Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

భద్రమైన భవిత కోసం... పర్యావరణ సదస్సు

భారతదేశంలో పరిసరాల శాస్త్రానికి ఘనమైన చరిత్ర ఉంది. అధర్వణ వేదం 'భూమి సూక్తం'లోని 63శ్లోకాలు- పరిసరాల పరిరక్షణలో మానవుల బాధ్యతలు, ధర్మాలను చర్చించాయి. అదేవిధంగా యజుర్వేదం- 'ఆకాశాన్ని ఆక్రమించకు. మధ్య ఉన్న గాలిని కలుషితం చేయకు. భూమికి అనుగుణంగా వ్యవహరించు. బతుకు ...' అని మానవులకు ఉపదేశిస్తోంది. పరిసరాల పరిరక్షణకు సంబంధించి, ఈ విధమైన తత్వజ్ఞాన సంప్రదాయం భారతీయ చరిత్రలో అనాదిగా ఉంది. పరిసరాల పరిరక్షణ విషయంలో ఒక విధానాన్ని రూపొందించి ఆచరింపజేయడం మౌర్యుల కాలం నుంచే ఆరంభమైంది. ఈ విషయం ప్రాచీన గ్రంథం 'అర్థశాస్త్రం' ద్వారా స్పష్టమవుతోంది. దీని ప్రకారం- చెట్లు నరికినవారికి, అడవుల్ని నాశనం చేసినవారికి, జంతువులను అకారణంగా చంపినవారికి, పలు రకాల కాలుష్యం కలిగించినవారికి అప్పట్లోనే అనేక శిక్షలు విధించేవారు. పరిసరాలపట్ల అంతటి ఉద్విగ్న భావన ఆ కాలంనుంచే ఉంది. దాన్ని ఒక తాత్విక జ్ఞానంతో సిద్ధాంతీకరించారు. బాధ్యత విస్మరించి ప్రవర్తించినవారిని శిక్షించారు. ఇది ఏ ఇతర ప్రాంతంలోనూ అనాది కాలంలో కనిపించని ఒక నిరుపమాన అంశం. పాశ్చాత్య దేశాల్లో పరిసరాల గురించి చట్టం లేదా శాసనం 17వ శతాబ్దంలో వెలువడింది. మొట్టమొదటిసారిగా దీన్ని యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని ఫార్న్‌ దీవుల్లో పక్షుల సంరక్షణకు ఉద్దేశించారు.

అస్తిత్వ పోరాటం

ఆధునిక కాలంలో పరిసరాల పరిరక్షణమీద అవగాహన పాశ్చాత్య మేధావులవల్ల పెరిగింది. ఇదే సందర్భంలో ప్రకృతి ప్రేమికుడు, కవి విలియమ్‌ వర్డ్స్‌వర్త్‌తోపాటు సముద్ర జీవ శాస్త్రజ్ఞుడైన రాచెల్‌ కార్సన్‌ గుర్తుకొస్తారు. పరిసరాల ప్రభావం వీరిపై ఎంతగానో ఉంది. కార్సన్‌ రచించిన 'సైలెంట్‌ స్ప్రింగ్‌' శాస్త్రాధార గ్రంథం. ఇది పరిసరాల రక్షణ అంశాలకు ఎంతో దోహదం చేసింది. కానీ, అప్పుడు సాగిన ఆ ప్రక్రియలో రెండు ప్రధాన లోపాలు కనిపిస్తాయి. ఒకటి: అలనాటి ఆ ఉద్యమానికి సామాన్యులతో పాటు మేధావుల మద్దతు లభించినా- అది చాలావరకు ఒక అద్భుతమైన భావనాత్మక అంశంగానే మిగిలిపోయింది. రెండు: అప్పటి ఆ ప్రక్రియ కేవలం ప్రతిక్రియగానే ఉండిపోయింది తప్ప, ఒక సాధనాత్మక రూపం పొందలేదు. అందువల్ల, సిద్ధాంతీకరించడం లేదా చట్టపరమైన రూపం సంతరించుకోవడం జరగనే లేదు. చాలాకాలంగా ఇది ఒక భావనగానే మిగిలింది. అనంతర కాలంలో పారిశ్రామిక విప్లవంవల్ల పలు పరిణామాలు సంభవించాయి. వాటివల్ల కలిగిన కష్టనష్టాలు అనుభవించిన తరవాతే, ప్రభుత్వాలు నడిపే నాయకుల్లో ప్రకృతి పరిరక్షణ గురించి చలనం కలిగింది. అత్యద్భుతంగా కొనసాగిన పారిశ్రామిక ప్రగతి పాశ్చాత్య దేశాలను ఒక సరికొత్త యుగంలోకి నడిపించింది, అనంతర స్థితిగతులు, మానవులందరూ నివసించాల్సిన ఈ భూమి అస్తిత్వానికే ప్రమాదకరంగా పరిణమించాయి. అప్పటినుంచి 20వ శతాబ్ది వరకు, ముఖ్యంగా చివరి శతాబ్దంలో మానవ జీవనం, జాతి ప్రగతి అనే రెండు విషయాలూ పరస్పర విరుద్ధాలుగా మారాయి. వీటి మధ్య అనారోగ్యకరమైన పోటీ ప్రారంభమైంది. అంతేకాదు, ఇవి రెండూ కలిసి ప్రయాణించలేని పరిస్థితి కూడా ఏర్పడింది.

1970లలో ఈ అంశంపై చర్చ మళ్ళీ ప్రారంభమైంది. కోవెల్‌, లోవీ వంటి సిద్ధాంతకర్తలు ప్రవేశపెట్టిన 'పరిసరాలు-సామాజిక కర్త' అనే భావన లేదా విజ్ఞాపన పత్రం వల్ల కొందరు ప్రభావితులయ్యారు. అన్ని రకాల యంత్రాల బహిష్కరణే ఈ సమస్యకు పరిష్కారంగా భావించారు. అయాన్‌ రాండ్‌ వంటి మరికొందరు మేధావులు దాన్ని 'భావావేశ ప్రతీక'గా భావించారు. రాండ్‌ 'కేవలం ప్రకృతిపరంగా బతకడం సామూహిక మరణం' అని వ్యాఖ్యానించాడు. ఈ వాదనను కొంతమంది సమర్థించారు. ఇలా రెండు వర్గాల అంతర్యుద్ధంలో అసలు సమస్యలైన 'వాతావరణ కాలుష్యం, పరిసరాల పరిరక్షణ' మరుగునపడ్డాయి. ఏ సిద్ధాంతం గొప్పది, ఏది మనుషులకు అవసరం అనేవాటిపై వాద ప్రతివాదాలు సాగాయి. ప్రకృతిని విస్మరించడం సైతం ఇంకా సాగుతూ వచ్చింది. ఈ చర్చల నుంచి మూడో సిద్ధాంతం పుట్టుకొచ్చింది. దాన్ని 'సమతౌల్య ప్రగతి'గా వర్ణించారు. పలువురు మేధావులు, సిద్ధాంతకర్తలు దాన్ని విస్తృతంగా సమర్థించారు. 1972లో ఐక్యరాజ్య సమితి స్టాక్‌హోమ్‌లో నిర్వహించిన సదస్సు 'మానవ జీవితం, పరిసరాల'పై సాగింది. ఈ సమర్థనకు అదే నిదర్శనం. ఇందులో- వాతావరణం, మానవ ప్రగతి పరస్పర విరుద్ధ అంశాలు అనే భావనను తొలగించడానికి ప్రయత్నించారు. రెండు అంశాలను సిద్ధాంతీకరించారు. అందులో మొదటిది- పరిసరాల పరిరక్షణ విధానం ఏ ప్రగతికీ అవరోధం కాకూడదు. రెండోది- ఏ పరిసరాలైనా తమ స్వచ్ఛతను కాపాడుకోలేని పరిస్థితిని కాలుష్యం పేరిట కలిగించరాదు. వీటినే అప్పట్లో ప్రతిపాదించారు. అప్పుడప్పుడే ప్రగతిపథంలోకి చేరాలని ప్రయత్నిస్తున్న దేశాల గురించీ నాటి సదస్సు చర్చించింది. పరిసరాల రక్షణ, పారిశ్రామిక ప్రగతి మధ్య ఎటువంటి వైరుధ్యమూ లేకుండా సమతుల్యత సాధించాలని అది పిలుపిచ్చింది. 'ఇప్పుడిప్పుడే ప్రగతి సాధిస్తున్న దేశాలకు అందరి సహాయమూ కావాలి. పరిసరాల సంరక్షణకు ప్రయత్నాలు కొనసాగాలి. ఆయా దేశాలకు కావలసిన వనరులను తక్కువ ధరలతో సమకూర్చి, వాటికి చేదోడువాదోడుగా నిలవాలి' అని ఆ సదస్సు నాడు ఉద్ఘాటించింది.

ఇండియాలో పర్యావరణ పరిరక్షణ కృషి 'చిప్కో' ఉద్యమంతో కొత్తగా వూపందుకొందని చెప్పవచ్చు. ఈ అంశంలో మొట్టమొదటగా ఒక విధానాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రూపొందించారు. తన స్టాక్‌హోమ్‌ సదస్సు ప్రసంగంలో బీదరికాన్ని ఒక ముఖ్య కారణంగా ఆమె వర్ణించారు. 'వాతావరణ కాలుష్యానికి, పరిసరాల గుణాత్మక క్షీణతకు మౌలిక అవసరాలు సైతం తీర్చని బీదరికం కూడా కారణం కాదా' అని గట్టిగా ప్రశ్నించారు. అనంతరం, 1969లోనే జలకాలుష్య నివారణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. అది 1974లో 'జలకాలుష్య నివారణ, నియంత్రణ చట్టం'గా రూపొందింది. అది భారత్‌ విధివిధానాల్లో పరిసరాల పరిరక్షణతోపాటు ఇంకా అనేకమైనవి రూపొందడానికి దోహదపడింది. తరవాత 1981లో వాయుకాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని రూపొందించారు. ఇందిరాగాంధీ మరణం అనంతరం ప్రధాని అయిన రాజీవ్‌గాంధీ హయాములో చరిత్రాత్మకమైన 'పరిసరాల రక్షణ చట్టం' 1986లో రూపుదిద్దుకొంది. అన్నిరకాల కాలుష్యాలనూ నివారించేంత సమగ్ర విధానంగా అది వెలువడింది. ఈ విధానాలు భారత్‌లో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణకు ముందే రూపొందడం గమనార్హం. 1990లలో ఆర్థిక స్థితిని చైతన్యపరచడానికి చేసిన కొన్ని ప్రయత్నాలతో, పరిసరాల పరిరక్షణ అంశం వెనకబడింది. పాశ్చాత్య దేశాలు 1970లలో ఎదుర్కొన్న బాధాకర పరిస్థితి భారత్‌ ఇరవై ఏళ్ల తరవాత 1990లలో ఎదుర్కొంది. ఇది ఒకవిధంగా కమ్యూనిస్టు దేశమైన సోవియట్‌ యూనియన్‌ బీటలువారాక, ఇక్కడి కమ్యూనిస్టు పార్టీలు బలం కోల్పోతున్న సమయంలో సంభవించింది. వాతావరణ కాలుష్యం గురించి మాట్లాడినవారిపై ధనికవర్గాలకు, ప్రగతికి వ్యతిరేకులుగా ముద్రవేయడం జరిగింది. సహజంగానే పర్యావరణ పరిరక్షణే- ప్రగతి కంటే ముఖ్యమనేవారిని ఈ వర్గానికి చెందినవారిగా భావిస్తూ వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. ఈ విజయానికి కారణం- రూపొందిన విధివిధానాలన్నీ పరిసరాల రక్షణ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడమే! ఓజోన్‌ సంబంధిత అంశాలు 2000లో, దేశ జలవిధానం 2002లో, పరిసరాల చట్టం 2006లో, గ్రీన్‌ ట్రైబ్యునల్‌ నిబంధనలు 2010లో వెలువడ్డాయి. ఇంకా ఎన్నో నిబంధనలు, విధివిధానాల రూపకల్పనలు- ప్రకృతి పరిరక్షణ, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొనే రూపొందాయి. అప్పటివరకు ఉన్న ద్వైదీభావం పోయి, ప్రగతికి మార్గం సుగమమైంది. అంతవరకు ఉన్న సందేహాలు, భయాలు పటాపంచలయ్యాయి.

కొత్త దారిలో...

రాష్ట్రాల సమాహారంగా ఏర్పడిన భారత్‌లో- ఏ చట్టాలను విజయవంతంగా అమలుచేయాలన్నా, రాష్ట్రాలే ముందుగా అవగాహన చేసుకోవాలి. ప్రజాపాలనలోకి వాటిని తేవాలి. ఈ విషయంలో రాష్ట్రాలదే ముఖ్యమైన భూమిక. పరిసరాల పరిరక్షణకు సంబంధించిన అంశాలు- జలసంరక్షణ, అడవుల్ని కాపాడటం, ఆర్థిక ప్రగతి వంటి అన్నింటినీ నిజాయతీగా అమలుపరచాల్సి ఉంటుంది. ఇటువంటి చొరవ వల్ల వెలువడిందే- తెలంగాణ సౌరశక్తి చట్టం- 2015. అలాగే కేరళలో హరిత భవనాల చట్టం(2013), మహారాష్ట్రలో శక్తి పునర్నిర్మాణ చట్టం(2015) రూపొందాయి. ఈ రాష్ట్రాలు చూపిన విధానాలు దేశంలో మళ్ళీ ఒక 'హరిత' విప్లవానికి దారితీస్తాయనడంలో సందేహం లేదు. పరిసరాలను మునుపు ఒక భావనాత్మక అంశంగానే పరిగణించారు. ఆ చింతనను అనుభవపూర్వకమైన అంశంగా ఆ తరవాత మార్చుకున్నారు. మానవ జీవితంలో ప్రగతి సాధిస్తూనే, పర్యావరణాన్ని సంరక్షించుకునే పద్ధతిని అనుసరిస్తున్నారు. ఇదే ఇప్పటి ప్రత్యేకత. ఈ సాధనలో ఒకప్పుడు కేవలం ప్రతిచర్యగా మొదలైన భావన, ఇప్పుడు ఒక సాధనాత్మక క్రియగా రూపొందడం ముదావహం. అందుకే, ఈ సరికొత్త 'హరిత' విప్లవం భారత్‌ భవిష్యత్తుకు మేలిబాటలు వేయడమే కాకుండా, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సహజ వనరులిచ్చిన ప్రకృతిని కాపాడుకోవడం, ప్రగతిపథంలో దూసుకుపోవడం నేడు భారత్‌కు సాధ్యపడుతోంది. యూఎన్‌ఎఫ్‌సీసీ సదస్సు పారిస్‌లో జరగనున్నది కనుక, ఇప్పుడు భారత్‌ సాధించిన ఈ విజయం ప్రపంచానికి ఒక చక్కటి సందేశమిస్తుందని ఆశిద్దాం!

- క‌ల్వకుంట్ల క‌విత‌
(ర‌చ‌యిత్రి - పార్లమెంటు స‌భ్యురాలు)
Posted on 29-11-2015