Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సామర్థ్యంపై సందేహాలు!

* కుప్పకూలుతున్న లోహవిహంగాలు

యుద్ధ విమానాల సమర్థతపై అనుమాన మేఘాలు కమ్ముకొంటున్నాయి. తాజాగా అసోమ్‌లోని జోర్హాట్‌ ప్రాంతంలో ఏఎన్‌-32 రాడార్‌ విమానం అదృశ్యమైంది. ఎనిమిది రోజులు రేయింబవళ్లు గాలించాకగానీ దాని ఆచూకీ తెలియలేదు. అత్యవసర సమయంలో సంకేతాలు పంపాల్సిన ‘లొకేటర్‌’ పాతదైపోవడంతో పనిచేయలేదు. దీనితో వాయుసేనలో ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. ప్రపంచంలో సంఖ్యాపరంగా వైమానిక దళాల జాబితాలో భారత్‌ తొలి అయిదు స్థానాల్లో నిలుస్తోంది. సామర్థ్యపరంగా అయిదునుంచి పది స్థానాల మధ్యలో ఉంది. వైమానికశక్తిలోని నాణ్యత లోపాలను వెల్లడిస్తున్న పరిణామమిది. జనవరి నుంచి ఇప్పటివరకు వాయుసేనకు చెందిన 10 విమానాలు ప్రమాదానికి గురై 20మందికి పైగా మృతిచెందారు. వాటిలో శత్రువులతో జరిగిన పోరులో కూలింది అభినందన్‌ వర్ధమాన్‌ మిగ్‌-21 ఒక్కటే. మిగిలినవన్నీ సాంకేతిక కారణాలతో నేలరాలినవే!

ప్రమాదాలకు కారణమిదీ!
ఇప్పటి వరకు వైమానిక శక్తి అంటే కేవలం ఫైటర్‌ జెట్స్‌ మాత్రమే అనే అభిప్రాయం ఉంది. కానీ, వాటికి మద్దతుగా పనిచేసే పలు రకాల విమానాలూ వాయుసేనను బలోపేతం చేస్తాయి. వాటిలో రాడార్‌, ట్యాంకర్‌, కార్గో విమానాలు కీలకమైనవి. ప్రస్తుతం మిగ్‌-21ల తరహాలో కార్గో విమానాలు బాగా పాతవి కావడంతో ప్రమాదాలకు గురవుతున్నాయి. ఫైటర్‌జెట్లతో పోలిస్తే కార్గో విమాన ప్రమాదాలు కూడా వాయుసేన యోధులను పొట్టనబెట్టుకుంటున్నాయి. ఇప్పటికే సోవియట్‌ కాలం నాటి ఏఎన్‌32 విమానాల పరిస్థితి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత వాయుసేన నిర్వహించే రవాణా, సహాయ చర్యల్లో ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎత్తయిన పర్వత ప్రాంతాలు ఉన్నచోట ఇదే ప్రధాన రవాణా సౌకర్యం. ప్రమాదాలు సైతం అదే స్థాయిలో చోటు చేసుకొన్నాయి. 1984లో వీటిని తొలిసారి ఐఏఎఫ్‌లో ప్రవేశపెట్టారు. 1986 మన దేశానికి అప్పగించేందుకు తీసుకువస్తున్న విమానం అరేబియా సముద్రంలో కూలిపోయింది. ఆ తరవాతా ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ప్రస్తుతం దేశంలో ఆ విమానాలు వందకుపైగా ఉన్నట్లు అంచనా. 2009లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ప్రమాదంతో ప్రభుత్వం కళ్లు తెరిచి ఈ విమానాన్ని నవీకరించాలని నిర్ణయించింది. అప్పటికి సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం కావడంతో జరిగిన పంపకాల్లో విమానాల తయారీ సంస్థ అయిన ఆంటనోవ్‌ సంస్థ ఉక్రెయిన్‌కు దక్కింది. దాంతో భారత్‌ 40 కోట్ల డాలర్ల విలువైన ఏఎన్‌32ల నవీకరణ ప్రాజెక్టును ఆ దేశానికి కట్టబెట్టింది. తరవాత సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కింద కాన్పూర్‌లో 64 విమానాలను నవీకరించేందుకు చేపట్టిన ప్రాజెక్టు సైతం ముందుకు పోలేదు. దాంతో ఆంటనోవ్‌ సంస్థను మూడు ముక్కలు చేశారు. ఫలితంగా కాన్పూర్‌లో పనిచేస్తున్న ఉక్రెయిన్‌ ఇంజినీర్లు అర్ధంతరంగా వెళ్లిపోయారు. మరోవైపు విడిభాగాల సరఫరా నిలిచిపోయింది. క్రిమియా సంక్షోభం ముదిరిపోవడంతో రష్యాతో ఉక్రెయిన్‌ సంబంధాలు నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు కింద 10 విమానాలు మాత్రమే నవీకరించగలిగింది. అందులో ఒకటి 2016లో బంగాళాఖాతంలో కూలిపోయింది. ఉక్రెయిన్‌ సహాయ నిరాకరణతో ఐఏఎఫ్‌ దేశీయంగా ప్రైవేటు సంస్థలతో కలిసి కొన్ని రకాల విడిభాగాలు తయారు చేసుకొని ఏఎన్‌32 వైమానిక సేవల కొనసాగింపునకు సిద్ధమైంది. అదే సమయంలో నవీకరణకు నోచుకోని ఓ విమానం అసోమ్‌ నుంచి గాల్లోకి ఎగిరి రాడార్‌ పరిధి నుంచి అదృశ్యమైపోయింది.

గతంలో రష్యానుంచి 300 కోట్ల డాలర్ల విలువైన తల్వార్‌ శ్రేణి ఫ్రిగేట్లు కొనుగోలు చేయాలని భారత్‌ నిర్ణయించింది. సోవియట్‌ యూనియన్‌ హయాములోని తయారీ సంస్థలను రష్యా, ఉక్రెయిన్‌ మధ్య పంచారు. ఇప్పుడు భారత్‌లోని పిపావో (గుజరాత్‌) షిప్‌యార్డ్‌లో రష్యా వీటిని నిర్మిస్తోంది. వీటి ఇంజిన్లు మాత్రం ఉక్రెయిన్‌ నుంచి రావాలి. రష్యాకు ఈ ఇంజిన్లను ఇచ్చేందుకు ఉక్రెయిన్‌ నిరాకరించింది. దాంతో భారత్‌ వాటిని సమీకరించుకుంటుందని నచ్చజెప్పడంతో సరఫరాకు అంగీకరించింది. కానీ, ఏఎన్‌32 నవీకరణ ప్రాజెక్టు తరహాలో వాటి సరఫరాను ఆపివేసినా, ‘సర్వీసింగ్‌’కు సంబంధించి సహాయ నిరాకరణ చేసినా మనదేశం ఇబ్బందుల్లో పడే పరిస్థితి నెలకొంది. బాగా పాతవి అయిన ఏఎన్‌-32లకు తోడుగా వాయుసేనలో పాతబడిన పలు విమానాలున్నాయి. హెచ్‌ఎస్‌ 748 రకం విమానాలు పాతకాలానికి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు వీటిని పక్కన పెట్టాయి. ఇథియోపియా, రువాండా వంటి దేశాలు మాత్రమే వాటిని వాడుతున్నాయి. భారత్‌ దగ్గర ఈ విమానాలు ఇంకా 57 ఉన్నట్లు అంచనా. వాయుసేన కొనుగోళ్లలో జాప్యం కారణంగా పాతవే దిక్కవుతున్నాయి. అతిపెద్ద రవాణా విమానమైన సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ కొనుగోలు దీనికో మచ్చుతునక. తొలుత భారత్‌ 10 విమానాలు కొనుగోలు చేసింది. అదనంగా మరో ఆరు కొనుగోలు చేద్దామనుకొని తర్జనభర్జనలు పడి చివరికి మూడింటికి సరేనంది. ఈ లోపు పుణ్యకాలం పూర్తయి మొత్తంగా వాటి ఉత్పత్తినే బోయింగ్‌ నిలిపివేసింది. దాంతో ఒక్కటి మాత్రమే ఇవ్వగలమని భారత్‌కు చెప్పింది. ఈ విమానాలను పూర్తిస్థాయిలో వాడుకొనే మౌలిక వసతులను భారత్‌ సమకూర్చుకోలేకపోయిది. ఈ విషయంలో మన అసమర్థతను ‘కాగ్‌’ తప్పుపట్టింది.

ప్రతిపాదనలకే పరిమితం
గతంలో ఏఎన్‌-32ల స్థానంలో రష్యాతో కలిసి సరికొత్త విమానాన్ని అభివృద్ధి చేసే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దాదాపు 30 కోట్ల డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా 20 టన్నుల సామర్థ్యం గల రవాణా విమానాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటిల్లో 45 విమానాలను కొనేందుకు మన దేశం సిద్ధమైంది. కానీ దీనిలో ఎటువంటి ఇంజిన్‌ అమర్చాలనే అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. దానిలో సరికొత్తదైన ఫ్యూయల్‌ అథారిటీ డిజిటల్‌ ఇంజిన్‌ కంట్రోల్‌ (ఎఫ్‌ఏడీఈసీ)లను అమర్చాలని భారత్‌ కోరుతోంది. రష్యా దీనికి పీఎస్‌ 90 ఇంజిన్‌ సమకూర్చేందుకు సిద్ధమైంది. దీనిని ఇప్పటికే ఐఎల్‌ 72 విమానాల్లో వాడుతున్నారు. దీనిపై ఏకాభిప్రాయం రాలేదు. భారత్‌ ఈ ప్రాజెక్టు విషయంలో చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి. దేశీయంగా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలి. ఇప్పటికే మహీంద్రా సంస్థ ఆస్ట్రేలియాకు చెందిన గిప్స్‌ఏరో సంస్థను కొనుగోలు చేసింది. ఇది చిన్న విమానాలనూ నిర్మించగలదు. మరోపక్క దసౌ రిలయన్స్‌ 2022 నాటికి ఫాల్కన్‌ బిజినెస్‌ జెట్‌ తయారు చేయనుంది. కనీసం ఇప్పటి నుంచైనా దేశంలో వైమానిక రంగానికి చెందిన విడిభాగాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలి. ఈ రంగంలో స్వదేశీ తయారీ అనే ‘విత్తనాన్ని’ ఇప్పుడైనా నాటితే- ఆ ఫలాలు వచ్చేందుకు పదేళ్లయినా పడుతుంది. ఈ విషయాన్ని గుర్తెరిగి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి!


- పెద్దింటి ఫణికిరణ్‌
Posted on 13-06-2019