లముందు జరుగుతున్న అన్యాయం స్పష్టంగా కనిపిస్తున్నా- ఓఆర్‌ఓపీ అమలుకు ప్రభుత్వాలు దశాబ్దాలుగా మీనమేషాలు లెక్కించడానికి కారణమేమిటయ్యా అంటే వినిపించే సమాధానం 'సాంకేతిక, విధానపరమైన సమస్యలు'! మోకాలడ్డుతున్న ఆ ఇబ్బందులేమిటో పారదర్శకంగా ఏకరవు పెట్టి, అందరితో చర్చించి పరిష్కారాలు అన్వేషించే ప్రయత్నాలను ఈ 30ఏళ్లలో ప్రభుత్వాలు ఒక్కసారైనా చేశాయా అంటే... అదీ లేదు! నైతికంగా పతనమైన జాతి రాజకీయ స్వాతంత్య్రాన్నీ మరెంతో కాలం నిలబెట్టుకోలేదని గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. వీరసైనికుల న్యాయమైన ఆకాంక్షనూ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకొనే ప్రస్తుత ప్రయత్నాలు జాతీయవాదులను కలవరపరుస్తున్నాయి, ప్రజాస్వామ్యవాదులను వ్యాకులపరుస్తున్నాయి.

వీరులకు ఇదా గౌరవం?

ఆత్మాభిమానాన్ని డబ్బుతో వెలకట్టలేం: డబ్బుకన్నా ముఖ్యంగా జవాన్ల ఆత్మగౌరవ సమస్య ఇది. స్వయంగా ప్రభుత్వమే పనిగట్టుకుని సైనికుల గౌరవానికి భంగం కలిగిస్తున్న పరిస్థితుల్లో వారి నైతిక స్త్థెర్యం కొత్త లోతులకు దిగజారితే ఆశ్చర్యం లేదు. సైన్యంలో చేరడాన్ని దేశంలోని యువత ఇప్పటికే చిట్టచివరి ఐచ్ఛికాంశంగా పరిగణిస్తోంది. బుద్ధిబలం ఉన్న యువత క్రమంగా సేనావాహినికి దూరం జరుగుతోంది. సైనికులను గౌరవించుకోలేని దివాళాకోరుతనంలోకి మన ప్రభుత్వాలు జారుకుంటుండటమే ఇందుకు కారణం. స్వాతంత్య్రానంతరం పౌర ఉద్యోగులతో పోలిస్తే జవాన్ల జీతభత్యాల్లో స్పష్టమైన కోత కనిపిస్తోంది. ఏడోదశకం తొలినాళ్లలో చిట్టచివరి జీతంలో సైనికులకు 70శాతం పింఛనుగా లభిస్తే, పౌర ఉద్యోగులకు అందులో 30శాతం దక్కేది. కానీ ఆ తేడాను ప్రభుత్వం మెల్లగా తెగ్గోస్తూ వచ్చింది. 1973నుంచీ పౌర ఉద్యోగుల పెన్షన్‌ 30శాతంనుంచి 50శాతానికి పెంచి; సైనికాధికారుల పింఛను 70శాతంనుంచి 50శాతానికి తగ్గించేశారు. పౌర ఉద్యోగులకూ, జవాన్లకూ విధి నిర్వహణ విషయంలో పోలికే లేదన్న విషయం స్పష్టంగా తెలిసీ సర్కారు చేస్తున్న ప్రయోగాలు... సైనికుల గుండెలకు తీరని గాయాలు చేస్తున్నాయి. ప్రపంచ దేశాలన్నీ సైనికుల త్యాగాలకుగాను వారికి తలవంచి సలామ్‌ చేస్తున్నాయి. అమెరికాలో 40ఏళ్ల వయసు వచ్చేవరకూ పనిచేసిన సైనికులకు- చిట్టచివరి మూల వేతనంతో సమానంగా పింఛన్‌ చెల్లిస్తున్నారు. కెనడాలో ఆఖరున అందుకున్న వేతనంలో 75శాతాన్ని పింఛనుగా ఇస్తుంటే- దేశంలో అత్యధిక జీతాలు పొందే కార్పొరేట్‌ ఉద్యోగులతో సరిసమానంగా జవాన్లకు సింగపూర్‌ వేతనాలు అందిస్తోంది. దేశంకోసం ప్రాణాలొడ్డుతున్న సైనికులకు కృతజ్ఞతలు తెలియజేసే ఏ అవకాశాన్నీ అమెరికన్‌ అధ్యక్షులు వదులుకోరు. జవాన్లతో ముడివడిన ప్రతి కార్యక్రమానికీ హాజరుకావడం అమెరికా అధ్యక్షులకు ఆనవాయితీ! అదీ వారు సైన్యానికిచ్చే మర్యాద. దాదాపు ఐరోపాలోని దేశాలన్నీ సైన్యం త్యాగాలకు చిహ్నంగా ప్రత్యేక స్మారకాలు నిర్మించాయి. దేశాన్ని మూడు యుద్ధాల్లో గెలిపించి, వేల సంఖ్యలో అసువులుబాసిన జవాన్లకోసం భారత ప్రభుత్వం ఒక్క యుద్ధ స్మారకం నిర్మించకపోవడమే జాతి వీరులపట్ల మనవారి మర్యాదను ప్రకటిస్తోంది. పదవీ విరమణ చేసిన సైనికులు దిల్లీ నడిబొడ్డున అరవై రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం తరఫున వారిని పట్టించుకున్నవారు లేరు. పైపెచ్చు స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అడ్డంగా ఉన్నారంటూ వారిని నిర్దాక్షిణ్యంగా తలోదిక్కూ విసిరిపారేశారు. ఈ నిర్లక్ష్యాన్ని భరించలేక రిటైర్డ్‌ జవాన్లు తాము సాధించిన విజయాలకు చిహ్నంగా ఉన్న గౌరవ పతకాలను సర్కారుకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే 20వేల పతకాలను తిరిగి ఇచ్చేయగా, 2009లో నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడంతో మరో 10వేల మెడళ్లు రాష్ట్రపతి కార్యాలయంలో జాతి నైతిక ప్రవృత్తిని వెక్కిరిస్తూ పడి ఉన్నాయి. దేశ రక్షణకోసం సైనికులను భూమి, నీళ్లు, వాయు మార్గాల్లో ఎక్కడికి పడితే అక్కడికి తరలిస్తారు. తప్పనిసరైతే కాళ్లూ చేతులూ విరగ్గొట్టుకునైనా, ప్రాణాలను తృణప్రాయంగా త్యజించైనా మాతృగడ్డను కాపాడాలని మన ప్రభుత్వాలు వారికి ఉపదేశాలు చేస్తాయి. కానీ అందుకు ప్రతిగా రాజ్యం సైనికుడికి ఇస్తోందేమిటి అని తరచి చూస్తే... అవమానం, అవహేళన తప్ప కనిపించడం లేదు. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే మిగిలేది దేశం కాదు... రాజకీయ నాయకుల ఉపదేశాలు, సందేశాలే!.

(రచయిత - ఉల్చాల హరిప్రసాదరెడ్డి)
Posted on 29-08-2015