Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

జలసిరులను పొంగించే వ్యూహం!

* నీటి పొదుపే నేటి అవసరం
జల వనరుల లభ్యత అంతకంతకూ తరిగిపోతోంది. ఆహారోత్పత్తికి, తాగటానికి, పారిశ్రామికావసరాలకు, విద్యుదుత్పాదనకు, జలరవాణాకు, మరెన్నో ఇతర అవసరాలకు నీరు కావాలి. నీరు లేకుండా మనిషి మనుగడను, అభ్యున్నతిని వూహించడం కష్టమే. నానాటికీ పెరిగిపోతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా జలవనరులను అభివృద్ధిపరచుకోవడమే మనం ఎదుర్కొనవలసిన పెద్ద సమస్య. దేశ జనాభా మరో మూడున్నర దశాబ్దాల్లో 164కోట్లకు చేరుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా. తలసరి వార్షిక నీటి లభ్యత 1,700 ఘనమీటర్లకంటే తక్కువ ఉన్న దేశాలు నీటిపరంగా ఒత్తిడి ఎదుర్కొంటాయని, వెయ్యి ఘనమీటర్లకంటే కనిష్ఠ లభ్యత ఉన్న దేశాలు నీటి కొరతకు గురవుతాయన్నది ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన వాస్తవం. ఈ పరిస్థితుల్లో భారత్‌ నీటి ఒత్తిడి బారిన పడకుండా ఉండాలంటే 2050నాటికి ఏటా 2.78లక్షలకోట్ల ఘనమీటర్లు; నీటికొరతకు గురికారాదంటే 1.640లక్షల కోట్ల ఘనమీటర్ల నీటిని కలిగి ఉండాల్సిన అవసరముంది.

కరుగుతున్న వనరులు
జల వనరులు ప్రపంచమంతటా సమానంగా విస్తరించి లేవు. ఒకవైపు వర్షపాతం బొత్తిగాలేని ఎడారులుండగా, మరోవైపు అత్యధిక వర్షపాతంగల ప్రాంతాలున్నాయి. మనిషి వినియోగానికి ఉపయోగపడే నీటి ప్రవాహం కొన్ని నదుల్లో, వాగుల్లో మాత్రమే ఉంటోంది. భారత్‌లో ఏటా నదుల్లో ప్రవహించే సగటు భూతల జల లభ్యత దాదాపు 1.87లక్షల కోట్ల ఘనమీటర్లు అని అంచనా. అవసరమైన చోట్ల నదులపై జలాశయాల నిర్మాణం ద్వారా కేవలం 69వేలకోట్ల ఘ.మీటర్ల నీటిని మాత్రమే వినియోగించుకోవడానికి వీలవుతుంది. వర్షపాతం దేశమంతటా సమానంగా లేదు. ఏడాదిలో వర్షాలు కేవలం నాలుగు నెలలకే పరిమితమవుతున్నాయి. భూతల జల వినియోగం తక్కువ కావడానికి ఇదీ ఒక కారణమే. దేశ భూభాగంలో మూడింట ఒక వంతు వరదలు, కరవుల బారినపడుతోంది. భూతల జలానికి అదనంగా ఏటా వర్షపాతం ద్వారా జతపడే గతిశీలమైన నీటి వనరు అందుబాటులో ఉంటుంది. దాని సామర్థ్యం 43,200కోట్ల ఘ.మీటర్లుగా అంచనా వేశారు. దానివల్ల 2050నాటికి ఏటా వినియోగానికి అందుబాటులో ఉండే భూతల, భూగర్భ జలాల మొత్తం పరిమాణం 1,12,200కోట్ల ఘ. మీటర్లు అవుతుంది. ఫలితంగా 2050నాటికి దేశంలో 164కోట్లకు చేరనున్న జనాభాకు తలసరి వార్షిక నీటి లభ్యత 684 ఘనమీటర్లకు కోసుకుపోతుంది. దేశం తీవ్రమైన నీటికొరతకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌లోని 20 నదీ పరీవాహక ప్రాంతాల్లో 2050నాటికి బ్రహ్మపుత్ర బేసిన్‌ తప్ప తక్కినవన్నీ నీటి ఒత్తిడి బారినపడతాయి. గంగానదికి దక్షిణాన ఉన్న ఉపనదులన్నీ నీటి ఒత్తిడితో, నీటి కొరతతో సతమతమవుతుంటాయి. ప్రాణహిత సంగమం తరవాత మాత్రమే గోదావరిలో నీరు పుష్కలంగా ఉంటుంది. కానీ, ప్రాణహిత సంగమానికి ఎగువన గోదావరిలో నీటి ఒత్తిడి, కొరత అత్యధికం.

ముంచుకొస్తున్న ముప్పు
దేశంలో 2050నాటికి పెరగనున్న 164కోట్ల జనాభాకు రోజుకు తలసరి 750గ్రాముల చొప్పున మొత్తంగా ఏడాదికి 45కోట్ల టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయి. కానీ, ఆ మేరకు ఆహారధాన్యాల ఉత్పత్తి జరగడం లేదు. ఇప్పుడున్న ఉత్పత్తిని 45కోట్ల టన్నులకు పెంచడం సులభమైన విషయం కాదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించడం ఇప్పటికే పెను సమస్యగా మారింది. 2050నాటికి పెరగనున్న దేశ జనాభాలో సగంమంది (82కోట్లు) పట్టణ ప్రాంతాల్లో, మిగిలిన సగం (82కోట్లు) పల్లెల్లో ఉంటారని అంచనా. పారిశ్రామిక, పర్యావరణ, జీవావరణ నిర్వహణ అవసరాలు; భూవినియోగ విధానం, జలవనరుల క్షీణత వంటి కారణాలవల్ల నీటి సమస్య మున్ముందు మరింత జటిలమయ్యే అవకాశముంది.

సాగునీటికి ప్రాధాన్యం
దేశంలో 1951లో 22.60కోట్ల హెక్టార్లుగా ఉన్న సాగుభూమి, 1997నాటికి 90కోట్ల హెక్టార్లకు అంటే దాదాపు నాలుగు రెట్లు పెరిగింది. విత్తన పంటలో సుమారు 40శాతానికి సాగునీటిని అందించాల్సి వస్తోంది. రుతుపవనాల అనిశ్చితి ఉన్నప్పటికీ సాగునీటి సౌకర్యం కల్పించడంవల్ల ప్రస్తుతం ఆహార భద్రత ఉంటోంది. 2050నాటికి వార్షిక ఆహారోత్పత్తిని ప్రస్తుతం ఉన్న 26కోట్ల టన్నులనుంచి 45కోట్ల టన్నులకు అంటే ప్రస్తుత ఉత్పత్తిని ఇంచుమించు రెట్టింపు పెంచడం సామాన్య విషయం కాదు. అందువల్ల నిర్మాణంలోని ప్రాజెక్టులను సాధ్యమైనంత సత్వరం పూర్తిచేయడంతోపాటు, నీటి నిర్వహణలో ఆధునిక విధానాలు అనుసరించాల్సిన ఆవశ్యకత ఉంది.

ఒడుపుగా వినియోగం
గడచిన కొంతకాలంగా దేశంలో పంటలు పండించే నికర విస్తీర్ణం సుమారు 14.5కోట్ల హెక్టార్ల వద్ద నిలిచిపోయింది. 1985-86నుంచి 1995-96 మధ్య సగటు పంట విస్తీర్ణం 12.44కోట్ల హెక్టార్ల వద్ద ఉంది. దేశంలో తేయాకు, పత్తి, జనపనార, జీడిపప్పు మొదలగు ఎగుమతి ప్రధానమైన పంటలు పండిస్తే ఆహార ధాన్యోత్పత్తి చేసే పంట భూమి విస్తీర్ణం తగ్గిపోవచ్చు. కాబట్టి 2050నాటికి ప్రధానమైన ఆహార, ఆహారేతర అవసరాలు గుర్తించి పొదుపుగా నీటి వినియోగం, ఉత్పత్తి పెరుగుదల ద్వారా దేశంలో నికర పంట భూమి విస్తీర్ణాన్ని 15-16కోట్ల హెక్టార్లకు పెంచాల్సిన అవసరముంది. మొత్తంగా లభ్యమయ్యే 432 శతకోటి ఘన అడుగుల భూగర్భ జలంలో తాగునీటికి, గృహావసరాలకు 70శత కోటి ఘనపుటడుగులు పోనూ మిగిలిన 362 శ.కో.ఘన అడుగులతో 6.40కోట్ల హెక్టార్లకు నీటిని అందించవచ్చునని అంచనా వేశారు. ఇక మిగిలిన తొమ్మిది కోట్ల హెక్టార్ల (154-64) పంటభూమిని సాగు చేయడానికి సుమారు 700 బి.ఘ.మీటర్ల భూతల జలం అవసరమవుతుంది. మున్ముందు ఇంత భారీ పరిమాణంలో సాగునీటి సరఫరాకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవడం తప్పనిసరి.
పట్టణ వాసులకు తలసరి రోజుకు 200లీటర్లు, గ్రామీణులకు 100లీటర్ల చొప్పున నీరు అవసరమవుతుంది. దానిలో పశుగణానికి అవసరమయ్యే నీటి వినియోగమూ కలిసి ఉంది. పట్టణ ప్రాంత అవసరాల్లో కొంత భాగానికి, గ్రామీణ ప్రాంత అవసరాల్లో పూర్తి భాగానికి భూగర్భ జలం సరిపోతుందని అంచనా. సాగునీటి రంగానికి, గృహావసరాలకు వేర్వేరు అవసరాలున్నాయి. ఆ గిరాకీని తట్టుకొంటూ ఆరు వేలకోట్ల ఘ.మీటర్ల భూతల జలాన్ని పట్టణ వాగులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. జాతీయ జలవిధానం ప్రకారం తాగునీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో సరఫరా చేసే నీటిలో నికరంగా వినియోగమవుతోంది 20 శాతమే. బయటకుపోయే మిగిలిన 80శాతం జలాలను శుద్ధిజేసి వినియోగించుకోవలసిన అవసరం ఉంది. భారత్‌ 2050నాటికి ప్రధాన పారిశ్రామిక శక్తిగా ఆవిర్భవించనుంది. పరిశ్రమలకు శుద్ధి చేసిన నీటి అవసరం ఉంటుంది. వాటినుంచి వెలువడే నీటివల్ల సంభవించే కాలుష్యం తీవ్రమైన సమస్యే. ఈ సమస్యను ఎంతో జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుంది.

కష్టాల్లో జల విద్యుత్తు
పర్యావరణ సమస్యలవల్ల ప్రస్తుతం జలాశయాధారిత విద్యుదుత్పాదనకు కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నాయి. జలవనరుల అందుబాటును దృష్టిలో ఉంచుకొని దానినుంచి ఆవిరి నష్టాలను; పశ్చిమ దిశగా ప్రవహించి సముద్రంలో కలిసిపోయే నీటి నష్టాలను మినహాయిస్తే జల విద్యుదుత్పాదనలో ఎలాంటి నీటి నష్టాలూ ఉండవు. 2050నాటికి విద్యుదుత్పాదనకు అవసరమయ్యే నీటి పరిమాణం 15వేలకోట్ల ఘన మీటర్లు అని అంచనా! జనాభా పెరుగుదల; వేగవంతమైన పట్టణీకరణ, పారిశ్రామికీకరణవల్ల జల వనరులపై విపరీతంగా ఒత్తిడి పెరుగుతోంది. భూగర్భ జలాలు కలుషితం కావడంవల్ల వాటి నాణ్యత తగ్గి, వినియోగార్హమైన నికర జలాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జలవనరులను పొదుపుగా నిర్వహించని పక్షంలో వివిధ రంగాలకు అవసరమైన నీటి పరిమాణం తగ్గిపోయే ప్రమాదం ఉంది.

ప్రజాభాగస్వామ్యంతో సంరక్షణ
విచ్చలవిడి వినియోగం ఇలాగే కొనసాగితే జలసంక్షోభం మరింతగా విరుచుకుపడే ప్రమాదం ఉంది. అందువల్ల శాస్త్రీయ పద్ధతిలో వాన నీటి పరిరక్షణ, పరీవాహక ప్రాంత నిర్వహణ, సంప్రదాయబద్ధమైన నీటి నిల్వ, నీటి నిర్వహణ కార్యక్రమాల్లో సామాజిక భాగస్వామ్యం పెంచడం, ముఖ్యంగా నీటి వినియోగదారుల సంఘాలకు సముచిత పాత్ర కల్పించడం, నిర్వహణ కార్యక్రమాల్లో వికేంద్రీకరణ వంటి వినూత్న కార్యక్రమాలతో ముందుకు రావలసి ఉంది. నీటి లభ్యతనుబట్టి అవసరాలు సర్దుబాటు చేసుకొంటూ ముందుకు సాగాలి. నీటికి సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకొని, ఆ మేరకు జల వనరులను అభివృద్ధిపరచుకొనేందుకు ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. అప్పుడే ఆశించిన ఫలితం సాధ్యమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకుడు గుంతల కార్యక్రమం యుద్ధప్రాతిపదికన ఉద్యమ స్ఫూర్తితో సాగుతుండటం హర్షణీయం. వాననీటిని ఒడిసిపట్టి భూగర్భ జలసంపదను పెంచే ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు జాతి భవితకు భరోసా ఇస్తాయి!

- చెరుకూరి వీరయ్య
(సాగు నీటిపారుద‌ల రంగ‌ నిపుణులు)
Posted on 28-05-2016