Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

విజ్ఞానం ‘స్వయం’ ప్రకాశం

* అందరికి అందుబాటులో మేలిమి విద్య
ఏ దేశ ఆర్థికాభివృద్ధి అయినా అక్కడి మానవ వనరుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మానవ వనరుల నాణ్యత, శ్రామిక ఉత్పాదకతలకు విద్య, వైద్య స్థాయిలే కీలకం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా కలిగిన దేశం. 10-24 వయోవర్గంలో 35.6 కోట్లమంది ఉన్నారు. యువత శక్తిసామర్థ్యాలను సక్రమంగా వినియోగించుకుంటే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉంది. యువ జనాభాను ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నం చేయాలన్నా, వారి ఉత్పాదకత శక్తిని పెంచాలన్నా విద్య, వైద్య సదుపాయాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఉత్పాదకత శక్తిని పెంపొందించడంలో విద్యాస్థాయిదే కీలకపాత్ర. విద్యాస్థాయిని అంచనా వేయడానికి స్థూల నమోదు నిష్పత్తి(జీఈఆర్‌) సూచిక ప్రధానంగా ఉపయోగపడుతుంది. పాఠశాల లేదా కళాశాలకు వెళ్లడానికి అర్హులైన వయసు కలిగిన మొత్తం పిల్లలు యువకుల్లో ఎంతమంది పాఠశాల లేదా కళాశాలలో నమోదయ్యారో ఈ నిష్పత్తి తెలియజేస్తుంది. అర్హులైనవారికి అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, విద్యాసంస్థలు, జ్ఞాన సముపార్జనకు గల అవకాశాలు దీని ద్వారా తెలుస్తాయి. దేశంలో ఈ నిష్పత్తి ప్రాథమిక విద్యలో 92 శాతం, మాధ్యమిక స్థాయిలో 52 శాతం, ఉన్నత విద్యలో 23.6 శాతంగా ఉంది. దేశ జనాభాలో 44 శాతం 6-23 వయోపరిమితివారు విద్యాభ్యాసం చేస్తున్నారు. కానీ, విద్యకోసం వెచ్చిస్తున్న మొత్తం స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 3.3 శాతమే.
భారత జనాభాలో 44 శాతం 6-23 సంవత్సరాల మధ్య విద్యాభ్యాస స్థాయిలో ఉన్నారు. విద్యపై అతి తక్కువగా వెచ్చించడం; పేదరికం, నిరుద్యోగం, ఉపాధికి హామీ ఇవ్వని విద్యావిధానం, మేలిమి విద్యాసంస్థలు, సదుపాయాలు, ఆసక్తిగల కోర్సులు అందుబాటులో లేకపోవడం; లోపభూయిష్ఠమైన బోధన పద్ధతులు; మూల్యాంకన విధానం, అనుత్తీర్ణత తదితర అంశాలు విద్యార్థుల మధ్యలో బడిమానేయడానికి కారణాలు. దీనివల్లే జీఈఆర్‌లో భారత్‌ వెనకబడిపోయింది. జీఈఆర్‌ పెరిగితే తప్ప నాణ్యమైన మానవ వనరులు అందుబాటులోకి రావు. జీఈఆర్‌ను పెంచాలంటే విస్తృతమైన విద్యావకాశాలను అందుబాటులోకి తీసుకురావాలి. జీఈఆర్‌ను 2020నాటికి 30శాతానికి పెంచాలన్నది పన్నెండో ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యం. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉన్నత విద్యారంగాల్లో జ్ఞాన విస్తరణకు, అభ్యసన అవకాశాలను పెంపొందించడానికి స్వయం, స్వయంప్రభ, జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం, ప్రాంగణ అనుసంధానం(క్యాంపస్‌ కనెక్ట్‌) వంటి కార్యక్రమాల నిర్వహణకు సమాయత్తం అవుతోంది.

స్వయం (స్టడీవెబ్స్‌ ఆఫ్‌ యాక్టివ్‌ లెర్నింగ్‌ ఫర్‌ యంగ్‌ ఆస్పైరింగ్‌ మైండ్స్‌): మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ రూపొందిస్తున్న ‘స్వయం’ కార్యక్రమం విద్యావిస్తృతికి ఎంతో దోహదపడేదిగా ఉంది. అర్ధాంతరంగా చదువు ఆపేసినవారు ఆన్‌లైన్‌ ద్వారా విద్య కొనసాగించడానికి ఇది అవకాశం కల్పిస్తోంది. మూక్‌ (ఎంఓఓసీ-మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) వెబ్‌సైట్‌ ద్వారా ఎవరైనా, ఎక్కడి నుంచైనా అంతర్జాలం ద్వారా కోర్సును పూర్తిచేయవచ్చు. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు రాసి ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. ‘స్వయం’ ప్రకారం- 9-12 తరగతులు, డిగ్రీ, స్నాతకోత్తర, ఇంజినీరింగ్‌ స్థాయుల్లో దాదాపు 2000 కోర్సులు, ఒక్కోదానిలో 40 గంటల పాఠాలు అందుబాటులో ఉంచనున్నారు. పది లక్షల విద్యార్థులు ఏకకాలంలో ఎక్కడినుంచైనా, ఎప్పుడైనా నెట్‌వర్క్‌కు ఉచితంగా అనుసంధానమయ్యే సదుపాయం కల్పించనున్నారు. ‘మూక్‌’ వైబ్‌సైట్‌లో సుమారు 2.5 లక్షల గంటలకు సమానమైన పాఠ్యాంశాలు ఉంటాయి. ‘ఈ-కంటెంట్‌’గా ఏకగవాక్షం ద్వారా అందించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద అభ్యసన వనరుగా దాన్ని పేర్కొనవచ్చు. అమెరికా తరవాత భారత్‌లోనే అత్యధికంగా ఆన్‌లైన్‌ విద్యార్థులు ఉన్నారు. 8-12 తరగతుల మధ్య బడి మానేసినవారు, పనిచేస్తూ చదువుకోవాలనుకొనే విద్యార్థులు, వయోజనులు, గృహిణులతో పాటు అదనపు పాఠ్యాంశాల కోసం, తరగతి గదిలో అర్థం కాని పాఠ్యాంశాల కోసం, వివరణల కోసం ఈ వైబ్‌సైట్‌ను వినియోగించుకోవచ్చు. నిష్ణాతులైన సీబీఎస్‌ఈ ఉపాధ్యాయులు, ఐఐటీ, ఐఐఎం, ఎన్‌ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యులతో పాఠాలను రూపొందించి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థి సందేహల నివృత్తి కోసం ‘కాల్‌సెంటర్‌’ను ఏర్పాటు చేయనున్నారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా రాబోయే మూడేళ్లలో మూడు కోట్ల విద్యార్థులకు లబ్ది చేకూర్చే ప్రయత్నం ఇది. ఆన్‌లైన్‌ పరీక్షలో ఉత్తీర్ణులకు ధ్రువీకరణ పత్రాలు/క్రెడిట్స్‌ను ఇస్తారు. రెగ్యులర్‌ విద్యార్థులు ‘స్వయం’ ద్వారా పొందిన క్రెడిట్స్‌ను తమ మాతృ విద్యాలయానికి బదిలీ చేసుకోవడానికి యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తమ అధ్యాపకుల నాణ్యమైన ఆన్‌లైన్‌ పాఠాలు, చర్చావేదికలు, విద్యావ్యయం తగ్గడం, ఉద్యోగ నైపుణ్యాలు పెరగడం, ముఖ్యంగా జీఈఆర్‌లో గణనీయమైన పెరుగుదల లాంటి ప్రయోజనాలు ‘స్వయం’వల్ల కలగనున్నాయి.

స్వయంప్రభ: అంతర్జాలం ద్వారా మాత్రమే కాకుండా టీవీ ప్రసారాల ద్వారా కూడా చదువులు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఆ దిశగా రూపొందిన కార్యక్రమమే ‘స్వయంప్రభ’! ఈ కార్యక్రమం ద్వారా 32 డీటీహెచ్‌ (డైరెక్ట్‌ టు హోం) ఛానళ్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 10 ఇంజినీరింగ్‌, 10 ఇంజినీరింగేతర, నాలుగు ఐఐటీలు, ఎనిమిది పాఠశాల కళాశాల బయటఉన్న విద్యార్థులకు ఉద్దేశించినవి. ప్రత్యక్ష ప్రసారాలు, ముందుగా రికార్డు చేసిన పాఠాలు, ప్రత్యక్ష ప్రసారాలు ఇందులో ఉంటాయి. బోధకుడితో సందేహ నివృత్తి సౌలభ్యం ఉండటం ఇందులో ప్రత్యేకత.
జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం: దేశంలోని డిజిటల్‌ గ్రంథాలయాలను ఉన్నత విద్యాసంస్థలన్నింటికీ ఆన్‌లైన్‌ ద్వారా అనుసంధానం చేస్తారు. 50 లక్షల పుస్తకాలు, 18 వేల ఈ-జర్నల్స్‌ను అందుబాటులో ఉంచనున్నారు.

క్యాంపస్‌ కనెక్ట్‌: ఎన్‌కేఎన్‌ (జాతీయ నాలెడ్జి నెట్‌వర్క్‌) కనెక్టివిటి ద్వారా 1500 పరిశోధన ఉన్నత విద్యా సంస్థలను అనుసంధానం చేయనున్నారు. ఈ సౌకర్యం ఉన్న ఉన్నత విద్యా సంస్థలో 10 జీబీపీఎస్‌ వరకు ఇంట్రా/ఇంటర్‌ నెట్‌ సౌకర్యాలను కల్పిచనున్నారు. ఇప్పటి వరకు 402 ఉన్నత విద్యా సంస్థల అనుసంధానం పూర్తి అయింది. 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో రూ.380 కోట్లతో ‘వైఫై’ సదుపాయం కల్పించారు. ‘నో యువర్‌ కాలేజ్‌’ కార్యక్రమం ద్వారా 40 వేల ఉన్నత విద్యాసంస్థల మౌలిక సదుపాయాలు, కోర్సులు, అధ్యాపకులు వివరాలతో కూడిన డేటాబేస్‌ను అనుసంధానించారు.

ఉన్నత విద్యను అందరికీ అందించడానికి మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేస్తున్న ఈ ప్రయత్నంలో సాంకేతిక పరిజ్ఞానానిదే పైచేయి. భారత్‌లోని మారుమూల ప్రాంతాలకు ఇంకా పూర్తిస్థాయిలో ఇంటర్నెట్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సౌకర్యాలు అందుబాటులోకి రాకపోవడం పెద్ద అడ్డంకి. ఇలాంటి అవరోధాలను అధిగమిస్తేనే ఈ కార్యక్రమాలు విజయవంతమవుతాయి. విద్యార్థుల-ఉపాధ్యాయుల విస్తృత భాగస్వామ్యం ఆశయ సాధనకు కీలకావసరం!

- డాక్టర్‌ ఆడెపు వెంకటరమణ
Posted on 23-08-2016