Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

విపత్తులపై అప్రమత్తతేదీ?

* కేరళ నేర్పుతున్న పాఠాలు

కేరళ వరద బీభత్సం దేశంలోని ప్రకృతి వ్యవస్థల పరిరక్షణ తీరుతెన్నులపై మరోసారి చర్చకు తెరలేపింది. పర్యావరణ వ్యవస్థల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. విపత్తులను ఎదుర్కొనడంలో వ్యవస్థల వైఫల్యాలనూ ఎత్తి చూపించింది. విచ్చలవిడిగా సాగుతున్న అడవుల విధ్వంసం, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణలో నిర్లక్ష్యం, వాతావరణ మార్పుల చేదు ఫలితాల మూలంగా విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ప్రకృతి కన్నెర్రతో సంభవించే విపత్తులను ఎదుర్కొనడం కష్టమైనప్పటికీ, ముందస్తు జాగ్రత్తల ద్వారా ప్రమాద, నష్ట తీవ్రతను తగ్గించే కనీస కార్యాచరణ లోపిస్తుండటం విచారకరం. పర్యావరణ వ్యవస్థలను సంరక్షించుకోవడంతోపాటు దీటైన ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం, సమర్థమైన అత్యవసర సేవల ద్వారా ప్రకృతి విపత్తుల నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంది. కేరళ అనుభవాలతోనైనా ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. భారీ విపత్తుల బారిన పడ్డ అభివృద్ధి చెందిన పలు దేశాలు పడిలేచాయి. వాటి అనుభవాలను కేరళ పునర్నిర్మాణంలో ఆదర్శంగా తీసుకోవాలి.

ప్రకృతి వ్యవస్థల ప్రకోపం
దేశంలో వరద బీభత్సాలు కొత్తమీ కాదు. భారత్‌లో ఏటా మూడుకోట్ల మంది వరద బారిన పడుతున్నారని అంచనా. వరదలు, తుపానులను పసిగట్టి అప్రమత్తం చేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా నష్టనివారణ ఆశాజనకంగా లేదు. గడచిన దశాబ్దకాలంలో వివిధ రాష్ట్రాల్లో సంభవించిన తుపాన్లు, వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. 2013లో ఉత్తరాఖండ్‌ వరదలు భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయి. నదీ ప్రాంతాల గమనాన్ని మార్చే రీతిన లెక్కకు మించి నిర్మితమైన జల విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణం ఈ పరిస్థితికి కారణమని అప్పట్లో పర్యావరణ నిపుణులు విశ్లేషించారు. 2014లో కశ్మీర్‌ వరదలకు అక్కడ సరస్సులు, చెరువుల ధ్వంసం కారణమని తేల్చారు. చెన్నై, హైదరాబాద్‌ నగరాలు వరదబారిన పడి చేదు అనుభవాలను చవిచూశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖతో సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు హుద్‌ హుద్‌ తుపాను భారీ నష్టాన్ని కలిగించింది. గతేడాది గుజరాత్‌, రాజస్థాన్‌, బిహార్‌, పశ్చిమ్‌బంగ, ఈశాన్య రాష్ట్రాలు వరదల్లో చిక్కుకుని విలవిల్లాడాయి. తాజా వరదలు పర్యాటక స్వర్గధామం అయిన కేరళను అతలాకుతలం చేశాయి. నాలుగు వందల మందికి పైగా మృత్యువాత పడ్డారు. వేల కిలోమీటర్ల రహదార్లు దెబ్బతిన్నాయి. పశ్చిమ కనుమల్లో విలువైన జీవవైవిధ్య వ్యవస్థ జల ప్రకోపానికి చిన్నాభిన్నమైంది.
కేరళ పశ్చిమకనుమల్లో ప్రకృతి వ్యవస్థలను మితిమీరి దెబ్బతీయడమే వరదలకు ప్రధాన కారణంగా పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ కనుమలు గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లో విస్తరించి ఉన్నాయి. వీటిల్లో ఏటా ఏదో ఒక రాష్ట్రం వరదబారిన పడుతోంది. దశాబ్దం నుంచి పశ్చిమ కనుమల పరిరక్షణలో రాజ్యమేలుతున్న నిర్లక్ష్యంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2010లో తమిళనాడులోని కోటగిరిలో పశ్చిమ కనుమల పరిరక్షణ నినాదంతో నిర్వహించిన సదస్సులో అప్పటి పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్‌ కీలక నిర్ణయం ప్రకటించారు. పశ్చిమ కనుమల పర్యావరణ, జీవవైవిధ్యాలపై తీసుకోవాల్సిన సమగ్రచర్యలపై నివేదిక సమర్పించేందుకు ప్రముఖ పర్యావరణవేత్త మాధవ్‌ గాడ్గిల్‌ నేతృత్వంలోని కమిటీకి బాధ్యత అప్పగించారు. ఈ కనుమలను పర్యావరణ పరంగా సున్నితమైన ప్రాంతంగా ప్రకటించాలని, నిర్దేశిత ప్రాంతాల్లో వ్యవసాయం, ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని కమిటీ సూచించింది. కొత్త ఆర్థిక మండళ్లూ, హిల్‌స్టేషన్లకు అనుమతులు ఇవ్వకూడదని, ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చకూడదని, అటవీ భూములను అభివృద్ధి కార్యక్రమాలకు బదిలీ చేయరాదని, కొత్తగా ఖనిజ తవ్వకాలకు అనుమతులు మంజూరు చేయరాదనీ పేర్కొంది. పర్యాటక కార్యకలాపాలను నియంత్రించాలని, పశ్చిమ కనుమల పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. వీటిని పశ్చిమ కనుమల పరిధిలోని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీపై రాష్ట్రాల నుంచి వ్యతిరేకత రావడంతో 2012లో అప్పటి పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్‌ అంతరిక్ష శాస్త్రవేత్త కస్తూరి రంగన్‌ నేతృత్వంలో మరో కమిటీని నియమించారు. గాడ్గిల్‌ కమిటీ సూచనల తీవ్రతను తగ్గిస్తూ కస్తూరి రంగన్‌ కమిటీ నివేదిక ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం విషయాన్ని పక్కన పెట్టేసింది. పదేళ్ల క్రితమే మాధవ్‌ గాడ్గిల్‌ సూచించిన అంశాలను తీవ్రంగా పరిగణించి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. దేశంలో పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వ్యవస్థలను పదిలం చేసుకోవడం తదితర అంశాలు నివేదికలు, చర్చలకే పరిమితమవుతున్నాయి. యూపీఏ ప్రభుత్వం పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్‌ (2006), అటవీ హక్కుల గుర్తింపు చట్టం (2006) వంటి కీలక చట్టాలను అమల్లోకి తెచ్చింది. యూపీఏ రెండో దశ పాలనలో వాటిని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేసింది. మే 2014లో అధికార పగ్గాలు చేపట్టాక అడవులు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల అంశాల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం విధానపరమైన మార్పులను చర్చలకే పరిమితం చేసింది. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే టీఎస్‌ఆర్‌ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని కమిటీని నియమించింది. అటవీ భూముల బదలాయింపు, పర్యావరణ అనుమతుల ప్రక్రియను నియంత్రించేందుకు, పర్యావరణ, అటవీ చట్టాల్లో సమూల మార్పులను తీసుకురానున్నట్టు ప్రకటించింది. సుబ్రమణియన్‌ కమిటీ నివేదిక సమర్పించినా గడచిన నాలుగేళ్లలో పర్యావరణ చట్టాల మార్పు విషయంలో ఒక్క అడుగూ ముందుకు పడకపోగా అడ్డగోలుగా అనుమతులు ఇచ్చే విధానం సాగుతోంది. నాలుగేళ్లలో ఎన్‌డీఏ ప్రభుత్వం అటవీయేతర కార్యక్రమాలకుగాను 1,24,788 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించింది. వాతావరణ మార్పుల అంశంలోనూ కేంద్రప్రభుత్వ వైఖరి నిరాశాజనకంగానే ఉంది. క్షేత్రస్థాయి నుంచి సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన ప్రతిపాదనలను కూలంకషంగా సమీక్షించి నిధులు విడుదల చేయాల్సి ఉండగా ఆ దిశగా కేంద్రం అడుగులు వేయడం లేదు.

ఇసుక తవ్వకాలతో ఇక్కట్లు
కేరళసహా ఇతర రాష్ట్రాల్లో వరదలకు ప్రజలు, ప్రభుత్వాల అపరిపక్వ చర్యలు కారణమన్నది నిపుణుల అభిప్రాయం. దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 80 శాతం రుతుపవనాల సమయంలోనే కురుస్తోంది. అంటే ఏడాది పొడవునా కురిసే మొత్తం వర్షపాతంలో అత్యధిక శాతం జూన్‌, సెప్టెంబరు మధ్యకాలంలోనే ఉంటుంది. ఫలితంగా నదుల్లో భారీగా నీటి ప్రవాహం చేరుతోంది. ఈ సమయంలో పర్వత శ్రేణులను అనుకుని ఉన్న ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో వరదల తాకిడి అధికంగా ఉంటుంది. దీంతో నదుల సామర్థ్యాన్ని మించి వాటిల్లోకి నీరు చేరుతోంది. వరద నీరు నదీ పరీవాహక ప్రాంతాల నుంచి వచ్చే అవక్షేపాలనూ భారీగా తీసుకుని రావడంతో నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తాయి. విచక్షణారహితంగా ఇసుక తవ్వకాలు సహజ ప్రవాహాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పరివాహక ప్రాంతాల్లో చొచ్చుకువచ్చి చేపడుతున్న నిర్మాణాల మూలంగా వరదల నష్ట తీవ్రత పెరుగుతుంది. నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థలను విస్తరించకపోవడం, పూడిపోయిన వాటికి మరమ్మతులు చేయకపోవడం ముప్పునకు దారితీస్తోంది. సాగు, విద్యుత్‌ అవసరాల కోసం పర్వతశ్రేణుల్లో నదుల సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మిస్తున్న ఆనకట్టలు గోరుచుట్టుపై రోకలిపోటులా తయారవుతున్నాయి. హిమాలయాలు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమల్లో పర్యావరణ, సామాజిక ప్రభావాన్ని విశ్లేషించకుండా, భవిష్యత్‌ ప్రమాదాలను ఎదుర్కొనే వ్యూహాలు లేకుండానే అభివృద్ధి పేరుతో ఆనకట్టలు నిర్మిస్తుండటం ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

కార్యాచరణతోనే భరోసా
ప్రకృతి విపత్తుల సమయాల్లోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి. నష్టాన్ని భర్తీ చేయడానికి, పునర్నిర్మాణం చురుగ్గా సాగడానికి, భవిష్యత్‌ కార్యాచరణకు చిత్తశుద్దితో కృషి చేయాలి. కేరళకు సంబంధించి విరాళాల సమీకరణ, కేంద్ర సాయం వంటి విషయాల్లో వెలువడుతున్న ప్రకటనలు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయలోపాన్ని ఎత్తి చూపుతున్నాయి. వరద తాకిడికి పూర్తిగా దెబ్బతిన్న జిల్లాలకు పూర్వవైభవం తీసుకురావడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. 2005లో అమెరికాలో ‘కత్రినా’ పెనుతుపాను విరుచుకుపడినప్పుడు, ఆ ప్రాంత పునర్నిర్మాణం కోసం విధానపరమైన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించి ప్రజల్లో భరోసా పెంచారు. బాధితులకు పునరావాసం కల్పించేందుకు ఈ చట్టం దోహదపడింది. దురదృష్టవశాత్తూ ఈ తరహా విధానాలను మనదేశంలో అనుసరించడం లేదు. ఫలితంగా బాధితులకు అరకొర సాయం మాత్రమే లభిస్తోంది. ఇప్పటికైనా ఈ వైఖరిలో మార్పు అవసరం. కేరళకు చేయూతనిచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా స్పందన రావడం స్వాగతించదగ్గ పరిణామం. విరాళాలతో ప్రత్యేకనిధిని ఏర్పాటు చేసి అన్ని విధాలుగా నష్టపోయిన వారిని ఆదుకోవాలి. రంగాలవారీగా నష్టాన్ని భర్తీచేసే ప్రణాళికలను బడ్జెట్లో ప్రత్యేకంగా పొందుపరచాలి. పశ్చిమ కనుమల్లో అడవుల పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ వనీకరణ (కంపా) నిధులను కేంద్రం పెద్దమొత్తంలో కేటాయించాలి.
భవిష్యతులో విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే విధంగా క్షేత్రస్థాయి నుంచి కేంద్రం వరకూ ప్రభుత్వ వ్యవస్థలు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. ప్రకృతి విపత్తుల కమిటీల్లో స్థానికుల భాగస్వామ్యం తప్పనిసరి చేయాలి. ఆ మేరకు వారికి తగిన శిక్షణ ఇవ్వాలి. అటవీ, నదీ తీరప్రాంత వనరుల వినియోగం, యాజమాన్యం, నిర్వహణకు ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలి. అప్పుడే విపత్తులను ఎదుర్కోగలమనే ధీమా ప్రజల్లో కలుగుతుంది!

Posted on 28-08-2018