Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

మోదీ పాలన దశా దిశ

ముందున్నవి మంచి రోజులు అన్న నినాదంతో ఎన్నికల సమరంలో పాల్గొన్న భాజపాకు ప్రజలు పూర్తిస్థాయి ఆధిక్యం కట్టబెట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గద్దెనెక్కి ఏడు నెలలవుతోంది. సామాన్యులకు భరోసా కలిగించే కీలక మార్పులేవీ ఇప్పటివరకూ చోటుచేసుకోలేదు. జన్‌ధన్‌ యోజన, స్వచ్ఛభారత్‌ వంటి పథకాలతో ప్రజల ముందుకొచ్చిన మోదీ ప్రభుత్వం- ముఖ్యమైన సంస్కరణలనూ అత్యవసరాదేశాల ద్వారానే చేపడుతోంది. ఏలినవారి నిర్ణయాలు క్షేత్రస్థాయిలో సామాన్యులకు సాంత్వన కలిగించినప్పుడే భాజపా ప్రవచిత 'అచ్ఛే దిన్‌' నినాదం సాకారమయ్యేది!

ఆర్థిక సంక్షోభం ఫలితంగా 2008లో అమెరికా, ఆ తరవాత ఐరోపా ఆర్థిక వ్యవస్థలు పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయాయి. సంక్షోభం ఆ దేశాలతో ఆగకుండా, అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలకూ విస్తరించింది. ఫలితంగా భారత్‌కూ కష్టాలు వచ్చిపడ్డాయి. అప్పటివరకు 8-9శాతంగా ఉన్న వృద్ధిరేటు కాస్తా అయిదు శాతానికి పడిపోయింది. నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, ఎక్కువ వడ్డీరేట్లు, ధరోల్బణాలతో ప్రజలు ఇబ్బందులపాలయ్యారు. అవినీతి, కుంభకోణాలు పెచ్చరిల్లి వ్యవస్థలు గాడితప్పాయి. మళ్ళీ మంచిరోజులు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూసిన సందర్భమది. 2014 ప్రారంభంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఒక సదస్సులో 'మనకివి ఇబ్బందికరమైన రోజులు. అయినా, మంచిరోజులు రాబోతున్నా'యని సెలవిచ్చారు. ఆ మాటనే తరవాత తన ఎన్నికల నినాదంగా భారతీయ జనతాపార్టీ అందిపుచ్చుకొంది. 'అచ్ఛే దిన్‌ ఆనేవాలే హై' అంటూ జోరుగా ప్రచారం చేసింది. మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలందరూ అండగా నిలవడంతో అనూహ్య ఆధిక్యతతో కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుంది. ఎన్నికల ప్రచార సారథిగా దేశాన్ని చుట్టేసిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా పట్టాభిషిక్తులయ్యారు. మంచిరోజులు (అచ్ఛే దిన్‌) వస్తాయని, భవిష్యత్తు ఎంతో బాగుంటుందని భాజపా సారథ్యంలోని ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు పదేపదే చెబుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ అచ్ఛే దిన్‌ ఎక్కడని ప్రజలు అటూఇటూ చూస్తున్నారు. ప్రభుత్వమైతే ఏదో చేస్తున్నట్లు, హడావుడి పడుతున్నట్లు కనిపిస్తోంది. అదే రీతిలో క్షేత్రస్థాయిలో మార్పులు కనిపించడం లేదు. కాకపోతే, మార్పులు మొదలైంది ఇప్పుడే కాబట్టి, ఫలితాలు కనిపించటానికి ఇంకొంత సమయం పట్టేట్లుంది.

కలిసొచ్చిన కాలం

ప్రధానమంత్రి పీఠాన్ని నరేంద్ర మోదీ అధిష్ఠించగానే ఖాళీ ఖజానా, అధిక లోటు, నిరాశాజనకమైన ఆర్థిక వ్యవస్థ ఆయనకు తక్షణ సమస్యలయ్యాయి. అందుకే నిధులు ఖర్చయ్యే పథకాలకు బదులు, ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు ఎంచుకున్నారు. వినూత్నరీతిలో స్వచ్ఛ భారత్‌, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన, మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమాలు చేపట్టారు. వాస్తవానికి ఇవేమీ పూర్తిగా కొత్త కార్యక్రమాలు కావు. అందరికీ బ్యాంకింగ్‌ సేవలు (ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌) అందించే లక్ష్యంతో బ్యాంకు ఖాతాలు తెరిపించే దిశగా దశాబ్దకాలంగా ప్రభుత్వ పరమైన కార్యక్రమాలు సాగుతున్నాయి. అదేవిధంగా తయారీ రంగం అభివృద్ధి చెందకపోతే స్థిరమైన ప్రగతి సాధించటం కష్టం కాబట్టి, ఆ రంగానికి అధిక ప్రోత్సాహం ఇవ్వాలనే ఆలోచన ఎంతకాలంగా ఉంది. కానీ, స్వయంగా ఈ కార్యక్రమాలకు తానే ప్రచారకర్తగా నిలిచిన ప్రధానమంత్రి, గతంలో రాని ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించారు. అందులో చాలావరకు సఫలీకృతులయ్యారనే చెప్పాలి. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కార్యక్రమం కింద, స్వల్పకాలంలోనే 10.09కోట్ల బ్యాంకు ఖాతాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఖాతాల ద్వారా బ్యాంకుల్లోకి రూ.7,778కోట్లు వచ్చిచేరాయి. గోవా, కేరళ, త్రిపుర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కుటుంబానికొకటి చొప్పున అన్ని కుటుంబాలకూ బ్యాంకు ఖాతాలు సమకూరాయి. ఇంత తక్కువ సమయంలో అధిక సంఖ్యలో బ్యాంకు ఖాతాలు తెరవటం అనేది రికార్డే. ఈ ఖాతాల ద్వారా ఎల్‌పీజీ సబ్సిడీ, ప్రభుత్వం నుంచి లభించే ఇతర రాయితీలను పంపిణీ చేయటానికి వీలు కలుగుతుంది. తద్వారా అర్హులకే సబ్సిడీ అందటంతో పాటు, ఆ మొత్తం బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా పంపిణీ అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఇది ప్రయోజనకారే. ఇక ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించటానికి 'మేక్‌ ఇన్‌ ఇండియా' అంటున్నారాయన. దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాన్ని ఈ రూపంలో మొదలుపెట్టారు.

అనుకోనివిధంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిసరకులు, లోహాల (కమాడిటీ) ధరలు తగ్గటం మొదలైంది. ముడిచమురు ధర అనూహ్యంగా పతనమైంది. ఇది ప్రభుత్వానికి కలిసి వచ్చింది. పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గటంతో అక్కడ కొత్తగా పన్నులు వడ్డించి ఆదాయాలను పెంచుకునే అవకాశం ప్రభుత్వానికి లభించింది. ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, 4.1శాతానికి లోటును పరిమితం చేయాలనే లక్ష్యానికి కట్టుబడి ఉండటం మరికొన్ని సానుకూలాంశాలు. అంతర్జాతీయంగానూ వ్యూహాత్మక వైఖరి అనుసరించి నరేంద్ర మోదీ తనకు అనుకూల పరిస్థితి సృష్టించుకున్నారు. ఆస్ట్రేలియా, జపాన్‌, అమెరికా పర్యటనలన్నీ ఒకెత్తు. గణతంత్ర దినోత్సవానికి అతిథిగా వచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు ఒబామాను ఒప్పించటం మరోఎత్తు. ఇక రాష్ట్రాల ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించడమూ చెప్పుకోదగ్గ అంశం. ఇలా ఏవిధంగా చూసినా ప్రధానమంత్రికి గత ఏడు నెలల కాలమంతా మంచిరోజులే!

ద్రవ్యోల్బణం అధికంగా ఉందనే ఉద్దేశంతో కీలకమైన వడ్డీరేట్లను తగ్గించటానికి భారతీయ రిజర్వు బ్యాంకు సుముఖంగా లేదు. అటు వ్యాపార వర్గాలు, ఇటు ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ఇంకొంతకాలం చూద్దామంటూ, వడ్డీరేట్ల తగ్గింపును వాయిదా వేస్తూ వస్తోంది. కేంద్రంలో ప్రభుత్వం మారిన దరిమిలా భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో స్టాక్‌మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా దేశీయ, విదేశీ సొమ్ము వచ్చింది కానీ, ఉత్పత్తి-సేవారంగాల్లోకి మాత్రం అంతే స్థాయిలో నిధుల ప్రవాహం నమోదు కాలేదు. నల్లధనాన్ని స్విస్‌ బ్యాంకుల నుంచి మొత్తంగా వెనక్కి తీసుకువస్తామని చెప్పిన ప్రభుత్వమే దానిపై ఇప్పుడు అంతేస్థాయిలో చొరవ ప్రదర్శించటం లేదు. 'మేక్‌ ఇన్‌ ఇండియా' చెప్పుకోవటానికి ఆకర్షణీయంగా ఉంది. దీనివల్ల ఉత్పత్తి రంగం విస్తరించి పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి సంపద సృష్టికి వీలు కలుగుతుంది. తద్వారా ప్రజల తలసరి ఆదాయం పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అదే జరిగితే 'అచ్ఛే దిన్‌' వచ్చినట్లే. అయితే దేశీయంగా ఉత్పత్తి రంగం విస్తరించటానికి అవసరమైన పెట్టుబడులను ఎవరు తీసుకువస్తారనేదే ప్రశ్న. దీనికి పూర్తిగా ప్రైవేటురంగం మీద ఆధారపడితే కలిగేది ఆశాభంగమే. ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించి పెద్దయెత్తున పెట్టుబడులతో ముందుకు వస్తే, ఆ స్ఫూర్తిని అందుకొని ప్రైవేటు రంగమూ భాగస్వామి అవుతుంది. ప్రభుత్వం వద్ద అటువంటి కార్యాచరణ ప్రణాళిక ఉన్నట్లు కనిపించటంలేదు. బదులుగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని అనుకుంటున్నట్లు వివిధ ప్రాజెక్టుల్లో భాగం పంచుకోవలసిందిగా జపాన్‌, చైనా, అమెరికా సంస్థలను ఆహ్వానించటాన్ని చూస్తే స్పష్టమవుతోంది. ద్రవ్యలోటును 4.1శాతానికి పరిమితం చేయాలనే లక్ష్యానికి కట్టుబడాలని ప్రభుత్వం భావిస్తోంది. నిధుల సమీకరణ ఎలానో చెప్పటం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ.58,000కోట్లు సమీకరించాలని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గతంలో చెప్పారు.

కానీ, ఇంతవరకూ సెయిల్‌ ఇష్యూ ద్వారా రూ.1,700కోట్లు మాత్రమే సమీకరించారు. ఇంకా ఆర్థిక సంవత్సరాంతానికి మూడు నెలలే మిగిలిఉన్న పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా నిర్దేశిత మొత్తాన్ని సమీకరించటం కష్టసాధ్యమని స్పష్టమవుతూనే ఉంది. ఇక, దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన మౌలిక సదుపాయాల రంగాన్ని పునరుత్తేజితం చేసేందుకు చర్యలు ఇంతవరకు మొదలుకాలేదు. అప్పులు, నష్టాల వలలో చిక్కుకొని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్వహించే సంస్థలు కునారిల్లుతున్నాయి. ఈ రంగంలో మూలధనం కొరతను అధిగమించటానికి గత యూపీఏ ప్రభుత్వం పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) విధానం అమలు చేసింది. దానివల్ల ఎంత లాభం కలిగిందో, అంతేస్థాయిలో నష్టం కూడా కనిపించింది. సరైన ముందస్తు అంచనాలు లేకుండా అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేటు రంగం దూకుడుగా ముందుకు వెళ్లి, పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టులు చేపట్టాయి. కొన్ని పూర్తయినా, ఇంకెన్నో ప్రాజెక్టులు మధ్యలోనే నిలిచిపోయాయి. వడ్డీరేట్లు తగ్గిస్తే తమమీద కొంతైనా భారం తగ్గుతుందని మౌలిక సదుపాయాల రంగంలోని సంస్థలు ఎదురుచూస్తున్నాయి. పెద్దయెత్తున మూలధనం అవసరమైన బ్యాంకులు, ప్రభుత్వం ఎంతో కొంత మూలధనం సమకూరుస్తుందని ఎదురుచూస్తున్నాయి. ఇలా ఆర్థికపరంగా చక్కదిద్దాల్సిన వ్యవహారాలెన్నో ఉన్నాయి. అందువల్లే క్షేత్రస్థాయి దాకా ఫలితాలు రాలేదు. ప్రజల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పు కనిపించటం లేదు.

సంస్కరణలకు సమయం

'అచ్ఛే దిన్‌' ఎప్పుడొస్తాయని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇటీవల కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'అచ్ఛే దిన్‌' రాకపోగా అధిక ధరలతో, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారని త్రిపుర ముఖ్యమంత్రి మానిక్‌ సర్కార్‌ విమర్శించారు. ఆశించిన రీతిలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టలేదేమని పారిశ్రామికవేత్తలు నిరుత్సాహపడుతున్నారు. అధిక అంచనాలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదేస్థాయిలో వేగంగా ఫలితాలు చూపనందువల్ల వస్తున్న విమర్శలుగా వీటిని అర్థం చేసుకోవచ్చు. కొత్త ప్రభుత్వం తెచ్చిన సానుకూలత, అంతర్జాతీయంగా అనుకూల పరిణామాలు, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల ప్రభావం కలగలిసి మనదేశంలో వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతానికి దగ్గరగా ఉంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. వేగాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లుగా, కేంద్రం కీలక సంస్కరణలకు సంబంధించి అత్యవసరాదేశాలు (ఆర్డినెన్సులు) జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏడు నెలల పాలనను మంచిచెడుల మిశ్రమంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయాలకు తోడు, ప్రభుత్వం ఇంకా క్రియాశీలకంగా ముందుకు సాగి అనుకున్న ఫలితాలు రాబడితేనే- దేశ ప్రజలకు మంచిరోజులు వచ్చినట్లవుతుంది.

(రచయిత - గన్నవరపు సుబ్బారావు)
Posted on 01-01-2015