Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

దోమల దండు యాత్ర!

‘దోమలపై పరిశోధనకు అనువైన దేశం భారత్‌’ అని సర్‌ రొనాల్డ్‌ రాస్‌ ప్రకటించి ఇప్పటికి నూట పాతికేళ్లు! మలేరియా వంటి వ్యాధులకు కారణమయ్యే దోమల గురించి శాస్త్రీయ పరిశోధన సాగించి, నోబెల్‌ పురస్కారం సాధించిన శాస్త్రవేత్త ఆయన. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌’ ఉన్నతాధికారిగానూ పనిచేసిన రాస్‌ దృష్టిలో- దోమల నిర్మూలన అసాధ్యం కాదు. ప్రభుత్వం, పౌరసమాజం తమ వంతు బాధ్యతల్ని సమర్థంగా నిర్వహిస్తే; దోమల సంతును మట్టుపెట్టడం ద్వారా ఏ దేశమైనా వ్యాధి విముక్తం కావచ్చు. మనదేశంతో పాటు ప్రపంచంలోని 122 దేశాల్లో దాదాపు 362 కోట్లమందికి మలేరియాతో పాటు డెంగీ, స్వైన్‌ఫ్లూ వ్యాధుల పెనుముప్పు పొంచి ఉంది. వీటి వల్ల ప్రజలకు ఆరోగ్యపరంగా, ప్రభుత్వాలకు ఆర్థికంగా కలిగే కష్టనష్టాలు అపారం. పరిస్థితి తీవ్రతను బట్టి సకాల చర్యలు చేపట్టి, దోమల్ని నిర్మూలించిన దేశాలు మన పొరుగునే ఉన్నాయి. అదే ఇండియాలో- బహుకొద్ది ప్రాంతాలు తప్ప, దాదాపు అన్ని రాష్ట్రాల్నీ దోమకాటు పీడిస్తోంది. నీరు నిల్వ ఉండే చెరువులు, మురుగునీటి కాలువలు; వ్యర్థాలు, ఇతరత్రా చెత్తాచెదారం పోగుపడిన ప్రాంతాలన్నీ దోమలకు మూలకేంద్రాలు. వాటిని సంహరించాలంటే ‘స్వచ్ఛ భారత్‌’ స్ఫూర్తిగా వైద్య ఆరోగ్య శాఖతో పాటు పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేమం, గ్రామీణ నీటిపారుదల వంటి ఎనిమిది ప్రభుత్వ విభాగాలు యుద్ధప్రాతిపదికన పనిచేయాలి. వూరూవాడా దోమల మందు చల్లే కార్యక్రమం వర్షకాలానికి ముందుగానే పూర్తికావాలి. జులై దాటినా ఎవరికీ ఏదీ పట్టడం లేదంటే, ఇది నేరపూరిత నిర్లక్ష్యం కాక మరేమిటి?

ముందస్తు చర్యలేవీ?
మూడు రకాల దోమల కారణంగా, మలేరియా సహా ఆరు ప్రాణాంతక వ్యాధులు దాపురిస్తున్నాయి. ఏడాది వ్యవధిలోనే ప్రపంచదేశాల్లో 4.3 లక్షలమంది; మనదేశంలో పాతికవేల మందికిపైగా మలేరియాతో ప్రాణాలు కోల్పోయారు. దేశదేశాల్లో గరిష్ఠంగా పది కోట్లమంది డెంగీతో తల్లడిల్లుతున్నారని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడించింది. భారత్‌కు సంబంధించి, డెంగీ వ్యాధి కేసులు ఏడేళ్లలో మూడు రెట్లు పెరిగాయని సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది. దేశంలో ఏటా కనీసం లక్షమందిని బాధించే సాధారణ ఫ్లూతో పోల్చి చూసినప్పుడు, స్వైన్‌ఫ్లూ తాకిడి పదింతలు పైగా ఉంటుందని భారతీయ వైద్యమండలి నిర్థారించింది. లిక్విడ్‌, కాయిల్స్‌ వంటి నివారణ సాధనాలకు దోమలు అంత తొందరగా లొంగవని వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయం, కాలిఫోర్నియా సాంకేతిక విద్యాసంస్థ సంయుక్త పరిశోధనలో తేలింది. కేవలం డీడీటీ వంటి క్రిమిసంహారక మందులు చల్లడం, పొగమందు పిచికారీ (ఫాగింగ్‌)తోనే పరిస్థితి పూర్తిగా అదుపులోకి రాదనీ స్పష్టమైంది. హైదరాబాద్‌ వేదికగా గతంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు- దోమకాటుకు సంబంధించిన ప్లాస్మోడియా వైరస్‌ వ్యాప్తిపై చర్చించింది. దాన్ని అంతరింపజేసే మందును కనుగొనేంతవరకు, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వాలు ఇతర విధానాలు పాటించాలనీ సూచించింది. అటువంటి సలహాల్ని ఏళ్లతరబడి పెడచెవిన పెట్టిన ఫలితమే ఇదంతా! సాధారణ మందులకు లొంగని వైరస్‌- కాలం, ప్రాంతం, వాతావరణాలతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు వ్యాపిస్తోంది. వ్యాధినిరోధక శక్తి లేనివారిపై మళ్ళీమళ్ళీ విరుచుకుపడి చివరికి ఉసురుతీస్తోంది. డెంగీ సంపూర్ణ నివారణకు ఉపకరించే టీకా లేదా ఔషధం ఇప్పటివరకు లేదు. ఈ పరిస్థితుల్లో ముందస్తు చర్యలపై దృష్టిపెట్టాలని, దేశంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం డెంగీ కేసుల వివరాలు నమోదుచేయాలని ఇదివరకే అన్ని రాష్ట్రాలనూ కేంద్రప్రభుత్వం ఆదేశించింది. అప్పట్లోనే స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడినా, ఆ మేరకు పనులు ఇప్పటికీ కాకపోవడం పలు రాష్ట్రాల క్రియారాహిత్యానికి సూచిక.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో దాదాపు 2,500 ఉన్నప్పటికీ; నానా రకాల కొరతలు వాటి ‘అస్వస్థత’కు కారణమవుతున్నాయి. అంటురోగాలతో వూళ్లకు వూళ్లే మంచంపట్టినా పట్టించుకొన్న నాథుడంటూ లేడు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది కొరత, ఔషధాలకు కటకట, సంబంధిత శాఖల మధ్య సమన్వయ లేమి... ఇన్ని సమస్యల మధ్య ప్రజారోగ్య పరిరక్షణ ఇంకెక్కడ? అక్షరజ్ఞానంలో ముందుండే కేరళ ఆరోగ్య రంగంలో అట్టడుగుకు చేరింది. ఆ రాష్ట్రాన్ని డెంగీ పట్టిపీడించినా, మరికొన్ని వ్యాధులు-బాధలతో వేలాది ప్రజలు అల్లాడినా దిక్కూమొక్కూ లేకపోయింది. ఒడిశా, పశ్చిమ్‌ బంగ, కర్ణాటక, మహారాష్ట్ర, మరెన్నో రాష్ట్రాల్లో దోమల ‘దండు యాత్రలు’ అనేక కుటుంబాల్లో శోకాగ్నులు రగిలించాయి. నగరాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం సరిగ్గా రెండేళ్ల క్రితం నిర్వహించిన సమగ్ర అధ్యయనం, దేశవ్యాప్తంగా 470పైగా నగరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో వెల్లడించింది. పరిస్థితి అంత దుర్భరంగా ఉంటే, దోమల దండు వూళ్లమీద పడక ఏం చేస్తాయి? వైరస్‌ పీడిత వ్యక్తి నుంచి శరవేగంతో ఇతరులకు వ్యాపించే స్వైన్‌ఫ్లూకు సంబంధించీ, వివిధ రాష్ట్రాల అధికార యంత్రాంగాల్లో ఎటువంటి స్పందనా లేదు. ప్రచార పటాటోపమే కానీ, ప్రత్యేక వైద్యశిబిరాల ఏర్పాటు ఎక్కడా కనిపించలేదు. బాధితులకు ఉచితంగా అందాల్సిన ఔషధాలు కొన్ని బడా వైద్యశాలల పుణ్యమా అని రెక్కలొచ్చి ఎగిరిపోయాయి! ఇటువంటి వైఫల్యాల, లోటుపాట్ల తాకిడితో నిరంతరం సతమతమవుతున్న భారత్‌- సాటి దేశాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి.
గతేడాది ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారం, పదిహేనేళ్లలో పదిహేడు దేశాలు మలేరియా నుంచి విముక్తమయ్యాయి. శ్రీలంక నిరుడే మలేరియా రహిత దేశంగా గుర్తింపు సాధించింది. అంతకుముందు సంవత్సరమే ఆ రికార్డును మాల్దీవులు సృష్టించింది. చైనా మరో మూడేళ్లకల్లా మలేరియాను పూర్తిగా తుడిచిపెడతానంటోంది. నేపాల్‌, భూటాన్‌ దేశాలూ ఆ బాటలోనే సాగుతామంటున్నాయి. ఇండియాతో పోలిస్తే, హంగరీ వంటి చిన్నదేశాలే ఎప్పుడో 45 ఏళ్ల క్రితమే మలేరియా కోరల నుంచి బయటపడ్డాయి. దోమల సంహారాన్ని ఓ ప్రజాఉద్యమంగా చేపట్టి ముందడుగు వేసింది క్యూబా. దోమలపై సమరం దరిమిలా మూడేళ్లుగా ఒక్క మలేరియా కేసైనా శ్రీలంకలో నమోదు కాలేదంటే, అక్కడి ప్రభుత్వం తీసుకున్న అనేక జాగ్రత్తలే కారణం. బాధితులకు మరెంతో ఉపకరించేలా విరివిగా ఆరోగ్య శిబిరాల్ని ఆ దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తాయి. ప్రధానంగా అందువల్లనే, 2000లో రెండు లక్షలకు పైగా ఉన్న మలేరియా కేసులు 12 ఏళ్ల తరవాత సున్నాకు చేరాయి. సంచార వైద్యకేంద్రాలు, సత్వర చికిత్సకు ఏర్పాట్లు, ఆరోగ్యవిద్యను విస్తరించే కృషి; వీటన్నింటికీ మించి ప్రభుత్వ నిబద్ధత, స్వచ్ఛంద సేవాసంస్థల సంపూర్ణ భాగస్వామ్యం శ్రీలంకను వ్యాధిరహితం చేశాయి. దోమల నిర్మూలనలో భాగంగా వినియోగించే డీడీటీ వంటి క్రిమిసంహారకాలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం కనబరుస్తున్నాయని ఆ దేశం నాలుగు దశాబ్దాలనాడే గ్రహించింది. ప్రత్యామ్నాయంగా మలాథియాన్‌ వంటి మందులపై చూపు సారించి అప్పట్లోనే సాంకేతిక విజ్ఞత చాటింది. శ్రీలంక 1990 ప్రాంతాల్లో ఒకేసారి రెండు భీకర యుద్ధాలు సాగించింది. రాజకీయంగా ‘లిబరేషన్‌ టైగర్ల’తో ఒకవైపు, ఆరోగ్య రంగంలో దోమకాటుపై మరోవైపు పోరాడి నెగ్గింది. రసాయనిక పూత కలిగిన వలల్ని కార్యకర్తల ద్వారా ఇంటింటికీ అందజేశారు. ఇటువంటి వివిధ చర్యల ఫలితమే- ఆ దేశంలో దోమల నిర్మూలన!

చిన్న దేశాల్ని చూసైనా...
ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా పేరొందిన మాల్దీవులది అక్షరాలా మరో ఘనచరిత్ర! ఆదాయ మూలాల్ని దెబ్బతీసేలా, ప్రజారోగ్యాన్ని హరించేలా దాపురించిన దోమకాటును ఆ దేశం ఎంతో దీటుగా ఎదుర్కొంది. వేలాది సుశిక్షత కార్యకర్తల్ని రంగంలోకి దించి, దోమల నిర్మూలన పనులు కొనసాగించి, అన్ని దేశాల కంటే ముందే వ్యాధి విముక్తమైంది. భూటాన్‌- ఇళ్ల వద్ద, పొలాల సమీపంలో, నీటి నిల్వ ప్రాంతాల చుట్టుపక్కల లార్వా నివారణ మందుల్ని అడుగడుగునా పిచికారి చేయించి దోమ సంతతిని అంతరింపజేస్తోంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే ఈ తరుణంలో, మే మొదలు అక్టోబరు వరకు ఆరునెలలూ అక్కడ దోమల సంపూర్ణ నిర్మూలన కొనసాగుతుంది. దోమకాటు వ్యాధుల కారణంగా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్‌పై పడుతున్న ఆర్థిక భారం ఇంతా అంతా కాదు. ఆ మొత్తం ఏటా మలేరియాకు సంబంధించి రూ.11,642 కోట్లు, డెంగీ విషయంలో అది రూ.6,020 కోట్లు.
తామరతంపరగా దోమలు పుట్టుకొచ్చే ప్రాంతాల్ని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా కనిపెట్టాలన్న నిపుణుల ప్రతిపాదన నేటికీ ప్రభుత్వ దస్త్రాల్లో మగ్గుతోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సేవల్ని వినియోగించుకోవడం ఇకనైనా సాకారం కావాలి. నిధులు గుమ్మరిస్తే తప్ప దోమల నిర్మూలన సాధ్యపడదన్నదీ సరైనది కాదు. ఇళ్ల లోపల, వెలుపల ప్రజలు తీసుకొనే జాగ్రత్తలే దోమల పనిపడతాయి. కొన్ని రకాల మొక్కల్ని పెంచితే, వాటి వాసనకు దోమలు ఆ పరిసరాలకైనా రావు. వేప, కొబ్బరి, నిమ్మ, యూకలిప్టస్‌ నూనెల వాడకం దోమల్ని దరి చేరనివ్వవని శాస్త్రపరిశోధనలు రుజువు చేస్తున్నాయి. చెరువుల్లోకి గంబూషియా చేపల్ని వదిలితే, లార్వా దశలోని దోమల్ని మటుమాయం చేస్తాయి. సెప్టిక్‌ ట్యాంకులకు గల పైపుల పైభాగంలో చిన్నపాటి వలలు బిగిస్తే, అంతకు మించిన దోమల విరుగుడు మరొకటి ఉండదు. కోడి ఈకలను రసాయనాలతో కలుపుతూ ‘స్వీట్‌ కేకు’ను కర్ణాటకలోని మణిపాల్‌ విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థులు ఈమధ్య రూపొందించారు. ఆ పదార్థం దోమల లార్వాను గణనీయంగా నియంత్రిస్తుందని చెబుతున్నారు. ఇలా అన్ని వైపులా, అనేక మార్గాల్లో ప్రభుత్వం, పౌరసమాజం జాగ్రత్తలు తీసుకుంటే; గట్టి చర్యలు చేపడితే దోమల నిర్మూలన కష్టతరమేమీ కాదు!

- జంధ్యాల శరత్‌బాబు
Posted on 03-08-2017