Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఉరుముతున్న నిరుద్యోగం

* ఉద్యోగాల సృష్టి ఒట్టిమాటే!

దేశంలో నిరుద్యోగ సమస్య ప్రబలుతుందన్న వాదనను ‘రాజకీయ గిమ్మిక్కు’గా నిరుడు ప్రభుత్వం కొట్టిపడేసిన దాఖలాలు చూశాం. ఆ తరవాత కొద్ది నెలలకు జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నియతకాలిక కార్మిక సర్వే నివేదికను ఓ పత్రిక వెలుగులోకి తెచ్చింది. నిరుద్యోగిత రేటు 6.1 శాతానికి చేరిందన్న చేదునిజాన్ని బయటపెట్టింది. గడచిన నాలుగున్నర దశాబ్దాల్లో ఈ సమస్య ఇంతలా ముప్పిరిగొనడం అదే మొదటిసారి. నాటి కేంద్ర గణాంకాల శాఖ మంత్రి సదానందగౌడ లోక్‌సభలో దీని మీద స్పందిస్తూ ‘పత్రికల్లో వచ్చింది నకిలీ నివేదిక’ అన్నారు. కానీ, మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం రెండో సారి కొలువుదీరిన తెల్లారే కేంద్ర గణాంకాల శాఖ, ఎన్‌ఎస్‌ఎస్‌వో జులై 2017- జూన్‌ 2018 నియతకాలిక కార్మిక సర్వే వివరాలను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఏడాది మొదట్లో పత్రికల్లో ప్రచురితమైనట్టు నిరుద్యోగిత రేటు 6.1 శాతమేనని తేల్చింది.

ఉపాధికి విఘాతం
నిరుద్యోగ సమస్య నానాటికీ తీవ్రరూపం దాల్చుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నియతకాలిక కార్మిక సర్వేతో పాటు 2018 ఏప్రిల్‌- జూన్‌, జులై- సెప్టెంబరు, అక్టోబరు- డిసెంబరు త్రైమాసికాలకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత పైనా ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అధ్యయనం చేసింది. అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో నిరుద్యోగిత రేటు 9.7 శాతంగా నమోదైందని వెల్లడించింది. నియతకాలిక కార్మిక సర్వే ప్రకారం జూన్‌, 2018 నాటికి పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 7.8 శాతం. ఆ తరవాత ఆర్నెల్లలోనే ఇది దాదాపు రెండు శాతం పెరిగింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు బాగా దెబ్బతినడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఎస్‌ఓకు సమాంతరంగా దేశ ఆర్థికవ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం (సీఎంఐఈ) సైతం నిరుద్యోగిత మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది. ఆ సంస్థ నివేదిక ప్రకారం జూన్‌ 9, 2019 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 7.7 శాతానికి పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే త్రిపుర (30.2 శాతం), హరియాణా (18.3 శాతం), జమ్ముకశ్మీర్‌ (16.7 శాతం)లలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. బిహార్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌ల్లో నిరుద్యోగిత రేటు పది శాతాన్ని దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 4.3 శాతంగా ఉంటే, తెలంగాణలో రెండు శాతంగా నమోదైంది. సీఎంఐఈ అధ్యయనం ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా ఉపాధి కోల్పోయారు. వీళ్లలో 84 శాతం మంది గ్రామీణులే. వ్యవసాయ రంగ సంక్షోభంతో పల్లెల్లో ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయి. దాంతో పనిని వెతుక్కుంటూ పట్నాలకు వస్తున్న లక్షల మందికి ఇక్కడా రిక్తహస్తాలే ఎదురవుతున్నాయి.

ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వే ఫలితాల వెల్లడి తర్వాత కేంద్ర ప్రభుత్వం.. కిందపడ్డా తనదే పైచేయి అన్నట్టు స్పందించింది. ‘దేశంలో నిరుద్యోగిత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిందన్న మాట వాస్తవ దూరం. ఈసారి సర్వేకు ఎంచుకున్న ప్రమాణాల్లో మార్పులున్నాయి కాబట్టి ఈ ఫలితాలను గత సర్వేలతో పోల్చి చూడకూడదు. దేశంలో చదువుకుంటున్న వారు పెరిగారు. కుటుంబ ఆదాయాలూ ఇనుమడించాయి. ఫలితంగా విద్యావంతులైన యువత ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. తన నైపుణ్యాలకు సరిపడని, తక్కువ జీతాలు లభించే ఉద్యోగాల్లోకి చేరడానికి వారు ఆసక్తి చూపట్లేదు’ అని చెప్పింది. అంటే ఉద్యోగాలు ఉన్నాయి కానీ, జీతాలు నచ్చక యువత చేరట్లేదనే కదా అర్థం. నిజానికి నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు దుర్లభమవుతున్న దుస్థితిలో యువతరం ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలు అనుకుంటోంది. పశ్చిమ్‌ బంగలో ఆమధ్య ఆరు వేల క్లాస్‌-4 ఉద్యోగాలకు ప్రకటన ఇస్తే 25 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఎనిమిదో తరగతి విద్యార్హత సరిపోయే ఈ ఉద్యోగాలకు పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారూ వరసలో నిలబడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 368 బంట్రోతు ఉద్యోగాలకు 23 లక్షల మంది పోటీపడ్డారు. వీళ్లలో లక్షన్నర మంది డిగ్రీ పట్టాదారులు, డాక్టరేట్లు సాధించిన వారు 250 మందికి పైగా ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ ఇటీవల ఇలాంటి దృశ్యాలే చోటుచేసుకున్నాయి. 18- 23 ఏళ్ల వయసులో ఉన్నత విద్యలో చేరే వారి శాతం 2005లో 12 శాతంగా ఉండేది. 2015 నాటికి ఇది 24.5 శాతానికి పెరిగింది. దశాబ్దం వ్యవధిలో దేశంలో ఉన్నత విద్యావంతులు రెట్టింపునకు మించి పెరిగారు. వారి సంఖ్యకు తగినట్టు ఉపాధి అవకాశాలు మాత్రం పెరగట్లేదు.

ఉద్యోగాల సృష్టిలో వెనకబాటుతో పాటు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాల్లో అత్యధికం అతితక్కువ ఆదాయాన్ని సమకూర్చేవే కావడం దేశం ఎదుర్కొంటున్న మరో ముఖ్యసమస్య. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ పరిధిలోని లేబర్‌ బ్యూరో 2015- 16 ‘ఉద్యోగిత- నిరుద్యోగిత సర్వే’ ప్రకారం దేశవ్యాప్తంగా 67.6 శాతం కుటుంబాల ఆదాయం నెలకు రూ.10 వేల లోపే కావడం గమనార్హం. వీటిలో 22.1 శాతం కుటుంబాలైతే నెలకు రూ.5 వేల కన్నా తక్కువ ఆదాయంతోనే జీవనం సాగిస్తున్నాయి. సరైన ఆహారం, ఆరోగ్యానికి నోచుకోక దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ 12.8 శాతం కుటుంబాలు మాత్రమే నెలకు రూ.20 వేలకు పైన సంపాదనతో మెరుగైన జీవితాలను గడుపుతున్నాయి. తక్కువ వేతనాలు లభించే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లలో ఎక్కువ మంది దళితులు, గిరిజనులే. అధిక మొత్తంలో జీతం లభించే ఉద్యోగాల్లో ఈ వర్గాలకు చాలా తక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అజిమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి చెందిన సుస్థిర ఉపాధి కేంద్రం రూపొందించిన స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా- 2018 నివేదిక ప్రకారం అగ్రవర్ణాల ఆదాయంలో 72 శాతాన్నే ఓబీసీలు పొందుతున్నారు. దళితులు 56 శాతం, గిరిజనులైతే 55 శాతం మొత్తాలను మాత్రమే సంపాదించుకోగలుగుతున్నారు. వేతనాల్లో లింగ దుర్వివక్ష బలంగా ఉంది. ఒకే రకమైన పని చేసే స్త్రీ పురుషుల సంపాదనల్లో 35- 88 శాతం తేడా ఉంది. ఈ స్థితిలో ఉపాధికల్పన మాత్రమే ప్రధానాంశం కాబోదు. ఎవరి కోసం ఎంత నాణ్యమైన ఉపాధిని కల్పిస్తున్నారనేది ముఖ్యం. తరతరాలుగా అణచివేతకు, ఉపేక్షకు గురవుతున్న వర్గాలకు ప్రభుత్వాలు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నాయా లేదా అన్నది ప్రధాన ప్రశ్న. ప్రస్తుతమైతే దీనికి సమాధానం ‘లేదు’! లోక్‌సభకు అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ ఆగస్టు 1, 2018న ఇచ్చిన సమాచారం మేరకు గల్ఫ్‌, మలేసియా, సూడాన్‌, థాయిలాండ్‌ తదితర దేశాలకు మూడేళ్లలో 16.96 లక్షల మంది వలసెళ్లారు. ‘125 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం చూపించడం సాధ్యం కాదు. మేం స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 8 కోట్ల మందికి స్వయంఉపాధి కల్పించింది’ అని ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొద్ది నెలల కిందట అన్నారు. ‘ముద్ర’ రుణాల పంపిణీని దృష్టిలో పెట్టుకునే ఆయన ఇలా చెప్పారు. కానీ, ఆ పథకం లబ్ధిదారుల్లో దాదాపు తొంభై శాతం మందికి అందిన సగటు రుణం రూ.23 వేలే. ఈ కొద్దిపాటి సొమ్ముతో స్వయం ఉపాధి పొందడం సాధ్యమేనా? ఈ పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించి చూపించడానికి చేసే ఏ ప్రకటనైనా హాస్యాస్పదమే అవుతుంది.

పరిశ్రమలకు చేయూతే పరిష్కారం
సుస్థిర ఉపాధి వ్యక్తికి ఆత్మగౌరవాన్నీ, స్వేచ్ఛనూ అందిస్తుంది. జీవితానికి భద్రతను కల్పిస్తుంది. ఇది లేనప్పుడు మనిషి నిరాశ, కుంగుబాటు, కోపాలతో సామాజికంగా ఏకాకి అయిపోతాడు. ఆత్మస్థైర్యం కోల్పోయి చివరికి వ్యక్తిగత అస్థిత్వాన్ని కోల్పోతాడు. ఈ మానసిక దుష్ప్రభావాలకు తోడు నిరుద్యోగితతో శారీరకంగా, ఆరోగ్యపరంగానూ మనిషి దెబ్బతింటాడని అనేక అధ్యయనాల్లో తేలింది. నిరుద్యోగిత పెరిగే కొద్దీ సమూహాల ఆర్థిక అవసరాలు తీరవు. ఫలితంగా వినియోగ సామర్థ్యం తగ్గిపోతుంది. సమాజంలో మాంద్యం పెరుగుతుంది. దేశం ఆ గడ్డురోజుల్లోకి జారిపోకూడదంటే పాలకులు వెంటనే స్పందించాలి. వ్యవసాయ రంగ సమస్యలకు వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలు వెతకాలి. ఆ రంగం తరవాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనివ్వాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగ సమస్యపై ఆసేతుహిమాచలం చర్చ జరిగినా- జాతీయ భద్రత, బలమైన నాయకత్వ కోణాల్లో ఆలోచించి ప్రజలు మోదీ ప్రభుత్వానికే ఓటేశారు. తమ ఆకాంక్షలను ఈసారి ఆయన కచ్చితంగా నెరవేరుస్తారని విశ్వసించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం, ముఖ్యంగా నిరుద్యోగితను అదుపులోకి తెచ్చి, యువతకు జీవనభద్రతను అందించడమే ఇప్పుడు మోదీ సర్కారు ఎదుర్కొంటున్న మొదటి పరీక్ష!

- శైలేష్‌ నిమ్మగడ్డ
Posted on 13-12-2019