Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పరిణత దౌత్యం

* భారత్‌-పాక్‌ సంబంధాల్లో కొత్త మలుపు!
భారత్‌, పాక్‌ సంబంధాల్లో మేలి మలుపు అనదగిన పరిణామాలు కిందటేడాది చివర్లో సంభవించాయి. అఫ్గాన్‌ పర్యటనను ముగించుకుని కాబూల్‌నుంచి తిరిగివస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లోని లాహోర్‌ ఉన్నపళంగా దిగడం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు శుభకామనలు తెలియజేయడంకోసం మోదీ లాహోర్‌లో దిగారన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ, ఆ సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య అనేక ద్వైపాక్షిక అంశాలూ చర్చకు వచ్చి ఉంటాయనడంలో సందేహం లేదు. భారత ప్రధాని ఆకస్మికంగా తమ దేశానికి రావడం పాకిస్థానీల్లో ఎన్నడూ లేనంత ఆనందం నింపింది. పాకిస్థానీల్లో మొదటినుంచీ భారత్‌పట్ల ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయన్నది కాదనలేని వాస్తవం. మోదీ పర్యటన ఆ అనుమానాలను చాలావరకు నివృత్తి చేయగలిగిందనే చెప్పాలి. ఉభయ దేశాధినేతల మధ్య రాకపోకలు ఇకమీదట పెరుగుతాయని మోదీ చేసిన వ్యాఖ్యలు ఆహ్వానించదగినవి. దీర్ఘకాలంగా ఇరుపక్షాల మధ్య రగులుతున్న దౌత్యపరమైన సమస్యలు, ఇతర వివాదాలు వంటివన్నీ ఇలాంటి సుహృద్భావ పర్యటనలతో తేలికపడతాయి. రెండు దేశాల నడుమ ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో అధినేతల అహాలు, ఆభిజాత్యాలు వివిధ సందర్భాల్లో అడ్డుగా నిలిచాయి. ఈ అడ్డంకులను అధిగమించి, ముందు చూపుతో మోదీ వ్యవహరించిన తీరు ప్రశంసనీయమైనది. మోదీ పర్యటన విషయంలో ప్రసారసాధనాలు వ్యవహరించిన తీరు మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించేదిగానే ఉంది. అసలు ఏ కారణంతో మోదీ పాకిస్థాన్‌లో పర్యటించారు అన్న విషయాన్ని కూపీ లాగేందుకే మీడియా సమయమంతా కేటాయించింది. మరోవంక మోదీ పాక్‌ పర్యటనకు సంబంధించి రంధ్రాన్వేషణ చేస్తూ కాంగ్రెస్‌ సంధించిన విమర్శలు పూర్తిగా బాధ్యతరహితమైనవి.

పదిహేనేళ్ల కిందట నాటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాకిస్థాన్‌లోని లాహోర్‌కు బస్సులో వెళతానన్నప్పుడు- ఆయన చొరవ అందరినీ ఆశ్చర్యానందాలకు గురిచేసింది. అప్పట్లో ఇరుదేశాధినేతల మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయి. షేక్‌ అబ్దుల్లా కుమారుడు ఫరూక్‌ అబ్దుల్లా గతంలో కశ్మీర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకర్షించాయి. పాక్‌ అధీనంలోని కశ్మీర్‌, పాకిస్థాన్‌లో అంతర్భాగంగానే ఉంటుందని; భారత్‌ పరిధిలోని కశ్మీర్‌ పూర్తిగా భారత్‌కే చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి క్షేత్రస్థాయిలో వాస్తవమూ అదే. వాస్తవాధీన రేఖ దాటి, ఎవరు ఏ కొంచెం ముందడుగు వేసినా ఉభయ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీ ఇటీవల లాహోర్‌లో జరిపిన పర్యటన సర్వత్రా సానుకూల సంకేతాలు పంపించింది. ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయం లిఖించిన పరిణామమది. ఇదే తీరును కొనసాగించి స్నేహసంబంధాలను సుదృఢంగా తీర్చిదిద్దుకోవడంతోపాటు- పరస్పర సహకారం ద్వారా ఆర్థికంగా బలపడేందుకూ ఇరు దేశాలు కృషి చేయాలి. ఉభయ పక్షాలు ప్రస్తుతానికి తమ ఎగుమతులు, దిగుమతులకు దుబాయ్‌ని కేంద్రంగా ఉపయోగించుకుంటున్నాయి. ఇకమీదట ఆ పరిస్థితి మారాలి. ఉభయుల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడితేనే అది సాధ్యం. ‘ప్రొటోకాల్‌’తో నిమిత్తం లేకుండా ఇకపై ఇరు దేశాధినేతలూ తరచూ కలుసుకుంటారని మోదీ చేసిన ప్రకటన సహర్షంగా స్వాగతించదగినది. ప్రధానిగా వాజ్‌పేయీ తిరుగులేని దార్శనికతను ప్రదర్శించారు. పాక్‌తో సంబంధాల విషయంలో ఆయన చొరవగా ముందడుగు వేశారు. వాజ్‌పేయీ బాటలోనే మోదీ ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తోంది. లాహోర్‌నుంచి తిరిగి వచ్చిన వెన్వెంటనే ప్రధాని మోదీ- వాజ్‌పేయీ నివాసానికి వెళ్ళి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవేళ వాజ్‌పేయీ ప్రధానిగా ఉండి ఉన్నా పాక్‌తో సంబంధాల విషయంలో ఇదే పద్ధతిలో సానుకూలంగానే స్పందించి ఉండేవారు.

పాక్‌తో సుహృద్భావ సంబంధాలు నెలకొల్పుకొనే ప్రయత్నం విజయవంతం కావాలంటే- ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలు తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా మోదీ అడ్డుకోవాలి. ఇప్పటికీ పాకిస్థాన్‌ను సార్వభౌమ దేశంగా ఆర్‌ఎస్‌ఎస్‌ గుర్తించడం లేదు. దాని దృక్పథంలో మార్పు తీసుకుని రావాల్సి ఉంది. ఈ తరహా అతివాద పోకడలను కట్టడి చేయకపోతే ఉభయ దేశాల మధ్య విశ్వాసరాహిత్యం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ నెలాఖర్లో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శులు సమావేశం కాబోతున్నారు. భారత్‌, పాక్‌ల మధ్య సమస్యలన్నీ ఏదో ఒక సమావేశంతో పరిష్కారమైపోతాయనుకుంటే అది భ్రమ. దశాబ్దాలుగా ఇరు దేశాలకూ కంటిమీద కునుకులేకుండా చేస్తున్న సమస్యలనేకం ఉన్నాయి. దేశాల రాజకీయ సంబంధాలు ఎంత సానుకూలంగా మారితే సమస్యల పరిష్కారంలో వేగమూ అంతగా పెరుగుతుంది. ఆ దిశగా మోదీ ఇప్పుడు తొలి అడుగు వేశారు. పాక్‌తో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలన్న దృఢనిశ్చయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. భారత ప్రధాని పర్యటనను అమెరికా, రష్యా, బ్రిటన్‌లు ఎంతగానో ప్రశంసించాయి. దిల్లీ-ఇస్లామాబాద్‌ల మధ్య సాధారణ సంబంధాలు నెలకొనాలని ప్రపంచదేశాలన్నీ ఆకాంక్షిస్తున్నాయి. విద్వేషాలు విడిచి, కవ్వింపు చర్యల జోలికిపోకుండా భారత్‌, పాక్‌లు కలిసి నడిస్తే ఉభయ పక్షాలూ ఆర్థికంగా బలపడతాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో పేదలు భారత ఉపఖండంలోనే ఉన్నారు. చర్చలు, సంప్రతింపులు, సంయమనం, పరస్పర సహకారంతో మాత్రమే ఈ ప్రాంతంనుంచి దారిద్య్రాన్ని తరిమికొట్టడం సాధ్యం. ఆ దిశగా భారత ప్రధాని చొరవ- ఉభయపక్షాలను మరింత చేరువ చేసేదేననడంలో మరో మాట లేదు.

- కుల‌దీప్ నయ్యర్‌
(రచయిత- ప్రముఖ పాత్రికేయులు, బ్రిటన్‌లో భారత మాజీ హైకమిషనర్‌)
Posted on 2-1-2016