Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

కొత్త సభ... కొన్ని సవాళ్లు!

* నేటి నుంచి పార్లమెంటు పదిహేడో సమావేశాలు

నూట ముప్ఫై కోట్లకు పైగా ప్రజావళి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా కొలువుతీరిన పదిహేడో లోక్‌సభ సమావేశాలు నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. మోదీ సారథ్యంలోని అయిదేళ్ల మలి దఫా ప్రభుత్వ ప్రస్థానం బడ్జెట్‌ సమావేశాలతోనే మొదలవుతుండటం విశేషం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వచ్చే నెల అయిదో తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు! ఎన్నికల వేళ భాజపా బోలెడన్ని జనాకర్షక వాగ్దానాలు గుప్పించింది. దేశ ఆర్థిక వ్యవస్థ ముందు ఇప్పుడు లెక్కకు మిక్కిలి సవాళ్లు ఉన్నాయి. ఇచ్చిన వాగ్దానాలను ఏదో స్థాయిలో నెరవేర్చి ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలను సంతృప్తిపరచడంతోపాటు- జాతి ఆర్థికానికి పొంచి ఉన్న సవాళ్ల నేపథ్యంలో వాస్తవిక అవగాహనతో స్పందిస్తూ బడ్జెట్‌ను వండివార్చేందుకు మోదీ ప్రభుత్వం ఈసారి పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. దేశ దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా మౌలిక రంగంలోకి పెట్టుబడుల ప్రవాహం పెరగాల్సి ఉంది. ఈ సమావేశాల్లో ఆ దిశగా ముందడుగు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సభలో సంపూర్ణ మెజారిటీ ఉండటం- ఆటంకం లేకుండా అనేక బిల్లులను చట్టరూపంలోకి మార్చుకొనే వెసులుబాటును కల్పిస్తోంది. లోక్‌సభతోపాటు రాజ్యసభలోనూ ఈ దఫా భాజపా సర్కారు సంపూర్ణ ఆధిక్యత సాధించే అవకాశాలున్నాయి. ప్రభుత్వానికి ఉభయ సభల్లోనూ పూర్తి మెజారిటీ ఉండటమన్నది ఎనిమిదో దశకంలో రాజీవ్‌ హయాములోనే సాధ్యమైంది. మరో ఏడాదిలో మోదీ ప్రభుత్వమూ ఈ రికార్డును సొంతం చేసుకోనున్న నేపథ్యంలో- లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లులు రాజ్యసభ గడపనూ అనాయాసంగా దాటే పరిస్థితులు విస్పష్టంగా కనిపిస్తున్నాయి.

తగ్గుతున్న నిపుణులు
దేశ భావిగతిని నిర్దేశించే అంశాలపై లోతైన చర్చ తరవాతే పార్లమెంటు వాటిపై సముచిత నిర్ణయాలు వెలువరిస్తుంది. సభలో భిన్న రంగాలకు సంబంధించిన నిష్ణాతులు కొలువుతీరినప్పుడే వివిధ అంశాలపై సహేతుక చర్చ సాధ్యపడుతుంది. పదిహేడో లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల్లో కీలక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు తక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. సభలో న్యాయవాదులు నాలుగు శాతంకన్నా తక్కువ సంఖ్యలో ఉండగా, వైద్యులు నాలుగు శాతం, ఉపాధ్యాయులు మూడు శాతంగానే ఉన్నారు. భారత రాజ్యాంగానికి ఊపిరిపోసిన రాజ్యాంగ సభలో అత్యధిక సంఖ్యలో న్యాయకోవిదులు ఉండేవారు. మొదటి లోక్‌సభలో 36శాతం ఎంపీలు న్యాయవాదులు. వారిలో అత్యధికులు ప్రపంచంలోని విఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నవారే! ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం లోక్‌సభలో ఆయా రంగాల్లో నిపుణుల సంఖ్య తగ్గడం- చర్చల నాణ్యతపై ప్రభావం కనబరుస్తుందనడంలో సందేహం లేదు. చర్చలో ఉపయోగించే ప్రతి పదం వెనక అర్థాన్ని, అంతరార్థాన్ని సభ్యులు సరిగ్గా అవగతం చేసుకోగలిగితేనే పార్లమెంటు వేదికగా సహేతుక చట్టాల రూపకల్పన సాధ్యమవుతుంది. సభ్యులు సంబంధిత అంశాలపై లోతైన అవగాహన పెంపొందించుకొని, రెట్టింపు ఉత్సాహంతో స్పందించడం ద్వారా పార్లమెంటరీ చర్చలకు పునర్వైభవం తీసుకురావాల్సి ఉంది. చట్ట రూపకల్పన సందర్భంగా జరిగిన చర్చలు, వాదోపవాదాలు భావితరాలకు అద్భుతంగా అక్కరకొస్తాయి. మరీ ముఖ్యంగా చట్టాల అమలు తీరుపై వివాదం తలెత్తినప్పుడు న్యాయస్థానాలు సాధారణంగా పార్లమెంటులో జరిగిన చర్చలను పరిశీలిస్తుంటాయి. వివిధ చట్టాల రూపకల్పనలోని వాంఛిత అర్థాన్ని ఈ చర్చలు వెల్లడిస్తాయి. ఒకవేళ ఎలాంటి చర్చలు లేకుండా చట్టాలను పట్టాలకెక్కిస్తే- వాటిపై వ్యాఖ్యానం వినిపించాల్సిన తరుణంలో న్యాయస్థానాలకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది.

ఈ సభలో ముమ్మార్లు తలాక్‌ సహా 10 అత్యవసరాదేశాల(ఆర్డినెన్సుల)ను చట్టాలుగా ఆమోదించాల్సి ఉంది. ముమ్మార్లు తలాక్‌పై గడచిన సభాకాలంలో ఆర్డినెన్సు జారీ అయినప్పటికీ- రాజ్యసభ ఆమోదం పొందకపోవడంతో అది మురిగిపోయింది. అత్యంత కీలకమైన ఆధార్‌ చట్టానికి, పౌరసత్వ బిల్లుకు సవరణల వ్యవహారంపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ముఖ్యమైన మరో పది బిల్లులు సభ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని 44 చట్టాలకు అవసరమైన మార్పులు చేసి వాటిని వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక రక్షణ-సంక్షేమం, పారిశ్రామిక సంబంధాలు వంటి నాలుగు స్మృతులుగా వర్గీకరించాలన్న తమ ఆలోచనను మోదీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. వేతనాలు, పారిశ్రామిక రక్షణతో ముడివడిన ఇరు స్మృతులను పార్లమెంటు తొలి సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోదింపజేసుకోవాలనుకుంటోంది. ప్రతి రూపాయిని ప్రభుత్వం ఆచితూచి ఖర్చు చేయాల్సిన సందర్భమిది. ఉపాధిని పెంచడంతోపాటు, విత్తలోటు కట్టడి అంత సులభం కాదు. ప్రైవేటు పెట్టుబడులకు నేరుగా లాకులెత్తడంగాని లేక మరిన్ని పెట్టుబడులకు తావిచ్చే తరహాలో వ్యయాలకు ఊపునివ్వడంగాని చేయాల్సి ఉంది. మూడు కీలక అంశాలపై మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఆస్తి హక్కుకు సంబంధించి రాజ్యాంగ సవరణ తీసుకురావడంతోపాటు; భూమి, భూ రికార్డులపై పటిష్ఠ చట్టాన్ని రూపొందించడం; జల వనరులు, సంబంధిత మౌలిక సదుపాయాల కల్పనపై పెట్టుబడులను ఇనుమడింపజేయడం వంటివి కేంద్ర సర్కారు తక్షణం దృష్టి సారించాల్సిన అంశాలు.

భూమి రికార్డులు, లీజులు, ఇతర ఆస్తులకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం పెద్దయెత్తున సంస్కరించాల్సి ఉంది. ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుగా మారుస్తూ రాజ్యాంగ సవరణ తీసుకురావడంవల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులకు సానుకూల సంకేతాలు పంపినట్లవుతుంది. 1978నాటి 44వ రాజ్యాంగ సవరణకు ముందున్న విధంగా ఆస్తిహక్కుకు సంబంధించిన అధికరణ 19 (1) (ఎఫ్‌)ను, అధికరణ 31ని తిరిగి తీసుకురావాలి. దేశ ఆర్థిక వ్యవస్థ శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న తరుణంలో ఆస్తుల రక్షణ, భద్రతకు సంబంధించిన భరోసా అత్యంత కీలకమవుతుంది. మరోవంక భూమి రికార్డులన్నింటినీ సమూలంగా సమీక్షించి, వాటిని డిజిటలీకరించడం ప్రభుత్వం చేయాల్సిన మరో ముఖ్యమైన పని. రాజ్యాంగపరంగా భూ రిజిస్ట్రేషన్లు, భూ రెవిన్యూ రాష్ట్రాల పరిధిలోని అంశాలు. దేశవ్యాప్తంగా భూముల సమగ్ర పునఃసమీక్ష, సంబంధిత రికార్డుల కంప్యూటరీకరణ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. భూముల సర్వే, కంప్యూటరీకరణకు పెద్దయెత్తున మానవ వనరులు అవసరపడతాయి. తద్వారా దేశంలో ఉపాధి విస్తరణకూ దారులు తెరచుకుంటాయి. భూముల పునఃసర్వే జరిగి, రికార్డుల కంప్యూటరీకరణ పూర్తయితే ఆస్తుల క్రయ విక్రయాలు జోరందుకుంటాయి. భూ లావాదేవీలకు సంబంధించిన వ్యయాలు బాగా తగ్గుతాయి. ఆ రకంగా దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడుగుతుంది. భూ రికార్డుల కంప్యూటరీకరణ వల్ల నల్లధనానికి అడ్డుకట్ట పడుతుంది. దేశంలోని బడా బాబులంతా తమ అక్రమార్జనను స్థిరాస్తి లావాదేవీల చుట్టూ తిప్పుతున్నారన్నది ఎవరూ కాదనలేని నిజం. ఈ పరిస్థితుల్లో రికార్డుల కంప్యూటరీకరణ జరిగితే అక్రమ లావాదేవీలకు చెక్‌ పెట్టినట్లవుతుంది. నిజానికి ఆ దిశగా 2008లోనే కేంద్ర ప్రభుత్వం అడుగులు కదిపింది. రికార్డుల ప్రక్షాళన, డిజిటలీకరణ ద్వారా ఎలాంటి వివాదాలకు తావులేని రీతిలో భూ పట్టాలను మంజూరు చేయాలని; తద్వారా స్థిరాస్తి లావాదేవీలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం తలపోసింది. దురదృష్టవశాత్తు పదేళ్లు గడచినా ఆ కార్యక్రమం ఇప్పటికీ పూర్తి కాలేదు.

బాధ్యతలెన్నో...
పన్నెండో పంచవర్ష ప్రణాళిక (2012-2017) కాలానికే భూముల పునఃసర్వే, రికార్డుల ప్రక్షాళన, కంప్యూటరీకరణ కార్యక్రమం పూర్తయి ఉండాల్సింది. దేశంలో 79 శాతం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కంప్యూటరీకరణ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భూ రికార్డులు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలకు సంబంధించి 58శాతం డిజిటలీకరణ పూర్తయింది. దేశంలోని కొన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఇప్పటికీ కనీసం అంతర్జాల సౌకర్యం లేదు. దేశంలో ఇప్పటివరకూ కేవలం 12శాతం గ్రామాల్లో మాత్రమే భూముల సర్వే/రీ సర్వే జరిగింది. కొన్ని రాష్ట్రాలు మాత్రమే భూముల రిజిస్ట్రేషన్‌ వివరాలను బ్యాంకులతో అనుసంధానించగలిగాయి. అయితే ఏ ఒక్క రాష్ట్రం కూడా రిజిస్ట్రేషన్‌ సమాచారాన్ని న్యాయస్థానాలతో అనుసంధానించకపోవడం బాధాకరం. దేశంలో ఆరు లక్షలకుపైగా గ్రామాలుంటే- భూముల సర్వే, రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ కేవలం రూ.1,900 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి- ఈ కార్యక్రమాన్ని నెత్తికెత్తుకోవాల్సి ఉంది. జలవనరులను సమర్థంగా నిల్వ చేయడమన్నది ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన మరో ప్రాధాన్యాంశం. దేశంలో వ్యవసాయం ఇప్పటికీ ప్రధానంగా రుతుపవనాల ఆధారంగానే జరుగుతోంది. పర్యావరణ మార్పులవల్ల వర్షపాతం క్రమక్రమంగా కోసుకుపోతోంది. దేశానికి 75శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల కారణంగానే సాధ్యపడుతోంది. భారత భూగర్భ జలాల్లో 58శాతానికి రుతుపవనాలే ఆదరవుగా ఉన్నాయి. ఏడాదిలో కొన్ని నెలలపాటు జోరుగా వర్షాలు పడి, మిగిలిన కాలంలో అనావృష్టి పరిస్థితులు విస్తరించడం పర్యావరణపరంగా భారత్‌ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా ఉన్నప్పుడే ప్రతి నీటి బొట్టునూ నిల్వ చేసేందుకు ప్రయత్నించాలి. అలా చేస్తే భూగర్భ జల మట్టాలూ గణనీయంగా పెరుగుతాయి. వ్యవసాయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జల వనరుల సంరక్షణ, సంబంధిత మౌలిక సదుపాయాల విస్తరణపై ప్రభుత్వం పెద్దయెత్తున నిధులు వెచ్చించాల్సి ఉంది. జల వనరులకు సంబంధించి దేశంలోని ప్రతి గ్రామం, పట్టణం స్వావలంబన సాధించే విధంగా ప్రణాళికలను రూపొందించి అమలుపరచాలి. పార్లమెంటు సమావేశాల్లో నిర్దిష్ట లక్ష్యాల సాధనకు అధికార, విపక్షాలు కృషి సాగించాల్సిన తరుణమిది!


Posted on 17-06-2019