Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పాలస్తీనాపై మారిన తీరు

* ఇజ్రాయెల్‌ వైపు భారత్‌ మొగ్గు

ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు వ్యతిరేకంగా భారత్‌ స్పందించింది. దశాబ్దాలుగా ఆ దేశానికి మద్దతు పలుకుతున్న విధానంలో మార్పు చోటు చేసుకోవడం కీలక పరిణామం. స్వచ్ఛందసంస్థ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ‘షహీద్‌’ అనే సంస్థ ఐరాస ఆర్థిక, సామాజిక మండలి (యూఎన్‌ఈసీఓఎస్‌ఓసీ)లో పాలస్తీనా వ్యవహారాలకు సంబంధించి సలహాదారు హోదాను కోరడాన్ని ఇజ్రాయెల్‌ వ్యతిరేకించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్‌ ఓటు వేసింది. అరబ్‌ దేశాల్లోని ఉగ్రవాద సంస్థల సంగతి తెలిసీ షహీద్‌కు మద్దతు ఇవ్వడం ఆత్మవంచనే అవుతుందన్నది భారత్‌ అభిప్రాయం. దానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తమ మద్దతు లభించదని స్పష్టంగా ప్రపంచానికి చాటింది.

దశాబ్దాలుగా పాలస్తీనాకు భారత్‌ మద్దతు ఇస్తోంది. మన దేశ అంతర్గత ఓటు బ్యాంకు రాజకీయాలూ ఇందుకు కొంతవరకు కారణం. గత ప్రభుత్వాలు మైనార్టీల ఓట్ల కోసం పాలస్తీనాపై సానుభూతి చూపేవి. ఒక్కోసారి అది మనకు చేటు చేస్తుందని తెలిసినా మౌనంగా ఉండేవి. పాలస్తీనాకు ఇంత అండగా ఉన్నా, ఆ దేశం నుంచి భారత్‌కు కశ్మీర్‌ విషయంలో ఒరిగిందేమీ లేదు. దీంతో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం వైఖరిలో కొంత మార్పు వచ్చింది. 2015లో ఐరాస మానవ హక్కుల సంఘంలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్‌ ఓటింగుకు దూరంగా నిలిచింది. ఇది పరోక్షంగా పాలస్తీనాకు హెచ్చరిక వంటిదే. ఆ తరవాత భారత్‌ మద్దతు పాలస్తీనాకు లభించింది. జెరూసలెమ్‌ను ఇజ్రాయెల్‌ రాజధానిగా అమెరికా గుర్తిస్తూ, తన దౌత్యకార్యాలయాన్ని టెల్‌అవీవ్‌ నుంచి అక్కడకు తరలించింది. దీనిపై ఐరాసలో జరిగిన ఓటింగులో పాలస్తీనా పక్షాన భారత్‌ నిలబడింది. అయినప్పటికీ ఇజ్రాయెల్‌ ఈ విషయాన్ని సానుకూలంగానే అర్థం చేసుకుంది. అనంతరం కొద్దిరోజుల వ్యవధిలోనే పాలస్తీనా దౌత్యవేత్త వలీద్‌ అబు అలీ పాక్‌ ఉగ్ర‌వాద‌సంస్థ‌ లష్కరే తొయిబా అధినేత హఫీజ్‌ సయీద్‌తో కలిసి వేదిక పంచుకొన్నారు. ఇది భారత్‌కు మింగుడు పడలేదు.

మరోపక్క ఇంధన అవసరాలు భారత్‌ అంతర్జాతీయ వ్యూహాలను ప్రభావితం చేస్తున్నాయి. చమురు ఎగుమతి చేసే గల్ఫ్‌దేశాలకు ఇజ్రాయెల్‌ ప్రధాన శత్రువు కావడంతో పాలస్తీనా వైపు భారత్‌ మొగ్గు చూపాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ, ఆ దేశాలు కశ్మీర్‌ విషయంలో భారత్‌కు అండగా నిలవకపోగా, ఓఐసీ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కంట్రీస్‌)లో పాకిస్థాన్‌కు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. మనం చమురు అవసరాల కోసం అరబ్‌ దేశాలతో పాటు అమెరికా, వెనుజువెలా వంటి దేశాలపైనా ఆధారపడుతున్నాం. తాజాగా ఇజ్రాయెల్‌లోనూ చమురు నిల్వలు వెలుగుచూశాయి. దీంతో ఇక ఇజ్రాయెల్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేమని సౌదీ అరేబియా అర్థం చేసుకొంది. పాత వైరం కొనసాగిస్తే భవిష్యత్తులో చిక్కులు తప్పవనే సత్యం బోధపడింది. సాంకేతికత విషయంలో అరబ్‌ దేశాలకు అందనంత దూరంలో ఇజ్రాయెల్‌ ఉంది. ఉమ్మడి శత్రువు ఇరాన్‌ అణుశక్తి సాధనకు అడుగులు వేయడం ఇటు ఇజ్రాయెల్‌, అటు సౌదీలోనూ ఆందోళనను పెంచాయి. దీంతో ఈ రెండు దేశాలు శత్రుత్వాన్ని పక్కనపెట్టాయి. ఇది భారత్‌కు కలిసొచ్చింది. ఫలితంగా భారత్‌కు చెందిన ఎయిర్‌ ఇండియా విమానం సౌదీ గగనతలం మీదుగా తొలిసారి ఇజ్రాయెల్‌ చేరుకొని చరిత్ర సృష్టించింది. దీంతో భారత్‌ సైతం పాలస్తీనా పట్ల సానుభూతి వ్యవహారశైలిని పక్కనపెట్టే అవకాశం లభించింది.

భారత్‌ తన అవసరాల కోసం ఆరో దశకం ప్రారంభంలో ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలు కొనుగోలు చేసింది. వాటిని ఆ దేశ పతాకాలు ఉన్న నౌకలపై తరలించకూడదనే షరతు భారత్‌ పెట్టింది. ఇందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించలేదు. చివరికి భారత్‌ తన అవసరాల కోసం మెట్టుదిగాల్సి వచ్చింది. ఇజ్రాయెల్‌తో బంధం విషయంలో భారత్‌ గోప్యతను కోరుకుంది. ఇజ్రాయెల్‌ను 1950లోనే భారత్‌ గుర్తించింది. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు అక్కడ దౌత్యకార్యాలయమే లేదు. 2017లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించడం భారత్‌ వైఖరిలో వచ్చిన బలమైన మార్పునకు సంకేతం. భారత్‌కు వ్యవసాయం, నీటి నిర్వహణ, అంకుర పరిశ్రమలు వంటి రంగాల్లో ఆ దేశ సహకారం అవసరం. దాదాపు 60శాతం భూభాగం ఎడారి మయమైన ఇజ్రాయెల్‌ నీటి వనరుల నిర్వహణ, నీటిశుద్ధి, ఎడారి వ్యవసాయ రంగాల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. భారత్‌లోని 10 రాష్ట్రాల్లో వ్యవసాయానికి సంబంధించి దాదాపు 30 కేంద్రాలను నిర్వహిస్తోంది. తాజాగా కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సాంకేతిక సాయం చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

దేశంలోని అంకుర పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు తొలిసారి బెంగళూరులో ఇండొ-ఇజ్రాయెల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ (ఐఐఐసీ)ను ప్రారంభించింది. రక్షణ, నిఘా రంగాల్లో ఇరుదేశాల బంధం చాలా గాఢమైంది. ఇజ్రాయెల్‌ ఉత్పత్తి చేసే ఆయుధాల్లో 40 శాతం వరకు భారత్‌ కొనుగోలు చేస్తోంది. బాలాకోట్‌లో ఉగ్రస్థావరాలపై దాడిలో ఈ దేశ ఆయుధాలే కీలక పాత్ర పోషించాయి. కశ్మీర్‌ విషయంలో భారత్‌కు ఇజ్రాయెల్‌ మద్దతుగా నిలుస్తోంది. 2009లో ఇజ్రాయెల్‌ విదేశాంగశాఖ నిర్వహించిన సర్వేలో 58 శాతం భారతీయులు ఆ దేశం పట్ల సానుభూతితో ఉన్నారని వెల్లడైంది. ప్రపంచంలో మరే దేశ ప్రజలు ఈ స్థాయిలో వారిపై సానుభూతితో లేరని తేలడం విశేషం. ఐక్యరాజ్య సమితిలో తాజా ఓటింగుతో పాలస్తీనాకు గుడ్డిగా మద్దతు పలికే వైఖరికి భారత్‌ చరమగీతం పాడింది. అదే సమయంలో ‘రెండు దేశాల విధానా’న్ని వదిలేయలేదు. అందుకే జెరూసలెమ్‌పై తీర్మానంలో భారత్‌ ఓటు పాలస్తీనాకు దక్కింది. తాజాగా ఉగ్రవాద సంస్థకు స్వచ్ఛందసంస్థ ముసుగేసి కథ నడిపిద్దామనుకుంటే మౌనంగా ఉండబోమని పాలస్తీనాకు భారత్‌ అర్థమయ్యేట్లు చెప్పింది!- పెద్దింటి ఫణికిరణ్‌
Posted on 04-07-2019