Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

భారత్‌ సూపర్‌

* 7 దశాబ్దాల స్వతంత్ర భారత్‌
వెక్కిరింతల మధ్య పుట్టిన దేశం ఇప్పుడు.. వెలుగులీనుతోంది!
అనుమానాల మధ్య అస్తిత్వంలోకి వచ్చిన దేశం ఇప్పుడు.. అద్భుతాలు సృష్టిస్తోంది!
స్వతంత్రం ఇస్తే మీకేం చేతనౌతుందన్న సీమదొరల ఎకసెక్కాల మధ్య..
సమస్యల సుడిలో స్వయం పాలనెలాగన్న సాటి దేశాల సందేహ దృక్కుల మధ్య..
స్వతంత్ర కాంక్షతో జ్వలించిన జాతి..
స్వేచ్ఛ కోసం త్యాగాలకు తెగించిన జాతి..
ప్రాణాలొడ్డి పరాయిలను పారదోలిన జాతి..
ఆ స్వతంత్రం విలువ మర్చిపోలేదు!
ఆ స్వతంత్రం వన్నెచిన్నెలూ తగ్గనివ్వలేదు!!
ఏడు దశాబ్దాల గమనంలో ఆటుపోటులెన్ని ఉన్నా స్వతంత్ర భారత్‌... స్వావలంబన సాధించింది సర్వతోముఖంగా విస్తరించింది సమున్నతంగా తలెత్తుకు నిలబడింది ప్రపంచ పటం మీద ఒక అసాధారణ శక్తిగా ఎదిగింది అభివృద్ధికి పతాకగా నిలుస్తోంది ఈ పురోగమనంలో దక్కిన ప్రతి ఫలమూ అనల్పం! ఈ ప్రస్థానంలో పడిన ప్రతి అడుగూ అపురూపం!
భారత ప్రజాస్వామ్యం.. ఒకప్పుడు అతిపెద్ద విస్మయం! నేడది ఓ అద్భుత వాస్తవం!!
1947 ఆగస్టు 15 అర్థరాత్రి చిమ్మ చీకట్లలో.. అంబరాన్నంటే సంబరాల మధ్య.. స్వతంత్రంతో పాటే లెక్కలేనన్ని సవాళ్లు, సంక్లిష్టతలతో పుట్టింది భారత్‌.

నాడు ఎటు చూసినా సమస్యలే. తొలి సవాలు- విభజన గాయాలతో లక్షలాదిగా తరలి వస్తున్న శరణార్ధుల రూపంలో ఎదురైంది. ప్రాణాలు చేతబట్టుకుని తరలి వస్తున్న దాదాపు 80 లక్షల మందిని ఆదరంగా అక్కున జేర్చుకోవటం సంక్లిష్టమైన సందర్భం. మరోవైపు దేశవ్యాప్తంగా విస్తరించిన దాదాపు 500 చిన్నచిన్న రాజ్యాలు, సంస్థానాలను దారిలోకి తెచ్చుకుని భారత్‌లో విలీనం చేసుకోవాల్సి రావటం మరో పెద్ద పరీక్షగా నిలిచింది. ఈ తక్షణ సమస్యలను అటుంచితే నాడు మన దేశ జనాభా 34.5 కోట్లు! వీరిలో కట్టుబట్టలకూ, కడుపునిండా తిండికీ కొరత అనుభవిస్తున్న కడు బీదలే ఎక్కువ. దీనికి తోడు ఎన్నో కులాలు, మతాలు, సంస్కృతులు, ప్రాంతాలుగా విడిపోయి వైరుధ్యాల్లో కొట్టుమిట్టాడుతున్న ఈ జనాభా మొత్తాన్ని ఏక తాటి మీదికి తీసుకువచ్చి ఒక జాతిగా, ఒక దేశ ప్రజగా తీర్చిదిద్ది, వీరిలో మనమంతా భారతీయులమన్న విశ్వాసం పాదుకొనేలా చెయ్యటం అతి పెద్ద సవాల్‌గా పరిణమించింది. ఇలా మొదలైన మన ప్రయాణంలో.. ఈ డెబ్భై ఏళ్ల ప్రస్థానంలో మనం ఇంతగా పురోగమించటానికి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా, వేగంగా అడుగులేస్తున్న ప్రబల ఆర్థిక శక్తిగా ఎదగటానికి దోహదం చేసిన ప్రతి అడుగూ అపురూపమైనదే.

ఈ క్రమంలో ముందుగా చెప్పుకోవాల్సింది మన రాజ్యాంగం, మన వ్యవస్థ, మన రాజ్యాంగ నిర్మాతల దార్శనికత! ప్రతి పౌరుడికీ సమాన హక్కులతో ప్రజాస్వామ్యాన్ని సమున్నతంగా ప్రతిష్ఠించటం తొలి ఘనత. ఒక దేశం పుడుతూనే- ఎలాంటి తరతమ భేదాలకూ తావు లేకుండా 21 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించిన దేశంగా మన చరిత్ర అజరామరం. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు కూడా చెయ్యలేదీ పని! ముందు ఆస్తిపరులకు, ఆ తర్వాత చదువుకున్నవారికి, ఆ తర్వాత ఉద్యోగులకు, చివరికి ఎప్పటికో మహిళలకు.. ఇలా అంచెలంచెలుగా ఓటుహక్కు కల్పించాయా దేశాలు. కానీ ఒక్కసారిగా ఇంతమందికి ఓటుహక్కు కల్పించటమే కాదు.. వీరందరితో భారీ ఎత్తున తొలి సార్వత్రిక ఎన్నికను విజయవతంగా నిర్వహించటం ద్వారా ప్రపంచ దేశాలను నివ్వెర పరిచింది- అప్పటికి బాల్యం దాటని భారత్‌. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నిక.. ప్రజల అకుంఠిత స్వాతంత్య్ర, ప్రజాస్వామ్య కాంక్షకు దర్పణం పట్టింది. 4 నెలల పాటు, 68 దశల్లో అంచెలంచెలుగా జరిగిన ఈ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లకు గాను 10.59 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. 1874 మంది బరిలో దిగారు, వీరిలో 533 మంది స్వతంత్ర అభ్యర్ధులు! ఈ డెబ్భై ఏళ్లలో ఇప్పటి వరకూ 16 సార్వత్రిక ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా వేలాది ఎన్నికలు విజయవంతంగా జరిగాయంటే దానికి ఈ తొలి ఎన్నికలు వేసిన బలమైన సంప్రదాయమే పునాది! ప్రతి పౌరుడికీ వాక్సా్వతంత్య్రాన్ని కల్పించటం, స్వతంత్రంగా వ్యవహరించే న్యాయ వ్యవస్థను స్థాపించుకోవటం, అవసరమైతే రాజ్యాంగ స్ఫూర్తికి పహారాగా కూడా నిలిచే న్యాయ సంప్రదాయాలను నెలకొల్పుకోవటం, కడు బీదలతో పాటు సామాజికంగా అణగారిన, వెనకబడిన బడుగు వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్ల వంటి విధానాలను అనుసరించటం, కులమత ప్రాంతీయ భిన్నత్వాలెన్ని ఉన్నా వాటి మధ్య ఏకత్వాన్ని సాధిస్తూ దేశ సమగ్రతను కాపాడుకోవటం, అర్ధాకలి బాధలు లేకుండా హరిత విప్లవాలతో తిండిగింజల ఉత్పాదనలో సమృద్ధి సాధించటం, శాస్త్రసాంకేతిక రంగాల్లో అగ్రరాజ్యాలతో సరిజోడిగా ఎదగటం.. డెబ్భై ఏళ్ల స్వతంత్ర భారత గమనాన్ని పురోగమన పథంలో నడిపించిన అంశాలివన్నీ!

సమసమాజానికి నిచ్చెన
భారత సమాజంలో ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం కొలువవ్వాలన్నది రాజ్యాంగ లక్ష్యాల్లో ఒకటి. కానీ.. అనాదిగా వస్తున్న దురాచారాల కారణంగా కొన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక హోదా దక్కలేదు. దేశంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ సృష్టించిన ఈ అంతరాన్ని సరిచేయడానికి రాజ్యాంగంలోనే రక్షణ, అవకాశాల కల్పనకు మార్గమేశారు. వెనుకబడిన, అణగారిన కులాల అభ్యున్నతికి రిజర్వేషన్లను తీసుకొచ్చారు. రిజర్వేషన్ల ఫలితంగా విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు చేరువై వెనుకబడిన, అణగారిన కులాల స్థితిగతులు చాలావరకు మారాయి. ఇప్పటికీ దళితులపై వివక్ష, దాడులు, అణచివేత కొనసాగుతున్నా ఒకప్పటితో పోల్చితే తగ్గింది. రాజ్యాంగ రూపకర్తలు ఆశించిన సమసమాజం సిద్ధించడంలో రిజర్వేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
దేశంలో వేళ్లూనుకున్న కుల వ్యవస్థలో అగ్ర వర్ణాలు అంటరానితనాన్ని పెంచి పోషించాయి. నిమ్న కులాలవారు ఇతర కులాలతో కలిసి భోంచేస్తే తప్పు, పొరపాటునైనా ఇతర కులాల వారిని తాకినా తప్పే.. అందరూ మంచినీళ్లు తీసుకెళ్లే బావి వద్ద అడుగు పెట్టడానికీ వారికి అవకాశం లేదు.. అంతలా సాగిన అణచివేత నుంచి నిమ్న వర్గాలను రక్షించేందుకు స్వాతంత్య్రానంతరం జాతి నేతలు నడుంబిగించారు. రాజ్యాంగాన్నే వారికి రక్షణ కవచం చేయాలనుకున్నారు. అంటరానితనాన్ని నిషేధిస్తూ రాజ్యాంగంలో 17వ అధికరణాన్ని పొందుపరిచారు. వారి ఎదుగుదలకు అదొక్కటే చాలదని గుర్తించి ప్రత్యేక రిజర్వేషన్లనూ కల్పించారు.
రిజర్వేషన్లు భారతదేశంలో అణగారిన వర్గాలకు వరంగా మారాయి. షెడ్యూల్డ్‌ కులాలతోపాటు షెడ్యూల్డ్‌ వర్గాలు, వెనుకబడిన కులాలుగా వర్గీకరించి రిజర్వేషన్లు కల్పించారు. నిర్ణీత శాతం ప్రకారం వారికి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు పెంచారు. ఫలితంగా విద్య వారికి చేరువై చైతన్యవంతులయ్యారు. ఉద్యోగాలూ పొందడంతో ఆర్థికంగానూ కుదురుకునే అవకాశమేర్పడింది. రాజకీయ అవకాశాలు రావడంతో చట్టసభల్లో తమ గళం వినిపించే అవకాశమేర్పడింది. ఇలా దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడంలో ఈ రిజర్వేషన్లు కీలకమయ్యాయి.

ఖాళీ ఖజానాలో కాసుల గలగల
పాతికేళ్ల కిందటితో పోల్చితే భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది. వస్తువులు, సేవలు అన్నీ ప్రజలకు అందుబాటులోకొచ్చాయి. ఇదంతా సంస్కరణల ఫలం. 70 వసంతాల స్వతంత్ర భారత ఆర్థిక ముఖచిత్రం సమూలంగా మారడానికి, ప్రపంచంలోని శక్తిసంపన్న దేశాల్లో ఒకటిగా నిలవడానికీ అవే కారణం.
భారత్‌.. నోట్లో బంగారు చెంచాతో పుట్టిన దేశం కాదు. శతాబ్దాల పాటు దోపిడీకి గురైన దేశం. పాతికేళ్ల కిందట.. పడుతూలేస్తూ సాగుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు భారీ కుదుపు వచ్చింది. తయారీ రంగం సుప్తావస్థకు చేరడం, రుణాత్మక ఆర్థిక వృద్ధి, నిరుద్యోగం, విదేశీ అప్పుల భారం అన్నీ కలిసి ఆర్థిక వ్యవస్థను మందగించేలా చేశాయి. ఆ సమయంలో 1991లో పీవీ నరసింహారావు కేంద్రంలో అధికారం చేపట్టారు. అసలే బలహీన ప్రభుత్వం.. ఆపై సవాళ్లు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌తో కలిసి ఆయన భారీ సంస్కరణలకు తెరతీశారు. అప్పటి నుంచి ఆ పరుగు ఎక్కడా ఆగకుండా సాగుతోంది. భారత్‌ ఇప్పుడు ఎన్నో దేశాలకు ఆర్థిక సహాయం చేసే పరిస్థితుల్లో ఉందంటే.. పెద్దదిక్కుగా కనిపిస్తుందంటే.. పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందంటే.. ప్రపంచం మనవైపు చూస్తుందన్నా.. దానికి కారణం సుస్థిర ఆర్థిక వ్యవస్థ. అది సంస్కరణలు సాధించిపెట్టిన విజయం.
అప్పుల వూబి నుంచి..
1991లో దేశంలో తొలిసారిగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన నాటికి విదేశీ అప్పుల భారం ఆందోళనకర స్థాయికి చేరింది. విదేశీ రుణాలు జీడీపీలో 23 శాతం ఉండేవి. దేశీయ రుణాలు కూడా జీడీపీలో 55 శాతానికి చేరాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు రూ.2,500 కోట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ద్రవ్యలోటు జీడీపీలో 8 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణమూ పెరిగిపోయింది. అప్పటికి పదేళ్ల కిందటే మొదలైన ఈ కష్టాలు క్రమంగా 1990 నాటికి తీవ్రస్థాయికి చేరాయి.

పరుగు నేర్పాయి
ఆర్థిక వ్యవస్థ పతనం అంచుల్లో ఉన్నప్పుడు అమల్లోకి తెచ్చిన సంస్కరణలు దేశాన్ని సుడిగుండం నుంచి బయటపడేయడమే కాకుండా ప్రపంచంలో కీలక ఆర్థిక శక్తిగా ఎదిగేందుకూ బాటలు వేశాయి. ఆ బడ్జెట్‌లో ఎగుమతులను ప్రోత్సహించేలా నిబంధనలను సరళీకరించారు. విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీని మన తయారీరంగం తట్టుకుని నిలిచేందుకు వీలుగా దిగుమతులపై ఆంక్షలు విధించారు. సుంకాలను భారీగా తగ్గించారు. పన్నులను హేతుబద్ధీకరించారు. 47 కీలక రంగాల్లో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశమిచ్చారు. పరిశ్రమలకు అనుమతుల విధానం సులభతరం చేశారు. చెల్లింపులు, బకాయిల భారంతో నిలువునా కుంగిపోయిన పరిస్థితుల్లో తీసుకొచ్చిన సరళీకరణ విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయి. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేశాయి. స్థిరమైన వృద్ధికి, సేవారంగం విస్తరణకు.. ప్రైవేటు రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు, సంపద సృష్టికి మార్గం వేశాయి. ప్రపంచంలోని ప్రతి వస్తువు, సేవలు ఇప్పుడు మనకు అందుబాటులోకి రావడం.. వ్యక్తిగత అభివృద్ధి అన్నీ సంస్కరణలు సాధించిన విజయమే అని చెప్పాలి.

సమాచార సాంకేతిక ర‌థం!
* ప్రపంచ మొత్తం ఐటీ సేవల్లో 67% వాటా భారత్‌దే
* అగ్రదేశాలు కూడా ఆధారపడేంతగా ఐటీలో మనం అభివృద్ధి చెందాం.
* అమెరికా.. ఆస్ట్రేలియా.. వంటి దేశాలతో పోల్చితే మనం 4 రెట్లు తక్కువ ఖర్చుతో ఐటీ సేవలను అందించగలుగుతున్నాం.
* గూగుల్‌.. మైక్రోసాఫ్ట్‌..అడోబ్‌.. ప్రముఖ ఐటీ సంస్థలన్నింటికీ నేతృత్వం వహించే స్థాయికి ఎదిగాం.
* గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమేజాన్‌ ఇలా దిగ్గజ సంస్థలన్నీ మన దేశంలో కార్యాలయాలు పెట్టుకున్నాయి.
ఐటీ రంగంలో భారత్‌ సాధించిన ప్రగతి అనితర సాధ్యం. ఈ టెక్నాలజీ విప్లవం దేశంలోని పౌరుల జీవన విధానాన్నే మార్చేసింది. ఒకప్పుడు ధనికవర్గాలకే పరిమితమైన ఫోన్‌..టీవీ.. అంతర్జాల సౌకర్యాలను ఇప్పుడు పేదలూ అనుభవించగలుగుతున్నారు.
1990 దశకంలో వీశాట్‌ లింక్‌లకు వెసులుబాటు కల్పించడం.. దేశంలో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కుల ఏర్పాటుకు సహకార సంస్థను ఏర్పాటు చేయడంతో మన సాంకేతిక విప్లవం మొదలైంది. 1999లో అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం సమాచార సాంకేతిక అభివృద్ధిని చాలా ప్రాధాన్యం ఇచ్చింది. ఇదే సంవత్సరంలో తీసుకొచ్చిన కొత్త టెలికమ్యూనికేషన్స్‌ విధానం.. ఫోన్లు.. ఇతర కమ్యూనికేషన్‌úస వ్యవస్థ విజృంభణకు వూతమిచ్చింది. 2000లో అమల్లోకి తెచ్చిన సమాచార సాంకేతిక చట్టం ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు, ఈ వాణిజ్యానికి ప్రోత్సాహం కల్పించింది. దీంతో మనం అతి పెద్ద సాంకేతిక శక్తిగా అవతరించాం. దేశంలో ఫోన్లు.. అంతర్జాలం వినియోగం పెరగడంతో బ్యాంకింగ్‌.. వాణిజ్యం.. ప్రభుత్వ సేవలు.. పాలన రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కోట్ల ఉద్యోగాలను సృష్టించి జీనవ ప్రమాణాలను.. విధానాన్ని మెరుగుపరచాయి.

కరవు పోయింది.. కడుపు నిండింది
స్వాతంత్య్రం వచ్చిన 20 ఏళ్ల వరకు తిండిగింజలకు కటకటలాడిన దేశం ఇప్పుడు ధాన్యరాశిగా మారిందంటే ఆ విజయానికి కారణం.. హరిత విప్లవం. భరతమాతను అన్నపూర్ణను చేసిన ఘనతా హరిత విప్లవానిదే.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో దేశంలోని ఆహార ధాన్యాలు చాలక దిగుమతి చేసుకునేవాళ్లం. 1960 తరువాత వరుస కరవులు ఏర్పడడంతో కొరత మరింత అధికమైంది. 1966లో ఏర్పడిన తీవ్రమైన కరవు కారణంగా దేశంలో ఉత్పత్తయిన 7.2 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు సరిపడక ఏకంగా కోటి టన్నులు దిగుమతి చేసుకున్నారు. ఆ తరువాత ఏడాది 1.2 కోట్ల టన్నులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది.
అలాంటి పరిస్థితుల్లో ముప్పును గుర్తించి తక్షణ ప్రణాళికగా 1966-67 ఆర్థిక సంవత్సరం ఖరీఫ్‌ కాలంలో హరిత విప్లవానికి నాంది పలికారు. అధిక దిగుబడులనిచ్చే వంగడాలను తయారుచేయడంతో పాటు ఎరువులు, పురుగు మందులను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చి పంట ఉత్పత్తులు పెరిగేలా చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ సూచనలతో మెక్సికో నుంచి అధిక దిగుబడినిచ్చే గోధుమ విత్తనాలను భారీగా దిగుమతి చేసుకున్నారు. ఇలాంటి వంగడాలను దేశీయంగా అభివృద్ధి చేయడంలోనూ స్వామినాథన్‌ కీలక పాత్ర పోషించారు. సాగునీటి పారుదల రంగంపై దృష్టి పెట్టారు. ఎక్కువ భూములకు నీరందేలా, రెండు పంటలు పండేందుకు వీలుగా ప్రాజెక్టులు, కాలువలు నిర్మించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలకు ప్రోత్సాహం.. బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు పెంచడంతో పొలాల్లో పంట పండింది. దశాబ్ద కాలంలోనే దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.

- ఈనాడు ప్ర‌త్యేకం
Posted on 16-08-2016