Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పునర్‌ వ్యవస్థీకరణకు శాస్త్రీయ పంథా

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన భారత్‌ స్వభావరీత్యా ఎంతో వైవిధ్య భరితమైంది. భిన్న మతాలు, భాషలు, కులాలు, సంప్రదాయాలు, సంస్కృతుల కలయికే భారతావని. ఇన్ని వైవిధ్యాలతో కూడిన దేశాన్ని ఒక్కటిగా ఉంచాలంటే రాజకీయ నాయకులకు ఎంతో దార్శనికత అవసరం. అప్పుడే మన దేశం చలనశీలంగా, బలంగా ఉండగలదు. అందుకు అవసరమైన ప్రాతిపదికను మనమే నిర్మించుకోవాలి. 71 సంవత్సరాల క్రితం ఉమ్మడి భారతావని మతం పేరుతో భారత్‌, పాకిస్థాన్‌లుగా రెండు ముక్కలయింది. తరవాత పాకిస్థాన్‌ నుంచి విడిపోయి బంగ్లాదేశ్‌ ఆవిర్భవించింది. దేశంలో విస్తరించిన నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఒక సవాలుగా మారింది. రాజ్యాంగ నిర్మాతలు దీన్ని అధిగమించటానికి కొన్ని రక్షణలు, సంస్కరణలు తీసుకువచ్చారు. ఇంకో అతిపెద్ద సవాలు- ప్రాంతీయ ఆకాంక్షలను సమర్థంగా పరిష్కరించడం. ఇందులో భాగమే రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ.

భాషా ప్రాతిపదికన...
స్వాతంత్య్రం వచ్చేనాటికి 14 బ్రిటీష్‌ ఇండియా ప్రావిన్సులు, 558 సంస్థానాలతో దేశం విస్తరించి ఉంది. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చొరవతో సంస్థానాల విలీన ప్రక్రియ సాఫీగా సాగింది. అప్పట్లో కొన్ని రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. ఈ సర్దుబాటు వందలాది పరిపాలన విభాగాలను కుదించటంతో విజయవంతమైనా ప్రజల ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చటంలో సఫలం కాలేదు. భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలు, చారిత్రక వారసత్వాలు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ఒకేభాష మాట్లాడే వారంతా ఒకటి కావాలనే తపన గాఢంగా ఉండేది. దానికి ఆద్యులు తెలుగువారే అని చెప్పాలి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరవాత భాషా ప్రాతిపదికపై ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్ర. భాషా ప్రయుక్త రాష్ట్ర భావనకు నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ బద్ధ వ్యతిరేకి అయినా పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగంతో దిగిరాక తప్పలేదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దాని స్ఫూర్తితో ఎన్నో ప్రాంతీయ ఉద్యమాలు మొదలయ్యాయి. అందులో ముఖ్యమైనవి- తెలుగు ప్రజల ఐక్యత కోసం విశాలాంధ్ర ఉద్యమం, మలయాళీల ఐక్యత కోసం ఐక్య కేరళ, మరాఠా ప్రజల ఐక్యత కోసం సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం ముఖ్యమైనవి.
బొంబాయి రాష్ట్రాన్ని పరిమాణంలో ఇంతకు ముందు కన్నా పెద్దదిగా చేశారు. గుజరాతీ మాట్లాడే ప్రజలందరూ ఆందోళన చేసి గుజరాత్‌ను ఏర్పాటు చేసుకున్నారు. పంజాబ్‌ విభజన జరిగింది. ఈశాన్య భారతాన్ని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కొత్తగా మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌ను విభజించి ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌ను విభజించి ఛత్తీస్‌గఢ్‌, బిహారును విభజించి ఝార్ఖండ్‌ ఏర్పాటు చేశారు. ఆ తరవాత 2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజనతో 29వ రాష్ట్రంగా కొత్తగా తెలంగాణ ఆవిర్భవించింది. ఇది ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. ఒకే భాష మాట్లాడే వారందరూ కచ్చితంగా ఒకే రాష్ట్రంగా ఉండాల్సిన అవసరం లేదనే వాదనను ఈ విభజన తెరపైకి తీసుకువచ్చింది. భాషతోపాటు సంస్కృతి, చారిత్రక వారసత్వాల పునాదిగా కొత్త రాష్ట్రాలు ఏర్పడవచ్చనే సంకేతం ఇచ్చింది. 1956 తరవాత కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి. పలు రాష్ట్రాలు తమ పేర్లను మార్చుకున్నాయి. ఇంకొన్ని ప్రతిపాదిత దశలో ఉన్నాయి. ఈ పరిణామాలను విశ్లేషిస్తే ఒక విషయం అర్థమవుతుంది. 1956 రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రాంతాలు, ప్రజల ఆకాంక్షలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోయిందని స్పష్టమవుతోంది. అంతేకాక ఎప్పటికప్పుడు ఒత్తిళ్లకు తలొగ్గి తాత్కాలిక ఉపశమన చర్యలు, పరిష్కార మార్గాలు కనుగొన్నారని విదితమవుతోంది. ఈ రోజుకీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది.
ఇటీవలే ఉత్తర కర్ణాటక ప్రాంత రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. ప్రత్యేక మిథిలాంచల్‌ కావాలని బిహారు పార్లమెంటు సభ్యుడు కీర్తి అజాద్‌ గళమెత్తారు. ప్రత్యేక విదర్భ రాష్ట్రం కోసం పెద్ద ఉద్యమమే జరిగింది. మహారాష్ట్ర నుంచి తమ ప్రాంతాన్ని విడదీయాలన్నది ఆ ప్రాంత ప్రజల డిమాండ్‌. గూర్ఖాలాండ్‌ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని బోడోలాండ్‌ ప్రజలు, కార్బీ అంగ్లాంగ్‌ ఆదివాసులూ ప్రత్యేక రాష్ట్రం కోసం గొంతెత్తుతున్నారు. సౌరాష్ట్ర, కచ్‌, కుకీలు, నాగాలు, ప‌శ్చిమ‌ ఒడిశాకు చెందిన కోశల్‌ వాసులు, పశ్చిమ్‌బంగలోని కూచ్‌ బిహార్‌ ప్రాంతవాసులు, పశ్చిమ తమిళనాడులోని కొంగునాడు వాసులు, పశ్చిమ భారతంలోని ఆదివాసులు, ఉత్తర భారతంలోని భోజ్‌పురీలు ప్రత్యేక రాష్ట్రాల కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు.
అన్నింటి కన్నా ప్రధానమైనది ఉత్తర్‌ప్రదేశ్‌. ఇది దేశంలోని అతిపెద్ద రాష్ట్రం. బుందేల్‌ఖండ్‌, పూర్వాంచల్‌, అవధ్‌, హరిత ప్రదేశ్‌ ప్రాంతాల వాసులు ప్రత్యేక రాష్ట్రాల కోసం ఎప్పటినుంచో పోరాడుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌- జనాభా పరంగా చూస్తే బ్రెజిల్‌తో సమానంగా ప్రపంచంలో అయిదో పెద్ద దేశంగా ఉంటుంది. అంతపెద్ద రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచడం వల్ల పాలన పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని మూడు లేదా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. పెద్ద రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచడానికి సహేతుకమైన కారణాలేమీ కనిపించటంలేదు. ఒకప్పుడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానించిన భాజపా 2014లో అధికారంలోకి వచ్చిన తరవాత ఆ విషయాన్నే మరచిపోయింది. ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అది చిన్న రాష్ట్రాలకు మద్దతుగా మాట్లాడిన సందర్భం లేదు. ఇక కాంగ్రెస్‌ సంగతి చెప్పాల్సిన పనిలేదు.

ఫలించని ప్రయోగం
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం 1953 డిసెంబరులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఫజల్‌ అలీ ఆధ్వర్యాన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌(ఎస్‌ఆర్‌సీ)ను నియమించింది. అది 1955లో నివేదిక ఇవ్వగా 1956 ఆగస్టులో పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించారు. 1956 నవంబరు ఒకటి నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చింది. దీని ప్రకారం 14 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటయ్యాయి. అంతకు ముందున్న నాలుగు రకాల రాష్ట్రాల వర్గీకరణ రద్దయింది. మొట్టమొదటి సారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఒక స్వరూపం చేకూరింది. అప్పట్లో ఇది పెద్ద సంస్కరణ. అయితే ఇది సమగ్రంగా లేదని తరవాతి పరిణామాలు రుజువు చేశాయి.

సమీక్ష అవసరమే
1956 నాటి రాష్ట్రాల పునర్వవస్థీకరణ ప్రయోగం పరిమిత ప్రయోజనాన్నే ఇచ్చింది. అందుకే మళ్ళీ ప్రాంతీయ ఉద్యమాలు తలెత్తుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత రాజకీయ నాయకత్వానిదే. ఏడు దశాబ్దాల భారతావని అనుభవాలు, ఇప్పటివరకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రెండోసారి సమీక్షించుకోవటం అవసరమే. 32 కోట్ల జనాభా కలిగిన అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ఎనిమిది కోట్ల జనసంఖ్య గల జర్మనీలో 16 రాష్ట్రాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాల రెండో పునర్‌వ్యవస్థీకరణ సంఘాన్ని నియమించాల్సిన ఆవశ్యకతను విస్మరించలేం.
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు కేవలం ప్రాంతీయ ఆకాంక్షలే ప్రాతిపాదిక కారాదు. సొంత వనరులు, సొంత కాళ్లమీద నిలబడే సామర్థ్యం, సాంస్కృతిక, చారిత్రక నేపథ్యం తదితర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల పరిపాలనపరంగా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు సౌలభ్యం ఏర్పడుతుంది. కొత్త రాజధానులతో నూతన పట్టణీకరణ జరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుంది. రాబోయే దశాబ్దంలో కనీసం పది శాతం గ్రామీణులు పట్టణాలకు వలస వెళతారన్న అంచనాలు వెలువడుతున్న దృష్ట్యా పట్టణీకరణ మరింత విస్తృతం కానుంది. సమస్య జటిలమైన తరవాత హడావుడి పడే బదులు ప్రశాంతమైన వాతావరణంలో సమగ్రంగా, శాస్త్రీయంగా విశ్లేషించి శాశ్వత ప్రాతిపదికపై రాష్ట్రాలను పునర్‌ వ్యవస్థీకరించడం అవసరం. అందుకు న్యాయమూర్తులు, ఆర్థికవేత్తలు, మేధావులతో కమిటీని వేసేందుకు ఇదే సరైన సమయం!

Posted on 28-08-2018