Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

రావణకాష్ఠం రాజేసిందెవరు?

* కశ్మీర్‌ కల్లోలం వెనక...
కశ్మీర్‌ సమస్యకు సంబంధించి భారత వైమానిక దళ అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. నీతి సూత్రాలు, నైతిక ప్రమాణాలను పట్టుకొని పాకులాడుతూ సమస్య పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన భారతదేశం, ఆ పనిచేయకుండా అప్పట్లో సైనిక పరిష్కారానికి సిద్ధపడి ఉంటే ఇప్పుడీ తలపోటు తప్పేదన్న ఆయన ప్రకటన- ఆషామాషీగా తీసుకోదగ్గది కాదు. కశ్మీర్‌ విషయంలో వైమానిక దళ అధిపతి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం అనూహ్యం, అసాధారణం. ఆయన మాటల్లో తీవ్ర ఆవేదన, ఆక్రోశం వెల్లడయ్యాయి. ఆయన చెప్పిన దాని ప్రకారం- 1947లో దేశవిభజన జరిగిన వెంటనే పాకిస్థాన్‌ దుస్సాహసానికి తెగబడింది. కశ్మీర్‌లోకి తన మూకల్ని పంపింది. పెద్దస్థాయిలో చొరబాటుకు పూనుకొంది. ఆనాటి భారత ప్రభుత్వం ఆ దురాగతాన్ని, దుర్మార్గాన్ని, దురాక్రమణను దీటుగా ఎదుర్కొనలేకపోయింది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ఆచరణాత్మకంగా వ్యవహరించలేకపోయింది. దాంతో కశ్మీర్‌కు సంబంధించి ఎంతో భూభాగం పాక్‌ హస్తగతమైంది. అదే పాక్‌ దురాక్రమిత కశ్మీర్‌. నేడదే పంటి కింది రాయిగా మారింది. కంటకప్రాయంగా తయారై, కంటికి కునుకు లేకుండా చేస్తోంది. కశ్మీర్‌ విషయంలో ఆనాడు భారత్‌ మెతగ్గా వ్యవహరించిందనేది నిస్సందేహం. ఐక్యరాజ్య సమితి, అలీనోద్యమ సంవిధానాలు; పంచశీల సిద్ధాంతాలకు అనుగుణంగా భారత విదేశాంగ విధానానికి రూపకల్పన చేశారు. ఉన్నత ఆదర్శాలకు కట్టుబడ్డారు. కానీ, భద్రత పరమైన అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఆచరణాత్మకంగా వ్యవహరించలేకపోయారు. పరిస్థితుల్ని సానుకూలపరచుకునేందుకు సైన్యానికి కీలకపాత్ర అప్పగించాల్సి ఉన్నా, ఆ వాస్తవాన్ని విస్మరించారు.

కొనితెచ్చుకున్న సంక్షోభం
కశ్మీర్‌కు సంబంధించి 1947 అక్టోబరులో చోటుచేసుకొన్న పరిణామాలను వైమానిక దళ అధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అరూప్‌ రాహ ప్రస్తావించారు. ఆయన చెప్పినదాన్ని బట్టి- ఆనాటి కీలక సమయంలో సైనిక దళాలను, సామగ్రిని కశ్మీర్‌ లోయకు తరలించడానికి భారత వైమానిక దళాన్ని రంగంలోకి దించారు. సైనిక చర్య చేపట్టేందుకు వాతావరణం అనుకూలంగానే ఉన్నా, ప్రభుత్వం వెనకాడింది. సమస్యకు శాంతియుత పరిష్కారం సాధించేందుకు తోడ్పడవలసిందిగా కోరుతూ ఐక్యరాజ్య సమితి తలుపు తట్టింది. ఆ పరిష్కారం నేటికీ కనుచూపు మేరలో కనిపించడంలేదు. సమస్య రావణకాష్ఠమై రగులుతూనే ఉంది. 70 ఏళ్లుగా జాతిని వేధిస్తున్న ఈ సమస్యకు మూలకారణం ఆనాటి రాజకీయ నాయకత్వం తీసుకొన్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలే. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వ్యాఖ్యల సారాంశమిదే.
దేశానికి స్వాతంత్య్రం లభించిన అనతికాలంలోనే ఈ సమస్య ఉత్పన్నమైంది. దేశ విభజన దరిమిలా భారత్‌లోకాని, పాకిస్థాన్‌లోకాని చేరే అవకాశాన్ని స్వదేశీ సంస్థానాలకు ఇచ్చారు. జమ్మూ కశ్మీర్‌ మహారాజు హరిసింగ్‌ మాత్రం భిన్నమైన ఆలోచన చేశారు. ఏ దేశంలోనూ చేరకుండా తన రాజ్యం స్వతంత్రంగా ఉండిపోతే మేలనుకున్నారు. కానీ, దానిపై గట్టి నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు. గోడమీది పిల్లి వాటాన్ని అనుసరించసాగారు. అదే అదనుగా పాక్‌ దండయాత్రకు పూనుకొంది. బలవంతంగా జమ్మూ కశ్మీర్‌ను ఆక్రమించుకొనే ఉద్దేశంతో 1947 అక్టోబరులో వేలాది సాయుధ గిరిజనులను సరిహద్దులు దాటించింది. పాకిస్థానీ సైనికుల సారథ్యంలో ఆ గిరిజనులు తొలుత ముజఫరాబాద్‌ మీద, తరవాత ఇతర ప్రాంతాలపైనా దాడులకు తెగబడ్డారు. జమ్మూ కశ్మీర్‌లోని భూభాగాన్ని కబ్జా చేశారు. ముస్లిములు, డోగ్రాలతో కూడుకొన్న జమ్మూ కశ్మీర్‌ సైన్యాన్ని రంగంలోకి దించినప్పటికీ, అంతర్గత తిరుగుబాట్లతో అట్టుడికిన ఆ సైన్యం రాష్ట్ర సరిహద్దులను కాపాడలేకపోయింది. బ్రిగేడియర్‌ రాజీందర్‌ సింగ్‌ నాయకత్వంలోని జమ్మూ కశ్మీర్‌ సైన్యం, యూరిలో రెండు రోజుల పాటు తీవ్ర ప్రతిఘటన కొనసాగించగలిగింది. కానీ, అది ఎదురు నిలవలేకపోయింది. దాంతో రెచ్చిపోయిన దురాక్రమణదారులు బారాముల్లాను స్వాధీనపరచుకోవడమే కాకుండా శ్రీనగర్‌ శివార్ల దాకా చేరుకొన్నారు. శ్రీనగర్‌కు విద్యుత్‌ సరఫరాను సైతం నిలిపివేశారు.
తన నిర్ణయ రాహిత్యం ఎంతటి అనర్థానికి దారితీస్తోందో కొద్దిరోజుల్లోనే మహారాజా హరిసింగ్‌కు అర్థమైంది. భయాందోళనలతో ఆయన, ఆదుకోవలసిందిగా భారత దళాలకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి చోటుచేసుకొంటున్న పరిణామాలు భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తాయని తెలిసినప్పటికీ- భారత్‌లో విలీనమైతే తప్ప ఆ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రభుత్వం అభిప్రాయపడింది. చివరకు 1947 అక్టోబరు 26న విలీన ఒప్పందంపై మహారాజా సంతకం చేశారు. భారత ప్రభుత్వం ఆ మరుసటి రోజు, అక్టోబరు 27 తెల్లవారుజాము నుంచే వైమానిక దళ విమానాల ద్వారా సైనిక దళాలను భారీయెత్తున శ్రీనగర్‌కు తరలించింది. ఆనాటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ చొరవ, చురుకుదనం, దృఢవైఖరి కారణంగానే భారతీయ సైన్యం రెప్పపాటులో శ్రీనగర్‌ చేరుకోగలిగింది. పక్షం రోజుల వ్యవధిలోనే భారత సైనిక దళాలు బారాముల్లా, యూరి పర్వత ప్రాంతాలను స్వాధీనపరచుకోగలిగాయి.
భారత సైనిక దళాలు దూకుడుగా దూసుకెళుతున్న ఆ సమయంలోనే ప్రధానమంత్రి నెహ్రూ తప్పుడు నిర్ణయం తీసుకొన్నారు. సర్దార్‌ పటేల్‌ వారిస్తున్నా వినకుండా, 1948 జనవరి ఒకటిన పాక్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతామండలికి ఫిర్యాదు చేశారు. పాకిస్థాన్‌ చొరబాట్లను ప్రోత్సహిస్తున్న విషయాన్ని ఐరాస దృష్టికి భారత్‌ తీసుకెళ్లింది. పాక్‌ దాన్ని ఖండించింది. ఉభయదేశాల వాదాల్లో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి నిర్ణయించింది. తనకు సంబంధం లేదని, తన ప్రమేయం అవాస్తవమని పదేపదే ఖండిస్తూ వచ్చిన పాకిస్థాన్‌, చివరకు తన పాత్రను అంగీకరించింది. కశ్మీర్‌ దురాక్రమణ యత్నాల్లో తన సైనిక దళాలు పాలుపంచుకొన్నట్లు ఒప్పుకొంది. దాంతో, దురాక్రమిత ప్రాంతాల నుంచి పాకిస్థాన్‌ వైదొలగాలని, ఆపై కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి కమిషన్‌ ఒక తీర్మానం ఆమోదించింది.
ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించడానికి ముందు, 1947 డిసెంబరు ఎనిమిదిన నెహ్రూ లాహోర్‌ వెళ్లారు. కశ్మీర్‌ నుంచి వైదొలగవలసిందిగా పాకిస్థానీ చొరబాటుదారులకు విజ్ఞప్తి చేయాలని, తద్వారా ఉద్రిక్తతల ఉపశమనానికి చర్యలు ప్రారంభించాలని పాక్‌ ప్రధానమంత్రి లియాఖత్‌ అలీఖాన్‌ను ఆయన కోరారు. అప్పట్లో రాష్ట్రాల మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేసిన వి.పి.మీనన్‌ వెల్లడించిన దాని ప్రకారం- నెహ్రూ విజ్ఞాపనపై ఖాన్‌ అశక్తత వ్యక్తపరచారు. తనది స్థిరత్వంలేని ప్రభుత్వమని, ఆజాద్‌ కశ్మీర్‌ ఉద్యమానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడం లేదంటూ తన సర్కారు మీద మీడియా విరుచుకుపడుతోందని నెహ్రూకు ఆనాడు లియాఖత్‌ అలీఖాన్‌ తెలిపారు. ఆ సమయంలో చొరబాటుదారులకు అలాంటి విజ్ఞప్తి చేస్తే, పిడివాదానికి మరింతగా పదును పెడుతున్న మరో రాజకీయ పక్షం తన ప్రభుత్వాన్ని కూలదోసే ప్రమాదం ఉందన్నారు. అందుకు బదులు- భారతదేశమే తన సైనిక దళాలను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రానికి నిష్పక్ష పాలకుణ్ని నియమించాలని ఆయన నెహ్రూకు సూచించారు. చేసేదేమీ లేక వట్టి చేతులతో తిరిగివచ్చిన నెహ్రూ, ఆ తరవాతే ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయంవల్ల భారతదేశ ప్రయోజనాలు రెండు విధాలుగా దెబ్బతిన్నాయి. ఒకటి- కశ్మీర్‌ అంతర్జాతీయ వివాదంగా మారిపోయింది. రెండు- చొరబాటుదారులను పూర్తిగా తరిమికొట్టకుండా భారత సైనిక దళాలను అడ్డుకొన్నట్లయింది. లక్ష్యాన్ని పూర్తిచేయడానికి సైన్యానికి మరికొద్ది రోజులే అవసరమైన సమయంలో కాల్పుల విరమణ ప్రకటించారు. తన పని కానిచ్చేందుకు సైన్యానికి అవకాశం ఇచ్చిఉంటే- చొరబాటుదారులను సరిహద్దుల అవతలకు తరిమికొట్టడమే కాకుండా కశ్మీర్‌ భూభాగాన్ని పూర్తిస్థాయిలో కాపాడుకొనేందుకు వీలయ్యేది. అనాలోచితంగా, హడావుడిగా ఐక్యరాజ్య సమితి తలుపుతట్టడంతో భారతదేశం అత్యంత బలహీనమైనదని, దురాక్రమణదారులను పాలదోలడానికి సైతం మూడో పక్షం సహాయం దానికి అవసరమవుతోందన్న అభిప్రాయం ప్రబలింది. భారత్‌ అనిశ్చిత ధోరణివల్ల ఒక కమిషన్‌ను ఐక్యరాజ్య సమితి ఏర్పాటుచేసింది. కాల్పుల విరమణను సజావుగా అమలుచేయడానికి సరిహద్దుల వెంబడి తన పర్యవేక్షకులను నియమించింది. అమెరికా తదితర పశ్చిమ దేశాలు భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి దాంతో ఆస్కారం ఏర్పడింది.

వెలికిరాని నిజాలెన్నో...
1947 చివరి మూడు నెలల్లో చోటుచేసుకొన్న పరిణామాల గురించి తెలిసినవారికి కశ్మీర్‌ ముక్కలుచెక్కలైన వైనం, ఆక్రమిత కశ్మీర్‌ భారత్‌కు కొరకరాని కొయ్యగా తయారైన తీరుతెన్నుల మీద అవగాహన ఉంటుంది. స్వాతంత్య్రం లభించిన రోజు నుంచే కశ్మీర్‌ విషయంలో ఎదురవుతున్న చేదు అనుభవాలు; ఈ సమస్యను పరిష్కరించే పేరుతో దేశ వ్యూహాత్మక ప్రయోజనాలపై రాజీపడటంపై తన ఆందోళన, ఆవేదనలనే ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వ్యక్తపరచారు. భారత్‌ ఒక ప్రజాస్వామ్య దేశంగా 70 ఏళ్ల అనుభవం గడించింది. అయినప్పటికీ నెహ్రూ జమానాలో పాతిపెట్టిన ఎన్నో నిజాలను ఇంకా వెలికితీయలేకపోతున్నాం. ఏడు దశాబ్దాల క్రితం తీసుకొన్న తప్పుడు నిర్ణయాల దుష్ఫలితాన్నే దేశం యావత్తూ నేడు అనుభవించాల్సి వస్తోందన్న ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వ్యాఖ్యలు పలువురిని విస్మయపరచడానికి కారణమిదే. భద్రత, సైనిక సంబంధ వ్యవహారాల్లో నిజాలు, నిజాయతీల వల్లే దేశ ప్రయోజనాలు నెరవేరతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా తన మనోగతాన్ని బయటపెట్టినందుకు వైమానిక దళ అధిపతి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ రాహ అభినందనీయులు!

Posted on 13-09-2016