Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అహేతుకం... అసంబద్ధం!

ఏకకాల ఎన్నికలనే సూత్రరహిత గాలిపటాన్ని ప్రధాని మోదీ పట్టుదలగా మళ్ళీ ఎగరేస్తున్నారు. ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ అనే భాజపా స్వయంప్రవచిత విధానానికి ఈసారైనా గట్టి మద్దతు కూడగట్టాలన్న లక్ష్యంతో, పార్లమెంటులో ప్రాతినిధ్యం కలిగిన పార్టీల అధినాయకుల్ని నేడు ప్రత్యేకంగా కొలువుతీరుస్తున్నారు. సుమారు నాలుగేళ్లుగా ప్రధానమంత్రి నోట తరచూ వినిపిస్తున్న జమిలి ఎన్నికల పునరుద్ధరణ ప్రతిపాదనను తొలుత ఎలెక్షన్‌ కమిషన్‌ 1983లో భుజాలకెత్తుకుంది. ఒకటిన్నర దశాబ్దాల తరవాత ఆ యోచనను న్యాయ సంఘం (లా కమిషన్‌) సమర్థించింది. 2015 డిసెంబరులో సుదర్శన్‌ నాచియప్పన్‌ సారథ్యంలోని పార్లమెంటరీ స్థాయీసంఘం సైతం లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ యోచనకు ఓటేసింది. నిరుడు జులైలో ఈ అంశంపై రాజకీయపక్షాల అభిప్రాయ సేకరణకు న్యాయసంఘం చొరవ కనబరచినప్పుడు భిన్నగళాలు వినిపించాయి. జమిలి ఎన్నికలకు అనుకూల, ప్రతికూల శిబిరాలుగా భిన్న రాజకీయపక్షాల నడుమ విభజనరేఖ ప్రస్ఫుటమైంది. వాస్తవానికి నిరుటి అఖిలపక్ష భేటీకి మూడు నెలలముందే- నీతి ఆయోగ్‌ చేసిన పలు ప్రతిపాదనలపై లోతుగా అధ్యయనం జరిపిన న్యాయ సంఘం నిర్దిష్ట సూచనల్ని క్రోడీకరించింది. రాజ్యాంగంతోపాటు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని, లోక్‌సభ అసెంబ్లీల నిబంధనల్ని సవరిస్తేనే తప్ప ముందడుగు పడబోదని స్పష్టీకరించింది. నిర్ణీత రాజ్యాంగ సవరణకు అటు పార్లమెంటు, ఇటు 29 రాష్ట్రాల శాసనసభల ఆమోద ముద్ర అత్యావశ్యకమనీ న్యాయ సంఘం అప్పట్లోనే వెల్లడించింది. ఆ స్థాయిలో స్థూల ఏకాభిప్రాయం, జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా శాసనసభల ఆమోదం ఎండమావిని తలపిస్తుండగా- నేటి ప్రత్యేక సమావేశం ద్వారా సాధించదలచిన పరమార్థమేమిటో అగమ్యం. భారతదేశ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఏకకాల ఎన్నికల యోచన ఆచరణాత్మకం కాదన్నదే ఆలోచనాపరుల సుస్థిర అభిప్రాయం!

వేర్వేరు శాసనసభల గడువును పరికిస్తే 2021 సంవత్సరం దాకా ప్రతి ఆరు నెలలకోమారు రెండునుంచి అయిదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు తప్పవని 2017 ఏప్రిల్‌లో ప్రకటించిన నీతి ఆయోగ్‌- ఆ కారణంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఆర్థికభారం తడిసి మోపెడవుతుందని అభిప్రాయపడింది. రాష్ట్రపతిగా లోగడ ప్రణబ్‌ ముఖర్జీ, నిరుడు జనవరిలో రామ్‌నాథ్‌ కోవింద్‌ నోట జమిలి ఎన్నికల జావళినే కేంద్రం పలికించింది. దేశంలో తరచూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతుండటంవల్ల ప్రవర్తన నియమావళి మూలాన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతుందన్నది వారుభయుల ప్రసంగ సారాంశం. ఆ బాణీకి వత్తాసు పలుకుతున్న జేడీ(యూ)లాంటి కొన్ని రాజకీయపక్షాలు- జమిలి ఎన్నికలు నిర్వహిస్తే వ్యయభారం తగ్గుతుందని, నల్లధనం అదుపులోకి వస్తుందని విడ్డూర వాదనలు వల్లెవేస్తున్నాయి. ఎన్నికల్లో నాటకీయ లబ్ధిని కాంక్షించి ఆపదమొక్కులుగా పథకాలు గుప్పించే విపరీత పోకడలకే ప్రవర్తన నియమావళి మోకాలడ్డుతుంది. అంతేతప్ప, ఎన్నాళ్లుగానో అమలులో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు అదేమాత్రం అవరోధాలు కల్పించదు. ఎన్నికల నిర్వహణ వ్యయభారమన్నది- ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, పాతిక లక్షల కోట్లరూపాయల మేర భారీ వార్షిక బడ్జెట్‌ కలిగిన భారత్‌కు అసలు లెక్కలోనిదే కాదు. పార్టీలు, అభ్యర్థుల మేరమీరిన వ్యయీకరణ దృష్ట్యా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో అయిన ఖర్చు రూ.60వేలకోట్లకు పైబడినట్లు తాజా అధ్యయనం చాటుతోంది. ఏకకాల ఎన్నికల వల్ల నల్లధన ప్రవాహాలు ఆగిపోతాయా, దిగ్భ్రాంతపరుస్తున్న ప్రలోభాల జాతర స్తంభించిపోతుందా? రాష్ట్రాల్లో తరచూ ఎన్నికలవల్ల పాలన పడకేస్తుందన్నదీ పసలేని వాదనే. దశ మహాపాతకాల భల్లూక పట్టులో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్న భారత ఎన్నికల రంగాన్ని జమిలి యోచన సాంత్వనపరచగలదన్నది వట్టి పగటికలే!

దేశంలో చివరిసారి 1967వ సంవత్సరంలో ఏకకాల ఎన్నికలు చోటుచేసుకున్నాయి. ఆనాడు కొన్ని రాష్ట్రాల్లో ఏర్పాటైన సంయుక్త విధాయక్‌ దళ్‌ ప్రభుత్వాలు అర్ధాంతరంగా కుప్పకూలిన దరిమిలా జమిలి పద్ధతి అటకెక్కింది. దక్షిణాఫ్రికా, స్వీడన్‌, బెల్జియం ప్రభృత దేశాలు పాటిస్తున్న ఏకకాల ఎన్నికల విధానాన్ని దేశీయంగా పునరుద్ధరించడమన్నది ఎంత క్లిష్టతరమో న్యాయ సంఘమే గతంలో విశదీకరించింది. త్రిశంకు సభ ఏర్పడినప్పుడు రాజకీయ అస్థిరత్వాన్ని నివారించడానికి, ఫిరాయింపు నిరోధక చట్ట నిబంధనల కోరలు పెరికిపారేయాలట! చట్టసభల సుస్థిరత కోసమంటూ, గోడ దూకుళ్లకు గేట్లెత్తేసే తరహా ‘ఉదార చర్యలు’ ఎవర్ని సముద్ధరించడానికి? భౌగోళిక పరిమాణంలో, జనసంఖ్యపరంగా కొన్ని ఐరోపా దేశాలకు దీటుగా నిలిచే ఇక్కడి రాష్ట్రాల్లో కొన్ని అసెంబ్లీల కాలావధుల్ని కుదించి, మరికొన్నింటిని పొడిగించి ‘ఏకకాల’ చట్రంలో ఇరికిస్తామనడం వెనక ఇతరత్రా రాజకీయ ప్రయోజనాలున్నాయన్న ఆరోపణలు హెచ్చుశ్రుతిలో వినవస్తున్నాయి. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లు ఒకే పార్టీవైపు మొగ్గుచూపే అవకాశం ఉందని ఎన్నో విశ్లేషణలు తెలియజెబుతున్నాయి. రెండు మూడు పటిష్ఠ విస్తృత పార్టీ వ్యవస్థలు కలిగిన అమెరికా, బ్రిటన్లతో పోలిస్తే- భాజపా తప్ప తక్కిన జాతీయ పక్షాలన్నీ చిన్నగీతలుగా మారి వెలాతెలాపోతున్న దేశం మనది. రాష్ట్రస్థాయి పార్టీలు నానావిధ జాడ్యాలతో కునారిల్లుతున్న తరుణంలో, ఏకకాల ఎన్నికల నిర్వహణ వాటి పుట్టి ముంచడం- పరిణత ప్రజాస్వామ్యాన్ని పరిఢవిల్లజేస్తుందా? ఎటువంటి ఎన్నికల సంస్కరణలైనా జనతంత్రంలో పారదర్శకత, జవాబుదారీతనాలకు ప్రోది చేస్తేనే ఆలోచనాపరుల మన్ననలందుకుంటాయి. భిన్నత్వానికి, వైవిధ్యానికి పేరెన్నికగన్న భారత్‌లో ఏకకాల ఎన్నికలు అహేతుకమైనవే కాదు, ఆచరణ సాధ్యం కానివి!


Posted on 19-06-2019