Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

మసి అంటని రీతిలో...

* బొగ్గు గనుల రంగం ప్రక్షాళన
దేశానికి ప్రధాన ఖనిజ వనరు బొగ్గు! జాతి ఆర్థికానికి కీలక వాహికగా నిలిచిన బొగ్గు గనుల రంగంలో తొలిసారి పోటీ వేలం పాట పద్ధతి ద్వారా కేటాయింపులకు శ్రీకారం చుట్టడంతో ప్రైవేటు సంస్థలకు ఎర్రతివాచీ పరచినట్లయింది. 1973లో బొగ్గుగనుల జాతీయీకరణ చట్టం చేసింది మొదలు నేటివరకు దేశంలో బొగ్గు ఉత్పాదకతలో ప్రభుత్వ రంగ సంస్థలదే గుత్తాధిపత్యం. తాజా సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వరంగ వ్యవస్థలు- ప్రైవేటు, బహుళజాతి సంస్థలతో పోటీపడాల్సిన పరిస్థితులు ఏర్పడటం గమనార్హం. దేశంలో గనుల లీజు కేటాయింపు ప్రక్రియలోని అవకతవకలను 2014లో ‘కాగ్‌’ ఎండగట్టడం; 1993నుంచి 2011వరకు జరిగిన 218 బొగ్గు గనుల కేటాయింపులన్నీ చట్టవిరుద్ధమైనవని ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, వాటిని రద్దుపరచడం; కేంద్ర దర్యాప్తు సంఘం (సీబీఐ) పలువురిపై అభియోగ పత్రాలు దాఖలు చేయడం వంటి పరిణామాలు గనుల రంగంలో కీలక సంస్కరణలకు తెరలేపాయి. బొగ్గు గనుల(ప్రత్యేక సదుపాయాల)చట్టం-2015 నూతన శకానికి నాంది పలికింది.

యాజమాన్యాలకు స్వేచ్ఛ
గతంలో జరిగిన భారీ అవకతవకలను దృష్టిలో ఉంచుకుని పోటీ వేలం పద్ధతి ప్రవేశపెట్టారు. తద్వారా బొగ్గుగనుల కేటాయింపుల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. భారీగా ఆదాయ వనరులు సమీకరించడం; వేలం పాట ద్వారా సమకూరిన ఆదాయంతో మైనింగ్‌ ప్రభావిత ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, నూతన వనరుల అన్వేషణకు నిధులు కేటాయించడమే లక్ష్యంగా ఈ విధానం అమల్లోకి తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొనడం విశేషం. కేంద్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రవేశపెట్టిన ఈ నూతన విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే ఆదాయం సమకూరుతున్నప్పటికీ- ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులనుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉండటం ఆలోచించాల్సిన విషయం. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేలం ధరలు ఎక్కువగా ఉండటం, తవ్వితీసే ఖనిజ వనరుల పరిమాణం తక్కువగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. ఖనిజాన్ని ఉపయోగించే ఉత్పాదక సంస్థలు ఆయా క్షేత్రాలకు దూరంగా ఉండటంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. బూడిద శాతం అధికంగా ఉన్న బొగ్గు వాడకంకన్నా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న బొగ్గువల్ల అధిక ఉత్పాదకత, మెరుగైన పనితీరు సాధ్యమవుతోంది. భూసేకరణ, యాజమాన్య బదిలీ, భూసరిహద్దుల సమస్యలపై స్పష్టత లేదు.

వేలం వేయడానికి నిర్ణయించిన బొగ్గు క్షేత్రాల్లో అత్యధిక శాతం పూర్తిగా కొత్తవి. ఖనిజ నిక్షేపాలు ఏ మేరకు ఉన్నాయో తెలియదు. ఇప్పటిదాకా పరిశోధన, తవ్వకాలు చేపట్టని ప్రాంతాలవి. దాంతో ఔత్సాహికులు నీరుగారిపోయారు. కోట్లాది రూపాయలు పెట్టి, వేలం పాటలో దక్కించుకున్నాక ఆశించిన ఖనిజవనరుల లభ్యతే ప్రశ్నార్థకమైతే ఎలాగన్న సందేహాలకు నిర్వాహకుల వద్ద సమాధానం లేకపోవడంతో పారిశ్రామిక వర్గాలు వెనకడుగు వేశాయి. గతంలో గనుల లీజుల కేటాయింపు విధానానికి, ప్రస్తుత వేలం పాట విధానానికి ప్రధానమైన వ్యత్యాసం- ఖనిజాధార పరిశ్రమల ప్రగతికి చర్యలు తీసుకోవడంలోనే ఉంది. గతంలో ప్రభుత్వం కేటాయించిన, మంజూరు చేసిన క్షేత్రంపైనే ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలు ఆధారపడాల్సి వచ్చేది. ప్రస్తుత విధానంలో బొగ్గు క్షేత్రాలను ఎంపిక చేసుకొనేందుకు వాటికి పూర్తి స్వేచ్ఛ కల్పించారు.

దేశ ఆర్థిక వ్యవస్థలో గనుల రంగం కీలకపాత్ర పోషిస్తోంది. 2005నాటి భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో గనుల రంగం వాటా 2.86శాతం. 2014నాటికి అది 1.86శాతానికి పడిపోయినట్లు 2014 ఆర్థిక గణాంక నివేదిక వెల్లడిస్తోంది. ఆస్ట్రేలియాలో జీడీపీలో గనుల రంగం వాటా 8.5శాతంకాగా, దక్షిణాఫ్రికాలో 8.3శాతం, రష్యాలో 11శాతం, ఇండొనేసియాలో అది 12శాతంగా నమోదైంది. చట్టబద్ధ పరిమితులు, నియంత్రణలు, పర్యావరణ అంశాలు భారత్‌లో పరిస్థితుల్ని ప్రభావితం చేస్తున్నాయి. 2008-09వరకు పదేళ్లకాలం శరవేగంగా దూసుకెళ్లిన గనుల రంగం, అంతర్జాతీయ విపణిలో తలెత్తిన సంక్షోభం కారణంగా తరవాత చతికిలపడింది. దేశంలో ఇప్పటికి ప్రభుత్వం నిర్వహించిన మూడు విడతల బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో షెడ్యూల్‌-II విభాగంలోని 18 క్షేత్రాలు వేలం వేశారు. అందులో అయిదింటిని విద్యుచ్ఛక్తి రంగ సంస్థలకు కేటాయించారు. మిగిలిన 13క్షేత్రాలను ఇతర సంస్థలకు వేలం వేశారు. ఇవికాక మిగిలిన 17క్షేత్రాలను ప్రభుత్వ రంగంలోని విద్యుదుత్పాదక సంస్థలకు కేటాయించారు. మొత్తం 18క్షేత్రాలను వేలం పాటలో దక్కించుకున్న ప్రైవేటు సంస్థల్లో అయిదు విద్యుదుత్పాదక సంస్థలు, అయిదు ఇనుము-ఉక్కు కర్మాగారాలు, అయిదు అల్యూమినియం కర్మాగారాలు, మూడు సిమెంటు పరిశ్రమ రంగానికి చెందినవి ఉండటం గమనార్హం. షెడ్యూల్‌-III విభాగంలోని 15 బొగ్గు క్షేత్రాలను వేలం వేయగా, వాటిలో నాలుగు క్షేత్రాలను విద్యుదుత్పాదకరంగ సంస్థలు దక్కించుకున్నాయి. తక్కిన పదకొండింటిని ఇతర సంస్థలు చేజిక్కించుకున్నాయి. అందులో అయిదు ఇనుము-ఉక్కు రంగ పరిశ్రమలు, మూడు సిమెంటు పరిశ్రమలు, మూడు క్యాప్టివ్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఈ కొత్త విధానం ప్రకారం వేలం పాటతో నిమిత్తం లేకుండా ఎంపికచేసిన బొగ్గు క్షేత్రాలను ప్రభుత్వరంగ సంస్థలకు కేటాయించే విశేషమైన అధికారాన్ని కలిగి ఉండటం విశేషం.

శాస్త్రీయ విధానంలో తవ్వకం
దేశంలో బొగ్గు గనుల రంగం ప్రగతి పథాన సాగాలంటే బొగ్గు క్షేత్రాలను వేలంలో దక్కించుకున్న సంస్థలు ప్రణాళికాబద్ధంగా కృషిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సుస్థిరమైన ప్రగతిసాధన దిశగా పయనించాలంటే ఉత్పాదకత, ఉత్పాదక వ్యయం, భద్రతాపరమైన సవాళ్లు అధిగమించాలి. భారతగనుల రంగంలో నూతన శకం ప్రారంభమవుతున్న దరిమిలా అంతర్జాతీయ విపణిలో తలెత్తుతున్న పరిణామాలపై అవగాహన కల్పించుకోవాలి. ఉత్పాదక సామర్థ్యం పెంపొందించుకోవడంపైనే కాకుండా వ్యయ నియంత్రణ చర్యలు, సుశిక్షిత మానవ వనరుల ఎంపిక, మౌలిక-అవస్థాపన సౌకర్యాలను సమర్థంగా నిర్వహించడంపైనా దృష్టి సారించడం ద్వారా వ్యవస్థాపరమైన పనితీరును మెరుగుపరచుకోవచ్చు. ముఖ్యంగా పర్యావరణ ప్రభావ పరిస్థితులు, ప్రభావిత వర్గాలు, ప్రాంతాల ప్రయోజనాల వంటివి నేడు గనుల రంగం ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. కేంద్రప్రభుత్వం 2015నుంచి అమల్లోకి తెచ్చిన గనులు-ఖనిజాల (అభివృద్ధి-నియంత్రణ) సవరణ చట్టంలో నిర్దేశించిన విధంగా శాస్త్రీయ విధానంలో వ్యర్థరహిత పద్ధతిలో, పర్యావరణ పరిమితుల ఛత్రానికి లోబడి ఖనిజాల తవ్వకం చేపట్టాలి. ప్రభుత్వరంగ సంస్థలైనా, ప్రైవేటు సంస్థలైనా చట్టబద్ధమైన పరిమితులకు లోబడి తుచ తప్పకుండా ఖనిజాల్ని వెలికితీయాలి. భద్రతాపరమైన చర్యల మీద దృష్టిసారించాలి. కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కల్యాణ్‌ యోజన వంటి ప్రయోజనాత్మక కార్యక్రమాలను పకడ్బందీ కార్యాచరణతో అమలు చేసిననాడు గనుల రంగం లోక కల్యాణకారకం అవుతుంది.

- మనస్వి
Posted on 18-1-2016