Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

బడి పిల్లలకు ఆహార భద్రత!

* హక్కుగా మధ్యాహ్న భోజనం
అయిదున్నర దశాబ్దాలనాటి మాట. తమిళనాడులోని ఒక పల్లెలో రోడ్డు పక్కన కనిపించిన కొందరు పిల్లల్ని, అదే దారిన వెళుతున్న రాజకీయ నాయకుడొకరు కారు దిగి పలకరించారు. 'బడికి పోకుండా ఇక్కడేం చేస్తున్నార'ని అడిగారు. 'ఆకలితో మాడిపోతుంటే, బడికెళ్లాలని అనిపిస్తుందా' అని ఓ పిల్లవాడు ఎదురుప్రశ్న వేశాడు. చలించిపోయిన ఆ నాయకుడు కామరాజ్‌ నాడార్‌ ఆలోచన నుంచి పురుడుపోసుకున్నదే 'బడి పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం'. 1960లో తమిళనాడు రాష్ట్రమంతటా అమల్లోకి వచ్చిన ఆ పథకాన్ని 1980లో గుజరాత్‌, 1995లో కేరళ అనుసరించాయి. ఆ తరవాతే ఆ కార్యక్రమం కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. దాదాపు 12.70లక్షల పాఠశాలల్లో 13కోట్లమందికి పైగా బాలలకు వర్తిస్తున్న అతిపెద్ద కార్యక్రమం ఇది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్యావిభాగం దీన్ని నిర్వహిస్తోంది. కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి వాటాలతో కొనసాగుతున్న దీనికి అసలుకే ఎసరు తెస్తున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే పిల్లల నోటిదగ్గరి కూటికి కక్కుర్తిపడే దారుణాన్ని ప్రభుత్వాలే అరికట్టాలని- సర్వోన్నత న్యాయస్థానం మొదలు స్వచ్ఛంద సేవాసంస్థలు, పౌరసంఘాల వరకు అనేకం చాలాకాలంగా పోరుతూనే ఉన్నాయి. కోర్టుల కన్నెర్రతో పాటు, పలు వర్గాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో- ప్రభుత్వ నియమ నిబంధనల్లో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా కేంద్రం ఇటీవల వెలువరించిన మార్గదర్శక సూత్రాలు చాలా కీలకమైనవి

కేంద్రం దిద్దుబాటు చర్యలు

చేదు అనుభవాల నేపథ్యంలోనే, ఈ పథకం అమలు తీరుపై కేంద్రప్రభుత్వం చూపు సారించింది. నియమావళి-2015 పేరిట మరికొన్ని విధివిధానాలను ప్రకటించింది. వాటిలో అత్యంత ప్రధానమైన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి: పిల్లలకు వండి వడ్డించే భోజన పదార్థాలకు సంబంధించి, గుర్తింపు పొందిన ప్రయోగశాలలో ప్రతినెలా పరీక్షలు జరపడం. రెండు: ఏ కారణం వల్లనైనా పిల్లలకు భోజనం అందించలేకపోతే, సంబంధిత రాష్ట్రప్రభుత్వమే వారికి ఆహార భద్రత భత్యాన్ని చెల్లించడం. ఈ రెండు రకాల ముఖ్యమైన దిద్దుబాటు చర్యలతోనైనా పరిస్థితి క్రమంగా అదుపులోకి వస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. దేశవ్యాప్త మధ్యాహ్న భోజన పథకాన్ని 20ఏళ్లక్రితం ప్రారంభించింది మొదలు, ఇప్పటివరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రభుత్వ నిధులు పొందుతున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత బడులు; స్థానిక సంస్థల నిర్వహణలోని విద్యాలయాలు, విద్యా ఉపాధి పథకం(ఈజీఎస్‌), ప్రత్యామ్నాయ-సృజనాత్మక విద్యా(ఏఐ ఈ)కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమం అమలవుతోంది. మొదటినుంచీ ఇది లోపాల పుట్టగానే ఉంది! రెండేళ్లక్రితం బిహార్‌లోని చాప్రా ప్రాంత పాఠశాలలో జరిగిన దుర్ఘటన 27మంది పిల్లల్ని పొట్టనపెట్టుకుంది. క్రిమిసంహారక మందులు ఉంచే డబ్బాలో వంటనూనె నిల్వచేశారు. ఆ నూనెతో వండిన ఆహారాన్ని వడ్డించడమే ఆనాటి ఘోరకలికి కారణం. ఆహార పరీక్ష అనంతరం, ప్రయోగశాల నుంచి వచ్చిన నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇప్పటికీ దాదాపు 89శాతం బడిపిల్లలకు వేడి భోజనం దక్కడం లేదని, 70శాతం పాఠశాలల్లో సరైన వంటశాలల వసతులు లేనే లేవని ఒక అంచనా. శుభ్రత లోపించడంతో ఆహార కల్తీ, కాలుష్యాల బారినపడి పిల్లలు అస్వస్థులవుతున్నారు. సరిపడా తిండిలేక, పోషకాలు లభించక మరెందరో అనారోగ్య పీడితులుగా మారుతున్నారు. ఇటువంటి బాలలు ఇండియాలో ప్రస్తుతం 34శాతం ఉన్నారని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ బాలల నిధి సంస్థ, 'గ్లోబల్‌ హెల్త్‌ డాటాబేస్‌'ల అధ్యయనాల్లో తేలింది. భోజన పథకం ప్రాథమిక ప్రయోజనాలే నెరవేరడం లేదని మరికొన్ని విశ్లేషణలు స్పష్టంచేస్తున్నాయి. పిల్లల ఆరోగ్య వివరాలు ఎక్కడా నమోదుకావడం లేదని; దీనికితోడు భోజనం సరిపడక నానా ఇబ్బందులకు గురయ్యే బాలల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణవారే అధికమని సాక్షాత్తు కేంద్రప్రభుత్వ పరిశీలనలోనే బయటపడింది.

కొత్త నియమాల ప్రకారం, పాఠశాల ఆవరణలో మాత్రమే భోజనం వండాలి. వంట స్థలంలో పరిశుభ్రత, బడిలో భోజనం నాణ్యతను పాఠశాల నిర్వహణ కమిటీ తప్పక పరిశీలించాలి. నిధుల వినియోగ బాధ్యతలను ప్రధాన ఉపాధ్యాయుడే వహించాలి. అన్నింటికీ మించి ప్రభుత్వ గుర్తింపు కలిగిన ప్రయోగశాల ద్వారానే భోజన పరీక్షలు జరపాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆహార పరిశోధన సంస్థ, ఔషధ నిర్వహణ సంస్థలు నెలనెలా ఆహార నమూనాలు సేకరించాలి. ఆయా సంస్థలకు అనుబంధంగా ఉండే ప్రయోగశాలలు ఇచ్చే ధ్రువపత్రమే పథకం నిర్వహణ తీరుకు మూలాధారం. పదార్థాల నాణ్యత, పోషక విలువలను ప్రయోగశాలే నిర్ధారిస్తుంది. అలా శాస్త్రీయంగా పరిశోధించి తేల్చిచెప్పడానికి, దేశంలో 'ప్రభుత్వ అనుమతి పొందిన ప్రయోగశాలలు' ఎన్ని ఉన్నాయన్నదే ప్రశ్న. ఇక భోజనం బాగోగుల తనిఖీలపై కేంద్రం, రాష్ట్రాలు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించక తప్పదు. పొరుగున ఉన్న కర్ణాటక లోగడే రాష్ట్రస్థాయి పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆహార నాణ్యతకు సంబంధించిన అన్ని ఫిర్యాదులనూ వేగవంతంగా పరిశీలించి పరిష్కరించేలా చర్యలు చేపడుతోంది. ఇది ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆదర్శప్రాయం. ఆహార ధాన్యాలు లేకపోవడం, ఇంధనం లభించని స్థితి, వంట ఖర్చులు విపరీతంగా పెరగడం, వంటమనిషి-సహాయకుల కొరత, ఇతర అనివార్య కారణాల వల్ల పిల్లలకు భోజనం పెట్టలేకపోతే, ఇకనుంచి రాష్ట్రప్రభుత్వమే ఆహార భద్రత భత్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తం- బాలలకు అందజేసే ఆహారధాన్యాల పరిమాణం, వంటఖర్చు లెక్కలపై ఆధారపడుతుంది. పాఠశాల పనిరోజుల్లో, వరసగా మూడు రోజులపాటు లేదా నెలలో అయిదురోజుల పాటు భోజనం అందించలేని పరిస్థితులు నెలకొంటే- ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి. ఆహార భద్రత భత్యం అందించేందుకు వెంటనే సిద్ధపడాలనీ కేంద్రం స్పష్టీకరించింది. అంతే కాక, పథకం అమలును పలు విద్య, ఆరోగ్య పథకాలతో అనుసంధానిస్తారు. నిజానికి తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఇదివరకే ఈ ప్రక్రియ మొదలుకావడం గమనార్హం.

పౌరసమాజమే అండ

బాలలకు భోజన పథకం మౌలిక లక్ష్యాలను ఆకళింపు చేసుకొన్న ఝార్ఖండ్‌- ఇతర ప్రాంతాలకు వేగుచుక్కగా నిలుస్తోంది. ఆ రాష్ట్రంలోని బడి పిల్లల తల్లులతో 'సరస్వతీ వాహిని' పేరుతో కార్యనిర్వహణ సంఘాలు ఏర్పాటయ్యాయి. వాటినుంచి ఎంపికైన ఇద్దరేసి ప్రతినిధులు వంటపనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ సంఘంలోని ఇతర సభ్యులూ బృందాలుగా ఏర్పడి వంట, వడ్డన పనుల పర్యవేక్షకులుగా వ్యవహరిస్తున్నారు. అదే కోవలో, ప్రతి బడిలోనూ బాలసభల పేరుతో కమిటీలు రూపొందాయి. భోజనానికి ముందు, తరవాత సబ్బునీళ్లతో చేతులు, కాళ్లు శుభ్రపరుచుకోవడం మొదలు- అన్ని ఆరోగ్యకర పద్ధతులూ పాటించేట్లు చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రతే బాలలకు విద్య, ఆరోగ్య భాగ్యాలు కలిగిస్తోంది. దీనికి పొడిగింపుగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో 'పాఠశాల మధ్యాహ్న భోజన పరిశీలక సంఘాల'ను చిన్నచిన్న బృందాల కలయికతో రూపుదిద్దుతున్నారు. ఇవన్నీ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకాలే!

గుజరాత్‌, తమిళనాడు బడిపిల్లలకు ఒకప్పుడు ఇతరచోట్ల వండిన భోజన పదార్థాలు వడ్డించేవారు. తరవాత ఆ రెండు రాష్ట్రాలతో పాటు పలుచోట్ల అనేక మార్పులు జరిగాయి. ఈ కార్యక్రమం నిరుపేద విద్యార్థుల పాలిట వరంగా మారిందని నాటి ప్రధాని వాజ్‌పేయీ, ప్రసిద్ధ ఆర్థికవేత్త-నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌, గతేడాది భారత పర్యటనకు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కితాబిచ్చారు. కానీ ఇంత విస్తృతమైన ప్రజాప్రయోజన పథకం అమలుపై స్వార్ధపరులైన వ్యాపార, రాజకీయవర్గాల నీడ పడటం అనర్థదాయకమని లోగడ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన అహ్లువాలియా తీవ్ర ఆందోళన వ్యక్తపరిచారు. అదే సంస్థకు చెందిన కార్యక్రమ మూల్యాంకన విభాగం అయిదేళ్లక్రితం నిర్వహించిన ఓ పరిశీలన- ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తే తప్ప, ఈ పథకం విజయవంతం కాదని తేల్చింది. కేంద్రం ఎప్పటికప్పుడు వెలువరించే నియమావళిని కొన్ని రాష్ట్రాలు పట్టించుకోవడం లేదని కూడా ఆ పరిశీలనలో వెల్లడైంది. ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే, ఇటువంటి పథకాలు- ఆశించినదానికి మించి, బహుళ ప్రయోజనాలు కలిగిస్తాయి. ఆ నిబద్ధత లోపించినప్పుడు కొత్తకొత్త సమస్యలకు దారితీస్తాయని అనుభవాలు చెబుతున్నాయి. ప్రభుత్వ విధివిధానాల్లో స్పష్టత లోపించడం, ఆహార పదార్థాల వినియోగంలో అవకతవకలు, భోజనంలో శుచి, రుచి కొరవడటం, వీటన్నింటికీ తోడు- కోట్లాది నిధులు కైంకర్యం కావడం పథకం అమలులోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. కేటాయింపుల్లో ఎడాపెడా కోతలు, పనుల నిర్వహణ-నియంత్రణ-పర్యవేక్షణల్లో లొసుగులు అన్నీ ఇన్నీ కావు. బడిపిల్లలకు భోజనమన్నది ఎవరి దయాధర్మమూ కాదని, అది వారి చట్టబద్ధమైన హక్కు అని, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని సుప్రీంకోర్టు గతంలోనే ప్రస్ఫుటం చేసింది. ఎవరికీ ఏ బాధ్యతా లేకుండా పోయిందని, ఒక్కమాటలో చెప్పాలంటే 'సర్వం స్వాహా పథకం'గా మారిందని కంప్ట్రోలర్‌-ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక సైతం వేలెత్తిచూపింది.

తీరు మారని తెలుగు రాష్ట్రాలు

ఉడకని పప్పు, నీళ్ల చారు, కుళ్లిన కూరగాయలు, ముక్కిపోయిన పదార్థాలతో బాలలకు ప్రాణాంతక పరిస్థితులు ఎదురుకావడంపై ఫిర్యాదులు- అప్పుడూ ఇప్పుడూ ప్రభుత్వాలను చుట్టుముడుతూనే ఉన్నాయి. తెలంగాణలో సన్నబియ్యంతో అన్నంపెడుతున్నా, కూరల గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి. కొందరు ఉపాధ్యాయులు నిర్వహణ బాధ్యతలను విస్మరిస్తున్నారు. కొంతమంది అధికారులు ఆకస్మిక తనిఖీల నిర్వహణ పట్ల అలసత్వం చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక వంటశాలల నిర్మాణం హామీలకే పరిమితమవుతోంది. వంట ఖర్చులు, సహాయకులకు పారితోషికాల విషయంలోనూ రకరకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వివిధ ప్రభుత్వ విభాగాలవారితో కూడిన కమిటీలు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నా, ఉభయ రాష్ట్రాల్లోనూ సరిగ్గా అదే లోపిస్తోంది. పౌరసరఫరాల శాఖలను ప్రక్షాళించడం అత్యవసరం. అది లేనంతకాలం 'ఎక్కడి గొంగడి అక్కడే' స్థితి రెండు చోట్లా తాండవిస్తూనే ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు చెల్లింపులు రాకున్నా, భవిష్యత్తులో ఏకమొత్తంగానైనా దక్కుతాయన్న ఆశతో చిన్నారులకు వండిపెడుతున్నామని కొన్నిచోట్ల స్వయం సహాయక బృందాలు చెబుతున్నాయి. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం- మరి కొన్నిచోట్ల రోజుల తరబడి పిల్లల కడుపు మాడుస్తోంది. బడుల వద్ద ఆహార ధాన్యాలు, కూరగాయలు భద్రపరిచే నిల్వ గదుల నిర్మాణ పనులూ నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవాలు ఈ విధంగా ఉంటే, కేంద్రం తెస్తున్న సంస్కరణలు ఏ మేరకు ఆచరణకు వస్తాయన్నది ప్రస్తుతానికి ప్రశ్నగానే మిగులుతోంది!

- జంధ్యాల శరత్‌బాబు
Posted on 10-10-2015