Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సుస్థిరశాంతికి మార్గం!

* నాగా ఒప్పందం
'పరస్పర నమ్మకం, గౌరవం ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని ఈ ఒప్పందం చాటుతోంది. వివాదాలను వదలి, సంభాషణల పంథాను చేపట్టి పరస్పర సమస్యలు, ఆశలు, ఆశయాలను అర్థం చేసుకుంటే గొప్ప ఫలితాలు సిద్ధిస్తాయని ఇది నిరూపిస్తోంది'- నాగా ఒప్పందంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్య ఇది. గతనెల భారత ప్రభుత్వానికి, నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలిమ్‌ (ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం) మధ్య శాంతి ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. ప్రభుత్వం తరఫున సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారి ఆర్‌ఎన్‌ రవి, ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం తరఫున ఐజాక్‌ స్వు, తుయింగలెంగ్‌ ముయివాలు దీనిపై సంతకాలు చేశారు. ఒప్పంద వివరాలు వెల్లడి కాకపోయినా, అసలు ఒప్పందం కుదరడమే గొప్ప ముందడుగని పరిశీలకులు భావిస్తున్నారు. ఇది సంక్షుభిత ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని మోదీ హర్షాతిరేకం వ్యక్తం చేయగా, ముయివా కొంత తగ్గుస్థాయిలో స్పందించారు. 1947 జులై 19న నాగా ప్రతినిధి వర్గానికి మహాత్మాగాంధీ ఇచ్చిన కింది హామీని గుర్తుచేశారు. 'స్వాతంత్య్రం పొందే హక్కు నాగాలకు పూర్తిగా ఉంది. భారతీయులు బ్రిటిష్‌వారి పెత్తనాన్ని సహించేది లేదన్నారు. అందుకే వాళ్లు ఈ దేశం విడిచి వెళ్లిపోతున్నారు. నాగా పర్వతాలు మనందరివని నేను భావిస్తున్నాను. అలాకాదు, అవి మాకు మాత్రమే చెందుతాయని మీరంటే మేము విభేదించలేం. సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని మేము కోరుకుంటున్నా, మిమ్మల్ని బలప్రయోగంతో భారతదేశంలో అట్టిపెట్టే ఉద్దేశం నాకు లేదు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని భారతదేశంలో భాగస్వాములను చేయలేం!'

రాజకీయ దార్శనికత ముఖ్యం

నాగాలాండ్‌ కోసం ఆరు దశాబ్దాలపాటు నడచిన పోరులో ఎందరో నాగాలు, భారతీయులు మరణించారు. మియన్మార్‌ అడవుల్లో దాగి భారతీయ దళాలపై 27 ఏళ్లపాటు గెరిల్లా పోరాటం జరిపిన చరిత్ర ముయివాది. ఈ క్రమంలో ఎన్నో నాగా బృందాలను ఆయన చైనాకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో మియన్మార్‌, భారత దళాలను ఎదుర్కొన్నారు. ముయివా నాయకత్వంలో నాగాలు తినడానికి తిండి లేక, వేసుకున్న దుస్తులు చిరిగిపోయి అడవుల్లో సంచరించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇంతటి దుర్భర పరిస్థితుల్లోనూ నాగా యువజనుల్లో స్థైర్యం సన్నగిల్లకుండా నిరంతరం ఉత్సాహపరచేవారు. అలా వారికి ఆదర్శనీయుడిగా మారారు. నాగా జాతీయవాదులు ఏటా ఆగస్టు 14ను స్వాతంత్య్ర దినోత్సవంగా జరుపుకొంటారు. 1947లో సరిగ్గా ఇదే రోజున నాగా జాతీయ మండలి (ఎన్‌ఎన్‌సీ) నాగాలాండ్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. 1952లో అంగామి జాపు ఫిజో నాగా ఫెడరల్‌ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ముయివా మొదటి నుంచి ఎన్‌ఎన్‌సీ సభ్యుడిగా ఉన్నప్పటికీ, దాని సీనియర్‌ సభ్యులు ఎమర్జన్సీ రోజుల్లో (1975) షిల్లాంగ్‌లో కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసించి, ఎన్‌ఎన్‌సీ నుంచి బయటికొచ్చేశారు. అప్పట్లో షిల్లాంగ్‌ ఒప్పందం నాగా సమాజంలో తీవ్ర విభేదాలకు దారితీసింది. తాజాగా తానే కుదుర్చుకున్న ఒప్పంద చరిత్ర భిన్నంగా ఉంటుందని ముయివా ఆశిస్తుండవచ్చు. అదే ఆశ నాగా ప్రజానీకంలోనూ ఉంది. ముయివా రాజకీయ సహచరుడైన ఐజాక్‌ స్వు తీవ్ర అస్వస్థుడై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భారత ప్రభుత్వం దీన్ని వాటంగా తీసుకుని ఎన్‌ఎస్‌సీఎన్‌ను ఒప్పందానికి అంగీకరించేట్లు ఒత్తిడి చేసిందని కొన్ని నాగా వర్గాలు అనుమానిస్తున్నాయి. ముయివా, ఐజాక్‌ స్వులకు నాగాల నాయకులుగా ఆమోదనీయత ఉంది. అలాంటప్పుడు భారత ప్రభుత్వం వీరితో కాకుండా మరెవరితో శాంతి ఒప్పందం కుదుర్చుకొంటుంది? ఇంతకాలం నాగాల మధ్య విభేదాలు సృష్టించిన కేంద్ర గూఢచారి సంస్థలు, శాంతి సంప్రతింపులకు ఒక ప్రధాన సంస్థ అవసరమని గుర్తించాయి. ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐఎం) శాంతి ఒప్పందంలోని న్యాయ, రాజ్యాంగపరమైన కోణాలను క్షుణ్నంగా అర్థం చేసుకుంది. ఈ విషయంలో అంతర్జాతీయ న్యాయనిపుణుల సలహా సంప్రతింపులనూ స్వీకరించింది. అయితే ఒప్పందం విజయవంతంగా అమలు కావాలంటే రాజకీయ దార్శనికత అవసరం. ఏ ఒప్పంద జయాపజయాలనైనా చివరకు శాసించేది రాజకీయాలే.

భిన్నత్వంలోని ఏకత్వమే ఇంతకాలం నాగా జాతీయోద్యమానికి ఆయువుపట్టుగా నిలిచింది. నాగా విద్యార్థి సమాఖ్య, నాగా పెద్దల సభ అయిన నాగా హూహూ, సమైక్య నాగా మండలి, ఇతర సంప్రదాయ సంస్థల్లో చిన్నపెద్దా అనే తేడాల్లేకుండా అన్ని నాగా తెగలకూ సమాన ప్రాతినిధ్యం లభిస్తోంది. ఈ నాగా విశిష్టత శాంతి ఒప్పందానికి ప్రాతిపదిక అని ముయివా ఉద్ఘాటించారు. సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, నాగ భూమి జీవవైవిధ్యం, ప్రాకృతిక వనరులు నాగా ప్రజలకు విశిష్టతను చేకూర్చాయి. ముయివాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ అంశాన్ని నొక్కిచెప్పారు. 'ఈశాన్య భారతంతో నాకు ప్రగాఢ అనుబంధం ఉంది. గతంలో చాలాసార్లు నాగాలాండ్‌ను సందర్శించాను. నాగా ప్రజల విశిష్ట జీవనశైలి, వైవిధ్యభరితమైన సుసంపన్న వారసత్వం భారతదేశానికే కాదు యావత్‌ ప్రపంచానికీ వన్నె తెస్తున్నాయి' అని మోదీ ప్రశంసించారు.

సాంస్కృతిక వైవిధ్యమే వరం

అయితే బ్రిటిష్‌ కాలంలో నాగా ప్రాంతాలకు వచ్చిన క్రైస్తవ మతప్రచారకులు విశేష నాగా సంస్కృతిని ధ్వంసం చేశారు. వలస పాలకులు, మానవ పరిణామ శాస్త్రజ్ఞులు పురాతన నాగా వ్యవస్థలను నాశనం చేసి, వారి వారసత్వ సంపదను దోచుకున్నారు. నాగా పురావస్తువులు నేడు ప్రపంచంలోని పలు పురావస్తుశాలల్లో కనిపించడానికి కారణమిదే. స్వాతంత్య్రానంతరం భారతీయ విద్యావ్యవస్థ నాగా సంస్కృతిని మరింత క్షీణింపజేసి, నాగా తెగల భాషలను ధ్వంసం చేసింది. పాఠశాల పుస్తకాలలో నాగా చరిత్రకు స్థానం లేదు. నాగా సాంస్కృతిక అస్తిత్వం దెబ్బతినడం వల్ల కలిగిన దుష్ప్రభావాలను వర్ణిస్తూ, టెంజన్‌ జుంగ్బా అనే నాగా విద్యార్థి ఈ ఏడాది జులైలో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో 'ల్యాండ్‌ వేర్‌ లైఫ్‌ ఈజ్‌ గుడ్‌' అనే నాటికను ప్రదర్శించారు. భారతీయత అనే అస్తిత్వంలో నాగాల ప్రత్యేకతను ఎలా మరుగుపరచినదీ వెలుగులోకి తెచ్చారు.

ఇకనైనా భారతీయులు, నాగాలు సాంస్కృతిక వైవిధ్యాన్ని ఒక అవరోధంగా కాక భవిష్య సమాజానికి భూషణంగా పరిగణించాలి. ప్రపంచీకరణ వల్ల నాగాల్లోనూ మధ్యతరగతి ఆవిర్భవించింది. అది మోదీ అభివృద్ధి నమూనాలో భాగస్వామ్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఐజాక్‌ స్వు, ముయివాలతో కేంద్రం కుదుర్చుకున్న ఒప్పందం ప్రగతి పథంలో చెట్టపట్టాల్‌గా నడిచే అవకాశాన్ని అందిస్తోంది. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

- నందితా హక్సర్‌ (రచయిత్రి - మానవ హక్కుల న్యాయవాది)
Posted on 16-09-2015