Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

దారితప్పిన వ్యవస్థలు ప్రవాసులకు అవస్థలు

* దళారుల మోసాలు అడ్డుకునే తీరిది...

‘వారికి ఏ అర్హతలూ ఉండవు. బోగస్‌ కంపెనీల పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉపాధి కల్పిస్తామంటారు. ఇలా అమాయక ప్రజలను మభ్యపెట్టి విదేశాలకు తీసుకెళ్లి మోసం చేస్తున్న నకిలీ ఏజెంట్లు ఎందరో. ప్రభుత్వపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇది చాలా తీవ్ర సమస్య. దేశంకాని దేశంలో చిక్కుకున్నవారికి కష్టాలు, బాధిత కుటుంబాలకు మానసిక క్షోభ మిగులుతున్నాయి. దేశానికీ దౌత్యపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి’- ఈ నెల పదో తేదీన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ అన్ని రాష్ట్రాల మంత్రుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. దొంగ ఏజెంట్ల నిర్వాకాలను తీవ్రంగా ఎండగట్టారు. వలసల్లో జరుగుతున్న మోసాల నిరోధానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను కేంద్రమంత్రి వ్యాఖ్యలు ప్రస్ఫుటీకరించాయి.

అవగాహనాలోపమే శాపం
భారత్‌ నుంచి విదేశాలకు ఏటేటా వలసలు అధికమవుతున్నాయి. నిరుడు దాదాపు రెండు కోట్లమంది మెరుగైన ఉపాధి అవకాశాలు వెదుక్కొంటూ విదేశాలకు పయనమయ్యారు. గల్ఫ్‌ వంటి పశ్చిమాసియా దేశాలకు వెళ్లేవారిలో అనేకులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. అమెరికా వంటి దేశాల్లో నిబంధనలు కఠినంగా ఉంటాయి. కాబట్టి అక్రమ వలసలు తక్కువగా ఉంటున్నాయి. గల్ఫ్‌ దేశాలకు మాత్రం అడ్డదారి వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏజెంట్ల మాయాజాలం, వలసదారుల అవగాహన లోపాలే ఇందుకు ప్రధాన కారణాలు. గల్ఫ్‌ దేశాల్లో ఏటా 20 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను గుర్తిస్తున్నారు. నేరుగా పాస్‌పోర్టు, వీసాను పొంది విదేశాలకు వెళ్లడం కష్టమనే తప్పుడు భావన ప్రచారంలో ఉంది. ఏజెంట్ల ఆగడాలకు ఇదే కారణమవుతోంది. చాలా మంది ఏజెంట్లకు గుర్తింపు లేదు. అయినా గ్రామస్థాయి నుంచి నగరాల వరకు వారు నేరుగా కార్యాలయాలు తెరిచి దందా సాగిస్తున్నారు. 1983 నాటి కేంద్ర ప్రభుత్వ వలసల చట్టం ప్రకారం ఏజెంట్లు తమ వివరాలను విధిగా నమోదు చేసుకోవాలి. రూ.50 లక్షల బ్యాంకు పూచీకత్తు, రూ.25 వేల రుసుమును చెల్లించాలి. విచారణ అనంతరం కేంద్రం వారిని ఏజెంటుగా నమోదు చేస్తుంది. ఈ గుర్తింపు అయిదేళ్లపాటు ఉంటుంది. ఏజెంట్లుగా చెప్పుకొంటున్నవారు ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎనిమిదివేలకు పైగా అనధీకృత ఏజెంట్లు ఉన్నారు. వారి గుర్తింపు వ్యవహారం కేంద్ర పరిధిలోని అంశమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫిర్యాదులు వచ్చినా పోలీసులు స్పందించడం లేదు. చట్టాల్లోని లోపాలు, యంత్రాంగాల వైఫల్యాలను ఆసరా చేసుకొని ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.

విదేశాల్లో ఉద్యోగాల కోసం ముందుగా వీసా పొందాలి. ఆయా సంస్థలు నేరుగా వచ్చి ఎంపిక చేసుకున్న తరవాత వీసాలు జారీచేయడం ఒక విధానం. ఏజెంట్లే సంస్థల పేరిట వీసాలు ఇవ్వడం మరో పద్ధతి. ఇక్కడే లేని సంస్థల పేర్లు చెప్పి ఏజెంట్లు ఉద్యోగార్థులను నమ్మిస్తారు. రెండు లక్షల నుంచి అయిదు లక్షల రూపాయల వరకు వసూలు చేస్తారు. పర్యాటక, సందర్శక, వైద్యచికిత్సల వీసాలను తీసుకొని వాటి ద్వారా ఉద్యోగాలు వస్తాయని నమ్మిస్తున్నారు. తీరా విదేశాలకు వెళ్లిన తరవాత అసలు నిజాలు తెలుస్తాయి. అప్పటికి ఏజెంట్ల జాడ ఉండదు. ఫోన్లను ఆపేస్తారు. కొన్ని రోజులు కార్యాలయాలు మూసేస్తారు. ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబీకులు ఆందోళన చెందుతారనే కారణంతో చాలామంది దాన్ని దాస్తారు. అవకాశం ఉన్నప్పటికీ, భయం వల్ల రాయబార కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు సైతం చేయరు. గల్ఫ్‌, ఇతర పశ్చిమాసియా దేశాల్లో పెద్దయెత్తున మోసాలు జరుగుతున్నా ఫిర్యాదులు అతి తక్కువగా వస్తున్నాయి. నిరుడు భారతీయుల నుంచి కేవలం 92 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. కొందరి వీసాల గడువు ముగిసినా, చేతుల్లో డబ్బులు లేక, స్వదేశానికి రావడానికి మొహం చెల్లక, అప్పుల వాళ్లు వేధిస్తారనే భయంవల్ల అక్కడే భయభయంగా రహస్యంగా జీవిస్తున్నారు. తిండి దొరక్క పస్తులుంటున్నారు. ప్రమాదాల బారినపడి మరణించేవారి సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది. ఎడారుల్లో, ఇళ్లల్లో, సంస్థల్లో చాలీచాలని వేతనాలతో బతుకులు నెట్టుకొస్తున్నవారు ఎందరో. వేతనాలు సకాలంలో అందవు. అడిగితే యాజమాన్యాలు వారిని బయటికి గెంటేస్తున్నాయి. నిలదీస్తే జైళ్లలో పెట్టిస్తున్నాయి. వీసాలు, పాస్‌పోర్టులను లాక్కుంటున్నాయి. పరిస్థితి విషమంగా మారిన తరవాతే కొందరు బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. అక్కడ రాయబార కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుల కంటే, మన దేశంలోని కుటుంబీకులు ఇక్కడి ప్రభుత్వాలకు చేసే ఫిర్యాదులే అధికంగా ఉంటున్నాయి.

రాయబార కార్యాలయాల నిస్సహాయత
మోసాలను నియంత్రించడంలో రాయబార కార్యాలయాలు నిస్సహాయంగా ఉండిపోతున్నాయి. ఆంగ్లం, హిందీ తెలిసినవారే రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. ప్రాంతీయ భాషలు తెలిసినవారు ఉండటం లేదు. హిందీయేతర భాషల్లో బాధితులు చెప్పే విషయాలను వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. యాజమాన్యాల నుంచి వేతనాలు ఇప్పించే సాహసం చేయడం లేదు. ప్రమాదాల సమయంలో అండగా నిలవడం లేదు. శవాలను పంపించడానికి సైతం చొరవ చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న సందర్భాల్లోనే రాయబార కార్యాలయాలు స్పందిస్తున్నాయి. గల్ఫ్‌ దేశాల్లో క్షమాభిక్షల సందర్భంగానూ రాయబార కార్యాలయాల తీరు సరిగ్గా ఉండటం లేదు. క్షమాభిక్షల సమయంలో అక్కడ అక్రమంగా కొనసాగుతున్నవారిని గుర్తించి తిప్పిపంపడానికి అవకాశాలున్నాయి. బాధితుల వద్ద వీసాలు, పాస్‌పోర్టులు లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. విమానాల టికెట్ల కోసం సాయం అందజేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వారిని సంప్రతించి, డబ్బులు చెల్లించేందుకు ముందుకు వచ్చినప్పుడే రాయబార కార్యాలయాల్లో కదలిక వస్తోంది. అక్రమంగా ఉన్నవారిని గుర్తించేందుకు రాయబార కార్యాలయాలు ప్రయత్నించడం లేదు. విదేశాల్లో కేవలం ఉద్యోగార్థులే కాకుండా వివిధ విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులు సైతం మోసపోతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జర్మనీ వంటి దేశాల్లో ఇవి జరుగుతున్నా ఆయా రాయబార కార్యాలయాలు విద్యార్థులను అప్రమత్తం చేయడానికి ముందుకు రావడం లేదు. ఖతార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించినప్పుడు అక్కడి బాధితులు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేశారు. రాయబార కార్యాలయాల వైఫల్యాలకు ఇదో ఉదాహరణ.

శాశ్వత పరిష్కారం అవసరం
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత అక్రమ వలసల నిరోధంపై దృష్టి సారించింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ శాశ్వత పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారు. ఫిర్యాదులకు సత్వరం స్పందిస్తున్నారు. విదేశీ కార్మికుల వనరుల కేంద్రాల ఏర్పాటుతో పాటు బీమా యోజన, భారతీయ సమాజ సంక్షేమ నిధి వంటి పథకాలు చేపట్టారు. ఏజెంట్ల అక్రమాల నిరోధానికి అన్ని రాష్ట్రాల మంత్రులతో సమావేశం నిర్వహించారు. విదేశీ ఉద్యోగాల పేరిట జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఎవరైనా విదేశాల్లో రెండుసార్లు మోసపోయినట్లు రుజువైతే అయిదేళ్లపాటు వారి పాస్‌పోర్టులను రద్దు చేయాలని నిర్ణయించింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. పరిష్కారం కావాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా విదేశాల్లోని ప్రవాస భారతీయుల నమోదు ఇప్పటివరకు పట్టాలకెక్కలేదు. విమానాశ్రయాల్లో వలసల (ఇమ్మిగ్రేషన్‌) విభాగం నమోదు చేసే గణాంకాలే అందుబాటులో ఉన్నాయి. ఎంతమంది అక్రమంగా ఉన్నారు, వారి సమస్యలను ఎలాతీర్చాలనే అంశాలపై దృష్టి సారించాలి. ఏజెంట్ల నమోదు విధానాన్ని సరళీకృతం చేస్తే అందరూ దీనికి ముందుకు వచ్చే వీలుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం. అన్ని రాష్ట్రాల్లో విదేశీ భవన్‌లు నిర్మించాలి. అక్కడే విదేశాలకు వెళ్లేవారి వివరాలను విధిగా నమోదు చేయాలి. వివిధ శాఖలకు సంబంధించి ఫిర్యాదుల కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు టోల్‌ఫ్రీ నంబర్‌తో సహాయక కేంద్రాలు నిర్వహిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం మరో టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేవాలి. విదేశీ ఉద్యోగాల కోసం కేంద్ర ప్రభుత్వం తరపున ఓ నియామక సంస్థను ఏర్పాటు చేయాలి. తెలంగాణలో టామ్‌కామ్‌ పేరిట విదేశీ మానవవనరుల సంస్థను ఏర్పాటు చేశారు. విదేశీ సంస్థలతో ఒప్పందాలు చేసుకొని, అభ్యర్థులకు తగు సమాచారం ఇచ్చి, అర్హతలు గలవారికి శిక్షణ అందజేసి విదేశాలకు పంపి ఉద్యోగాలను ఈ సంస్థ ఇప్పిస్తోంది. ఇందులో మోసాలకు తావులేదు. దళారుల బెడద లేదు. కేంద్రమే ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయాలి. పదేపదే మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై ముందస్తు నిర్బంధ (పీడీ) చట్టం ప్రయోగించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. పశ్చిమ్‌ బంగ, మహారాష్ట్ర, తెలంగాణల్లో మానవ అక్రమణ రవాణా నిరోధానికి ప్రవాసుల శాఖ, మైనారిటీ, పోలీసు శాఖలు సంయుక్త బృందాలను ఏర్పాటు చేశాయి. ప్రవాసుల సంక్షేమానికి కేరళ ఆదర్శనీయమైన చర్యలు చేపట్టింది. వీటన్నింటిని కేంద్రం ప్రోత్సహించాలి. ‘ప్రవాసులు మనదేశ ఘన చరిత్ర, సంస్కృతులను అంతర్జాతీయంగా చాటుతున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తాం. అన్ని విధాలుగా అండగా ఉంటాం’ అని ప్రధాని మోదీ ప్రవాసీ దినోత్సవం సందర్భంగా హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా పకడ్బందీ చర్యలకు సత్వరం ఉపక్రమించాలి.

- ఆకారపు మల్లేశం
Posted on 18-01-2018