Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పునర్విభజనతో పరిష్కారం!

* కశ్మీర్‌పై కేంద్రం కసరత్తు

జమ్ము-కశ్మీర్‌లో కొనసాగుతున్న ప్రాంతీయ విభేదాలు, ముఖ్యంగా జమ్ము, లడఖ్‌ ప్రాంతాలపై కొనసాగుతున్న కశ్మీరీలోయ ఆధిపత్యం ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారాయి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని సూచనప్రాయంగా ప్రస్తావించారు. కశ్మీర్‌లోని యాభై కుటుంబాలు మొత్తం అధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకొన్నాయని ఆయన ఆరోపించారు. ఇటీవల అమిత్‌ షా కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత ఆ రాష్ట్రంలో నియోజక వర్గాల పునర్విభజనకు కసరత్తు జరగబోతున్నట్లు జాతీయ మాధ్యమాల్లో పెద్దయెత్తున ప్రచారం జరిగింది. అయితే అటువంటిదేమీ లేదని హోం మంత్రి అమిత్‌షా, రాష్ట్ర గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ పేర్కొనడం గమనార్హం.

షేక్‌ అబ్దుల్లా కుటిల నీతి
కశ్మీర్‌ సమస్యకు సంబంధించిన మూలాలు చాలా పురాతనమైనవి. 1948లో జమ్ము-కశ్మీర్‌ను మహారాజా హరిసింగ్‌ భారత్‌లో విలీనం చేసిన తరవాత షేక్‌ అబ్దుల్లా నాయకత్వాన ప్రభుత్వం ఏర్పడింది. అబ్దుల్లా ఒత్తిడితో నెహ్రూ ఒప్పందం చేసుకోవడంతోపాటు ఆ తరవాత కశ్మీర్‌కి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఆమోదించారు. రాష్ట్ర అసెంబ్లీకి నియోజకవర్గాలను విభజించేటప్పుడు షేక్‌ అబ్దుల్లా కుటిలనీతితో వ్యవహరించారు. కశ్మీర్‌లోయకి పెద్దపీట వేసి జమ్ముకి అన్యాయం చేశారు. విస్తీర్ణం రీత్యా చూస్తే రాష్ట్రంలో కశ్మీర్‌ లోయ 16, జమ్ము ప్రాంతం 26 శాతంగా ఉంది. అయినా అసెంబ్లీ స్థానాల దగ్గరకు వచ్చేటప్పటికీ కశ్మీర్‌లోయకు 43, జమ్మూకి కేవలం 30 స్థానాలే కేటాయించారు. విస్తీర్ణంలో దాదాపు 58 శాతానికి పైగా ఉన్న లద్దాఖ్‌ ప్రాంతంలో జనాభా తక్కువని రెండు శాసనసభ స్థానాలు మాత్రమే కేటాయించారు. మిగతా 25 స్థానాలు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ కోసం ఖాళీగా అట్టిపెట్టారు. జనాభా ప్రాతిపదికన చూస్తే జమ్ముకశ్మీర్‌లకు చెరిసమానంగా సీట్లు కేటాయించాల్సి ఉంది. అప్పట్నుంచీ జమ్ముకి జరిగిన అన్యాయంపై ఆ ప్రాంత ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. లద్దాఖ్‌ ప్రాంతానికి మొదటి మంత్రివర్గంలో స్థానమే లేదు. ఆ ప్రాంతంలోని లేహ్‌ జిల్లాలో బౌద్ధులు అధికంగా ఉన్నారు. కార్గిల్‌ జిల్లాలో షియా ముస్లిములు అధికం. ఈ ప్రాంత సంస్కృతిని దెబ్బతీసే ప్రయత్నం షేక్‌ అబ్దుల్లా కాలం నుంచీ కొనసాగింది. ఉర్దూను బలవంతంగా వాళ్లపై రుద్దే ప్రయత్నం చేశారు. లద్దాఖ్‌ ప్రాంతం కశ్మీర్‌ డివిజన్‌లో భాగంగా ఉండేది. లద్దాఖ్‌ ప్రాంతవాసుల సంస్కృతీ, ప్రత్యేకతలు కాపాడటంలో కశ్మీర్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయి. అందుకే లడఖ్‌ వాసులు తమ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయమని ఆందోళన చేశారు. ఇదీ ప్రాంతీయ విభేదాలకు మూలం. 35 ఏ అధికరణ తొలగిస్తే తమ ప్రత్యేక సంస్కృతి దెబ్బతింటుందని ఆందోళన చేసేవారు, రాష్ట్రంలో లద్దాఖ్‌ సంస్కృతిని దెబ్బతీయడానికి మాత్రం వెనకాడక పోవడం గమనార్హం.

అధికారం తమదగ్గరే ఉండాలంటే అసెంబ్లీలో మెజారిటీ స్థానాలు తమ ప్రాంతానికే ఉండాలనేది కశ్మీరీలోయ ప్రాంత ప్రజల కోరిక. వారు అందుకు అనువుగా పావులు కదుపుతూనే ఉన్నారు. దేశంలో చివరిసారి 2002లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. జమ్ము-కశ్మీర్‌లో మాత్రం ఒక్కసారే కె.కె.గుప్తా కమిషన్‌ 1995లో నియోజక వర్గాలను పునర్విభజించింది. ఇది కశ్మీర్‌ లోయకు 43, జమ్మూకి 37, లద్దాఖ్‌కి నాలుగు స్థానాలు కేటాయించింది. ఈ కమిషన్‌ కూడా జమ్మూ ప్రాంతానికి జనాభా ప్రాతిపదికన న్యాయం చేయలేదు. కశ్మీర్‌కి ప్రత్యేక రాజ్యాంగం ఉండటంతో దేశవ్యాప్త నియోజకవర్గాల పునర్విభజన చట్టం దీనికి వర్తించదు. దీన్ని అవకాశంగా తీసుకుని కశ్మీరీ లాబీ జమ్ము ప్రాంతానికి అన్యాయం చేస్తుందనేది పరిశీలకుల భావన. 1995 తరవాత కాంగ్రెస్‌-పీడీపీ ప్రభుత్వం శాసనసభా స్థానాలు పెంచడానికి బిల్లు పెట్టింది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మద్దతు లేకపోవడం వలన అది ఆమోదానికి నోచుకోలేదు. మరోపక్క 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన లేకుండా 2002లో ఫరూక్‌ అబ్దుల్లా రాజ్యాంగ సవరణ చేశారు. దీనితో కశ్మీర్‌ అధిపత్యానికి ఢోకా లేకుండా పోయింది. జమ్ముకి న్యాయబద్ధంగా రావాల్సిన స్థానాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అసెంబ్లీలో కశ్మీర్‌ లాబీ మెజారిటీతో జమ్ముకి, లద్దాఖ్‌కి రావాల్సిన నిధులలో ఎప్పుడూ దుర్విచక్షణ కొనసాగుతూనే ఉంది.

మోదీ మొదటి దశలో జమ్ముకు అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేశారు. 2016లో దీనిపై అధ్యయనం చేయడానికి భాజపా-పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నతాధికార కమిటీ నియమించింది. అయితే ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి దాన్ని పనిచేయనివ్వలేదు. దీనితో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ని వేయాలనే డిమాండ్‌ జమ్ము ప్రాంతంలో ఊపందుకుంది. దీనికి బలమైన కారణాలే ఉన్నాయి. 1991లో జమ్ము-కశ్మీర్‌లోని సంచారజాతులైన గుజ్జర్లు, బకార్వాలాలు, గిడ్డీలు, సిప్పీలను షెడ్యూల్డ్‌ట్రైబులుగా గుర్తించారు. వీరు జనాభాలో దాదాపు 12 శాతం ఉంటారు. మతపరంగా చూస్తే వీళ్ళందరూ ముస్లిములే. వీళ్ళు ఆరు నెలలు కశ్మీర్‌ లోయలో, మిగతా ఆరు నెలలు జమ్ము ప్రాంతంలో ఉంటారు. 1991లో వీరిని ఎస్టీలుగా గుర్తించినా ఇంతవరకూ వారికి రిజర్వుడు నియోజక వర్గాలు కేటాయించలేదు. ఈ విషయంలోనూ కశ్మీరీ లాబీ అడ్డుపడుతోంది. జమ్మూ ప్రాంతంలో ఎస్‌సీ రిజర్వుడు నియోజక వర్గాలు ఏడున్నాయి. ఇవి ఎప్పట్నుంచో ‘రొటేషన్‌కు నోచుకోలేదు. ఇదీ రాజ్యాంగ విరుద్ధమే. అతి ముఖ్యమైనది జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్‌ లోయకు, జమ్ముకు మధ్య వ్యత్యాసం 15 లక్షలు మాత్రమే. ఇక్కడా జమ్మూకి కావాలనే అన్యాయం చేశారు. రాష్ట్రంలో సంచార జాతుల జనాభా సుమారు 15 లక్షలు. వీరిని కశ్మీర్‌ లోయ జనాభా కింద పరిగణించారు. సంచార జాతుల జనాభా తీసేస్తే కశ్మీర్‌ లోయ, జమ్ము జనాభా సరి సమానమే. ప్రస్తుత నియోజక వర్గాలు పరిశీలిస్తే కశ్మీర్‌లో సగటున నియోజక వర్గానికి 81 వేల మంది ఓటర్లు ఉండగా, జమ్మూలో 91 వేలమంది ఉన్నారు. రాష్ట్రంలో లక్షపైన జనాభా గల నియోజక వర్గాలు 14 ఉండగా, అందులో 10 జమ్మూ ప్రాంతంలోనే ఉన్నాయి. 1990 దశకం చివరలో రాష్ట్రంలో దాడుల కారణంగా రెండు లక్షల మందికి పైగా కశ్మీరీ పండిట్లు వలసవెళ్లారు. వీరిని కశ్మీరీ లోయవాసులుగా లెక్కగట్టారు. వాస్తవానికి వాళ్ళెవ్వరూ అక్కడలేరు. అందులో రెండొంతులమంది జమ్ములో, మిగతావాళ్ళు దిల్లీ చుట్టుపక్కల తలదాచుకుంటున్నారు. ఆశ్చర్యమేమంటే వీళ్లను బయటికి తరిమిన వాళ్లే అసెంబ్లీలో కశ్మీరీ వాటా పెరగడానికి వాళ్ళను తమ ప్రాంతవాసులుగానే లెక్కించడానికి అభ్యంతరం చెప్పడంలేదు. విభజన సమయంలో పశ్చిమ పాకిస్థాన్‌ నుంచి వలసవచ్చిన శరణార్థులు కశ్మీరులో ఓటర్లు కాదు. వాళ్ళందరూ ప్రస్తుతం జమ్ములో తలదాచుకుంటున్నారు. వారు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కి చెందిన వారు. వీరికి ఖాళీగా ఉన్న 24 సీట్లలో కొన్ని కేటాయించమని బీజేపీ కోరుతోంది. అమిత్‌ షా హోంమంత్రి కావడంతో కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

మతవాదం సరికాదు
అయితే సమస్య పరిష్కారం అంత తేలికకాదు. అబ్దుల్లా కుటుంబం కశ్మీర్‌పై మొదటినుంచీ పట్టు బిగించింది. ఫరూక్‌ అబ్దుల్లా హయాములో నియోజక వర్గాల పునర్విభజన చేయకుండా రాజ్యాంగ సవరణ చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోను మార్పులు చేశారు. ఆ చట్టాలు మార్చకుండా సమస్యకు పరిష్కారం దొరకదు. దీనిపై 2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. ఇది మార్చాలంటే ఒక్కటే మార్గం. ప్రస్తుతం అసెంబ్లీ లేదు కాబట్టి పార్లమెంటు ద్వారా కశ్మీర్‌ రాజ్యాంగానికి సవరణ చేయొచ్చు. ఇందుకు రాజ్యసభలో కాంగ్రెస్‌ మద్దతు కావాలి. జమ్ముకి జరిగిన అన్యాయంలో కాంగ్రెస్‌ గొంతు కలిపే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే కశ్మీర్‌ సమస్యకు కొంతమేర పరోక్షంగా పరిష్కారం దొరికినట్లే. ఇందులో కొంతమంది మతాన్ని చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ వాదన సరికాదు. జమ్మూలో మూడింట ఒకవంతు ముస్లిములున్నారు. లద్దాఖ్‌లో దాదాపు సగం జనాభా ముస్లిములే. మొతం జమ్ము-కశ్మీర్‌లో ముస్లిములు 68 శాతానికి పైగా ఉన్నారు. హిందువులు 28 శాతం మాత్రమే. అందువల్ల దీనిని ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి సంబంధించిన ప్రయత్నంగానే చూడాలి తప్ప మతకోణంలో విశ్లేషించరాదు. ప్రస్తుతం అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. జులై ఒకటినుంచి అమరనాథ్‌ యాత్ర మొదలవుతుంది. చట్ట సవరణలు, అమరనాథ్‌ యాత్ర తరవాత నియోజక వర్గాల పునర్విభజన చేసి ఎన్నికలకు వెళతారని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద త్వరలో కశ్మీర్‌ సమస్యకు కొత్త కోణంలో పరిష్కారం లభించే అవకాశం లేకపోలేదు!

అసమానతల తొలగింపు ప్రయత్నాలు
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రజల కోరిక మేరకు లద్దాఖ్‌ ప్రాంతాన్ని కశ్మీర్‌ డివిజన్‌ నుంచి విడదీసి ప్రత్యేక పాలన డివిజన్‌గా, రెవిన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ఇందుకు గవర్నర్‌ పాలన ఉపయోగపడింది. ఇప్పటి గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నిర్ణయాలు తీసుకోవడంలో వినూత్నంగా ఆలోచిస్తారని పరిశీలకుల అభిప్రాయం. మాలిక్‌ మొదట్లో లోహియా వాది. ఇటీవల భాజపాలో చేరారు. మోదీ ఏరికోరి ఆయన్ని గవర్నర్‌గా ఎంపిక చేశారు. తన హయాములో కశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. లద్దాఖ్‌ని ప్రత్యేక డివిజన్‌ చేయడం ఈ ప్రయత్నంలో భాగమే. లద్దాఖ్‌ ప్రజల కోర్కెను అసెంబ్లీ లేని తరుణంలో గవర్నర్‌ ద్వారా నెరవేర్చడం రాజనీతిగా పేర్కొనవచ్చు. ఎందుకంటే కశ్మీరీ లాబీ మెజారిటీగా ఉన్న అసెంబ్లీలో ఆ ప్రతిపాదనకు ఆమోదం సాధ్యమయ్యే పని కాదు.


Posted on 14-06-2019