Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సమాఖ్య స్ఫూర్తితో అనుసంధానం

* నీతి ఆయోగ్‌ మారాల్సిన విధం
* రాష్ట్రాల వాదనకు దక్కని చోటు
* మేధాసంస్థగానే మిగిలిపోతున్న వైనం
* పరిశోధనల ద్వారా సమాచార సేకరణ
* కేంద్రానికి పథనిర్దేశం
* సమస్యలు యథాతథం

‘రాష్ట్రాల వాదన వినిపించే అవకాశం నీతి ఆయోగ్‌ సమావేశాల్లో లేదు. అందువల్ల అలాంటి సమావేశానికి వెళ్లడంలో అర్థం లేదు’ అన్న పశ్చిమ్‌ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. నేడు దిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి తాను హాజరుకావడం లేదంటూ ఆమె ఇప్పటికే ప్రధానమంత్రికి లేఖ రాశారు. మమతా బెనర్జీ ప్రకటన వెనక రాజకీయపరమైన కారణాలు ఉండవచ్చు. రాష్ట్ర శాసనసభలో పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. దీంతో అక్కడ మమతా పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాల మధ్య పోరు నడుస్తోంది. ఫలితంగా రాష్ట్ర రాజధాని కోల్‌కతా రణక్షేత్రం అవుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్రంపై నిప్పులు చెరిగేందుకు తనకు అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్నీ మమత వదులుకోవడం లేదు. ఆమె విమర్శలను పూర్తిగా విస్మరించలేం. గతంలో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చెప్పింది విని రావడం తప్ప తమ ఇబ్బందులు, అవసరాలు అక్కడ చెప్పుకొనే అవకాశం లేదని ఆ ముఖ్యమంత్రులు ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. తాము అధికారంలోకి వస్తే నీతి ఆయోగ్‌ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని తీసుకువస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సార్వత్రిక ఎన్నికల ముందు ప్రకటించారు. దీన్నిబట్టి ఈ సంస్థ పాత్రపై వివిధ వర్గాల్లో ఏకాభిప్రాయం లేదనేది స్పష్టమవుతుంది.

అనేక పరిమితుల మధ్య...
స్వాతంత్య్రం వచ్చిన తరవాత రాజ్యాంగం, స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసుకున్న భారత ప్రభుత్వం ఆర్థికంగా విభిన్న మార్గాన్ని ఎంచుకుంది. అటు పెట్టుబడిదారీ వ్యవస్థ, ఇటు కమ్యూనిజం కాకుండా మిశ్రమ ఆర్థిక వ్యవస్థ బాట పట్టింది. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందించుకొని అన్ని రంగాల్లో స్వయంసమృద్ధి సాధన దిశగా అడుగులు వేసింది. ఈ పయనంలో కేంద్ర ప్రణాళిక సంఘం కీలక పాత్ర పోషించింది. ప్రణాళిక రచనే కాకుండా మంత్రిత్వ శాఖలవారీగా దాన్ని అమలు చేసేందుకు చొరవ తీసుకుంది. 1991 తరవాత దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. ఫలితంగా ప్రణాళిక సంఘం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. అప్పటికే నామమాత్రంగా ఉన్న ఈ సంఘాన్ని కేంద్రంలో అధికారం చేపట్టిన తొలినాళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసింది. ప్రణాళిక సంఘానికి, నీతి ఆయోగ్‌కు ఎంతో తేడా ఉంది. పూర్తిగా మేధాసంపత్తి సంస్థగా నీతి ఆయోగ్‌ ఉండిపోయింది. ఒక పరిశోధన సంస్థ మాదిరిగా వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, పరిశోధన పత్రాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించడం వరకే ఇది పరిమితమవుతోంది. అంతకుమించి దానికి అధికారాలు, పాత్ర నిర్దేశించలేదు.

ఇప్పటివరకూ నాలుగుసార్లు నీతి ఆయోగ్‌ సమావేశాలు జరిగాయి. నేడు అయిదో సమావేశాన్ని నిర్వహించడానికి కేంద్రంలో రెండోసారి కొలువుతీరిన మోదీ ప్రభుత్వం సిద్ధపడుతోంది. నీటి యాజమాన్యం, వ్యవసాయాభివృద్ధి, వామపక్ష తీవ్రవాదాన్ని అదుపు చేసే చర్యలు, జిల్లాలవారీగా అభివృద్ధి ప్రణాళిక-అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గత నాలుగేళ్ల కాలంలో కొన్ని అంశాలపై నీతి ఆయోగ్‌ తనదైన ముద్ర వేసింది. కొత్త ఆలోచనలను ముందుకు తీసుకురావడం, దానిపై సమగ్ర పరిశీలన తరవాత విధాన పత్రాలను ఆవిష్కరించింది. పలు కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి పథనిర్దేశం చేసింది. ‘ఆయుష్మాన్‌ భారత్‌’, ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌’ వంటి కార్యక్రమాలు, భారత వైద్య మండలి స్థానంలో భారత వైద్య కమిషన్‌ ఏర్పాటు, చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని సరిదిద్దేందుకు ఉద్దేశించిన పోషణ్‌ అభియాన్‌... తరహా నిర్ణయాలు ఈ కోవలోనివే. పాలన యంత్రాంగంలో బాధ్యతారాహిత్యాన్ని నియంత్రిచేందుకు కొన్ని చర్యలు ప్రతిపాదించింది. వివిధ అంశాలను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రస్తావించి పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు చొరవ తీసుకుంది.

నీతి ఆయోగ్‌ సలహా సంస్థ మాత్రమేనని, దానికి ఎటువంటి అధికారాలు లేవని, అది తయారు చేసే ప్రతిపాదనలు, ప్రణాళికలు అమలు చేయకపోయినా అది చేయగలిగినది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. దేశంలో పేదరికం పోలేదు. ఉద్యోగ-ఉపాధి సమస్యలు పీడిస్తూనే ఉన్నాయి. నిరుద్యోగం పెద్ద సమస్యగా మారింది. విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాలు, రహదారులు వంటి ప్రాథమిక అవసరాలపై ప్రభుత్వం వెచ్చించే నిధులు అరకొరగా ఉంటున్నాయి. ఆయా రంగాల్లో జీతభత్యాలు, సాధారణ ఖర్చులకు సంబంధించిన ప్రణాళిక వ్యయం తప్పిస్తే, అభివృద్ధికి కేటాయింపులు ఉండటం లేదు. దీనివల్ల సమాజంలో మౌలికమైన మార్పు రావడం లేదు. కొత్త తరం వస్తున్నా అభివృద్ధి ఛాయలు ప్రస్ఫుటంగా కనిపించడం లేదు. ప్రజలను తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసే దీర్ఘకాలిక ఆర్థిక విధానాలు రూపొందించి, వాటిని కట్టుదిట్టంగా అమలు చేసే బదులు, తాత్కాలిక ప్రయోజనాలు కల్పించే సంక్షేమ పథకాలతో నెట్టుకురావడాన్నే చూస్తున్నాం. సాధారణ నైపుణ్యం గలవారికి, అసలు ఎటువంటి నైపుణ్యాలు లేనివారికి పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే ఉత్పత్తి రంగాన్ని పెద్దయెత్తున అభివృద్ధి చేయాలనే దిశగా బలమైన కార్యాచరణ ఉండటం లేదు. పొరుగున ఉన్న చైనా మూడు దశాబ్దాల్లో అద్భుతాలను ఆవిష్కరిస్తే, అదే పని మనం ఎందుకు చేయలేకపోతున్నామన్న విశ్లేషణ మనదేశంలో కొరవడుతోంది. ఆలోచనలు, ప్రణాళికలు ఎన్నైనా ఉండవచ్చుకాని, వాటిని చివరివరకు తీసుకువెళ్లకపోతే ప్రయోజనం ఏముంటుంది? అమలు కాని ప్రతిపాదనలు ఎన్నిఉన్నా ఏం లాభం అనిపించక మానదు.

దీర్ఘకాలిక ప్రణాళికలు కీలకం
ఎటువంటి అధికారాలు లేకుండా సలహాలు ఇవ్వడం వరకే నీతి ఆయోగ్‌ను పరిమితం చేయడం అసలు సమస్య. ప్రపంచవ్యాప్తంగా అటు సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక-ఆర్థిక కోణంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీనికి తగ్గట్లుగా దేశ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో అభివృద్ధి ఫలాలు అందుకునే అవకాశాన్ని చేతులారా కోల్పోయినట్లు అవుతుంది. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ముందుచూపు కలిగిన, ప్రగతిదాయకమైన ప్రణాళిక అవసరం. అటువంటి ప్రణాళికలను కట్టుదిట్టంగా అమలు చేయడమూ ముఖ్యమే. గతంలో ప్రణాళిక సంఘం మాదిరిగా ప్రస్తుత నీతి ఆయోగ్‌కు అధికారాలు లేవు. ప్రభుత్వ నిర్ణయాలను ఏ విధంగానూ ప్రభావితం చేయగల పరిస్థితి లేదు. విధాన నిర్ణయాల్లో దీని పాత్ర పరిమితం. భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. దక్షిణ కొరియా, మలేసియా, ఇండొనేసియా, తైవాన్‌ తదితర దేశాలు సంప్రదాయ వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థల నుంచి సత్వర పారిశ్రామికాభివృద్ధితో అభివృద్ధి చెందిన దేశాలుగా రూపాంతరం చెందడంలో వార్షిక, పంచవర్ష ప్రణాళికలు కీలకపాత్ర పోషించిన విషయాన్ని విస్మరించరాదు. పొరుగున చైనాలో ఇప్పటికే ప్రభుత్వ ప్రణాళికలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ పాత్రను పునర్నిర్వచించి, మరిన్ని అధికారాలు కట్టబెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంధానకర్త పాత్ర పోషించే బాధ్యత దీనికి అప్పగించాలి. రాష్ట్ర ప్రభుత్వాలూ నీతి ఆయోగ్‌కు పూర్తిగా దూరమై సాధించేది ఏమీ లేదు. కేంద్రం ముందు తమ ఆలోచనలు వినిపించడానికి వీలున్న ఈ వేదికను వినియోగించుకోవటానికి ప్రయత్నిస్తూనే తమకు మేలు జరిగేలా నీతి ఆయోగ్‌ను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేయాలి. రాష్ట్రాలవారీగా వార్షిక ప్రణాళికలను తయారు చేయడం, వాటిని అమలు చేయడం వంటి అంశాల్లో ఈ సంస్థకు క్రియాశీలకమైన పాత్ర కట్టబెట్టాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్‌ చేయాలి. అప్పుడే ఎంతోకొంత ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలతో నీతి ఆయోగ్‌ ప్రతినిధులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇది అవగాహన పెంపొందించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తున్నదే తప్ప, రాష్ట్రాల అవసరాలు తీర్చే కసరత్తు మాదిరిగా లేదు. వివిధ పథకాలకు సంబంధించి నిధుల కేటాయింపులను సిఫార్సు చేసే బాధ్యత సైతం దీనికి ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కొందరు ఆర్థికవేత్తల్లో ఉంది. రద్దు చేసిన ప్రణాళిక సంఘాన్ని మళ్ళీ తీసుకురావడంలో అర్థం లేదు. దాని స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేయడమే నేటి అవసరం!

రాష్ట్రాల మాటకు మన్నన ఎన్నడు?
'సహకార సమాఖ్య’గా భావిస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో అందుకు భిన్నంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఎప్పుడూ ఉంటూనే ఉంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విబేధాలు, అవగాహనా లోపం, హక్కులు-బాధ్యతల విషయంలో భిన్నాభిప్రాయాలు కొత్తేమీ కాదు. వీటిని పరిష్కరించడానికి గతంలో ‘సర్కారియా కమిషన్‌’ ఎన్నో సూచనలు చేసింది. రాష్ట్రాల ప్రాథమ్యాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రచన, అమలు ఉండాలని, రాష్ట్రాల గొంతు వినే పరిస్థితి దిల్లీలో ఉండాలని నిపుణులు సూచించిన సందర్భాలు లేకపోలేదు. అందుకు అనువైన వ్యవస్థీకృత యంత్రాంగం అవసరమనే సిఫార్సులు కొత్తేమీ కాదు. కానీ బలమైన సంస్థలు ఉన్నప్పుడే ఆ అవసరం తీరలేదు. ఇప్పుడు ప్రతిపాదనలు-సిఫార్సులు చేసే సంస్థగా మిగిలిన నీతి ఆయోగ్‌ ఏం చేయగలుగుతుందనే సందేహాలకు సమాధానం లేదు.


- సుబ్బారావు గన్నవరపు
Posted on 15-06-2019