Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

కూడు పెట్టేదే కూసువిద్య!

కూడుపెట్టని చదువు యువత కడుపు కొడుతోంది. పక్కదారి పట్టించి, సమాజంలో అలజడికి కారణమవుతోంది. పలు తూర్పు, పశ్చిమ దేశాలతో పోలిస్తే మన విద్యా సంస్థల్లో సర్వత్రా అడుగంటిన ప్రమాణాలు అవ్యవస్థకు అంటుకడుతున్నాయి. ప్రాథమిక స్థాయి నుంచి ప్రక్షాళన చేపడితే తప్ప స్థితిగతులు మారే సూచనల్లేవు. యువతలో నైపుణ్యాలను పెంపొందించి, వృత్తి విద్యా కోర్సులను ప్రవేశపెట్టేందుకు కేంద్రం తెరమీదకు తెచ్చిన జాతీయ నైపుణ్యాల అర్హత చట్రం (నేషనల్‌స్కిల్స్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌)- పరిస్థితుల్ని మెరుగుపరచే దిశలో ముందడుగే. తొమ్మిదో తరగతి నుంచి పీజీ వరకు తొమ్మిది స్థాయుల్లో వృత్తివిద్యా కోర్సుల ద్వారా యువతను నిపుణత గల మానవ వనరుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం- సక్రమంగా పట్టాలకెక్కితే భారతీయ విద్యారంగం సరైన గమ్యం చేరినట్లే!
విద్యే అన్నింటికీ మూలం. ఉత్పత్తి, అభివృద్ధి, విలువలు, సాంఘిక జీవనం, పర్యావరణ పరిరక్షణ, క్రమశిక్షణ, నిజాయతీతో కూడిన ప్రభుత్వాలను అందించగలిగేది అదే. ఉన్నత లక్ష్యాలు లేని విద్య అవిద్యే అవుతుంది. విద్య లక్ష్యం సంపాదనే కాదు. విద్య వివేకాన్ని, విమర్శనాశక్తిని అందించాలని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అనేవారు. భారీ పెట్టుబడులతో యువతరంలో శక్తిసామర్ధ్యాలు పెంపొందించడానికి ప్రభుత్వాలు సిద్ధమైనప్పుడే వారు దేశానికి తరగని సంపద కాగలుగుతారని 2007లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. విద్యావిధానంలోని లోపాలపై ఆందోళన వెలిబుచ్చడం పరిపాటిగా మారింది. కమిటీల నివేదికలు, సూచనలకు కొదవేమీ లేదు. ఇవన్నీ అమలు చేసేది ఎవరనేదే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. వెరసి ప్రపంచ ప్రమాణాలతో మన విద్యావ్యవస్థ సరితూగలేకపోతోంది.

చేతలు ప్రధానం

మనదేశంలో నియంత్రణ మండళ్లకు కొదవేమీ లేదు. కేంద్రంలో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), రాష్ట్రస్థాయిలో ఉన్నత విద్యామండళ్లు, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా విభాగాలు ఉన్నాయి. ఇవి కాకుండా వయోజన, ఉపాధ్యాయ, వృత్తి, మైనారిటీ, సాంకేతిక విభాగాల పర్యవేక్షణల్లో విద్యావ్యవస్థ నడుస్తోంది. ఇక జిల్లాల స్థాయిలో మరెన్నో పర్యవేక్షక విభాగాలున్నాయి. ఇన్ని యంత్రాంగాలు విద్యావ్య వస్థను పర్యవేక్షిస్తున్నా, మరెన్నో ప్రాయోజిత పథకాలు విద్యార్థులకు తోడ్పాటును అందిస్తున్నా... ఏ స్థాయిలోనూ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ఇక మధ్యలో బడి మానేసే (డ్రాపౌట్లు) అరికట్టడం ఏ పథకం వల్లా సాధ్యపడలేదు. ఎన్ని పథకాలు అమలుచేసినా, వాటి ప్రయోజనం పరిమితంగానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతికి చేరేసరికి మధ్యలో బడి మానేసేవారి సంఖ్య (2012-'13లో) మహబూబ్‌నగర్‌ జిల్లాలో అత్యధికంగా 57.02శాతం ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యల్పంగా 20.03శాతం నమోదైంది.

అక్షరాస్యత వల్లనే అభివృద్ధి సాధ్యమనేది నిష్ఠుర సత్యం. కానీ మనదేశంలో అక్షరాస్యతను గానీ, ఉన్నత విద్య చదివేవారి సంఖ్యను పెంచడంలో కానీ సఫలం కాలేకపోయామనే చెప్పొచ్చు. విశ్వ విద్యాలయాల్లో పాలన వ్యవహారాలకు ప్రాముఖ్యం పెరిగి, బోధన రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనడంలో సందేహం లేదు. విద్య విషయంలో పదిహేనేళ్లక్రితం మనకన్నా బాగా వెనకంజగా ఉన్న చైనా, నేడు ప్రగతి సాధించింది. మనదేశంలోని యువతలో కేవలం పదిశాతం మంది పట్టభద్రులవుతుండగా, ఇజ్రాయెల్‌లో 45శాతం మంది ఉన్నత విద్యావంతులున్నారు. అసర్‌ (2013) తొమ్మిదో వార్షిక నివేదిక ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యా ప్రవేశాలు మెరుగుపడినా, పాఠశాలల్లోని సదుపాయాలు, ఉపాధ్యాయుల హాజరు, వారి బోధన తీరు, పటిమ వంటి విషయాల్లో తీవ్ర నిరాశే మిగిలింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన విశ్వవిద్యాలయాలను తీర్చిదిద్దాలంటే, ప్రాథమిక విద్య నుంచే పటిష్ఠ ప్రణాళికను అమలుచేయాలి. కానీ అన్ని స్థాయుల్లో బోధకుల నిరాసక్తత, నిర్లక్ష్యం, నైపుణ్యంగల ఉపాధ్యాయుల కొరత, యాంత్రిక పద్ధతిలో విద్యాబోధన, ప్రభుత్వాల అలసత్వం, వనరుల కొరత, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం వంటి కారణాలన్నీ కలిసి ఉన్నత విద్యలో అత్యుత్తమ ప్రమాణాలు కొరవడటానికి కారణమవుతున్నాయి. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి సంస్థలను నెలకొల్పి అధ్యాపకుల కోసం విదేశాల వైపు చూసే పరిస్థితి వేదన కలిగించేదే. విశ్వవిద్యాలయాల్లో నాణ్యత ప్రమాణాల పర్యవేక్షణ, మదింపు యంత్రాంగాలను బలోపేతం చేసే ప్రయత్నాలు మృగ్యం. కేంద్రప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో కనీసం 25నుంచి 50శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి.

మనదేశ విద్యారంగం స్థితిగతులను పట్టించుకొనే ఓపికా తీరికా ప్రభుత్వాలకు లేదు. విధానపర నిర్ణయాల్లో సర్కారు జాప్యం, నిర్లక్ష్యం వల్ల ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు విజృంభిస్తున్నాయి. అవి విద్యను ఒక సేవా కార్యక్రమంగా చూడక, పూర్తిగా పెట్టుబడి వస్తువుగా మార్చి మార్కెట్‌లో అమ్మే విధానం క్రమంగా పెరిగిపోతోంది. అలాగని ప్రైవేటు విద్యాసంస్థలు లేకుండా ప్రభుత్వం ఒక్కటే ప్రస్తుత డిమాండ్‌ను తీర్చే స్థితిలో ఉందా అంటే- లేదనే చెప్పాలి. విలువలతో కూడిన విద్యను అందించాలి. కేవలం కార్యాలయాల్లో పనిచేసే గుమస్తాలుగా తయారుచేయకూడదు. ప్రభుత్వ విద్యాసంస్థలతో పోలిస్తే ప్రైవేటు, కార్పొరేటు విద్యాలయాల్లో ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండడం వల్లే విద్యార్థులు అటువైపు ఆకర్షితులవుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా క్షీణిస్తుండటమే దీనికి నిదర్శనం. ఈ ఒరవడి ఆర్థిక అసమానతలను పెంపొందించే ప్రమాదం పొంచి ఉంది. అమెరికా విజయాల నుంచి, స్వదేశీ వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందడుగు వేస్తేనే ఉన్నత విద్యారంగం మెరుగుపడుతుంది. ప్రభుత్వ కళాశాలలు, విశ్వవిద్యాలయాల పరిస్థితిని ముందుగా చక్కదిద్దాలి. దీనికి అనుగుణంగానే విజ్ఞాన సమాజ స్థాపన అనే మహోన్నతాశయ సాధనకు శ్యామ్‌ పిట్రోడా నేతృత్వంలో ఏర్పాటైన విజ్ఞాన సంఘం (నాలెడ్జ్‌ కమిషన్‌) పలు నివేదికలు అందించింది. సాంకేతిక విద్యలో నాణ్యత ప్రమాణాల మెరుగుదల కోసం 'టెక్విప్‌' పేరిట భారత ప్రభుత్వం ఓ కమిటీని నియమించి, 2013లో అమెరికా పంపి అధ్యయనాలు చేయించింది. ఆ కమిటీ అమెరికాలోని షికాగో స్టేట్‌ యూనివర్సిటీ, కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్‌ తదితర విశ్వవిద్యాలయాలను సందర్శించింది. అధ్యాపకులు, విద్యార్థులను కలిసి వివరాలు సేకరించింది. అక్కడ ప్రాక్టికల్స్‌కు 80శాతం, పాఠ్యాంశాల బోధనకు 20శాతం సమయం కేటాయిస్తున్నట్టు గుర్తించింది. అక్కడి విశ్వవిద్యాలయాలు పారిశ్రామిక రంగానికి మార్గదర్శకాలుగా ఉన్నాయని, చాలా పరిశ్రమలకు విశ్వవిద్యాలయాలతో అనుసంధానం ఉందని కమిటీ తెలుసుకుంది. అమెరికా వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల సంఖ్యలో మూడోవంతు భారతీయులేనని, అందులో మూడోవంతు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని గుర్తించిన ఈ కమిటీ- మన దేశ ఉన్నత విద్యావ్యవస్థ మెరుగుదలకు పలు సిఫార్సులు చేసింది.

ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు నైపుణ్యాల్లో గాని, ఉపాధి పొందడంలో గాని మన విద్యార్థులు బాగా వెనుకబడి ఉన్నారు. స్నాతక, స్నాతకోత్తర, సాంకేతిక విద్యనభ్యసించిన వారిలో సగంమంది సైతం ఉద్యోగాలకు అర్హత పొందడం లేదు. నైపుణ్యాలు కొరవడటం వల్లే పరిస్థితి విషమిస్తోంది. భావ వ్యక్తీకరణ, భాష, సాంకేతిక నిపుణతలు లోపించడమే యువతను ప్రధానంగా దెబ్బతీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 12.6 శాతం నిరుద్యోగులుండగా, భారత్‌లో అది 31.1 శాతమని అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. ఆరోగ్యవంతమైన యువతకు నైపుణ్యం తోడైతే సమర్థ మానవవనరులు లభిస్తాయి. అదే దేశానికి బలం, పెట్టుబడి. విద్యపై పెట్టిన పెట్టుబడిని వ్యాపార దృక్పథంతో చూడటం మానుకోవాలి. చక్కటి ప్రణాళికతోపాటు సమర్థత, అంకిత భావాలతో అమెరికా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, చైనా, సింగపూర్‌, తైవాన్‌, కొరియా వంటి దేశాలు ప్రామాణిక విద్యను అందించి, మానవ వనరులను తీర్చిదిద్దుతున్నాయి. యువశక్తిని సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా పురోగమిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో 10-24 ఏళ్ల మధ్యవయస్కులు 36.5కోట్లమంది ఉన్నారని, 2020నాటికి ప్రపంచంలోనే అత్యంత యువదేశంగా భారత్‌ అవతరించనుందని ఐరాస జనాభా నిధి (యూఎన్‌ఎఫ్‌సీఏ) తన నివేదికలో పేర్కొంది. యువత ఎక్కువగా ఉన్నంత మాత్రాన అభివృద్ధి దానంతట అది వచ్చిపడదు. అమెరికా, బ్రిటన్‌, రష్యా, జపాన్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా, కెనడా, జర్మనీ, ఇటలీ తదితర దేశాలు 99శాతం అక్షరాస్యతను సాధించగా, మనదేశంలో అదింకా 76శాతంగానే ఉంది. యువ జనాభాకు అనుగుణంగానే మనదేశంలో విద్యాలయాల సంఖ్యను పెంచాల్సిన అవసరముంది. 2000 నుంచి 2010 సంవత్సరాల మధ్య మనదేశం నుంచి ఇతర దేశాల విశ్వవిద్యాలయాల్లో చేరేవారి సంఖ్య 20లక్షల నుంచి 36లక్షలకు పెరగడాన్ని ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి.

ఉపాధికే పెద్దపీట

ప్రపంచ ప్రమాణాలకు దీటుగా ఉన్నత విద్యను తీర్చిదిద్ది, మనదేశంలో విజ్ఞానం పెంపొందించాలి. దేశీయ విశ్వవిద్యాలయాల్లో బోధన-అభ్యసన పద్ధతులు, నాణ్యతల పెరుగుదలకు అవసరమైన ఆర్థిక చేయూతను అందించాలి. రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ (రూసా) లక్ష్యమిదే. దానిప్రకారం- అసమానతలు లేని నాణ్యమైన విద్యను అందరికీ అందించాలి. ఉన్నత విద్యను అభ్యసించేవారి సంఖ్యను పెంచాలి. పాలన సంస్కరణలు చేపట్టి విద్యాసంస్థలకు స్వయంప్రతిపత్తి కల్పించాలి. బాధ్యతాయుత పద్ధతిని పెంపొందించాలి. పన్నెండో ప్రణాళిక (2012-'17)పూర్తయ్యేనాటికి ఉన్నత విద్య అభ్యసించేవారి సంఖ్యను 25.2శాతానికి పెంచాలని, 13వ ప్రణాళిక అంతానికి దాన్ని 32శాతానికి చేర్చాలన్నది 'రూసా' ఆకాంక్ష. ఉన్నత విద్యావ్యవస్థ పరిఢవిల్లాలంటే ప్రభుత్వాలు ప్రాథమిక విద్యా స్థాయిలోనే ప్రక్షాళన చేపట్టాలి. దేశాభివృద్ధి జరగాలంటే ఉపాధికి ఉపయోగపడే విద్యా విధానాన్ని రూపొందించాలి. పరిశ్రమలకు అనుసంధానమైన విద్యను తేవాలి. ఉన్నత విద్యలో నాణ్యత పెరిగితేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పట్టభద్రస్థాయి విద్యను సరికొత్త మార్పులతో పునరుద్ధరించాలి. ఈ లక్ష్యాలు చేరడానికి కావాల్సిన ఆర్థిక దన్ను సమకూర్చి, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కార్యాచరణకు పూనుకోవాలి.

(రచయిత - ఆచార్య జి. సూర్యనారాయణ)
(రచయిత- విద్యారంగ నిపుణులు)
Posted on 04-01-2015