Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

రాష్ట్రాల గోడు వినేదెవరు?

రాష్ట్రాల అభివృద్ధి కాంక్షలు, మధ్యతరగతి కోరికలు, యువతరం ఆశలు, అయిదు కోట్లమంది చిన్న వ్యాపారుల కలలు సహా అన్నింటినీ అందరినీ పరిగణనలోకి తీసుకొంటుందంటూ ప్రధాని మోదీ రూపుదిద్దిన నీతి ఆయోగ్‌ ఆవిర్భవించి అయిదున్నరేళ్లు అయింది. సుసంపన్న ఆర్థిక వ్యవస్థ నిర్మాణమే లక్ష్యమంటూ 2022-’23 నాటికి 288 లక్షల కోట్ల రూపాయల (నాలుగు ట్రిలియన్‌ డాలర్ల) స్థూల దేశీయోత్పత్తి సాధనకు అనువైన వ్యూహపత్రాన్ని నిరుడు డిసెంబరులో నీతి ఆయోగ్‌ వెలువరించింది. నేడు జీడీపీ వృద్ధిరేటు, విత్తలోటు, ఉద్యోగిత, పారిశ్రామిక ప్రగతి మరింతగా క్షీణించిన దశలో- రాష్ట్రాల దన్నుతో దేశార్థికానికి చురుకుపుట్టించే కార్యాచరణ తక్షణం ఊపందుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ అయిదో సదస్సు- 2024 నాటికి అయిదు ట్రిలియన్‌ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది. అయిదేళ్లలో దేశ స్థూలోత్పత్తిని రెట్టింపు చెయ్యడం పెను సవాలే అయినా, రాష్ట్రాలు కలిసికట్టుగా కూడివస్తే అసాధ్యం కాదని ప్రధాని మోదీ స్పష్టీకరిస్తున్నారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసలపై ఉమ్మడి పోరాటం సాగాలని, 2022 నాటికి ‘నయా ఇండియా’ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలని మోదీ నిర్దేశిస్తున్నారు. నిరుడీ రోజుల్లో నీతి ఆయోగ్‌ నాలుగో భేటీలోనే రెండంకెల వృద్ధి సాధనే అందరిముందున్న సవాలు అని మోదీయే స్పష్టీకరించినా, మానవాభివృద్ధి ప్రామాణికాలను 115 ఆశావహ (బాగా వెనకబడిన) జిల్లాల్లో గణనీయంగా మెరుగుపరచాలని నిర్ణయించినా ఈసారీ అవే లక్ష్యాల పునరుక్తి- దేశార్థిక రథం సజావుగా సాగడం లేదనేందుకు సంకేతం. స్వచ్ఛభారత్‌, డిజిటల్‌ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి వంటివాటిపై ముఖ్యమంత్రులతో వేసిన ఉపసంఘాలు విధానాల రూపకల్పనకు దోహదపడ్డ మాట నిజమే అయినా, రాష్ట్రాల భాగస్వామ్యం అంతవరకే పరిమితం కావడం- ‘శ్రేష్ఠ్‌ భారత్‌’ లక్ష్యాల సాధనకు తీవ్రాఘాతం!

ఆరున్నర దశాబ్దాల పాటు పంచవర్ష ప్రణాళికల పేరిట- పంచవన్నెల వంచనా చిత్రాన్ని కళ్లకు కట్టడానికే పరిమితమైన ప్రణాళిక సంఘం స్థానే నీతి ఆయోగ్‌ ఆవిర్భవించింది. గతంలో ప్రణాళిక సంఘం తీర్మానాలను జాతీయాభివృద్ధి మండలి సభ్యుల హోదాలో మొక్కుబడిగా ఆమోదించడానికే ముఖ్యమంత్రుల పాత్ర పరిమితం అయ్యేది. ఆ చేదు గతానికి భిన్నంగా ప్రగతి వ్యూహాల నిర్మాణంలో, కార్యాచరణ క్రతువులో ఆయా రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్యానికి చోటుపెట్టగలదనుకొన్న నీతి ఆయోగ్‌ వ్యవహార సరళి పట్ల పలువురు ముఖ్యమంత్రులు మూతి విరుస్తున్నారు. దీక్ష, దక్షత, వనరులపరంగా ఎంతమాత్రం లోటు లేదని ప్రధానమంత్రి ఆయా సందర్భాల్లో ప్రస్తావిస్తున్నా- కరవు వరదల్లాంటి ప్రకృతి ఉత్పాతాలు తీవ్రతరంగా విరుచుకుపడినప్పుడు యథాపూర్వం రాష్ట్రాలు కేంద్రం వైపు మోరసాచక తప్పడం లేదు! వేలకోట్ల రూపాయల నష్టాన్ని రాష్ట్రం నెత్తిన రుద్దేలా భయానక వరదలు విరుచుకుపడ్డా, తమకు అందిన తోడ్పాటు అంతంత మాత్రమేనన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి మాటతో పలువురు ముఖ్యమంత్రులు ఏకీభవిస్తున్నారు. ఇప్పటితీరులో నీతి ఆయోగ్‌ పనిపోకడలు రాష్ట్రాల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా లేవంటూ పలు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పన కేంద్రీకృతమైపోతోందన్న ముఖ్యమంత్రుల అభ్యంతరాల్లో తప్పు పట్టాల్సిందేమీ లేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటా సగటున 40 శాతానికి చేరడం, పరిమితంగా ఉన్న ఆర్థిక వనరులపై పెనుభారం మోపుతోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన, సంక్షేమ పథకాల అమలు రాష్ట్రాల బాధ్యతే అయినప్పుడు- వనరుల పంపిణీలో ఆర్థిక సమాఖ్య భావనకు చోటుపెట్టకుంటే ఆశించిన ప్రయోజనాలు ఎలా ఒనగూడుతాయి?

నిరుడు జనవరిలో ప్రారంభించిన ఆశావహ జిల్లాల్లో బ్లాకులవారీగా కేంద్రం రూపొందించిన పథకాల్ని తమ బృందాలే పర్యవేక్షిస్తాయని నీతి ఆయోగ్‌ చెబుతోంది. మూడు నెలలకోసారి జిల్లాలవారీ సమీక్షా జరుపుతామంటోంది! సహకార సమాఖ్య మౌలిక సూత్రావళికి అనుగుణమైన పద్ధతేనా అది? ప్రకృతి ఉత్పాతాల తాకిడిని ప్రస్తావిస్తూ ఒడిశా, పార్లమెంటులో ఇచ్చిన వాగ్దానాలపై నిలదీస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక ప్రతిపత్తి కోసం గళమెత్తినా వాటికి సమాధానం ఏదీ? మరికొద్ది నెలల్లో వెలువడనున్న పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక- రాష్ట్రాలను నీట ముంచుతుందో, పాల ముంచుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాల్ని బేఖాతరు చేసి 2011నాటి జనాభా లెక్కల్నే ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు మొన్న ఫిబ్రవరి మూడోవారంలో ఎన్‌కే సింగ్‌ సారథ్యంలోని ఆర్థికసంఘం ప్రకటించింది! జన నియంత్రణ సాధించిన రాష్ట్రాలకు నష్టం వాటిల్లకుండా తాము సమతూకం సాధించాల్సి ఉందన్న ఆర్థిక సంఘం- 42 శాతం వనరుల బదిలీ అంశాన్నీ పునస్సమీక్షించబోతోంది. రాష్ట్రాలకు గరిష్ఠంగా ఆర్థిక వనరుల్ని మళ్ళించి అభివృద్ధి వ్యూహల్ని అవే రూపొందించుకొనే స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా సమాఖ్య స్ఫూర్తిని నిలబెడుతున్నామని మోదీ సర్కారు చెబుతున్నా- వాస్తవం వేరు! చూపులకు ఏపుగా ఉన్న వనరుల పంపిణీలో ఎన్ని లొసుగులున్నాయో నిరుడే విశదీకరించింది భాజపా నేతృత్వంలోనే ఉన్న గుజరాత్‌ సర్కారు! రాష్ట్రాలన్నీ అంతర్గత బలిమిపై దృష్టి పెట్టి, ఎగుమతి అవకాశాల్ని ఒడిసిపట్టి జిల్లాస్థాయిలో అభివృద్ధి వికాసాన్ని దేశార్థిక రెండంకెల వృద్ధిరేటుగా మలచాలన్న నిర్దేశం వీనులవిందుగా ఉన్నా- తరుముకొస్తున్న కరవును ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమవుతున్న రాష్ట్రాలకు ఆ సుభాషితాలు చెవికెక్కుతాయా? ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి కేంద్రం కట్టుబాటు చాటకుండా- నీతి ఆయోగ్‌ చెప్పే సమ్మిళిత, స్థిర, పరిశుద్ధ, హేతుబద్ధ అభివృద్ధి సాధ్యమా?


Posted on 17-06-2019