Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సత్వర న్యాయానికి దారి

అపరిష్కృత వ్యాజ్యాలు భారీగా పేరుకుపోతుండటం, భారత న్యాయవ్యవస్థ నేడు ఎదుర్కొంటున్న అతి గడ్డు సమస్య. పెండింగ్‌ కేసుల భారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సైతం తప్పించుకోలేకపోతున్నదనడానికి, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన తాజా లేఖాంశాలే దాఖలా. సుప్రీంకోర్టులో 58 వేలకు పైబడిన అపరిష్కృత వ్యాజ్యాల రాశి ఇంకా విస్తరిస్తున్న నేపథ్యంలో అదనంగా జడ్జీలను నియమించాలని సూచించిన చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌- హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 62 నుంచి 65 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టుతోపాటు వివిధ ఉన్నత న్యాయస్థానాల్లో గుట్టలుగా పేరుకుపోయిన కేసులకు మోక్షం కల్పించడానికి 128, 224ఏ రాజ్యాంగ అధికరణల కింద విశ్రాంత న్యాయమూర్తుల సేవలు స్వీకరించాలనీ ఆయన సూచించారు. మూడు దశాబ్దాల క్రితం 18 నుంచి 26కి పెరిగిన సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య ఆపై 31కి చేరీ పదేళ్లయింది. జడ్జీల పదవీ విరమణ వయసు పెంపు అన్నది ఇతరత్రా అనేకాంశాలతో ముడివడిన నిర్ణయం కనుక కేంద్రం ఇప్పుడు అందుకు సుముఖంగా లేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, న్యాయమూర్తుల సంఖ్య పెంపొందించాలన్నది దశాబ్దాలుగా తగిన మన్నన దక్కని ప్రతిపాదన. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు 50మంది చొప్పున న్యాయాధీశుల్ని నియమించాల్సిందిగా న్యాయసంఘం (లా కమిషన్‌) 1987లోనే సిఫార్సు చేసింది. ఆ లెక్కన 135 కోట్లకు మించిన దేశ జనసంఖ్యకు దీటుగా సుమారు 67 వేలమంది న్యాయమూర్తులు వివిధ అంచెల్లో కొలువుతీరి ఉండాలి. అత్యున్నత న్యాయస్థానం నుంచి కిందిస్థాయి కోర్టుల దాకా మంజూరైన కొలువులే 24 వేలలోపు; అందులోనూ ఖాళీలు వెక్కిరిస్తున్న తరుణంలో- ఏవో కొన్ని నియామకాలు, తాత్కాలిక సర్దుబాట్లతో పరిస్థితి కుదుటపడుతుందనుకోవడం వట్టి భ్రమ.

దేశవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానాల్లో ఒక కొలిక్కిరాక పోగుపడిన వ్యాజ్యాల సంఖ్య 42 లక్షలకు మించిపోయింది. అత్యధిక పెండింగ్‌ కేసుల ప్రాతిపదికన బాంబే, పంజాబ్‌, హరియాణా, కలకత్తా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టులు ముందువరసలో ఉన్నట్లు అధికారిక గణాంకాలు చాటుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయిదు నుంచి పదేళ్లుగా 95 వేలవరకు, పది నుంచి ఇరవై సంవత్సరాలుగా సుమారు 48 వేల వ్యాజ్యాల్లో కక్షిదారులు చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నారు. అన్ని హైకోర్టుల్లోనూ కలిపి నాలుగు వందల దాకా జడ్జీల ఖాళీలు భర్తీ కాకుండా ఉండిపోయాయి! ఎకాయెకి రెండు కోట్ల 70 లక్షల మేర అపరిష్కృతŸ వ్యాజ్యాలు పోగుపడిన జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో నిలిచిపోయిన నియామకాలు అయిదు వేలకు పైమాటే. దేశంలో పెండింగ్‌ కేసుల కొండలు కరిగించడానికి ఎన్ని అదనపు కోర్టులు అవసరమో శాస్త్రీయంగా మదింపు వేయాలన్న ‘సుప్రీం’ ఆదేశాల మేరకు న్యాయసంఘం విపుల నివేదికను సమర్పించి అయిదేళ్లయింది. దిగువస్థాయిలో స్వల్పంగా న్యాయాధికారుల పదవుల్ని పెంచిన రాష్ట్ర ప్రభుత్వాలు, ఖాళీలు భర్తీ చేయాల్సిన బాధ్యతను గాలికొదిలేయడంతో- అసంఖ్యాక న్యాయార్థుల సుదీర్ఘ గుండెకోత అంతులేని కథగా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు గత నవంబరులో రాష్ట్ర ప్రభుత్వాల్ని బోనులో నిలబెట్టి, హైకోర్టుల పాలన విభాగాల అలసత్వాన్ని సూటిగా- ఎక్కడి గొంగడి అక్కడే. వచ్చే ఆరు నెలల్లో వివిధ హైకోర్టులకు చెందిన 40మందికి పైగా న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తున్న దృష్ట్యా- ఆ మేరకు ఖాళీల సత్వర భర్తీతోపాటు అదనపు నియామకాలూ చురుకందుకోవాల్సి ఉంది. దిద్దుబాటు చర్యలు కరవై యథాతథంగా మందభాగ్యం కొనసాగితే దేశంలో ఇంకో రెండు దశాబ్దాల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య 15 కోట్లకు పెచ్చరిల్లుతుందన్న అంచనా, ప్రజాప్రభుత్వాలకు పెను ప్రమాద హెచ్చరిక!

భారత న్యాయవ్యవస్థ ఎడ్లబండి కాలంలోనే ఉండిపోయిందని సుప్రీంకోర్టు గౌరవ న్యాయాధీశులే ఈసడించిన సందర్భాలున్నాయి. సశక్త సమర్థ వ్యవస్థగా న్యాయపాలిక భాసిల్లాలన్న ప్రజాభీష్టానికి వ్యవస్థాగత లోటుపాట్లు తూట్లు పొడుస్తున్నాయి. దేశంలో సివిల్‌ దావాల పరిష్కరణకు సగటున పదిహేను సంవత్సరాలు పడుతుండగా, క్రిమినల్‌ కేసులకు సంబంధించీ అయిదు నుంచి ఏడేళ్ల వరకు నిరీక్షించాల్సి వస్తోంది. వకీళ్లు కోరిందే తడవుగా వాయిదాలపై వాయిదాలు పడుతున్న కేసుల మూలాన కక్షిదారులు విపరీత ప్రయాసాయాసాలకు గురవుతున్నారు. కాలదోషం పట్టిన చట్టాలు, అసంబద్ధ విధివిధానాలు- న్యాయం కోరి కోర్టు తలుపు తట్టడమే నేరమైందని కక్షిదారులు విలపించే దుస్థితి కల్పిస్తున్నాయి. ఒకప్పుడు ఇటువంటి అవస్థలే చవిచూసిన బ్రిటన్‌- పౌరన్యాయ వ్యవస్థను సరళీకరించి, విస్తృత సంస్కరణలు చేపట్టడం గొప్ప సత్ఫలితాలు చేకూర్చింది. అటు కేసుల పరిష్కరణ వేగం ఇనుమడించింది, ఇటు న్యాయార్థులపై వ్యయభారం దిగివచ్చింది! కనిష్ఠ వ్యవధిలో వ్యాజ్య పరిష్కరణ నిమిత్తం న్యాయమూర్తులకు, న్యాయవాదులకు శిక్షణ సమకూర్చి, కేసుల నిర్వహణలో నిర్దిష్ట మార్గదర్శకాలు క్రోడీకరించి, పౌరశ్రేయస్సాధకంగా సివిల్‌ ప్రొసీజర్‌ చట్టం రూపొందించిన బ్రిటన్‌- అవసరార్థులకు న్యాయసేవలు అందించడంలోనూ తనదైన ఒరవ డి దిద్దింది. మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యమిచ్చి వ్యాజ్యాల ఉరవడికి కళ్లెం వేసిన అమెరికా, అట్టడుగు నుంచీ పైదాకా కోర్టుల్ని కంప్యూటరీకరించి అనుసంధానించి నెలల వ్యవధిలో శిక్షలు ఖరారు చేస్తున్న చైనాల అనుభవాలూ మనకు విలువైన గుణపాఠాలు. అడుగడుగునా జవాబుదారీతనానికి ప్రోదిచేసే సమగ్ర న్యాయసంస్కరణలతోనే దేశంలో కక్షిదారులు తెరిపిన పడతారు!


Posted on 24-06-2019