Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

శాశ్వత సభ్యత్వం ఎప్పుడో!

అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు లభించిన అనూహ్య దౌత్య విజయమిది. 2021 నుంచి రెండేళ్ల కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం ఆసియా-పసిఫిక్‌ దేశాల కూటమి మూకుమ్మడిగా ఇండియాకు మద్దతు ప్రకటించింది. మండలిలో చైనా, ఫ్రాన్స్‌, రష్యా, బ్రిటన్‌, అమెరికా అయిదూ శాశ్వత సభ్యదేశాలు. వాటితోపాటు రెండేళ్ల కాలపరిమితి కలిగిన పది తాత్కాలిక సభ్యదేశాలుంటాయి. ఏటా అయిదు నిష్క్రమిస్తే మరో అయిదు వాటి స్థానే భద్రతామండలిలో ప్రవేశిస్తుంటాయి. ఆఫ్రికా ఆసియాలకు అయిదు, తూర్పు ఐరోపా దేశాలకు ఒకటి, లాటిన్‌ అమెరికా కరీబియన్‌ దేశాలకు రెండు, తక్కిన వాటికి రెండు లెక్కన తాత్కాలిక సభ్యత్వాల భర్తీకి ఎప్పుడూ గట్టి పోటీ నెలకొంటుంది. అలా వచ్చే ఏడాది జూన్‌లో జరిగే ఎన్నికల్లో భారత్‌ ప్రాతినిధ్యానికి ఇప్పుడు ఆసియా-పసిఫిక్‌ కూటమి ఏకగ్రీవంగా వత్తాసు పలుకుతోంది. సాధారణంగా ఐక్యరాజ్య సమితి వేదికపై పాకిస్థాన్‌, చైనాల జోడీకి ఇండియా అంటేనే చుక్కెదురు. తరచూ దౌత్యపరమైన సవాళ్లు విసిరే ఇస్లామాబాద్‌, బీజింగ్‌ల నుంచి ఈసారి దిల్లీకి అసందిగ్ధ తోడ్పాటు వ్యక్తం కావడం విశేషం. నిర్ణీత పద్ధతి ప్రకారం ఏటా అయిదు తాత్కాలిక సభ్య దేశాలను ఐరాస సాధారణ సభ ఎన్నుకుంటుంది. 193 సభ్య దేశాల్లో మూడింట రెండొంతుల ఓట్లు పొందాల్సి ఉన్న భారత్‌కిక విజయం నల్లేరుపై బండి నడకేనన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియాకు పరతంత్ర పాలన పీడ విరగడై 2022 ఆగస్టుకు 75 ఏళ్లు పూర్తవుతాయి. అదే సంవత్సరం జి-20 సదస్సుకు దిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. అందువల్ల అప్పటికి భద్రతామండలిలో ప్రాతినిధ్యం కలిగి ఉండాలన్న భారత్‌ అభిలాష నెరవేరడానికి మార్గం దాదాపుగా సుగమమైనట్లే. విశ్వ మానవాళిలో 17శాతానికి పైగా భూరి జనరాశికి నెలవైన భారత్‌ స్థాయీ ప్రమాణాలకు, స్వాభావిక అర్హతలకు సముచిత గౌరవం- భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమే!

భద్రతామండలిలో తాత్కాలిక సభ్యత్వ హోదా భారత్‌కు గతంలో ఏడుసార్లు దఖలుపడింది. ఇది ఎనిమిదోసారి. ఈ ప్రాతినిధ్యంకోసం 2013లోనే యత్నాలు ఆరంభించిన ఇండియాతో అఫ్గానిస్థాన్‌ తొలుత పోటీపడినా, తరవాత వెనక్కి తగ్గింది. 1996నాటి హోరాహోరీలో జపాన్‌ చేతిలో భారత్‌కు భంగపాటు ఎదురైంది. జనాభా ప్రాతిపదికన చైనాకు ఇంచుమించుగా సాటి రాగల, సమీప భవిష్యత్తులో బీజింగ్‌ను వెనక్కి నెట్టగల ఏకైక దేశానికి- పరిమిత కోటాలో తాత్కాలిక సభ్యత్వానికి ఇన్ని తిప్పలు పడాల్సి రావడమేమిటి? అంతర్జాతీయంగా వర్ధమాన దేశాల వాణిని బలంగా వినిపించడంలో ముందున్న ఇండియాకు మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించడానికి రష్యా, ఫ్రాన్స్‌, అమెరికా, బ్రిటన్‌ వివిధ సందర్భాల్లో సుముఖత వ్యక్తపరచాయి. ఆ ప్రతిపాదనకు చిరకాలంగా మోకాలడ్డుతున్న ‘వీటో’ దేశం చైనాయే. ‘పి5’ (అయిదు శాశ్వత సభ్యదేశాల కూటమి)ని ఇండియా, జపాన్‌, జర్మనీ, బ్రెజిల్‌తో ‘పి 9’గా రూపొందించాలన్న యోచనకు ప్రతిబంధకాలు ఏర్పరుస్తున్నదీ అదే. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలకు భద్రతామండలిలో ఏకైక శాశ్వత ప్రతినిధిగా వెలుగొందుతున్న చైనా తన సరసన ఇండియా, జపాన్‌లకు చోటు దక్కరాదన్న ఏకైక లక్ష్యంతో ఏళ్ల తరబడి ప్రతినాయక పాత్ర పోషిస్తోంది. భద్రతామండలి పరిమాణం, అధికారాల్లో ఎటువంటి మార్పులు చేర్పులకైనా శాశ్వత సభ్యదేశాల సమ్మతి పొంది తీరాలని సమితి ఛార్టర్‌ స్పష్టీకరిస్తోంది. సభ్య దేశాల నిబద్ధత, రాజకీయ నిశ్చయాలే ఐక్యరాజ్య సమితి సంస్కరణల ప్రస్థానాన్ని నిర్దేశించగలవన్న సర్వప్రతినిధి సభ సారథి మరియా ఫెర్నాండా ఎస్పినోసా వ్యాఖ్యలు అక్షర సత్యాలు. మండలి విశ్వజనీనత సంతరించుకోవాలీ అంటే కీలక నిర్ణయాధికారం ఏ కొందరి గుప్పిట్లోనో ఇరుక్కోకుండా ఛార్టర్‌నుంచే ఆరంభం కావాలి సంస్కరణలు!

రెండో ప్రపంచ యుద్ధ శిథిలాలపై ఊపిరి పోసుకున్న ఐక్యరాజ్య సమితి స్థాపిత లక్ష్యాల సాధనలో విఫలమైంది. విశ్వ మానవాళికి యుద్ధభీతిని దూరం చేయలేకపోయింది. ‘సూపర్‌ పవర్‌’ చేతిలో గువ్వపిట్టగా సమితి, వీటో రాజ్యాల సంచాలక కార్యాలయంగా భద్రతామండలి పరువు మాశాయి. గడచిన ఏడున్నర దశాబ్దాల్లో ప్రపంచ స్థితిగతుల్లో విశేష మార్పులు చోటుచేసుకున్నాయి. మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. దశాబ్దాల తరబడి సమితిని తన కనుసన్నల్లో శాసించిన అమెరికా- ట్రంపరితనం పర్యవసానంగా ఐరాస మానవ హక్కుల మండలినుంచి వైదొలగి, సమితిని ఆర్థికంగానూ ఇక్కట్లపాలు చేస్తోంది. తనవంతుగా చైనా ‘జైషే మహ్మద్‌’ సారథి మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని అడ్డుకోవడానికి ‘వీటో’ అధికారాన్ని ఎలా దుర్వినియోగపరచిందీ ఇటీవలి చరిత్రే! ప్రపంచ జనాభాలో పదిశాతంలోపు వాటా కలిగిన ఐరోపా, భద్రతామండలిలో మూడు సభ్య దేశాలను (బ్రిటన్‌, ఫ్రాన్స్‌, రష్యా) కలిగి ఉండటమేమిటి? రష్యా, కజకిస్థాన్‌, టర్కీల్లో కొంత విస్తీర్ణంతోపాటు 48దేశాలతో ఎకాయెకి 60శాతం విశ్వమానవాళికి నెలవైన ఆసియా ఖండ ప్రాతినిధ్యం కేవలం చైనాకే పరిమితం కావడమేమిటి? ఒకప్పటి శిబిరాల లెక్కలు, బల సమీకరణాలను పక్కనపెట్టి భిన్న రంగాల్లో వివిధ దేశాల శక్తి సామర్థ్యాలు, అంతర్జాతీయంగా వాటి సేవానిరతి, శాంతిప్రియత్వం, ఖండాలవారీగా జనాభా ప్రాతిపదికన మండలిలో ప్రాతినిధ్యం కల్పించాలి. ‘వీటో’ అధికారం వద్దన్న పక్షంలో భారత్‌కు మండలి శాశ్వత సభ్యత్వం దక్కే అవకాశం ఉందన్న విడ్డూర సూచన రెండేళ్ల క్రితం వెలుగు చూసింది. ఇష్టారాజ్యంగా మోకాలడ్డే అటువంటి అధికారం ‘పి 5’ దేశాలకు మాత్రం ఎందుకుండాలి? పంచరాజ్యాల ‘వీటో’ గుప్పిట సమితి, మండలి విలవిల్లాడే దుస్థితిని తుడిచిపెడుతూ మెజారిటీ సభ్యదేశాల అభిప్రాయమే చెల్లుబాటు అయ్యేలా విధివిధానాల సమూల క్షాళన ఒకటే ఐరాస ఉనికిని కాపాడగలిగేది!Posted on 28-06-2019