Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సుపరిపాలన అడుగుజాడలు

సంకుచిత రాజకీయ ప్రయోజనాలకన్నా జాతి హితానికే పెద్దపీట వేసిన రాజనీతిజ్ఞుడు- అటల్‌ బిహారీ వాజ్‌పేయీ. సమర్థ సారథిగా దేశానికి కొత్త దశ, దిశ కల్పించారాయన. పోఖ్రాన్‌ అణుపరీక్ష నిర్వహించి, భారతదేశ సత్తాను లోకానికి చాటిచెప్పిన అటల్‌జీ హయాములోనే- సర్వశిక్షా అభియాన్‌, స్వర్ణ చతుర్భుజి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన వంటి పథకాలెన్నో పట్టాలకెక్కాయి. దేశప్రగతికి మేలుబాటలు పరచిన పాలన వైదుష్యం ఆయన సొంతం. అంతర్జాతీయ సంబంధాలను నెలకొల్పుకోవడంలో తనదైన ముద్ర వేసిన వాజ్‌పేయీ- ‘ఆపరేషన్‌ విజయ్‌’ ద్వారా శత్రుమూకల పనిపట్టి దేశ రక్షణలో తిరుగులేని నిబద్ధత చాటుకున్నారు. 1957నుంచి 2009దాకా పది దఫాలుగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన, అయిదేళ్లపాటు సుస్థిరంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. శివుడి జటాజూటం నుంచి దూకి, హిమగిరుల్ని తాకి, పరవళ్లు తొక్కుతున్న గంగాప్రవాహం ఆయన వాగ్ధాటి. అజాతశత్రువుగా దేశంలో సరికొత్త రాజధర్మాన్ని పాదుకొల్పిన ఆయనకు ఎవ్వరు సరిసాటి?

‘ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా కావచ్చుకానీ, దేశంకంటే గొప్పవాడు కాదు. ఓ రాజకీయ పక్షం ఎంత శక్తివంతమైనదైనా కావచ్చుకానీ, ప్రజాస్వామ్యం కంటే శక్తివంతం కాజాలదు’- ఈ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి, ఆచరణలోనూ ప్రవచిత ప్రమాణాలకు నిలువెత్తు దాఖలాగా నిలిస్తే... ప్రజాస్వామ్యానికి అంతకుమించిన పండగేముంటుంది! ఏడుపదుల రాజకీయ జీవితంలో విపక్ష నాయకుడిగా, దేశాధినేతగా ప్రతి దశలోనూ గీటురాయిగా మిగిలిపోదగిన ప్రమాణాలకు ప్రతీకగా నిలిచిన ఆ భారత రత్నమే... అటల్‌ బిహారీ వాజ్‌పేయీ! విలువలే వూపిరిగా స్వాతంత్య్రానంతర భారత రాజకీయాలకు నూతన సంస్కారం నేర్పిన అటల్‌జీ నికార్సయిన రాజనీతిజ్ఞుడు. ప్రజలే నిర్ణాయక శక్తిగా అంగీకరించిన పాలకులు- అందుకు భిన్నంగా వరస తప్పులు చేయడంతో పాలన గాడి తప్పి, వ్యవస్థలు పట్టుకోల్పోయిన దశలో విలక్షణ ముద్రతో రంగ ప్రవేశంచేసి రాజకీయాలకు కొత్త రంగు, రుచి అద్దిన మహానాయకుడు అటల్‌జీ. విజ్ఞత, నిర్మాణ దక్షత, బాధ్యతతోపాటు ప్రజలపట్ల అసలైన ఆపేక్షతో పాలన అందించారు కాబట్టే అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పుట్టిన రోజును కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తోంది. సమున్నత ఆదర్శాలకు పెద్దపీట వేసి, సమకాలీన రాజకీయాలకు మార్గదర్శిగా నిలిచిన అటల్‌జీ 91వ జన్మదినోత్సవం నేడు. ఉత్తమ నాయకత్వానికి ఉదాహరణ తానై, వ్యక్తిగానూ విశిష్ట విలువలకు పెద్దపీటవేసిన వాజ్‌పేయీ... ముందుతరాలకు సిసలైన స్ఫూర్తి ప్రదాత!

అసలైన ప్రజాస్వామ్యవాది

ప్రజలకూ, ప్రభుత్వానికీ వేర్వేరు లక్ష్యాలు ఉండవన్న అవగాహన అణువణువున పుణికిపుచ్చుకున్న నాయకుడాయన. ఇతరుల అభిప్రాయాలను సగౌరవంగా ఆలకించగల ప్రజాస్వామ్యవాది కాబట్టే మిత్రపక్షాల మనసులు గెలుచుకుని- సంకీర్ణ ప్రభుత్వానికి దశ దిశ నిర్దేశించగలిగారు అటల్‌జీ! ఏకాభిప్రాయంతో సంకీర్ణ రాజకీయాలు నడిపి తొమ్మిదో దశకంలో జాతి రాజకీయ గమనానికి నూతన పథ నిర్దేశం చేశారు. కుహనా లౌకిక అజెండాతో కాంగ్రెస్‌ పార్టీ ఒకవైపు కాలుదువ్వుతున్నా తొణకకుండా ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో మట్టికరిపించిన ధీశాలి వాజ్‌పేయీ. లోక్‌సభలో 1996లో అత్యధిక సీట్లు సాధించిన అతిపెద్ద పార్టీకి నాయకుడిగా ఆవిర్భవించినప్పటికీ- సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా విచ్ఛిన్న కుట్రలతో కాంగ్రెస్‌ పార్టీ చెలరేగింది. పాలన వ్యవస్థలకు కొత్త రక్తం ఎక్కించాలని అహరహం తపించిన ప్రజాస్వామ్యవాది జమానాకు ఆ రకంగా 13నెలల్లోనే ముగింపు పలికిన కుయుక్తుల కాంగ్రెస్‌ 1996-‘98 మధ్యకాలంలో హెచ్‌.డి.దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌ల సారథ్యంలోని రెండు అత్యంత బలహీనమైన ప్రభుత్వాలను దేశంమీద రుద్దింది. మొక్కవోని సంకల్పానికి వాజ్‌పేయీ ప్రతీక. న్యాయం గెలిచేదాకా ప్రజాక్షేత్రంలో పోరాడగల డస్సిపోని దార్శనికుడాయన. కాంగ్రెస్‌ అవకాశవాద ధోరణిని ఎండగడుతూ 1998ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి చరిత్రాత్మక విజయం అందించి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) పేరిట అత్యున్నత ఆదర్శాలతో సంకీర్ణ సర్కారును కొలువుతీర్చారు అటల్‌జీ. అంతకుపూర్వం భాజపాను వ్యతిరేకించిన పార్టీలు సైతం ఎన్డీయేలో భాగస్వామ్య పక్షాలుగా చేరాయి. పార్టీ పరిమితులు దాటి దేశవ్యాప్తంగా తనకంటూ సొంత గుర్తింపు, విస్తృత ఆమోదం సొంతం చేసుకున్న వ్యక్తి కావడంవల్లే పార్టీలన్నీ ఆనాడు వాజ్‌పేయీని విశ్వసించాయి. కుటిలత్వానికి చిరునామాగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటి తీరునే కొనసాగించి రాజకీయ పన్నాగాలకు ప్రాణం పోసి, 13నెలల్లోనే ఎన్డీయే-1 ప్రభుత్వాన్ని అస్థిరపరచింది. ప్రశ్నార్థకమైన ఒకే ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయీ ప్రభుత్వం పార్లమెంటులో ఓడిపోయింది. ఆ రోజు నాకిప్పటికీ గుర్తే. నిజంగా అటల్‌జీ మనసు విరిగిన రోజది! ఓటింగ్‌ పూర్తయిన తరవాత లోక్‌సభనుంచి నెమ్మదిగా నడుచుకుంటూ పార్లమెంటు భవనం పదో నంబరు గదిలోని తన కార్యాలయానికి చేరుకున్నారాయన. ఆయన వెనకే మేమంతా! గదిలోకి ప్రవేశించిన వెన్వెంటనే ‘హమ్‌ కేవల్‌ ఏక్‌ ఓట్‌ సే హారే, కేవల్‌ ఏక్‌ ఓట్‌’ (మనం కేవలం ఒక్క ఓటు తేడాతో ఓడాం... కేవలం ఒక్క ఓటు) అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారాయన. అటల్‌జీ తన భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోవడాన్ని చూడటం అదే మొదటిసారీ... చివరిసారీ! పడిలేచిన కెరటమాయన. 1999 పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో ఆయనలోని మహావక్త నిద్రలేచి సింహనాదం చేశారు. ‘నా ప్రభుత్వాన్ని కేవలం ఒక్క ఓటు తేడాతో కూల్చేయడానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నింది. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఒకే ఒక్క ఓటు మా విజయానికి, ప్రభుత్వ ఏర్పాటుకు వూపిరిపోయాలి’అని దేశవ్యాప్తంగా నిర్వహించిన అనేక ర్యాలీల్లో వాజ్‌పేయీ చేసిన పదునైన ప్రసంగాలు ప్రజలను జాగృతపరచాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా జాతి ప్రజలను ఒక్కతాటిమీదకు తీసుకువచ్చిన అటల్‌జీ- నాటి ఎన్నికల్లో విచ్ఛిన్నశక్తులకు మరచిపోలేని గుణపాఠం నేర్పారు.

స్థిరత్వం... పారదర్శకత్వం!

‘అడుగులు తడబడే పసిపాప కాదు భారత్‌. మహోన్నత చరిత్ర, పాలన వ్యవస్థలు భారతావని సొంతం. మనం చేయాల్సిందల్లా ఆధునిక సవాళ్లకు అనుగుణంగా దేశాన్ని తీర్చిదిద్దడమే’- వాజ్‌పేయీ చేసిన ఈ వ్యాఖ్య దేశంపట్ల, పాలన సంప్రదాయాలపట్ల ఆయనకుగల అపారమైన అవగాహనకు నిదర్శనం. అంతటి సమర్థుడు కాబట్టే సామాన్యుడి గళంగా, నీతిమంతమైన పాలనకు ఆయన బలంగా లాకులెత్తగలిగారు. స్థిరమైన, పారదర్శకమైన పాలన అందిస్తే అన్ని రంగాలూ అభివృద్ధి చెందుతాయన్నది అటల్‌జీ నమ్మిన ఆదర్శం! అచ్చంగా అందుకు పెద్దపీట వేస్తూ భారత ప్రధానిగా ఆయన పాలన వ్యవస్థల్లో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. కచ్చితమైన కాలవ్యవధి నిర్దేశించి, పరిమిత సమయంలో ప్రభుత్వాధికారులు లక్ష్యాలను పరిపూర్తి చేయాలన్న విధానం వాజ్‌పేయీ జమానాలోనే ప్రవేశపెట్టారు. సంస్కరణల పథంలో కిందుమీదులవుతున్న భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిర బాట పట్టించడం, మౌలిక సౌకర్యాలకు కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రాధాన్యమిచ్చి ప్రజల జీవన నాణ్యతను ద్విగుణీకృతం చేయడం, సామాజిక అంతరాలను తొలగించే పురోగామి పథకాలను పట్టాలకెక్కించడం వంటి చర్యలతో ప్రతి విభాగంలోనూ తన అనుభవాన్నంతా రంగరించి అద్భుత పాలనను అందించారాయన.సామాజిక, ఆర్థిక అభివృద్ధి పథంలో దేశం ఎలా ముందడుగు వేయాలన్న దానిపై అన్ని పక్షాలమధ్య ఏకాభిప్రాయం సాధించడం ప్రధానిగా ఆయన సాధించిన మహాద్భుత విజయం. అటల్‌జీది సమన్వయ మంత్రం! రహదారులు, రైల్వే, వైమానిక, నౌకా అనుసంధానానికి ఆయన జమానాలోనే పునాది పడింది. సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని టెలికం సేవలు, టెలివిజన్‌ ప్రసారాలు, ఐటీ అనుసంధానం వంటివాటితో ప్రగతిరథ సారథిగా దేశాన్ని కొత్త పుంతలు తొక్కించారు అటల్‌జీ. ‘స్వర్ణ చతుర్భుజి’ పథకం ఆయన మానస పుత్రిక. దేశంలోని నాలుగు ప్రధాన నగరాలను అనుసంధానించడం ద్వారా జాతి రహదారుల ముఖచిత్రాన్నే ఒక్కపెట్టున మార్చి, ఆర్థిక వ్యవస్థను దౌడు తీయించిన మహత్తర కార్యక్రమమది. మరోవంక ప్రధాన్‌ మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన గ్రామీణ ఆర్థికాన్ని గుణాత్మకంగా మార్చేసింది. గ్రామీణ ప్రాంత బాలికల్లో అక్షరాస్యత శాతం పెంచే సమున్నత ఆశయంతో ప్రారంభించిన సర్వశిక్ష అభియాన్‌ కార్యక్రమం దేశంలో విద్యాకుసుమాలు విరబూయించింది. ప్రజాస్వామ్యంలోని లోపాలను మరింత ప్రజాస్వామ్యం ద్వారానే పరిష్కరించగలమని విశ్వసించిన వాజ్‌పేయీ జమానా చివరినాటికి భారత్‌ ఎనిమిది శాతం వృద్ధిరేటుతో ముందుకు సాగింది. ఆయన పాలన వైదుష్యానికి నిదర్శనమిది. జాతి వైవిధ్యాన్ని ఆకళింపు చేసుకొని, సమాజంలోని అన్ని స్థాయులకూ పాలనను తీసుకువెళ్ళిన వాజ్‌పేయీ ఆదర్శాలు ఎప్పటికీ అనుసరణీయాలు.

స్ఫూర్తిదాయక నాయకత్వం

‘ఓటమిని అంగీకరించను. పోరాటం ప్రారంభిస్తాను... కొత్త పాట పాడతాను’- వాజ్‌పేయీ రాసిన కవితా పంక్తులవి. మడమతిప్పని వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్న అటల్‌జీ నైతిక నిష్ఠతో ఎప్పటికప్పుడు రాజకీయాలకు కొత్త మెరుగులు అద్దారు. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వంలో విదేశాంగమంత్రిగా తొలిసారి బాధ్యతలు నిర్వహించినప్పుడే పరిణత ముద్రతో భాసించిన అటల్‌జీ ఆ తరవాత పాలనపథంలో అంతకంతకూ రాటుదేలారు. దాయాది దేశం పాకిస్థాన్‌ ఎప్పటికప్పుడు భారత్‌ను అస్థిరపరచే కుయుక్తులతో ఇబ్బందిపెడుతున్నా దిల్లీ-లాహోర్‌ బస్సు యాత్ర ద్వారా అలుపులేని శాంతికాముకతకు ప్రతినిధిగా నిలిచారాయన. పాకిస్థాన్‌తో సంబంధ బాంధవ్యాలను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు దోహదంచేసిన ప్రయత్నమది. 2003 మేలో అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కీలక సహచరుల్లో ఒకరైన కార్ల్‌ ఇండర్‌ ఫర్త్‌- ‘సుహృద్భావ వాతావరణం నెలకొనేలా భారత్‌, పాక్‌ నాయకులు ఐక్యంగా సరికొత్త తీర్మానం అమలు చేయగలిగితే నోబెల్‌ శాంతి బహుమతి కచ్చితంగా గెలుచుకోగలుగుతారు’ అని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో వ్యాఖ్యానించారు. భారత్‌, పాక్‌ల మధ్య శాంతియుత వాతావరణం నెలకొంటే అంతకు మించిన బహుమతి మరొకటి లేదు అన్నట్లుగా ప్రతిస్పందించి నాయకత్వ విజ్ఞతకు దాఖలాగా నిలిచారు అటల్‌జీ. భారత్‌ను అణ్వాయుధ సంపత్తిగల దేశంగా తీర్చిదిద్దడాన్ని వాజ్‌పేయీ సాధించిన అతిగొప్ప విజయంగా కొందరు అభివర్ణిస్తారు. కానీ ఆయన ఉద్దేశాలు వేరు. ప్రత్యేకమైన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లోనే పోఖ్రాన్‌-2 పరీక్షల ఆవశ్యకత తలెత్తిందన్నది చారిత్రక వాస్తవం. జాతి రక్షణపట్ల మొక్కవోని సంకల్పంతో, అపారమైన ధైర్యసాహసాలతో ఆయన వ్యవహరించారనడంలో సందేహం లేదు. అంతమాత్రాన అణ్వాయుధరహిత ప్రపంచంపట్ల భారత్‌ నిబద్ధత ఏమాత్రం పలుచన కాలేదు. జాతి భద్రతకు సంబంధించిన ఓ తాత్కాలిక అవసరం తీర్చడమన్నది- చిరస్థాయిగా నిలిచే విజయంగా ఎన్నటికీ గుర్తింపు పొందలేదన్నదే ఆయన ప్రగాఢ విశ్వాసం. ఒక చెట్టును నరికితేగానీ మరొక చెట్టుకు నీళ్లు పోయడం సాధ్యంకాదన్న విధ్వంసక భావజాలం విస్తరిస్తున్న కాలంలో... వాజ్‌పేయీ నిర్మాణాత్మక పంథా విశిష్టం... విలక్షణం!

ముందుతరాలకు మార్గదర్శి

అటల్‌జీ ప్రసంగం... గంగా ప్రవాహ సమానం! గుండె గుండెలో మహోద్విగ్న తరంగ భంగిమలు పొంగులెత్తించే మధుర విన్యాసమది. ఆయన ఉపన్యాస ప్రతిభ, భాషపై సాధించిన పట్టు అమోఘం. ఆయన సిద్ధాంతాలతో ఏకీభవించనివారు సైతం అటల్‌జీ వాగ్ధాటికి ముగ్ధులవుతారు. దశాబ్దాలుగా విపక్షంలో ఉన్నా, ఎవ్వరినీ ఆయన వ్యక్తిగతంగా విమర్శించలేదు. వ్యంగ్యం, హాస్యం, చతురోక్తులు, విమర్శలతో సాగే ఆయన ప్రసంగాలు... ముందుతరాలు పదిలంగా దాచుకోవాల్సిన పరిణత పాఠాలు! వాజ్‌పేయీ శకం రెండు కీలక విషయాలను బోధపరుస్తోంది. దేశంగా భారత్‌, పార్టీగా భాజపా అందిపుచ్చుకోవాల్సిన ఆదర్శాలను ఆయన స్థిరపరిచారు. కుటుంబ పాలననుంచి విముక్తి పొంది, ఘర్షణాత్మక రాజకీయాలకు స్వస్తిపలకాల్సిన అవసరాన్ని వాజ్‌పేయీ జమానా సూచిస్తోంది. పరస్పర సహకారం, ఏకాభిప్రాయ నిర్మాణం ద్వారా దేశాభివృద్ధికి కొత్త బాటలు పరవాల్సిన ఆవశ్యకతను అటల్‌జీనుంచి భవిష్యత్‌ భారతం నేర్చుకోవాల్సి ఉంది. భాజపాకు కొత్త జవసత్వాలు తొడిగిన మహానాయకుడిగా పార్టీలోని ప్రతి ఒక్కరికీ ఆయన అడుగుజాడ ఆదర్శప్రాయం... అనుసరణీయం! భారతీయ సమాజం భిన్నత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. అన్ని వర్గాలకూ ఆమోదయోగ్యమైన సర్వోన్నత ప్రజాస్వామిక సంస్కృతిని అటల్‌జీనుంచి భాజపా అందిపుచ్చుకోవాల్సి ఉంది. వాజ్‌పేయీ ప్రగతి ప్రస్థానం... ముందుతరాలకు కరదీపిక అనడంలో మరోమాట లేదు! బహుముఖ ప్రతిభావంతుడైన నాయకుడిగా, జీవితాంతం విలువలకు కట్టుబడి రాజకీయాలు నడిపిన ఆలోచనశీలిగా ఆయన జనహృది విజేత. అటల్‌జీ స్ఫూర్తిగా... సుపరిపాలనకు పునరంకితం కావలసిన సందర్భమిది!

- ముప్పవ‌ర‌పు వెంక‌య్యనాయుడు
(ర‌చ‌యిత - కేంద్ర ప‌ట్టణాభివృద్ధి, గృహ‌నిర్మాణం, ప‌ట్టణ పేద‌రిక నిర్మూల‌న‌, పార్లమెంట‌రీ వ్యవ‌హారాల మంత్రి )
Posted on 25-12-2015