Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పరిశో'ధన'మే ప్రగతికి ఇంధనం!

* ప్రోత్సాహంతోనే సత్ఫలితం
భారతదేశంలో ప్రతిభ, పట్టుదలకు కొదవ లేకపోయినా, వనరులకు మాత్రం ఎప్పుడూ కొరతే. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ)లో పరిశోధన-అభివృద్ధికి నిధులను ఒక శాతం నుంచి రెండు శాతానికి పెంచాలని 2003 జాతీయ శాస్త్రవిజ్ఞాన విధానం పలికిన చిలక పలుకులనే 2013 విధానం మళ్ళీ వల్లించింది. ఆచరణలో మాత్రం జరిగింది శూన్యం. 2000 సంవత్సరంలో జీడీపీలో 0.8శాతంగా ఉన్న మన పరిశోధన బడ్జెట్‌ నేడు 0.9శాతానికి మాత్రమే పెరిగింది. మరోవైపు చైనా తన జీడీపీలో రెండు శాతాన్ని పరిశోధనలకు కేటాయిస్తోంది. మన శాస్త్రజ్ఞులు కొన్ని రంగాల్లో తక్కువ నిధులతోనే అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఒక హాలీవుడ్‌ సినిమాకయ్యే ఖర్చు కన్నా చాలా తక్కువకే మంగళయాన్‌ను విజయవంతంగా నిర్వహించారు. చంద్రయాన్‌, ఉపగ్రహ ప్రయోగాలు అంతరిక్ష రంగంలో భారతీయ శాస్త్రజ్ఞుల ప్రతిభను చాటాయి. మన శాస్త్ర సాంకేతిక నిపుణులు పేద ఆఫ్రికా దేశాలకు చవకగా జెనెరిక్‌ మందులను, టీకాలను అందిస్తూ ఎయిడ్స్‌, క్షయ తదితర వ్యాధుల చికిత్సలో కీలకపాత్ర వహిస్తున్నారు. అందుకే భారతదేశం నేడు వర్ధమాన దేశాల ఔషధశాలగా పేరుతెచ్చుకుంది. 60లలో భారత్‌ను తీవ్ర ఆహార కొరత పీడించినప్పుడు అమెరికా పంపిన ధాన్యాలే శరణ్యమై, 'నౌకల నుంచి నోటి కాడికి' అనే పదబంధం పుట్టింది. ఈ దుస్థితిని అధిగమించడానికి భారతీయ శాస్త్రజ్ఞులు పట్టుదలగా కృషి చేశారు. హరిత విప్లవం సృష్టించి ఆహార సమృద్ధికి తోడ్పడ్డారు. భారత ప్రగతి రథాన్ని మరింత వేగంగా ఉరకలెత్తించాలని వారికి తెలుసు. దీనికి కేవలం ప్రతిభ, పట్టుదలలే సరిపోవు. ఆర్థిక వనరులు, ప్రయోగ వసతులూ దండిగా కావాలి. కానీ, ప్రభుత్వం ఈ ఏడాది పరిశోధనశాలలకు నిధుల కేటాయింపులో 30శాతం కోత పెట్టింది. శాస్త్ర సాంకేతిక విభాగాలకు 2015-16 కేంద్ర బడ్జెట్‌లో గత ఏడాదికన్నా కొద్దిగా ఎక్కువ నిధులు కేటాయించినట్లు కనిపిస్తున్నా, ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ఏమీ పెంచనట్లే లెక్క! సైన్స్‌ విభాగాలకు కేటాయింపులను ఏటా 15శాతం పెంచనిదే శాస్త్రజ్ఞుల నుంచి గణనీయ ఫలితాలను ఆశించలేం. అదే సమయంలో విజయ సాధనకు ప్రభుత్వం దార్శనికత ప్రదర్శించాలి. సమగ్ర విధానాలను రూపొందించి కట్టుదిట్టంగా అమలు చేయాలి.

ఇంట గెలిచి రచ్చ గెలవాలి

ఈ సంగతి గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రజ్ఞులకు కొత్తగా దిశానిర్దేశం చేస్తున్నారు. నీరు, ఇంధన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సమస్యలను పరిష్కరించాలని ఈ ఏడాది జనవరిలో భారతీయ సైన్స్‌ మహాసభల్లో పిలుపిచ్చారు. 25శాతం పౌరులకు ఇప్పటికీ విద్యుత్‌ సౌకర్యం లేని భారతదేశంలో సౌరశక్తితోనే కరెంటు లోటు తీరుతుందని ఆయన విశ్వసిస్తున్నారు. అందుకే సౌరవిద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుత 3.7 గిగావాట్ల(ఒక గిగావాట్‌ అంటే వెయ్యి మెగావాట్లు) నుంచి 2022నాటికి 100 గిగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత నెలలో అగ్రశ్రేణి పరిశోధనా సంస్థలకు చెందిన 30మంది శాస్త్రజ్ఞులతో సమావేశమైనప్పుడు ఆయన వేసిన ప్రశ్నలివి: 'గంగానదిని శుద్ధి చేయడమెలా, క్షయ వ్యాధికి టీకా తయారు చేయలేమా, రుతు పవనాల రాకను కచ్చితంగా అంచనా వేయడమెలా, పశుగ్రాసాన్ని మరింత పుష్టికరంగా మార్చాలంటే ఏం చేయాలి'- ఈ ప్రశ్నలను బట్టి గ్రామీణుల సమస్యల పరిష్కారానికి మోదీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని అర్థమవుతోంది. ప్రపంచీకరణ, డిజిటలీకరణలు తీసుకొస్తున్న ఆర్థిక మార్పులు పట్టణాలనే కాదు- గ్రామాలనూ తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పారిశ్రామిక, సేవా రంగాల్లోనైతే కళ్లు బైర్లు కమ్మే వేగంతో మార్పులు సంభవిస్తున్నాయి. సంప్రదాయ విపణుల్లో ఇవి అలజడులు రేపుతున్నాయనడానికి ట్యాక్సీ, ఆటోవాలాల్లో 'వూబర్‌' సృష్టిస్తున్న కలకలమే నిదర్శనం. నరేంద్ర మోదీ ప్రకటించిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమ దశ, దిశలను కూడా ఉత్తరోత్రా రోబాటిక్స్‌, ఆటోమేషన్‌ ప్రక్రియలు మలుపు తిప్పబోతున్నాయి. భారతదేశంలో ఏటా 1,900 రోబోలు విక్రయమవుతుండగా చైనాలో నిరుడు 56,000 రోబోలను అమ్మారు. స్విట్జర్లాండ్‌లో రోబోలు తయారు చేస్తున్న టూత్‌బ్రష్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తుండగా, జర్మనీలో ఐస్‌క్రీమ్‌ కప్పులను నింపడానికి, బ్రిటన్‌లో నిమిషానికి 80 యోగర్ట్‌ (పెరుగు) డబ్బాల చొప్పున ప్యాకింగ్‌ చేయడానికి రోబోలను వినియోగిస్తున్నారు. దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గి సరకులు చవకగా లభిస్తాయి. అలాంటి ఉత్పత్తులతో పోటీ పడటానికి మేక్‌ ఇన్‌ ఇండియా కూడా కొత్త పరిజ్ఞానాలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది.

అంతరిక్షం, అణుశక్తి, ఫార్మా, వ్యవసాయం, క్షిపణుల అభివృద్ధి వంటి కొద్ది రంగాల్లో తప్ప మిగతా విభాగాల్లో భారతదేశ పరిశోధనల ఫలాలు ప్రయోగశాల నుంచి విపణిలోకి దూసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువ. దీనికి ఉన్నత విద్యారంగంలోని తీవ్రమైన లొసుగులే కారణం. దేశ రాజధాని దిల్లీలోని ఫొటోకాపీ దుకాణాల్లో పీహెచ్‌డీ పత్రాలను కూరగాయల్లా విక్రయించిన ఉదంతాలను చూస్తే, మన పరిశోధనలు ఎంత ప్రహసనంగా మారాయో అర్థమవుతోంది. మన పరిశోధనల స్థాయి అంతర్జాతీయ ప్రమాణాల ముందు దిగదుడుపుగా ఉండటమే కాదు, దేశంలో పరిశోధక నిపుణులకూ తీవ్రమైన కొరత ఉందని పార్లమెంటరీ సంఘం నివేదికే వాపోయింది. 128కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కేవలం రెండు లక్షల మంది పరిశోధకులు ఉన్నారు. భారత్‌లో ప్రతి 10,000 మంది జనాభాకు నలుగురు పరిశోధకుల చొప్పున ఉంటే, చైనాలో 18మంది ఉన్నారు. చివరకు ఆఫ్రికా దేశమైన కెన్యాలోనూ ఆరుగురు చొప్పున లెక్కతేలతారు.

ఇటీవలి కాలంలో భారతదేశంలో బహుళజాతి సంస్థలు పరిశోధనశాలల్ని నెలకొల్పడం వల్ల పేటెంట్లు, పరిశోధన పత్రాలు కాస్త ఎక్కువగానే వెలువడుతున్నాయి. కానీ, చిన్న దేశమైన దక్షిణ కొరియా 2013లో ప్రతి పది లక్షల మంది జనాభాకు 4,451 పేటెంట్లు దాఖలు చేస్తే, భారత్‌ 17 పేటెంట్లతో సరిపెట్టుకుంది. 2000 సంవత్సరంలో 25,000 పరిశోధన పత్రాలు వెలువరించిన భారత్‌ 2013లో మొత్తం 90వేల పత్రాలు సమర్పించింది. అదేకాలంలో చైనా పరిశోధన పత్రాలు 50,000 నుంచి 3,10,000కు పెరిగాయి. భారతదేశంలో దాదాపు 700 ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఉన్నా, వాటిలో అంతర్జాతీయ స్థాయి పరిశోధనలు చేపడుతున్న సంస్థల సంఖ్య చాలా స్వల్పం. ఐఐటీలు, ఎన్‌ఐటీల వంటి కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలు మినహా, ఇతర విశ్వవిద్యాలయాల్లో బోధనా ప్రమాణాలు ఎంతో తీసికట్టు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్ల సాయంతో విద్యా బోధన జరుగుతోంది. మన ఉన్నత విద్యాసంస్థల్లో సైతం సుద్దముక్క, నల్లబల్ల వినియోగం యథాతథంగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రయోగశాల వసతుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. దేశంలోని మొత్తం 2.8కోట్ల కళాశాల విద్యార్థుల్లో సగంమంది సామాజిక, న్యాయ, వ్యాపార నిర్వహణ శాస్త్రాలను అభ్యసిస్తున్నారు. 20శాతం ఇంజినీరింగ్‌, పారిశ్రామిక, భవన నిర్మాణ కోర్సులు, 15శాతం సైన్స్‌ కోర్సులు చదువుతున్నారు. మరి భారతదేశం సైన్స్‌, టెక్నాలజీల్లో ఏటా 9,000 పీహెచ్‌డీ పట్టభద్రులను మాత్రమే తయారు చేయగలుగుతోందంటే ఆశ్చర్యమేముంది? అదే అమెరికాలో ఇంతకు నాలుగు రెట్ల మంది తయారవుతున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో విద్యార్థులు చిన్న వయసు నుంచే ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న పట్టుదలను ప్రదర్శిస్తారు. అదే భారతదేశంలోని సంప్రదాయబద్ధ విద్యా, సామాజిక వాతావరణం, విద్యా సంస్థలపై ఉద్యోగి, అధికార గణం పెత్తనం, బోధనా ప్రమాణాల నాసితనం కలగలసి విద్యార్థుల్లో సృజనాత్మకతను, సాహసిక ప్రవృత్తిని చంపేస్తున్నాయి. 'టెక్‌ పరిశ్రమ సంప్రదాయ ధోరణులను గౌరవించదు. నవ కల్పనలకు మాత్రమే పట్టం కడుతుంది... ఆస్కార్‌ వైల్డ్‌ చెప్పినట్లు అసాధ్యాలను సాధ్యం చేయడం మన ధ్యేయం కావాలి' అని మైక్రోసాఫ్ట్‌ సిబ్బందికి రాసిన లేఖలో సత్య నాదెళ్ల ఉద్ఘాటించారు. ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించి సానపట్టే సంస్కృతి మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌ వంటి టెక్‌ కంపెనీల సొంతం. అభివృద్ధి చెందిన దేశాలు, అక్కడి వెంచర్‌ ఫండ్‌లూ వైఫల్య భయం లేకుండా ధైర్యంగా నవ కల్పనలు చేసేలా పరిశోధకులకు అండదండలందిస్తాయి. భారతదేశంలోనూ అటువంటి సంస్కృతి పాదుకొల్పినప్పుడు కొత్త పరిశోధనలు, పేటెంట్ల దాఖలూ వూపందుకొంటాయి.

పయనించాల్సిన దూరమెంతో...

ఇటీవలి కాలంలో ఐఐటీలు స్టార్టప్‌లను ప్రారంభించేలా తమ పట్టభద్రులను ప్రోత్సహిస్తున్నాయి. అందులో ఒకవేళ విఫలమైనా, ప్రాంగణ నియామకాల ద్వారా ఉద్యోగాల్లో చేరే అవకాశం కల్పిస్తాయి. ఇది శుభారంభమే కానీ, అమోఘ ఫలితాలను సాధించడానికి ఇదొక్కటే చాలదు. 1980లో అమెరికా 'బే-డోల్‌' చట్టం తెచ్చినప్పటి నుంచి విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు విరివిగా కొత్త ఉత్పత్తులు, పరిష్కారాలను కనిపెట్టి సొంత కంపెనీలను స్థాపించసాగారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నిధులతో విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులు, విద్యార్థులు కనిపెట్టిన కొత్త అంశాలపై వారికే మేధో హక్కులు దఖలు పరచడం 'బే-డోల్‌' చట్ట విశిష్టత. భారతదేశమూ క్రమంగా ఇలాంటి చట్టాలను, విధానాలను చేపట్టాలి. జీవశాస్త్రంలో మూలకణ, జీనోమ్‌, కంప్యూటేషనల్‌ బయాలజీ పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారు. స్టార్టప్‌లకు ప్రభుత్వ నిధులను ఏటా 20శాతం చొప్పున పెంచాలని నిర్ణయించారు. అయినా జరగాల్సింది ఇంకా చాలా ఉంది. సైన్స్‌, టెక్నాలజీ రంగాల్లో గొప్ప విప్లవం సాధించాలన్న కసితో ప్రభుత్వం, పరిశోధకులు పనిచేస్తూ భారత్‌ను 21వ శతాబ్ది విజేతగా నిలపాలి!

- కైజర్‌ అడపా
Posted on 17-10-2015