Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

మలిదఫాలో మరింత వేగం

* ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పులు

తొలి అయిదేళ్ల ఎన్‌డీయే పాలనలో ఆర్థిక సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించారు. మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టి వ్యవస్థలను గాడినపెట్టేందుకు ప్రయత్నించారు. మలి దఫా మోదీ జమానాలో అందుతున్న సంకేతాలను బట్టి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం పెరిగినట్లు కనిపిస్తోంది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెలువరించిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వం గతంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతోపాటు మున్ముందు పట్టాలకెక్కించదలచిన సంక్షేమాంశాల గురించీ ప్రస్తావించారు. బడుగు వర్గాలకు నగదు సాయం పెంచడంతోపాటు సేద్యరంగంలో పెట్టుబడులను ఇనుమడింపజేయడం, స్వయం ఉపాధి కార్యక్రమాలకు రుణసాయం పెంపు వంటి అనేక విషయాలను రాష్ట్రపతి ప్రసంగంలో ఉటంకించారు. ఒకే దేశం-ఒకేసారి ఎన్నికలు పేరిట ‘జమిలి’ ప్రతిపాదనను సైతం ఆయన ప్రస్తావించారు. ఏడు వేలకుపైగా పదాలున్న కోవింద్‌ ప్రసంగంలో- ఆర్థిక సంస్కరణలు, మాంద్యంనుంచి బయటపడేసి కార్పొరేట్‌ రంగానికి చురుకుపుట్టించడం, బెంబేలెత్తిస్తున్న రుణభార సమస్యను అధిగమించడం వంటి విషయాలేవీ ప్రస్తావనకు రాకపోవడం కొంత ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి.

వాజ్‌పేయీ హయాములో సంస్థాగత సంస్కరణలతో దేశ ఆర్థికవ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది. ప్రభుత్వ ఖజానాకు గుదిబండల్లా మారిన ప్రభుత్వ రంగ సంస్థలను వదిలించుకోవడం, విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం, టెలికామ్‌ రంగంలో సమూల సంస్కరణలకు లాకులెత్తడం వంటి అనేక చర్యలతో వాజ్‌పేయీ జమానా కొత్త పంథాలో అడుగులు కదిపింది. వాజ్‌పేయీ జమానాతో పోలిస్తే పార్టీపరంగా ఇప్పుడు నరేంద్ర మోదీకి ఏమాత్రం ఎదురులేని పరిస్థితి. జాతి అభివృద్ధికి అత్యవసరమైన మౌలిక సంస్కరణలను వేగంగా అమలుపరచేందుకు ప్రభుత్వానికి అత్యంత అనుకూలమైన వాతావరణం ఉంది. ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేయగల రెండు కీలక సంస్కరణలను నెత్తికెత్తుకోవడంపై తొలి అయిదేళ్ల పాలనలో తగిన శ్రద్ధకనిపించలేదు. భూ సమీకరణ చట్టానికి సంబంధించి సహేతుక విధానాలను రూపొందించడంలో తొలినాళ్లనుంచీ ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా ఎవరి భూమినైనా, ఎప్పుడైనా సేకరించి, నామమాత్ర పరిహారం చెల్లించే హక్కును ప్రభుత్వానికి కల్పిస్తూ 1894లో చట్టం తీసుకువచ్చారు. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్త అలజడి రేపిన నేపథ్యంలో- పాత చట్టాన్ని పూర్తిగా తలకిందులు చేస్తూ 2013లో యూపీఏ జమానాలో మరో చట్టం రూపొందించారు. 1894నాటి చట్టం భూ సమీకరణలో ప్రభుత్వానికి అలవిమాలిన హక్కులు కట్టబెడితే- యూపీఏ చట్టం సర్కారు వెసులుబాట్లను సంపూర్ణంగా హరించివేసింది. కనీసం జాతి భద్రతతో ముడివడిన అవసరాలకూ భూమిని సేకరించే వీలు లేని పద్ధతిలో ప్రభుత్వాన్ని పూర్తిగా బంధనాల్లో బిగిస్తూ యూపీఏ చట్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పురోభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సహేతుక మార్పులతో చట్టానికి కొత్త రూపు ఇవ్వాలంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో భాజపా సర్కారుపై ఎంతోమంది ఒత్తిడి తీసుకువచ్చారు. ఆ నేపథ్యంలోనే భూ సేకరణ విధానాలు- పరిహారం విషయంలో మార్పులు ప్రతిపాదిస్తూ మోదీ ప్రభుత్వం తొలినాళ్లలోనే అత్యవసరాదేశాన్నీ తీసుకువచ్చింది. అయితే ఆ తరవాత విపక్షాల విమర్శల నేపథ్యంలో ఆర్డినెన్సుపై వెనక్కితగ్గారు. భూసేకరణపరంగా నెలకొన్న సంక్లిష్టతల కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి అభివృద్ధి వెనకడుగు వేసింది.

యూపీఏ జమానాలో జరిగిన తప్పులను సరిదిద్దడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదు. అవినీతి ఆరోపణల సుడిలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరి అయిన మన్మోహన్‌ జమానాలో- ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అడ్డమైన నిబంధనలు కూర్చి తిరోగామి భూసేకరణ చట్టం తీసుకువచ్చారు. ఆ చట్టాన్ని సమన్వయ సాధకంగా మారిస్తే దేశంలో స్థిరాస్తి రంగం ఊపందుకొంటుంది. పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన భూముల సేకరణ సాధ్యపడుతుంది. ఉండటానికి గూడులేక నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్న కోట్లాది భారతీయులకు ఊరట దక్కుతుంది. మోదీ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన మరో కీలకాంశం కార్మిక సంస్కరణలు. యజమాని, కార్మికుల మధ్య సంబంధాలను సహేతుకంగా నిర్వచిస్తూ ప్రభుత్వం చట్టం తీసుకురావాలి. తద్వారా దేశవ్యాప్తంగా ఉపాధి విస్తరించడంతోపాటు ఉత్పాదకత పెంపునకూ బాటలు పడతాయి. భూ సమీకరణకు సంబంధించి నిర్మాణాత్మక మార్పులతోపాటు- కార్మిక చట్టాలను హేతుబద్ధంగా నవీకరించడం నేటి తక్షణావసరం. పెట్రో ధరలు, విత్త మార్కెట్లకు సంబంధించి పారదర్శక వ్యవస్థలు రూపొందించి ప్రశంసలు అందుకున్న మోదీ ప్రభుత్వం- దీర్ఘకాలంగా తెమలని జీఎస్టీపైనా కీలక నిర్ణయాలను ప్రకటించగలిగింది. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఆర్థిక వ్యవస్థలో కీలక మార్పుల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు కదపాలి.


- వీరేంద్రకపూర్‌
Posted on 24-06-2019