Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఆదర్శ గ్రామాలే ఆశాజ్యోతులు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన వినూత్న పథకాల్లో సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన ఒకటి. పల్లెల సర్వతోముఖ వికాసానికి దోహదం చేసే ఈ పథకం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికింద ప్రతి పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలోని కనీసం ఒక గ్రామాన్ని 2016నాటికి ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయాలి. ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం ముగిసేసరికి- అంటే 2019నాటికి మరో రెండు గ్రామాలను అభివృద్ధి పరచాలి. ఆ లెక్కన ప్రతి ఎంపీ తలా మూడు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి. పార్లమెంటు ఉభయసభల్లోని 793మంది సభ్యులూ కలిసి దాదాపు 2,400 ఆదర్శ గ్రామాలను అభివృద్ధి చేయాలన్న మాట. ఆదర్శ గ్రామాలు మనకు బొత్తిగా కొత్త కావు. గతంలోనూ అనేక స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు)- నిరుపేద గ్రామాలను వికాస పథంలోకి తీసుకువచ్చాయి. అద్గావ్‌, దేవ్‌ పింపల్‌ గావ్‌, రాలేగాం సిద్ధి, హివారె బజార్‌(మహారాష్ట్ర), శాంతిపుర (కర్ణాటక) వీటిలో కొన్ని. సమగ్ర భాగస్వామ్య వాటర్‌షెడ్‌ అభివృద్ధి పథకం కింద కలబురగి (గుల్బర్గా-కర్ణాటక), సుఖోమజ్రి (హర్యానా), అంకాపూర్‌ (తెలంగాణ) వంటి గ్రామాలూ స్ఫూర్తిదాయకంగా అభివృద్ధి చెందాయి. వాటర్‌షెడ్‌ అభివృద్ధి ప్రాజెక్టుల కింద ఈ గ్రామాల్లో బయోగ్యాస్‌ ప్లాంట్ల వంటి పునరుత్పాదక ఇంధన సౌకర్యాలనూ ఎన్జీవోలు ఏర్పాటు చేశాయి. ఈ ప్రజా కేంద్రిత పథకాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడమే కాదు, భూగర్భ జలమట్టాలను పెంచి, పొరుగు గ్రామాలకూ లబ్ధి చేకూర్చాయి.

సమష్టి కృషితోనే అభివృద్ధి

సృజనాత్మకత, నవీకరణలు అభివృద్ధి ప్రక్రియను కొత్త అంచెలకు తీసుకెళతాయని చాటే ఉదాహరణలు మరికొన్ని ఉన్నాయి. ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని పాలమౌ జిల్లాలో చక్రీయ వికాస్‌ ప్రణాళిక కింద రైతులు తమ భూములను సమీకరించి సమష్టి వ్యవసాయ అభివృద్ధి క్షేత్రాలుగా మార్చుకొని ఘన విజయాలు సాధించారు. ఇలాంటి మరో పథకం- వాడి నమూనా! ఇందులో గ్రామాన్ని కాకుండా కుటుంబాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. తొమ్మిది రాష్ట్రాల్లో 1,60,000మంది రైతులు 65,000హెక్టార్లలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా భూముల్లో సేద్యం, ఉద్యాన పంటలు, అడవుల పెంపకం చేపడుతున్నారు. ఈ 'నాబార్డ్‌' ప్రాయోజిత కార్యక్రమం స్థానిక ప్రజల చురుకైన భాగస్వామ్యంవల్ల విజయవంతమైంది.

తెలంగాణలోని వరంగల్‌కు 20కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగదేవిపల్లి గ్రామం గురించి పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. బాల వికాస సామాజిక సేవాసంఘం అనే స్వచ్ఛంద సంస్థ స్థానిక ప్రజలతో కలిసి గంగదేవిపల్లి ప్రయోగాన్ని విజయవంతం చేసింది. 13వేల జనాభాగల ఈ గ్రామం సంపూర్ణ అక్షరాస్యత సాధించింది. ఇతర మానవాభివృద్ధి సూచీల్లో ఎంతో ముందడుగు వేసింది. గ్రామంలోని మొత్తం 24కమిటీలు అక్షరాస్యత, ఆరోగ్యం, తాగునీరు, పారిశుద్ధ్య కల్పనతోపాటు కేబుల్‌ టెలివిజన్‌ ప్రసారాలనూ నిర్వహిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ కమిటీలు గంగదేవిపల్లిని ఆదర్శ గ్రామంగా మార్చుకున్నాయి. కమిటీ సభ్యులు ఇతర ప్రాంతాల్లో సభలు, గోష్టులకు వెళ్లి తమ అనుభవాలు వివరిస్తూ, మార్గదర్శకంగా నిలుస్తున్నారు. ఈ గ్రామం తెలుగు, ఆంగ్ల భాషల్లో సొంత 'వెబ్‌సైట్‌'నూ నిర్వహిస్తోంది. ఆదర్శ గ్రామంగా గంగదేవిపల్లి ఎదగడానికి 15ఏళ్లు పట్టింది. స్థానికులు తమకు తాము ప్రగతి చోదకులుగా మారి అభివృద్ధిని సాధించడమనేది నెమ్మదిగా సాగే ప్రక్రియ. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని గుర్తుంచుకోవాలి. 2014 సెప్టెంబరులో కేంద్రప్రభుత్వం ఎంపిక చేసిన మూడు స్ఫూర్తిదాయక గ్రామాల్లో గంగదేవిపల్లి ఒకటి. మిగతా రెండూ- పున్సారి(గుజరాత్‌), హివారి బజార్‌(మహారాష్ట్ర). ఈ గ్రామాలపై ప్రభుత్వం డాక్యుమెంటరీలు నిర్మించింది. 2014 అక్టోబర్‌ 11న ప్రధాని మోదీ సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన సందర్భంలో వాటిని ప్రదర్శించారు. 'ఆదర్శ' అనే పదం నైతికంగా ఎంతో బరువైంది. ఆ పదం వినగానే ప్రజల్లో గొప్ప ఆశలు రేగుతాయి. వారి ఆశలు నెరవేర్చే విధంగా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఈ పథకం కోసం గ్రామాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. సన్సద్‌ ఆదర్శ గ్రామ యోజన అమలులో అన్ని దశల్లోనూ స్థానికులు చురుగ్గా పాలుపంచుకోవాలి. సమష్ఠి కార్యాచరణలో పాల్గొన్న అనుభవం, స్థానిక వైరుధ్యాలను పరిష్కరించుకున్న చరిత్ర ఉన్న గ్రామాలను సన్సద్‌ పథకంలో మమేకం చేయాలి. రాజకీయ, కుల, మత భేదాలతో చీలిపోయిన గ్రామాల్లో ఆశించిన ఫలితాలు రావు. తన ప్రసంగంలో మోదీ అనేక లక్ష్యాలు పేర్కొన్నారు. వాటిని నెరవేర్చడం నిజంగా సవాలే. మోదీ పేర్కొన్న కీలకాంశాలు ఇవి- 1. సన్సద్‌ ఆదర్శ గ్రామ పథకం పరిపూర్ణ దృక్పథంతో అమలై, పల్లెలను రూపాంతరం చెందించాలి. 2. ప్రజల అవసరాలు, డిమాండ్లను తీర్చే విధంగా ఎంపీలు దీన్ని అమలు చేయాలి. 3. పథకం కింద ఎంపికైన గ్రామాల ప్రజలతో ఎంపీలు సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలి. వారితో కలిసి మెలిసి ఉంటూ సామరస్య వాతావరణం పెంపొందించాలి. 4. ఎంపీలు అధికార దర్పం ప్రదర్శించకుండా గ్రామీణులకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి. 5. మార్పు ప్రేరేపకులుగా నిలవాలి. పథకాన్ని సృజనాత్మకంగా అమలు చేయాలి. 6. ఉదాత్త ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి తోడ్పడే మార్గదర్శక సూత్రాలు రూపొందించి అమలు చేయాలి. సన్సద్‌ గ్రామ పథకం- ఆనవాయితీ ప్రభుత్వ పథకాల వంటిది కాదని; చురుకైన ప్రజాభాగస్వామ్యం, స్వచ్ఛంద సేవలతో నడిచే ఉదాత్త పథకమని మోదీ వివరించారు. పథక లక్ష్యాలకు అనుగుణంగా రూపొందే గ్రామాలు పొరుగు పల్లెలకు స్ఫూర్తినిచ్చి, అన్నింటినీ అభివృద్ధి మార్గం పట్టిస్తాయి. ఈ పథకానికి ఇంతటి ప్రభావశీలత ఉంది కనుక పార్లమెంటు సభ్యులు యథాలాపంగా ఆదర్శ గ్రామాలను ఎంపిక చేయకూడదు. స్థానికుల అవసరాలు, స్పందనాశీలత, ప్రాంతీయ సమీకరణలు, గతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తీరు- వంటి వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఆదర్శ గ్రామాల ఎంపిక జరగాలి. స్థానిక ఎమ్మెల్యేలు, పంచాయతీరాజ్‌ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని వెళ్లడం చాలా ముఖ్యం.

ఉమ్మడి లక్ష్యం కావాలి!

ఆదర్శ గ్రామంలో సమర్థ భూ, జల నిర్వహణ; సురక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆరోగ్య సేవలు, ఆస్పత్రి, విద్య, జీవనోపాధి వంటి సౌకర్యాలు అనివార్యంగా ఉండాలి. ప్రధానమంత్రి ఆశిస్తున్నట్లు ప్రతి ఎంపీ 2016నాటికి ఒక ఆదర్శ గ్రామాన్ని, 2019నాటికి మరో రెండింటినీ అభివృద్ధి చేయడం నిజంగా ఒక సవాలే. ప్రజలు తమ ఇష్టప్రకారమే భాగస్వామ్యం తీసుకుంటారు తప్ప, ప్రభుత్వ గడువు లోగా పనులు పూర్తిచేయాలని హడావుడి పడరు. ప్రజలు స్వచ్ఛందంగా పాలుపంచుకోని పథకాలు, వాటికింద వెచ్చించిన నిధులు వృథా అయిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పటికే విజయవంతమైన గంగదేవిపల్లి వంటి ఆదర్శ గ్రామాలు పల్లెవాసులను పెద్దయెత్తున పాలుపంచుకునేలా చేయగలవు. ఆదర్శ గ్రామ పథకాన్ని అమలు చేసే బాధ్యత పార్లమెంటు సభ్యులమీదే ఉంది. ఈ బృహత్తర పథకాన్ని అయిదేళ్లలో విజయవంతం చేయడం అంత తేలిక కాదు. ఈ సవాలును అధిగమించడానికి గ్రామీణ సమాజాలను, చురుగ్గా పనిచేస్తున్న స్వయం సహాయక బృందాలను, స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని పోవాలి. సామాజిక న్యాయ సాధన, అసమానతల నిర్మూలన, కౌలుదారుల హక్కుల రక్షణ, అందరి శ్రేయం కోసం ఉమ్మడిగా పనిచేయడం వంటి విశాల లక్ష్యాల సాధన దిశగా ఆదర్శ గ్రామాలు రూపుదిద్దుకోవాలి.

(రచయిత - డాక్టర్‌ టి.సంపత్‌ కుమార్‌)
Posted on 03-01-2015