Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఆహారం పుట్లు పంపిణీలోనే పాట్లు!

* వ్యవస్థను చక్కదిద్దాల్సిన సమయం

ప్రపంచ ఆహార భద్రతకు సంబంధించి, గతేడాది ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వెలువరించిన నివేదిక పలు ఆందోళనకర వాస్తవాలకు అద్దం పట్టింది. ఆహార కొరత, పోషకాహార లోపం వంటి సమస్యలు మానవాళిని ఎంతగా పీడిస్తున్నాయో అది వెల్లడించింది. ఆ సంస్థ అందించిన సమాచారం ప్రకారం, అంతకుముందు ఏడాదికంటే 2017లో ప్రపంచవ్యాప్తంగా కోటీ 68లక్షల టన్నుల ఆహార ధాన్యాలు అధికంగా ఉత్పత్తి అయ్యాయి. ఆ సంవత్సరంలో మొత్తంమీద ఆహారోత్పత్తి 262.7కోట్ల టన్నులకు పైమాటే! ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. గడచిన సంవత్సరాల నిల్వలనూ కలిపి లెక్కిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆహారనిల్వలు గత డిసెంబరునాటికి 333 కోట్ల టన్నులకు పైగా ఉంటాయి. అవసరాల్ని, ఉన్నవాటిని బేరీజు వేసి చూస్తే, నిల్వలు మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయి. అయిదేళ్ల కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తిపరంగా పెరుగుదల సగటున 0.6 శాతంనుంచి 1.0 శాతం వరకు నమోదైంది. అంటే, ఉత్పత్తి రీత్యా ఆహారధాన్యాల విషయంలో గడ్డు పరిస్థితి లేదు. ధాన్యాలు పుష్కలంగా ఉన్నా, మరోవైపు ఆన్నార్తుల సంఖ్య అంతకంతకూ ఇనుమడించడానికి కారణమేమిటన్నదే ప్రస్తుత చర్చనీయాంశం!

లక్ష్యం సుదూరం
అర్థశాస్త్రవేత్త థామస్‌ రాబర్ట్‌ మాల్థ్దస్‌ సిద్ధాంతాన్ని అనుసరించి- ఆహారోత్పత్తికి, జనాభా పెరుగుదలకు సంబంధం ఉంది. ఆహార¹ధాన్యాల కొరతకు జనాభా పెరుగుదల కూడా ఒక కారణం. జనాభా 1, 2, 4, 8...నిష్పత్తిలో, ఆహారోత్పత్తి 1, 2, 3, 4 పద్ధతిలో పెరుగుతుంటాయి. ఆయన అంచనా మేరకు, ప్రతి పాతిక సంవత్సరాలకూ జనసంఖ్య రెట్టింపు అవుతుంటుంది. ఆహారోత్పత్తి క్రమేపీ తగ్గుతుంటుంది. కొంతకాలానికి ఇలా పోల్చి చూస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల శాతం దాదాపు శూన్యంగానే కనిపిస్తుంది. మితిమీరిన వినియోగంతో పాటు, భూసారంలో క్షీణతవల్ల సైతం రానున్న సంవత్సరాల్లో గతంతో పోలిస్తే ఆహారోత్పత్తి తగ్గవచ్చు. ఆహార, వ్యవసాయ సంస్థ లెక్కల్ని బట్టి, మొత్తం ఉత్పత్తిలో తగ్గుదల లేకున్నా పెరుగుదల శాతం మాత్రం ఒకటి లోపునే ఉంటోంది. ఆహారోత్పత్తి పెరుగుదల స్థిరీకరణ చెంది, స్థూల ఉత్పత్తి తగ్గిన స్థితిలో- సరైన ప్రణాళికల్ని ప్రభుత్వమే సిద్ధం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత సమస్య ఆహారధాన్యాల కొరత కాదు. వాటి లభ్యత, వినియోగం మధ్య నిష్పత్తి 3:1గా ఉంది. అంటే, కావాల్సిన దానికంటే మూడు రెట్లు అధికంగానే దేశంలో ఆహార లభ్యత ఉన్నట్లు లెక్క. ఇటువంటి స్థితిలో ఆకలి కేకలకు కారణమేమిటి? ‘ఫుడ్‌ ఎయిడ్‌ ఫౌండేషన్‌’ గణాంకాల ప్రకారం- 2016 నాటికి ప్రపంచంలో 79.5 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇది నాటి మొత్తం జనాభాతో పోలిస్తే, 10.89 శాతం ఉంటుంది. అంటే ప్రతి తొమ్మిది మందిలోనూ ఒకరు క్షుద్బాధతో అలమటిస్తున్నారన్నమాట. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా 13శాతం ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఐక్యరాజ్యసమితి 2015లో ప్రకటించిన సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్ని సాధించాలంటే, ప్రపంచం నుంచి ఆకలి సమస్యను 2030 నాటికి తరిమివేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం నెరవేరుతుందని ఆశించడం అత్యాశే!
ఆహారధాన్యాల నిల్వలు సరిపడా ఉన్నా, ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేదు. ప్రజల ఆదాయాలు కనిష్ఠ స్థాయిలో ఉంటున్నాయి. ప్రపంచ జనాభాలో 15 శాతం ప్రజలు రోజుకు సగటున రెండు డాలర్లయినా ఆర్జించలేకపోతున్నారు. దాదాపు 56 శాతం ప్రజల ఆదాయం సగటున రోజుకు 10 డాలర్లు (సుమారు 650 రూపాయలు) దాటడం లేదు. భారత్‌లో గ్రామీణుల పరిస్థితి మరీ దుర్భరం. వారి సరాసరి ఆదాయం నెలకు రూ.5,000 లోపే. ఇంత తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం ఎవరికైనా పరమ దుర్భరమే. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తిని పెంచేలా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తున్నారు. ఇది 685 జిల్లాల్లో 2,62,703 గ్రామపంచాయతీల పరిధుల్లో కొనసాగుతోంది. ఇప్పటివరకు పనికార్డులు మంజూరైనవారి సంఖ్య 12.6 కోట్లు. దేశవ్యాప్తంగా పల్లెప్రాంతాల్లో నివసించేవారిలో 15-20 శాతం ప్రజలకు ఈ పనికార్డులు ఉన్నాయి. గ్రామీణ భారతానికి ఎనలేని మేలు చేసే బృహత్తర పథకంగా దీన్ని రూపుదిద్దారనడంలో సందేహం లేదు. అయితే దేశ జనాభా రీత్యా దీని పరిధిని మరింత విస్తృతం చేయాల్సి ఉంది. గడచిన అయిదేళ్ల కాలంలో (2013-14 నుంచి 2017-18) ఈ పథకంపై కేంద్రం చేసిన ఖర్చు రూ.2,25,431 కోట్లు. అంటే ఈ కార్యక్రమంపై ఏటా సగటున రూ.45,086 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నమాట. అయితే గడచిన కొన్నేళ్లుగా ఈ పథకంపై వ్యయంలో స్వల్పంగానైనా కోత కనిపిస్తోంది. సగటున వంద రోజుల పాటు గ్రామీణులకు పని కల్పించాలన్న నిబంధన ఉన్నప్పటికీ చాలాచోట్ల ఈ పనిదినాల సంఖ్య 50కి మించడం లేదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ కార్యక్రమం పట్టాలకెక్కినప్పటికీ ఇంకా దేశంలో 31శాతం ప్రజలు ఆకలి ముప్పును ఎదుర్కొంటున్నట్లు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఆకలి సమస్యను సమర్థంగా ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఆహార భద్రత చట్టాలను తీసుకువచ్చాయి. అమెరికాతో పాటు చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలు పలు చర్యలు చేపడుతున్నాయి. మనదేశంలో 2013 నుంచి అమలుచేస్తున్న జాతీయ ఆహారభద్రతా చట్టం ప్రకారం, జనాభా మొత్తంలో మూడింట రెండొంతుల మందికి ఆహారధాన్యాల్ని సబ్సిడీ రేట్లపై అందజేయాలి. ప్రతి వ్యక్తికి నెలకు అయిదు కిలోల వంతున బియ్యం/గోధుమలు/ తృణధాన్యాలు ఇవ్వాలి. ఈ మొత్తం సరఫరా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జరగాలని నిర్దేశించారు. అయితే అమలులో ఈ చట్టం అంత ప్రభావం చూపలేకపోతోంది. అర్హులందరి వద్ద సంబంధిత కార్డులు లేకపోవడం ఇందుకు కారణం. రాష్ట్రాల్లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించేందుకు వీలుగా అనేక రకాల రంగుల కార్డులను పంపిణీ చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ పంపిణీ సక్రమంగా జరగడం లేదు. అందువల్ల అనేకమంది అర్హులు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ విధానం’ కింద అర్హులందరూ బ్యాంకు ఖాతాలు తెరవాలని, తమ ఆధార్‌ సంఖ్యతో ఆ ఖాతాలను అనుసంధానించాలని ప్రభుత్వం చెబుతున్నా- పలు కారణాల వల్ల అర్హుల్లో దాదాపు సగంమంది దానికి వెలుపలేే ఉన్నారు. పథకాన్ని కేవలం ఆహార ధాన్యాల వరకే పరిమితం చేయడం మరో సమస్య. ఆహార తయారీకి అవసరమైన పప్పులు, చక్కెర వంటివి పథకంలో అంతర్భాగంగా లేకపోవడం గమనార్హం. ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఈ పథకం అమలుపై పూర్తి శ్రద్ధ వహించాలి. నిబంధనల్ని బట్టి, ఆహార కమిషన్లను అందుబాటులోకి తేవాలి.

నైపుణ్యాలకు సాన
ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ ర్యాంకు 100 వద్ద స్థిరపడటం దేశ దురవస్థకు నిదర్శనం. ఆ జాబితాలో భారత్‌తో పోలిస్తే 19 దేశాలు మాత్రమే వెనకంజలో ఉన్నాయి. వంద పాయింట్లకుగాను భారత్‌ సాధించింది కేవలం 31.4 మాత్రమే! ఈ విషయంలో భారత్‌ పరిస్థితి నేపాల్‌ కన్నా దయనీయంగా ఉంది. ఉత్తర కొరియా కంటే బాధాకరం. దేశంలో 23కోట్లమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆకలిబాధ తట్టుకోలేక రోజూ ఏడువేలమందికిపైగా మరణిస్తున్నారని అధ్యయనాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఈ విషయంలో బాధాకరంగానే ఉంది. భారతదేశం వృద్ధిరేటు 6.2 శాతమా లేక 7.2 శాతంగా ఉంటుందా అనే చర్చ కంటే, ప్రతి పౌరుడూ రోజూ రెండు పూటలా కడుపునిండా తినగలుగుతున్నాడా అన్నదే ప్రధానం. దాదాపు 42 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారన్నది కఠోర వాస్తవం. ఆకలి, పౌష్టికాహార లేమి బారినపడుతున్న వారిలో మహిళలు, పిల్లలే అత్యధికంగా ఉన్నారు. ఆకలి బాధకు సరైన పరిష్కారం- అర్హులందరికీ పని కల్పించడం. అదేవిధంగా ఆహారోత్పత్తిని రెండింతలు చేయడం. ఆహార ధాన్యాలను సక్రమంగా పంపిణీ చేయడమే సమస్యను తొలగించే మార్గం. ప్రభుత్వాలు రాజకీయ అవసరాల్ని పక్కనపెట్టి, ప్రజలందరికీ ఆహారం పంపిణీ అయ్యేలా చూడాలి. బియ్యం విషయంలో భారతదేశం ప్రముఖ ఎగుమతిదారుగా అవతరించింది. కాబట్టి, ఆహార కొరత అనేది ఉత్పత్తి కారణంగా ఏర్పడింది కాదు. సమర్థంగా సరఫరా చేయడమే ప్రభుత్వాల ప్రధాన బాధ్యత.
పౌరులకు కేటాయించే ఆహార ధాన్యాల పరిమాణం పెంచాల్సిన అవసరం ఉంది. అర్హత కార్డుల పంపిణీ సవ్యంగా సాగాలి. జాతీయ ఉపాధి పథకం పరిధిని ఎంతో విస్తృతం చేయడం, పనిదినాల్ని 200 రోజులకు పెంచడం, కుటుంబంలో ఇద్దరికి అవకాశం కల్పించడం కూడా ప్రభుత్వ కర్తవ్యాలే. దాని ద్వారా ‘సామాజిక ఆస్తులు’ పెరగాలి. అన్ని మార్గాల ద్వారా ఉపాధి అవకాశాల్ని పెంపొందించడం సమస్యకు మరో శాశ్వతమైన పరిష్కార మార్గమవుతుంది. అందులో భాగంగా తల్లిదండ్రుల, విద్యార్థుల ఆలోచన విధానంలో మార్పు తీసుకురావాలి. నైపుణ్య ఆధారిత చదువు, స్వశక్తితో నేర్చిన పని ఆధారంగా వ్యక్తి ఉన్నత జీవనం సాగించే వాతావరణం నెలకొనాలి. జపాన్‌ వంటి దేశాలు సత్వర పురోభివృద్ధి చెందడానికి, ఆ జనాభాలో కనీసం 40శాతం వరకు సుశిక్షితులైన కార్మికులు ఉండటమే కారణం. వస్తూత్పత్తిలో జపాన్‌ను మించిన దేశం లేదు. సంక్లిష్టమైన యంత్రాలు, పరికరాల తయారీలో వారికి వారే సాటి. పేరెన్నికగన్న భారీ యంత్ర తయారీకి జర్మనీ పేరు గడించింది. మనదేశంలోనూ నైపుణ్యాల్ని వెలికితీసి, వాటికి అన్ని రకాలుగా ప్రోత్సాహం కల్పించాలి. చట్టాల్ని సవ్యంగా అమలుచేస్తే, ఆహార ధాన్యాల పంపిణీలో జాగ్రత్త వహిస్తే, నైపుణ్య సంపదను అభివృద్ధిపరిస్తే... భారత్‌కు మంచిరోజులు వచ్చినట్లే!

Posted on 22-01-2018