Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ప్రపంచం మేలుకోరి... మేల్కోవాలి!

* నేటి నుంచి జి-20 సదస్సు

జపాన్‌లోని ఒసాకా నగరంలో నేడు, రేపు జరగనున్న 20 దేశాల బృంద (జి-20) సదస్సు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాధాన్యం సంతరించుకొంది. ఐరోపా సమాఖ్య (ఈయూ), మరో 19 ప్రముఖ దేశాలతో ఏర్పడిన జి- 20లో అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలూ ఉన్నాయి. ప్రపంచం ముందున్న ఆర్థిక సమస్యలపై అవి తరచూ చర్చించుకుంటాయి. పరస్పరం సహకరించుకుంటాయి.

ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జి-20 దేశాల్లోనే నివసిస్తోంది. ప్రపంచ జీడీపీలో 90 శాతం ఈ దేశాల్లోనే నమోదవుతోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం ఈ దేశాల మధ్యనే జరుగుతోంది. అందువల్ల ఈ సదస్సు తీర్మానాలు అంతర్జాతీయ విధాన రచనను ప్రభావితం చేస్తాయి. 1997లో ఆసియా దేశాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఏర్పడిన ఆర్థిక మంత్రుల వేదిక, తరవాత నాయకుల వేదికగా మారింది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం అనంతరం ఈ వేదిక ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక అప్పటి నుంచి జి-20 దేశాల నాయకులు ఏడాదికి ఒకసారి; ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్లు ఏడాదికి రెండుసార్లు సమావేశమవుతున్నారు. జి- 20 బృంద అధ్యక్ష పదవిని అన్ని సభ్యదేశాలూ వంతులవారీగా నిర్వహిస్తాయి. అధ్యక్ష స్థానంలో ఉన్న దేశమే ఆ ఏడాది సమావేశ అజెండాను నిర్ణయిస్తుంది. ఈ ఏడాది ఆ పదవిని నిర్వహిస్తున్న జపాన్‌- సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌, ప్రపంచంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాపై చర్చకు సన్నాహాలు చేస్తోంది. ఇంకా ఇతర అంశాలూ చర్చకు రానున్నాయి. ముఖ్యంగా అమెరికా-చైనాల వాణిజ్య యుద్ధం, వెనెజ్వెలా ఆర్థిక సంక్షోభం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి కీలక పరిణామాలపై చర్చించనున్నది. ఇరాన్‌ మీద అమెరికా అధ్యక్షుడి దూకుడు, ఉత్తర కొరియా సమస్య అంతర్జాతీయంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితిని వ్యాపింపజేస్తున్నాయి. ఈ ధోరణుల వల్ల ఇటీవలి కాలంలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో వందల కోట్ల డాలర్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఈ ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవడానికి ఒసాకా సదస్సు ప్రయత్నించనుంది. కానీ, ఆ యత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి.

తరుగుతున్న పాశ్చాత్య ప్రాబల్యం
ఇటీవలి వరకు ప్రపంచీకరణకు, బహుళ సంస్కృతులు, విశ్వజనీనతకు చిహ్నాలనుకున్న పాశ్చాత్య దేశాలు క్రమంగా ఆ లక్షణాలకు దూరంగా జరుగుతున్నాయి. ప్రపంచ ప్రయోజనాలకన్నా తమ స్వప్రయోజనాలే మిన్న అని అవి అంటున్నాయి. వీటిలో కొన్ని దేశాలు గత్యంతరం లేక, మరికొన్ని దేశాలు ఉద్దేశపూర్వకంగా ఆ పథంలో నడుస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత పాశ్చాత్య దేశాలు ప్రపంచ నాయకత్వాన్ని చేపట్టి బాధ్యతాయుత పాత్ర నిర్వహించేవి. ఏవైనా దేశాల మధ్య వివాదాలు, ఘర్షణలు తలెత్తితే మధ్యవర్తిత్వం నెరపేవి. అమెరికా, జర్మనీ, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తదితర దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులుగా నిలిచేవి. కానీ, 2000 సంవత్సరం మధ్యనాళ్ల నుంచి ఆర్థిక శక్తి క్రమంగా ఆసియా దేశాల చేతుల్లోకి వెళ్లడం ఆరంభించింది. 2008లో విరుచుకుపడిన ఆర్థిక సంక్షోభం అంతర్జాతీయ బ్యాంకింగ్‌, ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలించేసింది. పాశ్చాత్య దేశాల్లో ఉద్యోగాలు, వేతనాలకు కోత పెట్టింది. సంస్థల ఆదాయాలు, లాభాలను దెబ్బతీసింది. దానికి ప్రతిగా పాశ్చాత్య దేశాల్లో మితవాద జనాకర్షక నినాదాలకు, నాయకులకు గిరాకీ పెరిగింది. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారంలోకి రావడాన్ని ఈ కోణంలో చూడవచ్చు. తమ దేశ వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే పట్టం కడుతూ అంతర్జాతీయ వ్యవహారాల్లో తమ పాత్రను కుదించుకుంటూ ముందుకు సాగుతున్నారాయన. ప్రపంచ దేశాలు కలసికట్టుగా ముందుకు సాగాలన్న చిరకాల విధానానికి అమెరికా స్వస్తి చెబుతుండటంతో అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవహారాల్లో శూన్యత ఏర్పడుతోంది. దాన్ని భర్తీ చేస్తామంటూ ముందుకొస్తున్న మితవాద నాయకులు చివరకు వ్యవహారాన్ని మరింత కంగాళీ చేస్తున్నారే తప్ప సాధిస్తున్నది ఏమీ లేదు. దీనికి ‘బ్రెగ్జిట్‌’ ఒప్పందమే స్పష్టమైన ఉదాహరణ. ఐరోపా సమాఖ్య (ఈయూ) నుంచి హడావిడిగా బయటపడాలని చూసిన బ్రిటన్‌ ఇంటా బయటా రాజకీయ అనిశ్చితిని ఎదుర్కొంటోంది. ఆంగేలా మెర్కెల్‌ రాజకీయ విధానాల వల్ల ఆటుపోట్లను ఎదుర్కొంటున్న జర్మనీ సైతం ఆర్థికంగా ఒడుదొడుకులకు లోనవుతోంది. అంతర్జాతీయంగా గిరాకీ తగ్గడం వల్ల జర్మనీ మోటారు వాహనాల అమ్మకాలు క్షీణించాయి. ఐరోపా సమాఖ్య (ఈయూ) సైతం కీలకాంశాలపై రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించలేకపోవడం ఆర్థికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ప్రసరిస్తోంది. ఈ పూర్వ రంగంలో అమెరికాకు ప్రత్యామ్నాయ అగ్రరాజ్యంగా ఆవిర్భవించడానికి చైనా ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. వీటిని పాశ్చాత్య దేశాలు వివిధ వేదికలపై అడ్డుకొంటున్నాయి. ఆర్థికంగా, సాంస్కృతికంగా, సైనికంగా అమెరికాదే ఇప్పటికీ పైచేయి. అయినప్పటికీ చైనా అన్ని రంగాల్లో ప్రాబల్య విస్తరణకు గట్టి ప్రయత్నమే మొదలుపెట్టింది. ఇరాన్‌, ఉత్తర కొరియా సమస్యలు అమెరికా ఆధిపత్యానికి సవాలుగా నిలుస్తూ చైనాకు కొత్త అవకాశాలు తెరచాయి. ప్రపంచ నాయకత్వం పట్ల అమెరికా నిరాసక్తత, సొంత సమస్యల్లో కూరుకుపోయిన ఐరోపా, అమెరికా రకరకాలుగా తీసుకొస్తున్న ఒత్తిళ్ళ మధ్య అస్థిమితంగా ఉన్న చైనా- స్థూలంగా ఇదే ప్రస్తుత ప్రపంచ ముఖచిత్రం! ఈ అనిశ్చిత పరిస్థితుల మధ్య ఒసాకాలో జరుగుతున్న సదస్సు ఎంతో ప్రాధాన్యం సంతరించుకొంది. నేటి సంక్షోభ పరిస్థితికి ఏవైనా పరిష్కారాలు చూపుతుందా అన్న ఆసక్తి అంతర్జాతీయంగా నెలకొంది.

పన్నుల విధానాలపైనా చర్చలు
ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాల మధ్య పెట్టుబడుల ప్రవాహం పెంచడానికీ, విదేశీ మారక ద్రవ్య రేట్లలో అవకతవకలు జరగకుండా చూడటానికీ తోడ్పడే ద్రవ్య విధానాలను అన్ని దేశాలూ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు చైనా తన కరెన్సీ రేటును ఉద్దేశపూర్వకంగా డాలర్‌ కన్నా తక్కువగా ఉంచుతున్నందునే అమెరికాకు చైనా చవకగా ఎగుమతులు చేయగలుగుతోందన్నది ట్రంప్‌ వాదన. దీని వల్ల చైనాతో అమెరికా వాణిజ్య లోటు అపరిమితంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా తమ దేశంలో పరిశ్రమలు మూతబడి భారీ ఉద్యోగ నష్టానికి కారణమవుతోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇలాంటి అనుమానాలకు తావులేని ద్రవ్య విధానాలను ప్రపంచ దేశాలు అనుసరించేట్లు సదస్సు చర్యలు తీసుకోవాలి. ప్రపంచ ఆర్థికాభివృద్ధికి అవి దోహదం చేస్తాయి. పన్నుల విధానాలపైనా దృష్టి పెట్టాలి. అంతర్జాతీయంగా పెట్టుబడులు ప్రవహిస్తున్నా అవి జాతీయ స్థాయిలో నియంత్రణలకు తల ఒగ్గాల్సిందే. చట్టపరమైన నిబంధనలు, నియంత్రణలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి. దేశాల మధ్య చట్టపరమైన వ్యత్యాసాలను అంతర్జాతీయ పెట్టుబడిదారులు స్వప్రయోజనాల కోసం తెలివిగా ఉపయోగించుకొంటున్నారు. ఇది విషమ ప్రభావం ప్రసరిస్తోంది. కరెన్సీ విలువలు పడిపోవడానికీ, స్టాక్‌ మార్కెట్ల ఉత్థానపతనాలకూ కారణమై ఆయా దేశాల్లో ఆర్థికంగా కల్లోలం సృష్టిస్తున్నాయి. పెట్టుబడులు ఇష్టారాజ్యంగా వచ్చిపోవడం అస్థిరతను సృష్టిస్తోంది. దీన్ని కట్టడి చేసి విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని ఆయా దేశాల్లో ఉత్పత్తి కార్యకలాపాలకు మళ్లించే పకడ్బందీ ఆర్థిక ఏర్పాట్లు చేయాలి. విదేశీ పెట్టుబడులు కేవలం స్టాక్‌ మార్కెట్లకు వచ్చి తక్షణ లాభాలు కళ్లజూసి వెనక్కు మళ్లిపోయే విధానం జూదం తప్ప మరొకటి కాదు. దీన్ని క్యాసినో పెట్టుబడిదారీ విధానమంటారు. ఈ అవాంఛనీయ ధోరణులపై సదస్సు దృష్టి పెట్టి నిజమైన వృద్ధికి బాట వేసే విధానాన్ని రూపొందించాలి.

అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి సమన్వయంగా పనిచేయాలి. నేడు పెట్టుబడులు ఒక దేశం నుంచి మరొక దేశానికి స్వేచ్ఛగా ప్రవహిస్తున్నాయి కానీ, కార్మికులు, నిపుణుల వలసకు మాత్రం ఆ వెసులుబాటు లేదు. పెట్టుబడులతో ఏర్పాటయ్యే పరిశ్రమలు పర్యావరణానికి ఎంత హాని చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఈ రెండు సమస్యలకూ సరైన పరిష్కారం చూపడానికి సదస్సు ప్రాధాన్యమివ్వాలి. ఏతావాతా మనకు కావలసింది బహుళ ధ్రువ ప్రపంచమే తప్ప ఏక ధ్రువ ప్రపంచం కాదు. ఏదో ఒక్క దేశమే పెత్తనం చలాయించే పరిస్థితి పోయి, అనేక దేశాలు కలసికట్టుగా విధానాలు రూపొందించుకొనే పరిస్థితి రావాలి. ఆర్థికానికి ఎల్లలు లేవని గ్రహించి అన్ని దేశాల ప్రజలు అంతర్జాతీయ వ్యాపారం ద్వారా లబ్ధి పొందడానికి తోడ్పడే విధానాలను చేపట్టాలి. 130 కోట్లకు పైగా జనాభా కలిగి, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విలసిల్లుతున్న భారత్‌- జి- 20 సదస్సులో వర్ధమాన దేశాల వాణిని వినిపించాలి. బడుగు దేశాల ప్రతినిధిగా నిలవాలి!

సమన్వయమే కీలకం
ప్రపంచ శాంతిని కాపాడి, అంతర్జాతీయ ఆర్థిక రథాన్ని మళ్లీ గాడిన పెట్టడానికి జి-20 సదస్సు చొరవ తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అవి ఫలించాలంటే సభ్య దేశాలు చేయీ చేయీ కలిపి విధానాలను రూపొందించుకోవాలి. ఆర్థికాభివృద్ధి మందగిస్తున్న దృష్ట్యా ఇది చాలా అవసరం. ప్రపంచ ఆర్థిక స్థితి అంచనా నివేదిక ప్రకారం 2019లో అంతర్జాతీయ ఆర్థికాభివృద్ది రేటు మూడు శాతం మించదు. ప్రగతి మందగిస్తోందని ఇది రూఢి చేస్తోంది. 2017లో ప్రపంచ వృద్ధి రేటు నాలుగు శాతం కాగా, 2018 ప్రథమార్థంలో 3.8 శాతానికీ, ద్వితీయార్ధంలో 3.2 శాతానికీ పడిపోయింది. ఇది మళ్లీ పుంజుకోవాలంటే అంతర్జాతీయస్థాయిలో ఆర్థిక విధానాన్ని సమన్వయం చేయాలి.Posted on 28-06-2019