Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పల్లెకు చేరని ప్రగతి రథం!

* మారాలిక ప్రభుత్వపథం

భారతదేశంలో 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఫలం పరిశ్రమాధిపతులతోపాటు పట్టణ మధ్యతరగతికీ అందింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్లు, ఫార్మా, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌ రంగాల్లో యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు లభించాయి. నేడు భారతీయ వినియోగదారులు టీవీ, రిఫ్రిజిరేటర్‌, కార్లు, సెల్‌ఫోన్లు, వాషింగ్‌ మెషీన్ల వంటి ఆధునిక ఉపకరణాలను సులభంగా అమర్చుకోగలుగుతున్నారు. వాయిదాల పద్ధతిలో ఇళ్లు కొనగలుగుతున్నారు. ఇదంతా మన ఆర్థికాభివృద్ధి విజృంభణకు తోడ్పడుతున్న మాట నిజమే! కానీ, ఈ ప్రగతి గాథలో పట్టణాలతోపాటు పల్లెలు, గిరిజన ప్రాంతాలూ పాత్రధారులైనప్పుడు మాత్రమే భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించగలుగుతుంది. సంపన్న దేశాల సరసన సగర్వంగా నిలబడుతుంది. ఈ కల నిజం కావాలంటే ఆర్థిక రంగంతోపాటు పరిపాలన, వ్యవసాయం, గ్రామీణ, విద్యా వైద్య రంగాల్లోనూ సంస్కరణలు రావాలి. కోట్లాది గ్రామీణ పేదలకు ఇప్పటికీ మెరుగైన జీవనాధారం లభించకపోవడానికి కారణం- పరిపాలన యంత్రాంగంలోని లోపాలే. నేడు గ్రామీణ ప్రజలకు అడుగడుగునా పలు రూపాల్లో అవరోధాలు ఎదురవుతున్నాయి. వీటిని తొలగించడంపై ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు పెద్దగా శ్రద్ధ చూపడంలేదు.

అరాచకాలకు ఏదీ అడ్డుకట్ట?
నాసిరకం విత్తనాలు, పురుగు మందులను అమ్ముతున్న కంపెనీలు, దుకాణాల ఆట కట్టించడానికి అధికార యంత్రాంగం చిత్తశుద్ధి చూపకపోవడం వల్ల చిన్న, సన్నకారు రైతులు ఎంతగానో నష్టపోతున్నారు. క్షేత్ర సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ రకం మోసాలకు కళ్లెం పడటం లేదు. మోసాలను నిరోధించడానికి గతంలో క్షేత్ర సిబ్బంది చర్యలు తీసుకున్నా, నేరగాళ్లు ఎదురు కేసులు పెట్టడంతో తామే చట్టపరంగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఇదంతా చివరకు కల్తీదారులకే లాభిస్తోంది. చేపలు, రొయ్యల ఉత్పత్తిదారులకు ప్రయోగశాల సేవలు అందిస్తామంటూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చిన్న ప్రయోగశాల(మైక్రోల్యాబ్‌)లను కట్టడి చేసేవారూ లేరు. వీటికి కొంత రుసుము ముట్టజెబితే చాలు, చెరువులు నిక్షేపంగా ఉన్నాయంటూ నాణ్యతా ధ్రువీకరణ పత్రాలు జారీ అయిపోతున్నాయి. ఈ పత్రాల జారీకి ప్రభుత్వ నాణ్యతా సంరక్షణ కేంద్రాలు లేకపోవడంతో ఆక్వా రైతులు ప్రైవేటు ప్రయోగశాలలను ఆశ్రయించక తప్పడంలేదు. చేపలు, రొయ్యల చెరువులకు నాసిరకం ప్రొటీన్‌ గల ఆహారాన్ని సంస్థలు అంటగడుతున్నాయి. శిక్షణ, లైసెన్సులు కాని లేనివారిని చిన్న ప్రయోగశాలల్లో సాంకేతిక నిపుణులుగా నియమిస్తున్నారు. సరైన పరికరాలు, లైసెన్సులు లేకుండానే వెలసిన అనేక యూనిట్లు నాసిరకం పురుగు మందులు, కలుపు మందులు తయారుచేసి, పేరున్న కంపెనీల లేబుళ్లు అతికించి అమ్ముకుంటున్నాయి. ఈ కల్తీ మందులను ఉత్పత్తి వ్యయంకన్నా వెయ్యి శాతం ఎక్కువ ధరకు అమ్మి ఎడాపెడా సొమ్ము చేసుకుంటున్నాయి. ఇలాంటివారిని పట్టుకుని కల్తీ యూనిట్లు, దుకాణాల పేర్లను పంచాయతీ నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలి. వారిని నిషిద్ధ జాబితాలో చేర్చి, కఠిన శిక్షలు పడేట్లు చూడాలి.

కాలువలు, తూములను దురాక్రమించి, అక్రమ కట్టడాలు నిర్మించేవారి మీద కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. రైతులు తమ వద్ద దాచుకున్న ఉత్పత్తిని అక్రమంగా అమ్ముకుని అగ్ని ప్రమాదంలో తగలబడిపోయినట్లు బుకాయించే ప్రబుద్ధుల ఆటలూ కట్టించాలి. మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి సేకరించాల్సిన కమిషన్లపై ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడంలో వ్యవసాయ మార్కెటింగ్‌ సిబ్బంది తొట్రుపడుతున్నారు. ప్రభుత్వం కేవలం నాలుగు శాతం కమిషన్లను అనుమతిస్తుండగా, ఏజెంట్లు ఏకంగా 10 శాతం దాకా వసూలు చేస్తున్నారు. మార్కెట్‌ యార్డుల వద్ద నిధులు పుష్కలంగానే ఉంటాయి. మార్కెట్‌ రుసుము ద్వారా చేకూరే మొత్తమూ తక్కువ కాదు. అయినా ధరవరలను తెలిపే ఎలక్ట్రానిక్‌ బోర్డులు, రైతులకు విశ్రాంతి గదులు, గోదాములు, షెడ్లు నిర్మించడానికి యార్డులు ముందుకు రావడంలేదు. ఇలాంటి కనీస మౌలిక వసతులూ కొరవడి రైతులు ఇక్కట్లపాలవుతున్నారు.
నేడు ఒప్పంద వ్యవసాయం విస్తరిస్తోంది. రైతులకు, ఒప్పందదారులకు మధ్య కుదిరే అంగీకార పత్రాన్ని సంబంధిత జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ అధికారి వద్ద సాధికారికంగా నమోదు చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా కాంట్రాక్టు విలువలో 20 శాతం బ్యాంకు పూచీకత్తు రూపంలో అధికారికి సమర్పించాలి. అది కాంట్రాక్టు కాలమంతటికీ వర్తిస్తుంది. కాంట్రాక్టు నియమ నిబంధనలను పకడ్బందీగా రూపొందించి అమలు చేసినప్పుడే ఒప్పంద రైతుకు, ఒప్పందదారుకు లాభిస్తుంది. ప్రస్తుతం వివాదాలు తలెత్తితే పరిష్కారం కోసం ఏ అధికారిని ఆశ్రయించాలో రైతులకు తెలియడం లేదు. సమస్యలు వస్తే జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నాలకు దిగడం తప్ప మరో పరిష్కారం వారికి తట్టడంలేదు. ప్రకాశం, కృష్ణా, ఖమ్మం జిల్లాల్లో సుబాబుల్‌ రైతుల దురవస్థే ఇందుకు ఉదాహరణ. ఈ రైతులకు కాగితం మిల్లులు గడచిన 15 సంవత్సరాల నుంచి రూ.18.5 కోట్ల మేరకు బకాయి పడ్డాయి. కాంట్రాక్టును సంబంధిత అధికారి వద్ద నమోదు చేయించకపోవడంతో బకాయిలను ఎలా వసూలు చేసుకోవాలో రైతులకు పాలుపోవడంలేదు. ప్రభుత్వ ఆస్తులు, వ్యాపార సంబంధ సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా ప్రభుత్వం పారదర్శకత తీసుకురావాలి.
కడప, తాండూరు శ్లాబు గనుల లీజులను ఎప్పుడు పునరుద్ధరిస్తారు, ఈ గనుల విస్తృతి ఎంత, లీజు రేట్లు, వ్యవధి వివరాలేమిటనే అంశాలను బహిర్గతపరిస్తే వ్యవస్థాపక సామర్థ్యం కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతుంది. ప్రస్తుతం స్వార్థశక్తులు ఈ సమాచారాన్ని గుత్తకు తీసుకుని లాభపడుతున్నాయి. దీంతో సామాన్యులు తమ జీవితాలను మెరుగుపరచుకునే అవకాశమే లేకుండాపోతోంది. ఈ పరిస్థితిని మార్చేలా ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావాలి. ప్రభుత్వ ఆస్తులను ఘరానా మనుషులు కైంకర్యం చేయకుండా సామాన్యులు లబ్ధి పొందే ఏర్పాటు చేయాలి. ఎన్డీయే ప్రభుత్వం లక్షిస్తున్న సమ్మిళిత అభివృద్ధిని సాధించగల నికరమైన మార్గమిది.

జన చైతన్యమే రక్ష
గ్రామీణ ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చూడటం సమ్మిళిత అభివృద్ధికి కీలకం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి కొత్త పద్ధతులు అవలంబించిన రాష్ట్రాల్లో గణనీయ ఫలితాలు సిద్ధించాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో నవీకరణకు రైతు బజార్లు, మహిళా స్వయం సహాయక బృందాలు విశిష్ట చిహ్నాలుగా నిలుస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో గ్రామాల సేద్య ఉత్పత్తులను ఒకేచోటుకు తెచ్చి విక్రయించే ప్రయోగమూ సఫలమైంది. కేరళలో పేద మత్స్యకారుల సంఘాల సమాఖ్య ‘మత్స్య ఫెడ్‌’ చేపల వ్యాపార వృద్ధికి తోడ్పడింది. దళారుల పిడికిలి నుంచి, ధరల హెచ్చుతగ్గుల నుంచి మత్స్యకారులకు రక్షణ కల్పించింది. ఆర్థిక సంస్కరణల వల్ల ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఉభయులూ లబ్ధి పొందాలంటే పాలనపరంగా పటిష్ఠ నియమ నిబంధనలు, నియంత్రణ పాటించాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు పాల కంపెనీలు కుమ్మక్కై, రైతులు అమ్మే పాలలోని వెన్న శాతాన్ని తగ్గించి చూపుతున్నాయి. అవే పాలను వేరేచోట పరీక్షిస్తే వెన్న శాతం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ అంశంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక రైతులు పరిష్కారం కోసం కలెక్టర్‌ కార్యాలయాలకు పరుగు తీస్తున్నారు. ఇప్పటికే రకరకాల బాధ్యతల బరువుతో సతమతమవుతున్న కలెక్టర్లకు పాల మోసాల నిరోధానికి కావలసిన సిబ్బంది ఉండరు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి చట్టపరమైన, పాలనపరమైన అధికారాలను ఉపయోగించడంలోనూ అనుభవం ఉండదు. కలెక్టర్ల అధికార పరిధిలోకి పాడి పరిశ్రమ వస్తుందా రాదా అనేదీ రైతులకు తెలియదు. సహజ వనరులను కొద్దిమంది కొల్లగొట్టకుండా నివారించడానికి అధికార వికేంద్రీకరణ, స్థానిక ప్రజల భాగస్వామ్యం తోడ్పడతాయనడంలో సందేహంలేదు.గత 25 ఏళ్ల ఆర్థిక సంస్కరణల కాలంలో జీడీపీలో వ్యవసాయం వాటా బాగా తగ్గిపోవడమే కాదు, గ్రామీణ యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలూ కుంగిపోయాయి. పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయి. అక్కడి జీవన వ్యయాన్ని గ్రామీణులు తట్టుకోలేరు. కాబట్టి మురికివాడల్లో నివసిస్తున్నారు. 2001లో దేశంలో 1,743 మురికివాడలు ఉంటే, 2011కల్లా వాటి సంఖ్య 2,613కు పెరిగిందని జనగణన వెల్లడించింది. గత రెండేళ్లలో బెంగళూరు వంటి నగరాల్లో ఇంటి అద్దెలు ఒకటిన్నర రెట్లు పెరిగి మధ్యతరగతివారు ఇబ్బంది పడుతున్నారు.
స్మార్ట్‌ఫోన్లు, ఆధార్‌ కార్డులు, జన్‌ ధన్‌ ఖాతాలు తదితర అధునాతన సాంకేతిక పద్ధతులను అవలంబిస్తే అధికార యంత్రాంగంలో అవినీతిని అరికట్టవచ్చుననే వాదం ఉంది. ప్రజల్లో చైతన్యం పెరగనంత వరకు, మారుతున్న కాలానికి అనువైన కొత్త సంస్థలు ఆవిర్భవించనంతవరకు కేవలం టెక్నాలజీతోనే పని జరగదని గమనించాలి. మన వ్యవస్థలను సంస్కరించనిదే ఆర్థిక సంస్కరణలు ఆశించిన ఫలితాలు ఇవ్వవని గ్రహించాలి. ప్రజలు ప్రతిదానికీ ప్రభుత్వంపై ఆధారపడటం అభిలషణీయం కాదు. ఆర్థిక సంస్కరణల వల్ల సాధించిన ప్రగతి ‘భారత్‌లో తయారీ’కి రంగం సిద్ధం చేసింది. సంస్కరణలనేవి ఏదో ఒక్కరోజుతో ముగిసిపోయేవి కావు. అవి నిరంతర ప్రక్రియగా సాగాల్సినవి. వాటి అమలులో ప్రజలకూ భాగస్వామ్యం ఉండాలి.

Posted on 16-08-2016