Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సమస్యల దిగ్బంధంలో ‘న్యాయం’

* అపరిష్కృత వ్యాజ్యాలు- అసలు కారణాలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ దేశంలో పెరుగుతున్న అపరిష్కృత వ్యాజ్యాలపై ఇటీవల ఆందోళన వ్యక్తీకరించారు. గొగోయ్‌కు ముందు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ దీపక్‌ మిశ్రా సైతం అప్పట్లో ఈ విషయమై ఆందోళన వెలిబుచ్చారు. ‘నేషనల్‌ జ్యుడిషియల్‌ డేటా గ్రిడ్‌’ అధ్యయనం ప్రకారం జూన్‌ 16నాటికి దేశంలో 3.12 కోట్లకు పైగా వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిలో సివిల్‌ కేసులు 88.40 లక్షలు, క్రిమినల్‌ కేసులు 2.23 కోట్ల వరకు పెండింగులో ఉన్నాయి, వీటిలో 43.46 లక్షల కేసులు దేశంలోని వివిధ హైకోర్టుల్లో; సుప్రీంకోర్టులో 58,669 కేసులు పెండింగులో ఉన్నాయి. ఇక దేశంలోని వివిధ జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 2.68 కోట్ల కేసులు పేరుకుపోయాయి. దేశంలో ఇన్ని కేసులు పెండింగులో ఉండటానికి కారణాలు అనేకం. కేసుల నిర్ణయాల్లో కాల పరిమితి లేకపోవటం అందుకు ప్రధాన కారణం.

న్యాయమూర్తులు, ఉద్యోగుల కొరత; అధిక సంఖ్యలో వార్షిక సెలవులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవడం మరికొన్ని కారణాలు. ఇక మౌలిక సదుపాయాల కొరత, అసంఖ్యాకమైన భూ వ్యాజ్యాలు, ఆర్థిక స్వయంప్రతిపత్తి కొరవడటం వంటివీ కేసులు పేరుకుపోవడానికి కారణమవుతున్నాయి. మొత్తం వ్యాజ్యాల్లో 22.79 శాతం అయిదేళ్లుగా తీర్పులకు నోచుకోకుండా పడిఉన్నాయి. చట్టాలకు తగు సవరణలు చేసి వ్యాజ్యాల పరిష్కారానికి కాలపరిమితి నిబంధన తేవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

లా కమిషన్‌ 1987నాటి నివేదిక ప్రకారం దేశంలో సగటున పది లక్షల జనాభాకు 10.5 న్యాయమూర్తులు ఉన్నారు. ఆ సంఖ్య ఆస్ట్రేలియాలో 41.6, ఇంగ్లాండులో 50.9, కెనడాలో 75.2, అమెరికాలో 107గా ఉండటం గమనార్హం. 2018 నాటికి దేశంలో న్యాయమూర్తుల సంఖ్య 10.5 నుంచి 19కి పెరిగినప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చి చూస్తే మన వెనకబాటు ప్రస్ఫుటంగా కనబడుతోంది. దిగువ కోర్టుల్లో 5,748 న్యాయాధికారుల పదవులు, హైకోర్టుల్లో 406 పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులోనే ఆరుగురు న్యాయముర్తుల పదవులను ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం 1990లో చేపట్టిన కోర్టుల కంప్యూటరీకరణ నత్తనడకన సాగుతోంది. 18 హైకోర్టులు, 10 బెంచీలు మాత్రమే పూర్తి స్థాయి కంప్యూటరీకరణకు నోచుకున్నాయి. దిగువ స్థాయి కోర్టులు బాగా వెనకబడి ఉన్నాయి. కోర్టులకు ఏడాదికి సగటున 120 నుంచి 130 వరకు సెలవు దినాలు ఉంటాయి. అంటే ఏడాదికి ఎనిమిది నెలలు మాత్రమే అవి పనిచేస్తాయన్న మాట. న్యాయస్థానాలకు సెలవుల సంఖ్యను పరిమితం చేయాలన్న వాదనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. వీలైతే సిబ్బందికి వంతులవారీ వారాంతపు సెలవులు ప్రకటించి న్యాయస్థానాలు వారం పొడవునా పనిచేసే విధానం అమలుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మౌలిక సౌకర్యాల లోపాలూ సమస్యాత్మకమవుతున్నాయి. దిగువ కోర్టులకు ప్రస్తుతం 16,513 గదులే ఉన్నాయి. దిగువ కోర్టుల్లో ఖాళీ అయిన న్యాయమూర్తుల పదవులన్నీ ఒకవేళ భర్తీ అయితే 20,502 మంది న్యాయమూర్తులు పూర్తిస్థాయి విధుల్లో ఉంటారు. అప్పుడు ఎదురయ్యే 3,989 కోర్టు గదుల కొరతకు పరిష్కారమేమిటన్నదానికి జవాబు లేదు. దిగువ కోర్టుల్లో పూర్తిస్థాయిలో పదవులు భర్తీ చేయకపోవటానికి ఇదీ ఒక కారణం కావచ్చు!

దేశంలోని వ్యాజ్యాల్లో 66 శాతం కేవలం స్థిరాస్తి వివాదాలకు సంబంధించినవి ఉన్నాయి. పది శాతం కుటుంబ కలహాలు, ఎనిమిది శాతం నగదు రుణాల వివాదాలు, 3.4 శాతం నిషేధ ఉత్తర్వుల అభ్యర్థనలకు సంబంధించినవని అధ్యయనాలు స్పష్టీకరిస్తున్నాయి. స్థిరాస్తి సంబంధిత వ్యాజ్యాలు కొలిక్కివస్తే కోర్టులపై భారం గణనీయంగా తగ్గుతుంది. దీనికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాల సహకారం ఎంతో అవసరం. స్థిరాస్తికి చెందిన వివాదాల జాబితాలో కక్షిదారుగా ప్రభుత్వాలే అగ్రస్థానంలో ఉన్నాయి. స్థిరాస్తి లావాదేవీల నమోదులో, పట్టాదారు హక్కుల పరిశీలన ప్రక్రియలో లోపాలు ఉండటమే ఇందుకు కారణం. కేవలం నమోదు రుసుము వసూలుపైనే దృష్టి పెట్టడం, లోతైన వివరాల జోలికి వెళ్లకపోవడం వల్ల స్థిరాస్తి వివాదాల జాబితా కొండవీటి చాంతాడులా పెరుగుతోంది. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సమయంలో పట్టాదారు హక్కుల పరిశీలన, నిర్ధారణ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే స్వీకరించడం దీనికి శాశ్వత పరిష్కార మార్గం. అందుకోసం చట్టాలకు సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉరుముతోంది.

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు న్యాయవ్యవస్థకు వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. నిధుల కేటాయింపు తక్కువగా ఉండటం, వాటిని సకాలంలో వినియోగించకపోవటం అతిపెద్ద లోపం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ ఆర్థిక స్వయంప్రతిపత్తి లేకపోవడం సమస్యాత్మకమవుతోంది. 2010-15 సంవత్సరాలకు న్యాయవ్యవస్థ అభివృద్ధి కోసం రూ.5,000 కోట్లు కేటాయించాలని 13వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా- కేంద్రం అందులో సగమే వ్యయపరచింది. 14వ ఆర్థిక సంఘం 2016-20 కాలానికి రూ.9,749 కోట్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల మాట ఎలాఉన్నా, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు మాత్రం తమ బడ్జెట్లలో కేటాయింపులు 0.40 శాతం మించనీయడం లేదు. అధిక నిధులు, ఆర్థికంగా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం ద్వారా న్యాయవ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఇందుకు అవసరమైన చట్టపరమైన సవరణలను ప్రభుత్వం సత్వరం తీసుకురావాలి. ఈ సంస్కరణలు కార్యరూపం దాలిస్తే న్యాయపాలిక క్రియాశీలం అవుతుంది. అప్పుడు అపరిష్కృత వ్యాజ్యాల సమస్య చాలావరకు ఒక కొలిక్కివస్తుంది.


- బీఎన్‌వీ పార్థసారథి
Posted on 26-06-2019