Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

కాసుల గర్భాలకు కళ్లెం

* పార్లమెంటు ముందుకు బిల్లు

అద్దెగర్భం (సరోగసీ) విధానంలో వాణిజ్య పోకడలను నిరోధించే బిల్లును కేంద్ర మంత్రివర్గం అనుమతించడంతో ‘భారత్‌లో కృత్రిమ పద్ధతుల్లో పిల్లల తయారీ’ వ్యాపారానికి ఇక కళ్లెం పడనుంది. అదే సమయంలో అద్దె గర్భం ఇవ్వడానికి బంధువర్గం, స్నేహితులు దొరక్కపోతే మాతృత్వం కోసం ఆరాటపడే దంపతుల ఆశలు నీరుగారే పరిస్థితీ ఎదురుకానుంది. అనేక కారణాల వల్ల పిల్లలు కలగని భార్యాభర్తలకు అద్దెగర్భం విధానం ఒక వరం లాంటిది. భారతదేశంలో ఈ విధానం 2002 నుంచి 2018 వరకు విదేశీయులకు సంతాన సాఫల్య వరదాయినిగా నిలిచింది. అనేకమంది దేశ, విదేశీ దంపతులకు పిల్లలను అందించి ‘ప్రపంచ ఊయల’నే పేరు గడించింది. ‘సరోగసీ హబ్‌’గా పేరొంది ‘ఫెర్టిలిటీ టూరిజం’ కేంద్రంగా అభివృద్ధి చెందింది. గుజరాత్‌లోని ఆనంద్‌, సూరత్‌, జమున నగరాల్లో సంతాన సాఫల్య కేంద్రాలు స్వల్పకాలంలోనే ఇబ్బడి ముబ్బడిగా వెలిసి, ‘కృత్రిమ పిల్లల ఉత్పత్తి కుటీర పరిశ్రమలు’గా వృద్ధిచెందాయి.

సంతానోత్పత్తి పర్యాటకానికి ఇజ్రాయెల్‌ ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందింది. అమెరికా, అనేక ఐరోపా దేశాలనూ ఈ విధానం ఆకట్టుకుంది. అక్కడున్న చట్టాల ప్రకారం అద్దెగర్భం ద్వారా బిడ్డను పొందడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అక్కడి చట్టాలూ కఠినతరం. ఆయా దేశాల్లో వాణిజ్య ధోరణిలో అద్దె గర్భాల ద్వారా పిల్లల్ని పొందడం పూర్తిగా నిషేధం. రష్యా, ఉక్రెయిన్‌, జార్జియా, థాయ్‌లాండ్‌, అమెరికాలో కొన్ని రాష్ట్రాలు మాత్రమే వాణిజ్యపరమైన అద్దె గర్భాల పద్ధతిని అనుమతిస్తున్నాయి. ఫలితంగా అమెరికా, ఇంగ్లాండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్‌ తదితర దేశాలకు చెందిన దంపతులు భారత్‌ వైపు దృష్టి సారిస్తున్నారు. మనదేశంలో అద్దె గర్భానికయ్యే సగటు వ్యయం 10 నుంచి 15 లక్షల రూపాయలు. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో అయ్యే వ్యయంతో పోలిస్తే మూడోవంతు మాత్రమే. ఐక్యరాజ్య సమితి 2012లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో సాలీనా 40 కోట్ల డాలర్ల వ్యాపార లావాదేవీలు జరిగినట్లు అంచనా. నగరాల నుంచి పట్టణాల వరకు మూడువేల అధికారిక, అనధికారిక సంతాన సాఫల్య కేంద్రాలు వెలిసినట్లు ఈ సర్వే తెలిపింది. ‘సెంటర్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌’ అనే సంస్థ తన అధ్యయనంలో గుజరాత్‌, మహారాష్ట్రలోని పేద, మధ్యతరగతి మహిళలు అనేకమంది, గర్భాలు అద్దెకు ఇవ్వడాన్ని ఓ ఉపాధిగా ఎంచుకున్నారని వెల్లడైంది.

‘బేబీ మంజిస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసు వల్ల అద్దెగర్భం విధానం చట్టబద్ధత దేశంలో చర్చకు దారితీసింది. 2007లో జపాన్‌ దంపతులు ఇకుపుమి, యుకియమద గుజరాత్‌లోని ఆనంద్‌లోని‘ఆకాంక్ష సంతాన సాఫల్య కేంద్రం’ వైద్యుడు పటేల్‌ను సంప్రతించారు. అద్దెగర్భం ద్వారా మంజి అనే పాప పుట్టింది. ఇంతలో జపాన్‌ దంపతులు విడాకులు తీసుకున్నారు. బేబీ మంజిని స్వీకరించడానికి తల్లి యుకియమద నిరాకరించింది. దీంతో ఈ కేసులో తల్లి ఎవరు, బిడ్డ ఏ కుటుంబానికి చెందుతుంది, ఆ బిడ్డ జాతీయత తదితర విషయాలపై సమస్య తలెత్తింది. మంజి కేసు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి చట్టాలు తయారు చేయాలనే ఆలోచనలకు నాంది పలికింది. మన దేశంలో ఏ రకమైన చట్టాలు, నియమ నిబంధనలు లేని కారణంగా గ్రామీణ నిరుపేద మహిళలు దోపిడికి గురయ్యారు. సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు కనీస వృత్తి విలువలు పాటించలేదు. అద్దెగర్భానికి సంబంధించి ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌’ విధివిధానాల్ని రూపొందించింది. ఈ క్రమంలోనే ‘అసిస్టెడ్‌ రిప్రొడక్టివ్‌ టెక్నాలజీ బిల్లు- 2010’, తాజాగా ‘సరోగసీ రెగ్యులేషన్‌ బిల్లు’ వంటివి వెలుగులోకి వచ్చాయి. గతంలోనే లోక్‌సభలో అద్దెగర్భం నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టారు. అప్పట్లో దిగువ సభలో బిల్లు పాసైనా, ఎగువసభ వద్ద నిలిచిపోయింది. దీంతో మళ్లీ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు వాణిజ్యపరమైన అద్దెగర్భం విధానాన్ని పూర్తిగా నిషేధించింది. ధనాపేక్ష లేని, దగ్గరి బంధువులు, రక్తసంబంధీకుల సహకారంతో పిల్లల్ని కనడానికి అనుమతిస్తూ నియమాలు రూపొందించారు. విదేశీ, ప్రవాస భారతీయులకు పిల్లలు పొందే హక్కును నిషేధించారు. నియమాలను ఉల్లంఘిస్తే పదేళ్ల జైలుశిక్ష లేదా పది లక్షల రూపాయల జరిమానా విధించనున్నారు. అద్దెగర్భం ద్వారా సంతానం పొందే బదులు అనాథలను దత్తత తీసుకునేలా సంతానంలేని దంపతులను ప్రోత్సహించే దిశగా ఈ బిల్లు తెచ్చారన్నది ఒక వాదన. డబ్బు ఆశ చూపి, గ్రామీణ మహిళలను వైద్యులు, దళారులు దోపిడి చేస్తున్నారనేది మరో అంశం. సహజీవనం, స్వలింగ వివాహాలను అనుమతించిన సమయంలో ఈ బిల్లును కేవలం ‘హెటిరో సెక్సువల్‌’ దంపతులకు మాత్రమే అనుమతించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనే విమర్శలున్నాయి. బిల్లు అమలైతే గర్భాన్ని అద్దెకివ్వడంద్వారా గుజరాత్‌లో ఒక మహిళ తొమ్మిది నెలల వ్యవధిలో దాదాపు నాలుగు లక్షల రూపాయలు సంపాదించే అవకాశం కోల్పోతుందని ఒక అధ్యయనం పేర్కొంది. ఇది చాలా సున్నితమైన, భావోద్వేగాలతో కూడుకున్న సమస్య. పిల్లల్ని కనడం, కనకపోవడం దంపతుల ఇష్టం. ప్రభుత్వ జోక్యం ఎందుకన్న విమర్శలూ ఉన్నాయి. ఈ సమస్యను సామాజిక కోణంలో ఆలోచించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాణిజ్య ధోరణులను నిషేధించినా, తెరచాటున ఈ వ్యాపారం గుట్టుచప్పుడు కాకుండా విస్తరించే ప్రమాదమూ లేకపోలేదు. ‘ది హేగ్‌ కన్వెన్షన్‌-1980’ లాంటి అంతర్జాతీయ చట్టాలతోపాటు, మనదేశంలో పటిష్ఠమైన న్యాయవ్యవస్థను ఏర్పాటుచేసి ఈ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి. ‘అమ్మతనాన్ని’ పొందలేని మహిళలకు పిల్లల్ని ప్రసాదించే వెసులుబాటు కల్పిస్తూ, ఇది దుర్వినియోగం కాకుండా నివారణ చర్యలు చేపట్టినప్పుడే ఈ చట్టానికి సార్థకత చేకూరుతుంది.- డాక్టర్‌ రమేష్‌ బుద్దారం
Posted on 05-07-2019