Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

నగరాలకేదీ నగిషీ?

నగరీకరణే, ఈ సహస్రాబ్దిలో ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతి సంక్లిష్ట సమస్య. 2030 సంవత్సరం నాటికి విశ్వమానవాళిలో 60శాతం పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తారన్నది నిపుణుల అంచనా. ఇంచుమించు ఆ సమయానికి ఇక్కడ స్థూల దేశీయోత్పత్తిలో 80 శాతం దాకా నగరాల నుంచే సమకూడుతుందంటూ, అందుకు తగ్గట్లు మౌలిక సదుపాయాలు, సేవలతో పట్టణీకరణ ఊపందుకొనకపోతే ఆర్థిక ప్రగతే మందగిస్తుందన్న అధ్యయనాలూ వెలుగు చూశాయి. సజావుగా తీర్చిదిద్దుకుంటే పట్టణాలు, నగరాలే భావిభారతావనికి భాగ్య ప్రదాయినులవుతాయన్న విశ్వాసమే- నాలుగేళ్ల క్రితం ఏకకాలంలో మూడు ప్రతిష్ఠాత్మక పథకాలకు శ్రీకారం చుట్టడానికి మోదీ ప్రభుత్వాన్ని ప్రేరేపించింది. అమృత్‌ (అటల్‌ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవన పథకం), అందరికీ గృహయోజన, ఆకర్షణీయ (స్మార్ట్‌) నగరాల పథకాలతో పట్టణ భారతం రూపురేఖలే మార్చేస్తామని కేంద్రం అప్పట్లో ధీమాగా ప్రకటించింది. తాగునీరు, పారిశుద్ధ్యం, వరద నీటి కాల్వల నిర్మాణం, ఈ-పరిపాలనల ద్వారా 500 పట్టణాల సముద్ధరణకు ఉద్దేశించిన ‘అమృత్‌’ కార్యాచరణ మార్గదర్శకాల్ని స్థానిక సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రే నేరుగా పంచుకోవడం- అప్పటిదాకా దేశం కనీవినీ ఎరుగని విశేషం. నిర్దేశిత గడువు ఏడాదే మిగిలి ఉండగా గత జనవరి నాటికి సుమారు రూ.79వేల కోట్ల విలువ చేసే 5,400కు పైగా ప్రాజెక్టులకు గాను పూర్తయినవి 20 శాతమేనన్న గణాంకాలు విస్మయపరుస్తున్నాయి. ‘అమృత్‌’ కింద తలపెట్టిన పనుల పరిపూర్తిలో తమిళనాడు, పశ్చిమ్‌ బంగ ముందుండగా- గుజరాత్‌, ఏపీ, కేరళల్లో 50కిపైగా ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చాయి. బిహార్‌, అసోమ్‌ లాంటిచోట్ల పనుల అమలు కదులూ మెదులూ లేకపోవడం ‘అమృత్‌’ మౌలిక స్ఫూర్తినే నీరుకారుస్తోంది.

దేశంలోని పట్టణప్రాంతాల్లో 2012నాటికే కోటీ 88లక్షల దాకా ఇళ్ల కొరత ఉందని అధ్యయనాలు వెల్లడించాయి. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కోటికిపైగా, అల్పాదాయ వర్గాలకు 74లక్షలకు మించి గృహాల ఆవశ్యకత నెలకొన్నట్లు గణాంకాలు చాటాయి. ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యమన్న కేంద్రం 2021-22 నాటికి 2.91 కోట్ల మేర ఇళ్ల నిర్మాణానికి సంకల్పించింది. 2016-19 మధ్యకాలంలో నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చినవి దాదాపు 89 లక్షలేనంటే, గడువులోగా లక్ష్యసాధన ఎంత కష్టతరమో ఇట్టే బోధపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల పునాదులైనా తీయని ‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన’ ఇళ్ల సంఖ్య వేలల్లో ఉంది. గృహ నిర్మాణ వివరాల్ని సంబంధిత పోర్టల్‌లో పొందుపరచని కారణంగా తెలంగాణనుంచి నిధులు వెనక్కి తీసుకోదలచామని రాజ్యసభాముఖంగా కేంద్రం వెల్లడించడం, రాష్ట్రాలతో సమన్వయ లోపాల్ని పట్టిచ్చేదే. మూడు నెలల క్రితం ప్రధానే స్వయంగా చెప్పినట్లు- ‘ఇళ్ల నిర్మాణం ఇంకా వేగం పుంజుకోవాల్సి ఉంది’! నగరాల్లో జీవన ప్రమాణాలు పెంచుతామని, కొత్తగా వంద స్మార్ట్‌ సిటీలు అవతరింపజేస్తామన్నది భాజపా ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం. ప్రజా రవాణా, శుద్ధ ఇంధనం, ఉపాధి, విద్య, వైద్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల దన్నుతో ఆకర్షణీయ నగరాల ఆవిష్కరణకు కేటాయింపులు రూ.16,600 కోట్లు. వెచ్చించింది రూ.3,560 కోట్లేనని కేంద్రమే మొన్న జనవరిలో పార్లమెంటుకు నివేదించింది. స్మార్ట్‌ సిటీల పద్దులో కేంద్రం ఇస్తామన్న నిధుల విడుదలలో తీవ్ర జాప్యం ఒక వంక; అందిన వనరుల్లో ఒక్క శాతమైనా ఖర్చు చేయని కర్ణాటక తరహా ఉదంతాలు మరోపక్క- నగరాలకు చికిత్సను ప్రహసనప్రాయంగా మారుస్తున్నాయి. కేంద్రం, నగర పాలక సంస్థలు కీలక భాగస్వాములుగా సాగుతున్న మూడు భారీ పథకాల కింద ఇప్పటివరకు మొత్తం వ్యయ ప్రతిపాదనలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు పైబడ్డాయంటున్నా- పట్టణ పునరుద్ధరణ ఇంకా గాడిన పడకపోవడం ఆందోళనకరం.

ఏవో కొన్ని నగరాల్ని ఆకర్షణీయంగా మలచడమన్నది పరిమిత లక్ష్యం. దాన్ని సాధించడానికే కిందుమీదులవుతున్న యంత్రాంగాలు విదేశీ అనుభవాలనుంచి నేర్వదగ్గ గుణపాఠాలు అనేకం. కాలంతో మారుతున్న ప్రజావసరాలకు అనుగుణంగా విస్తృత సమాచార సాంకేతిక సేవలు, భద్రత, రవాణా, ఆరోగ్య రక్షణ అందించడంలో ఆక్లాండ్‌, మ్యూనిక్‌, జ్యూరిచ్‌, కోపెన్‌హేగన్‌ వంటివి విశేషంగా రాణిస్తున్నాయి. అత్యంత పరిశుభ్రమైన వాతావరణ పరికల్పనలో ఐస్‌లాండ్‌, ఫిన్లాండ్‌ల ముద్ర ఏ దేశానికైనా ఆదర్శమే. 2031నాటికి భారతీయ నగరాల్ని సకల వసతులతో పునరుజ్జీవింపజేయడానికి రూ.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు అవసరమని సర్కారీ అధ్యయనాలే లోగడ వెల్లడించాయి. ప్రైవేటు భాగస్వామ్యాన్నీ కూడగట్టి వనరుల సమీకరణకు సిద్ధపడాల్సిన ప్రభుత్వం- పట్టణ భారతాన్ని కలచివేస్తున్న మౌలిక సమస్యల్ని చురుగ్గా చక్కదిద్దడానికీ సమాయత్తం కావాల్సి ఉంది. వాయు నాణ్యత, నీరు, పారిశుద్ధ్యం, హరితావరణం, కర్బన ఉద్గారాలు తదితరాల ప్రాతిపదికన 180 దేశాల పర్యావరణ పనితీరు సూచీలో భారత్‌ చివరి వరసన నిలిచింది. దేశవ్యాప్తంగా మూడొంతులకుపైగా నగరాలు, పట్టణాల్లో వాయుకాలుష్యం పౌరుల ఆయుర్దాయాన్ని మూడేళ్ల వరకు కబళిస్తోంది. వరద ముంపు సమస్య నగర జీవుల్ని తరచూ ముంచుతోంది. పట్టణ వ్యర్థాల్లో సుమారు పాతిక శాతమే శుద్ధి అవుతున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిస్తోంది. దేశంలో ప్రతి పట్టణవాసికీ సౌఖ్యదాయక ఆవాసాలు, స్వల్ప వ్యవధిలో పనిప్రదేశాలకు చేర్చే రవాణా ఏర్పాట్లు, అత్యంత పరిశుభ్ర పరిసరాలు... జీవన నాణ్యతకు గీటురాళ్లు. ఆ స్వప్నం సాకారమయ్యేలా అమృత్‌, ఆవాస్‌ యోజన, స్వచ్ఛ భారత్‌, స్మార్ట్‌సిటీలు తదితరాలన్నింటినీ జాతీయ నగరాభివృద్ధి విధానం గొడుగు కిందకు చేర్చి- కార్యాచరణలో కంతలన్నీ పూడ్చాలి. ప్రణాళికల అమలులో పారదర్శకత, జవాబుదారీతనాలే పట్టణ భారతాన్ని తేజోమయం చేయగలిగేది!Posted on 27-06-2019