Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

కశ్మీరీలకు చేరువయ్యేదెలా?

* దీర్ఘకాలిక ప్రణాళికే శరణ్యం
కశ్మీర్‌లో పెట్రేగుతున్న హింసాకాండ గడచిన కొన్ని వారాలుగా పత్రికల పతాక శీర్షికగా మారింది. పరిస్థితిని ఉపశమింపజేసే ప్రయత్నాల్లో భాగంగా స్థానికులతో మాట్లాడేందుకు ఆ రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనకు కారణమిదే. బంగ్లాదేశ్‌, నేపాల్‌, చైనాలతో కూడా భారత్‌ భూ సరిహద్దులు కలిగి ఉంది. కానీ, పాకిస్థాన్‌తో కొనసాగుతున్న సరిహద్దు సంఘర్షణ ప్రత్యేకమైనది. ఈ సంక్షోభం ఏళ్లూ పూళ్లుగా కొనసాగుతోంది. సరిహద్దు సంఘర్షణలో మరణాలు, విధ్వంసకాండను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు- ఇదో సరికొత్త రక్తచరిత్ర! కశ్మీర్‌లో పరిస్థితి విషమించడానికి పలు కారణాలు ఉన్నాయి. అంతర్వాహినుల్లాంటి అంశాలను ప్రభుత్వాలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాయి. విస్పష్టమైన దీర్ఘకాలిక వ్యూహం కొరవడింది. తదుపరి చర్యల జాడలేదు. విధానకర్తల వైఫల్యాలివి. రాజకీయ పార్టీలు సైతం మన్నుతిన్న పాముల్లా వ్యవహరిస్తున్నాయి. ఇదివరకు చేపట్టిన కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాయి. కశ్మీర్‌ అగ్నికి ఇవన్నీ ఆజ్యం పోస్తున్నాయి.

చరిత్ర నేర్పుతున్న పాఠాలు
శ్రీనగర్‌ రాజధానిగా ఉన్న జమ్మూకశ్మీర్‌, ముజఫరాబాద్‌ ముఖ్యపట్టణంగా ఉన్న పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, గిల్గిట్‌ కేంద్రస్థానంగా కలిగిన ఉత్తర ప్రాంతాలు, జింగ్జియాంగ్‌ టిబెట్‌లలోని ప్రదేశాలు కశ్మీర్‌ భూభాగం పరిధిలోకి వస్తాయి. యావత్‌ కశ్మీరీ ప్రాంతం వాస్తవంలో భారత్‌కు చెందిందే కనుక, ఈ మేరకు సమస్య పరిష్కారానికి వీలుగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. సంఘర్షణవల్ల తీవ్రస్థాయి విధ్వంసకాండ, మారణహోమం, ప్రజానీకం నిరాశ్రయులు కావడమే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరదని 1947, 1965, 1971 యుద్ధాలు భారత్‌, పాకిస్థాన్‌లకు తెలియజెప్పాయి. ముస్లిములు సంఖ్యాధిక్యత కలిగిఉన్న ఒక ప్రాంతం కారణంగానే కశ్మీర్‌ సమస్య తలెత్తిందన్నది సరికాదు. కొంతకాలంగా, ముఖ్యంగా 1980ల దరిమిలా కశ్మీర్‌ లోయలో పెద్దయెత్తున ఇస్లామ్‌ విస్తరణ చోటుచేసుకొంది. 1947లో సైతం కశ్మీర్‌ ముస్లిం మెజారిటీ రాష్ట్రమే. కాకపోతే, 1980లలో వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాల పర్యవసానంగా పిడివాదుల సంఖ్య విస్తరించింది. రాజకీయ పరిణామాల విషయానికి వస్తే- 1977లో జమ్మూకశ్మీర్‌లోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవడం, 1987లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పెద్దయెత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దరిమిలా కశ్మీర్‌ లోయలో భారత వ్యతిరేక భావజాలం ప్రబలింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నాక, కశ్మీర్‌కు సంబంధించి భారత్‌ చేపడుతున్న చర్యల్ని షేక్‌ అబ్దుల్లా వ్యతిరేకించసాగారు. 1987 ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాక అబ్దుల్‌ ఘనీ లోన్‌, యాసిన్‌ మాలిక్‌ వంటివారు తిరుగుబాటు బావుటా ఎగరేశారు.

1970ల్లో భారత జాతీయ కాంగ్రెస్‌ మద్దతుతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. దాంతో లోయలో రాజకీయ సుస్థిరత ఏర్పడింది. జిన్నాతో విభేదాల కారణంగా పాక్‌ వ్యతిరేక పంథా అనుసరించిన షేక్‌ అబ్దుల్లా, భారత వ్యతిరేక భావాలను ప్రోత్సహించలేదు. జమాతే ఇస్లామీ వంటి సంస్థల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మతపరమైన విషం కక్కుతున్నారంటూ జమాతే ఇస్లామీపై ఆయన నిషేధం సైతం విధించారు. కశ్మీర్‌ పాకిస్థాన్‌లో చేరాలా అన్న ప్రశ్న ఎదురైనప్పుడు ఆయన తన మనోభావాన్ని కుండ బద్దలుకొట్టారు. మతం ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకోరాదని బహిరంగంగా ప్రకటించారు. 1947లో దేశ విభజన జరిగినప్పుడు పాకిస్థాన్‌లో 2.7 కోట్ల ముస్లిములు ఉంటే, భారత్‌లో నాలుగు కోట్ల ముస్లిములు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో కశ్మీర్‌ విలీనానికి సంబంధించి తమకు ఎలాంటి సమస్యలు లేవని, కశ్మీర్‌కు ఎంతమేరకు స్వయంప్రతిపత్తి కల్పిస్తారన్నదే ముఖ్యమని షేక్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. 1977లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నాక, అదే అబ్దుల్లా భిన్నమైన దారిలో సాగిపోయారు. కశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వ చర్యలమీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాభిప్రాయ సేకరణ జరపాల్సిందేనన్నారు. తమకు స్వాతంత్య్రం ఇవ్వాలనేదాకా వెళ్లారు. కశ్మీర్‌ను బానిస భూభాగంగా పరిగణిస్తున్నానని, అందువల్ల తను మరణించాక తన మృతదేహాన్ని కశ్మీర్‌లో ఖననం చేయరాదనీ వీలునామాలో రాశారంటే, పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
1952 నాటి 370వ రాజ్యాంగ అధికరణ పర్యవసానంగా కశ్మీర్‌ లోయలో సామాజిక, ఆర్థిక వాతావరణంలో గణనీయమైన మార్పు వచ్చింది. సంపన్న కశ్మీరీలకు, సామాన్య కశ్మీరీలకు మధ్య అగాధం మరింత పెరిగింది. ఆ పరిస్థితే నేడు ఇంతటి సంక్షోభానికి కారణమైంది. 370వ అధికరణ ప్రకారం కశ్మీరీలకు అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చారు. ఎన్నో మినహాయింపులు ఇచ్చారు. దురదృష్టవశాత్తు, కశ్మీరీ సంపన్నులకు మాత్రమే ఆ ప్రయోజనాలన్నీ దక్కాయి. రాష్ట్రంలో కశ్మీరీ బదులు ఉర్దూను అధికార భాష చేశారు. ఉర్దూ చదువుకొన్న సంపన్నుల పిల్లలు, ఇతరులను వెనక్కినెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు, నిధులు, పథకాలను కొల్లగొట్టడానికి దాంతో మార్గం సుగమమైంది. తీవ్రస్థాయి అవినీతి, దుష్పరిపాలన కారణంగా ప్రభుత్వానికి ప్రజలు దూరమయ్యారు. కశ్మీర్‌ లోయలో ఆకలి, ఆగ్రహం కట్టలు తెంచుకొన్నాయి. 1987లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌ వంటి స్థానిక పక్షాలను ఓడించి నేషనల్‌ కాన్ఫరెన్స్‌, భారత జాతీయ కాంగ్రెస్‌ కూటమి ఘనవిజయం సాధించింది. ఆ ఎన్నికల్లో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని, అవి బూటకపు ఎన్నికలంటూ విమర్శలు వచ్చాయి. దరిమిలా అబ్దుల్‌ ఘనీలోన్‌, యాసిన్‌ మాలిక్‌, సయ్యద్‌ షహబుద్దీన్‌ వంటి నాయకులు తిరుగుబాటు బాటలో సాగిపోయారు. ఆనాటి కేంద్ర పాలకులు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కశ్మీర్‌ లోయలో రాజకీయ ప్రక్రియను దారి తప్పించారు. తద్వారా దేశానికి దీర్ఘకాలిక తలనొప్పినే మిగిల్చారు.
కశ్మీర్‌లో పిడివాద ఇస్లాం ఏ విధంగా వూడలు తన్నుకొన్నదన్నది ఆసక్తికరం. కశ్మీరీలు శాంతికాముకులు. హిందువులు, ముస్లిములు, సిక్కులు, బౌద్ధులు అక్కడ దశాబ్దాల తరబడి శాంతియుత సహజీవనం సాగించారు. సౌభ్రాతృత్వం కొనసాగించారు. 1980 వరకు సోపోర్‌, అనంతనాగ్‌ వంటి చోట్ల మాత్రమే ఇస్లామిక్‌ ఛాందసవాద ఛాయలు కనిపించాయి. మిగతా కశ్మీర్‌ లోయలో చాలావరకు శాంతి సుహృద్భావాలు, ప్రజాస్వామ్య విలువలే ప్రభాసించాయి. వాస్తవంలో 1980లో షేక్‌ అబ్దుల్లా ప్రభుత్వం 2,500 గ్రామాల పేర్లు మార్చి, ఇస్లామిక్‌ పేర్లు పెట్టడంతోనే కశ్మీర్‌లో ఇస్లామికీకరణ మొదలైంది. కశ్మీర్‌ లోయలో అప్పటికే నిరాశా నిస్పృహల్లో మునిగిపోయిన యువతపై పాకిస్థాన్‌ గాలమేసింది. ‘కశ్మీర్‌ విషాదం’ పేరుతో పెద్దయెత్తున కరపత్రాల ద్వారా విషపూరిత, విద్వేషభరిత ప్రచారం మొదలుపెట్టింది. నిజమైన ముస్లిములుగా మనుగడ సాగించాలంటే షరియాను తు.చ. తప్పకుండా గట్టిగా పాటించాల్సిందేనని, ఈ విషయంలో సహాయపడటానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కశ్మీరీ యువతను పాకిస్థాన్‌ రెచ్చగొట్టింది. సందట్లో సడేమియాల్లా, సౌదీ అరేబియాకు చెందిన ఇస్లామిక్‌ పండితులు కశ్మీర్‌ లోయకు బారులు తీరారు. ఆ ప్రాంతంలో జిహాదీలకు శిక్షణకోసం పెద్దయెత్తున మదర్సాల ఏర్పాటుకు వీలుగా నిధులు ప్రవహింపజేశారు. ఇస్లామ్‌ కోసం పోరాడాలని, దారిలోకి రానివారిని ద్వేషించాలని చిన్నపిల్లలకు సైతం నూరిపోశారు. సమాచార పరిజ్ఞాన విస్తృతి కారణంగా పరిస్థితి మరింత విషమించింది.

సహేతుక అవగాహన అవసరం
కశ్మీరీల జీవన విధానాన్ని, మనస్తత్వాన్ని, మతపరమైన భావజాలాన్ని అర్థం చేసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. కశ్మీర్‌ లోయలో పరిస్థితి దిగజారడానికి అదీ ఒక కారణమే. కశ్మీరీ ఇస్లామ్‌ అన్నది సూఫీ తరహాకు చెందినది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించే ఛాందసవాద ఇస్లామ్‌కు అది భిన్నమైనది. వాస్తవంలో కశ్మీరీ ఇస్లామ్‌ మీద హిందూ వేదాంత ప్రభావం ఉంది. కేంద్రంలోని పాలకులు దానిమీద అధ్యయనం జరపలేదు, దాన్ని ప్రోత్సహించనూ లేదు. వారు అలా చేసి ఉంటే, కశ్మీరీలు విభిన్న మతవర్గంగా ప్రత్యేకత సాధించి ఉండేవారు. ఆ దిశలో ప్రయత్నాలు కొరవడ్డాయి. దాంతో పిడివాద, ఛాందసవాద ఇస్లామ్‌ క్రమంగా లోయలోకి అడుగుమోపింది. యువత దాని ప్రభావానికి లోనయ్యారు. కశ్మీర్‌ను చేజిక్కించుకోవడం అసాధ్యమని పాకిస్థాన్‌కు తెలుసు. అయినప్పటికీ వివిధ వేదికల మీద కశ్మీర్‌ సమస్యను అది ఏదో ఒక రూపంలో లేవదీస్తూనే ఉంది. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ 1990లో దిల్లీలో పర్యటించారు. అప్పటి భారత ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీతో ప్రైవేటు సంభాషణ సందర్భంగా ‘కశ్మీర్‌కో హమ్‌ నహీ లే సక్తే అవుర్‌ ఆప్‌ నహీ దే సక్తే హై’ (కశ్మీర్‌ను మేము తీసుకోలేం, మీరు ఇవ్వలేరు) అని అన్నారు. అదే నిజం. అయినప్పటికీ పాక్‌ దుష్ప్రచారం మానుకోలేదు. దూకుడు ఆపలేదు.
కశ్మీర్‌ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించగలిగితేనే ఈ సమస్యను పరిష్కరించడానికి వీలవుతుంది. స్థానిక ప్రజానీకం క్రియాశీల భాగస్వామ్యంతో తప్ప బయటి శక్తుల ద్వారానో, బలప్రయోగంతోనో దాన్ని పరిష్కరించలేం. ఇది ప్రపంచీకరణ యుగం. భౌతిక ప్రయోజనాలు, గరిష్ఠస్థాయి లాభాలే ప్రాతిపదికగా సమస్యకు పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది. సంఘర్షణకు ముగింపు పలకవలసి వస్తుంది. కేంద్రంలో ప్రభుత్వాలు మారవచ్చు. రాజకీయ నాయకత్వాల్లోనూ మార్పు రావచ్చు. అవేవీ అడ్డంకులు కారాదు. నిర్దిష్ట కాలావధి, విస్పష్ట లక్ష్యం ఏర్పరచుకొని, దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా ముందుకు సాగితేనే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యం. ఇదే అన్నింటికన్నా ముఖ్యం.

- కె.సి.రెడ్డి(రచయిత- ఐక్యరాజ్యసమితి మాజీ ముఖ్య భద్రతా సలహాదారు)
Posted on 02-09-2016