Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

బాలల రక్షణ ఛత్రానికి తూట్లు!

* సవరించిన చట్టంలో పలు లోపాలు
బాల కార్మిక వ్యవస్థ నిషేధానికి సంబంధించి కొత్త చట్టం ప్రకారం వ్యాపార సంస్థలపై నియంత్రణ, పర్యవేక్షణ పెద్ద సవాలుగా మారుతుంది. ‘కుటుంబ వృత్తులు, వ్యాపారాలు’ అన్న పదాలకు చట్టంలో సరైన నిర్వచనాలు లేవు. పనిలో ఉన్న పిల్లలు ఎవరు, యజమానితో వారికున్న సంబంధం ఏమిటన్న అంశాలను తనిఖీ అధికారులు గుర్తించగలరా? ప్రశ్నించిన అధికారులకు యజమానులు తప్పుడు సమాచారం అందజేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దగ్గరి బంధువుల పిల్లలు అంటూ పక్కదారి పట్టించవచ్చు. చట్ట సవరణ ద్వారా కౌమార దశ పిల్లలను ప్రమాదకర పనుల్లో పెట్టకూడదంటూ ఒకపక్క చెబుతూనే, మరోవైపు ప్రమాదకర పనుల జాబితాను బాగా కుదించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
బాలల హక్కులను పరిరక్షించే ప్రయత్నంలో భాగంగా 1986లో కేంద్రం బాలకార్మిక (నిషేధం-నియంత్రణ) చట్టం తెచ్చింది. దాని ప్రకారం 14 సంవత్సరాల్లోపు పిల్లల సేవలను వినియోగించుకోవడం శిక్షార్హం. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) 138వ నిబంధన మేరకు 2010లో విద్యాహక్కు చట్టాన్ని సైతం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. 14 ఏళ్ల వరకూ పిల్లలకు రాష్ట్రప్రభుత్వాలు ఉచిత విద్య అందించాలని అది స్పష్టీకరిస్తోంది. మూడు దశాబ్దాల తరవాత బాలకార్మిక చట్టానికి కేంద్రం సవరణలు చేసింది. ఈ సవరణలు విద్యాహక్కు చట్టాన్ని నీరుగార్చేలా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం, 1986నాటి చట్టనిబంధనల ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరవు పెడుతోంది. సవరణ తప్పనిసరి అయిందని నొక్కి చెబుతోంది.

నాణానికి మరోవైపు...
ప్రమాదకర పనుల్లో 14 ఏళ్ల లోపు పిల్లలను ఉపయోగించకూడదని 1986నాటి చట్టం చెబుతోంది. తాజా చట్టంలో 14-18 మధ్య వయసు పిల్లలనూ చేర్చారు. ప్రమాదరహిత కుటుంబ వృత్తులు, వ్యాపారాలు, చివరకు వ్యవసాయ పనులూ పిల్లలు చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తోంది. సెలవుల్లో బడిగంటలు ముగిసిన తరవాత పిల్లలు పనికి వెళ్లవచ్చని చెబుతోంది. టీవీ సీరియళ్లు, సినిమాలు, వ్యాపార వాణిజ్య ప్రకటనలు, ఇతర వినోద, క్రీడారంగాల్లో వారు పని చేయవచ్చని స్పష్టం చేసింది. ప్రమాదకర పనుల, ప్రక్రియల జాబితాలోని అంశాలను 83 నుంచి 31కు కుదించారు. కార్పెట్‌, జరీ, బీడీ, మైకా, వజ్రాలకోత, పారిశుద్ధ్యం, ఇటుక బట్టీలు, పొలం పనులు, తదితర ప్రమాదరహిత పనులకు జాబితాలో చోటు కల్పించారు. గనులు, మండే స్వభావం ఉండే పదార్థాలు, ఫ్యాక్టరీల చట్టం కింద ప్రమాదకర ప్రక్రియలుగా పరిగణించే రంగాలను ప్రమాదకర పరిశ్రమల విభాగంలో చేర్చారు. భవిష్యత్తులో ఏదైనా వృత్తి లేదా పనిని ప్రమాదరహితమైనదని కేంద్రం భావిస్తే, చట్ట సవరణతో పనిలేకుండా ఆ విభాగంలో చేర్చే హక్కు ఉంటుంది. కాబట్టి, ఈ కొత్త చట్టం ప్రకారం ఇంటిచాకిరీ, వ్యవసాయ పనుల్లో పిల్లలను యథేచ్ఛగా ఉపయోగించుకోవడంతో పాటు, ఏకంగా ప్రమాదకర పరిశ్రమల్లోనూ నియమించుకునే అవకాశం ఉందంటున్నారు. పేదరికం కారణంగా తల్లిదండ్రులకు కొంతమేర పిల్లలు చేదోడు వాదోడుగా ఉండాలన్నదే ఈ తాజా సవరణల లక్ష్యమని చెబుతున్నారు. 65 పని ప్రక్రియల్లో, 18 ప్రమాద పరిశ్రమల్లో బాలలు పనిచేయడం పాత చట్టం ప్రకారం నిషిద్ధం. కొత్త చట్టంలో బాలల వయస్సును 14 నుంచి 18 ఏళ్లకు పొడిగించారు. 18 ఏళ్లలోపు వారిని పనుల్లో నియమించుకుంటే వారెంట్‌ లేకుండా అరెస్టు చేయవచ్చు. ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు శిక్ష, రూ.20వేల నుంచి రూ.50 వేలవరకు జరిమానా విధించవచ్చు.
ఇవన్నీ మంచి అంశాలే అయినప్పటికీ, ఈ సవరణల పట్ల విపక్షాలు, బాలల హక్కుల కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాల కార్మిక వ్యవస్థను మరింత సమర్థంగా రూపుమాపడానికంటూ తెచ్చిన చట్టసవరణలు, ఆచరణలో అందుకు భిన్నమైన ఫలితాలు ఇస్తాయన్నదే విమర్శకుల వాదన. ఏ చట్ట సవరణ అయినా పరిస్థితుల్ని మెరుగుపరచడానికి దోహదపడాలి. లోటుపాట్లను సవరించేదిగా ఉండాలి. అంతేతప్ప నీరుగార్చేలా ఉండకూడదు. ఈ దృక్కోణంతోనే తాజా సవరణలపై వస్తున్న విమర్శలను పరిశీలించాలి. బడిగంటలు ముగిసిన తరవాత, సెలవుల్లో పిల్లలు కుటుంబ వ్యాపారాల్లో, వృత్తుల్లో, వ్యవసాయ కార్యకలాపాల్లో పనిచేయవచ్చని కొత్తచట్టం చెబుతోంది. కానీ, దీనివల్ల పిల్లలు హోం వర్కుకు, ఇంటివద్ద చదువులకు దూరమై వెనకబడతారు. తోటి విద్యార్థులతో పోటీపడలేక నష్టపోతారు. చదువులు, పనులవల్ల అధిక శ్రమకు గురైన పిల్లలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదమూ ఎక్కువగా ఉంటుంది.
అసలు ఈ చట్టాన్ని సవరించాలని ఎవరూ కోరలేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదు. పలుకుబడిగలిగిన కొంతమంది ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఈ సవరణలకు పూనుకొందన్న విమర్శలు ఆలోచింపజేసేవే. చట్ట సవరణల వల్ల మధ్యలో బడిమానివేసే పిల్లల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. సవరణల్లోని లోపాలను కొందరు స్వార్ధపరులు దుర్వినియోగపరచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పిల్లలను సైతం కులవృత్తుల్లో ఉన్న బాబాయిలు, మామలు, నాన్నలు, రక్త సంబంధీకులు యథేచ్ఛగా తమ పనుల్లో పెట్టుకోవచ్చు. ఇష్టానుసారంగా బాల కార్మికులను నియమించుకునే స్వేచ్ఛ ఇకపై లభిస్తుందని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాష్‌ సత్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ‘యునిసెఫ్‌’ సైతం చట్టసవరణలపై విమర్శలు గుప్పించింది. వృత్తిపనులు, కుటుంబ వ్యాపారాల్లో తల్లిదండ్రులు బయటకు వెళ్లినప్పుడు కొద్దిసేపు పిల్లలు ఆ పనులు చూస్తూ ఉండటం సాధారణంగా జరిగేదేనని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెబుతున్నారు. అందులో కొంత నిజం లేకపోలేదు. కానీ, కొద్దిసేపు పని చేయడాన్ని కూడా చట్టబద్ధం చేయాలనుకోవడమే విడ్డూరం. చివరకు అదో హక్కుగా మారి, పిల్లలను పనికే పరిమితం చేసే పెను ప్రమాదం లేకపోలేదు.
దేశంలో పౌష్టికాహారలేమితో వ్యాధుల బారిన పడుతున్న 48 కోట్ల చిన్నారులకు కొత్త చట్టసవరణలు శరాఘాతంగా పరిణమించవచ్చు. పిల్లలను కులవృత్తుల్లో పనిచేయించడం వల్ల తాత్కాలికంగా ఆ కుటుంబాలకు ఉపశమనం కలగవచ్చు. కానీ, భవిష్యత్తులో వారి పిల్లలు చదువులో వెనకబడిపోయి మంచి ఉద్యోగాలు పొందలేరు. చివరకు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. అటువంటి కష్టకాలంలో, బాల్యంలో శిక్షణ పొందిన కులవృత్తుల మీదే ఆధారపడాల్సి రావచ్చు. ఆ విధంగా వీరు ప్రభుత్వానికి భారం కాకుండా, తమ కాళ్లపై తాము నిలబడగలుగుతారన్నది ఒక వాదన. ఈ కోణంలో చట్టసవరణలను సమర్థించుకోవడం ఎంతవరకు సమంజసమన్నది ఆలోచించాలి.
నేటి బాలలే రేపటి దేశపౌరులు. కౌమార దశలో నేర్చుకున్న విద్య, తిన్న తిండి వారి భవిష్యత్తుకు పునాది. జీవితంలో ఉత్సాహం, ఉత్తేజం, ఉరకలు వేసే ఉజ్వలమైన దశ అది. ఏ దేశానికైనా యువశక్తే గొప్ప సంపద. ఈ విషయంలో భారతదేశం కంటే సంపన్న దేశం ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి, దేశ బాలలను విద్యకు దూరం చేసే పరిస్థితులు రాకూడదు. అందరికీ విద్య అందజేసి యువతను నాణ్యమైన మానవ వనరులుగా తీర్చిదిద్దుకోవాలి. కానీ, విద్యాహక్కు అసలు లక్ష్యానికే తూట్లు పొడిచేలా చట్ట సవరణలు ఉన్నాయన్నది నిష్ఠురసత్యం. పేదరిక నిర్మూలన లక్ష్యానికి ఇది పూర్తి విరుద్ధం. పిల్లలు తక్కువ వేతనాలకే యజమానుల వద్ద ఎక్కువ గంటలు పనిచేస్తుంటారు. దీనివల్ల యజమానులే అధిక లాభాలు ఆర్జిస్తారు. పనుల కోసం పిల్లల్ని రైళ్లల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా పట్టుకొంటున్న ఉదంతాలూ తరచూ వార్తల్లో వస్తున్నాయి. బాలకార్మిక వ్యవస్థ ఎంతగా విస్తరిందో తెలియజెబుతున్న పరిమాణాలివి. పేదరికం పిల్లల్ని చదువులకు, ఆటలకు దూరం చేస్తున్న రోజులివి. వీరిలో దళితులు, గిరిజనులు, ఇతర వెనకబడిన కులాలవారే ఎక్కువగా ఉన్నారు. మాధ్యమిక విద్యాస్థాయిలోనూ మధ్యలో చదువు మానేస్తున్నవారు ఎక్కువే. 5-17 వయోవర్గంలోని బాల కార్మికులు ప్రపంచవ్యాప్తంగా 16.8 కోట్లు ఉన్నారు. ఒక్క భారత్‌లోనే వీరి సంఖ్య 57 లక్షలన్నది అధికారిక అంచనా. అంతర్జాతీయ కార్మికశాఖ ఇటీవల విడుదల చేసిన 2015 సంవత్సరం నివేదికలోని వివరాలివి. వీరిలో సగం మంది బాలలు వ్యవసాయరంగంలో, నాలుగోవంతు ఎంబ్రాయిడరీ, కార్పెట్లు, అగ్గిపెట్టెల తయారీ, హోటళ్లు, ఇంటి చాకిరీ వంటివాటిల్లో పనిచేస్తున్నారని ఈ నివేదిక పేర్కొంది. వాస్తవంలో ప్రపంచవ్యాప్తంగానూ, భారతదేశంలోనూ బాలకార్మికుల సంఖ్య మరెన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది.

విద్యా హక్కుకు విఘాతం!
కుటుంబ పరిశ్రమల్లో పనిచేయడానికి కొత్త చట్టం పిల్లలను అను మ మతించినా, పత్తి పొలాలు, గాజులు, బీడీలు, కార్పెట్‌, లోహం వంటి పరిశ్రమలు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ప్రమాదకరమైన కుటుంబ పరిశ్రమల, వృత్తుల పూర్తి జాబితాను తయారుచేసి, వాటిల్లో బాలకార్మికుల వినియోగాన్ని బేషరతుగా నిషేధించాలని భారత ప్రభుత్వానికి ‘యునిసెఫ్‌’ సూచించింది. బాలలను పనిలో పెట్టుకోవడం వల్ల వయోజనులు నిరుద్యోగులుగా మారి, సామాజిక సమస్య తలెత్తవచ్చునని గమనించాలి. పిల్లలను బడికి పంపకుండా పనుల్లో పెట్టుకుంటే తల్లిదండ్రులు సైతం శిక్షార్హులే అవుతారు. కానీ, ఈ చట్ట నిబంధనల్ని ఎలా అమలు చేస్తారు? పిల్లలు తమ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలరా? పసిపిల్లలతో యజమానులకున్న చుట్టరికాన్ని లోతుగా ఆరా తీయడం, తనిఖీ అధికారులకు సాధ్యమా? వాస్తవంలో ఇవన్నీ జరిగేవి కావు. దీనివల్ల చివరకు విద్యాహక్కు చట్టం పవిత్ర లక్ష్యమే నీరుగారే ప్రమాదముంది. విద్యాహక్కు చట్టం వచ్చిన తరవాత పాఠశాలల్లో నిరుపేద కుటుంబాల పిల్లల హాజరీ శాతం గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. గతంలో వ్యతిరేకించిన తల్లిదండ్రుల ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తమ పిల్లల బతుకులైనా బాగుపడాలని వారు భావిస్తున్నారు. ఇటువంటి సమయంలో తాజా చట్ట సవరణల విషయంలో ఆచితూచి వ్యవహరించి ఉండాల్సింది. ఈ చట్టం మగ పిల్లల కన్నా ఆడపిల్లల్నే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా భవిష్యత్తులో మహిళా నిరక్షరాస్యత మరింత పెరుగుతుంది. పార్లమెంటు ఉభయసభల్లోనూ మరికాస్త సమయం వెచ్చించైనా ఈ అంశాలన్నింటిపై కూలంకషంగా చర్చ జరిపి ఉండాల్సింది. ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకనొ, ఇకనైనా ఈ విషయంలో పునరాలోచన జరిపితే బాలల బతుకులకు మరింత భరోసా కల్పిచినట్లవుతుంది!

Posted on 20-08-2016