Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

న్యాయపాలన కొత్త పుంతలు

షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) పద్నాలుగో సీనియర్‌ న్యాయమూర్తుల సదస్సు రష్యాలోని సోచి నగరంలో జరిగింది. సదస్సుకు భారత్‌ తరఫున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ హాజరయ్యారు. న్యాయపాలనకు సంబంధించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పరం సహకరించుకోవాలని ఎస్‌సీఓ పరిధిలోని ఎనిమిది దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయమూర్తులు నిర్ణయించారు. ఆ సదస్సులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చేసిన ప్రసంగ పాఠమిది!

ప్రతిష్ఠాత్మక షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ)లో భారతదేశం సభ్యురాలైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. దేశాల మధ్య దూరాలు చెరిగి బంధాలు బలపడుతున్న ఈ రోజుల్లో ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకోవడం మనందరినీ పరిపుష్టం చేస్తుంది. నిరంతరం విలువైన ప్రతిపాదనలు చేసుకుంటూ, ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా ఆలకిస్తూ, న్యాయ వ్యవస్థలోని మౌలిక విలువల పునాదిపై ఏకాభిప్రాయం నిర్మించుకొంటూ ముందుకు సాగితే మన న్యాయపాలన సామర్థ్యం మరెంతో ఇనుమడిస్తుంది. మన నేపథ్యాలు, శిక్షణ విధానాలు వేరైనా సత్వరం, సమర్థంగా న్యాయం అందించాలనే ఆకాంక్ష మనందరినీ కలుపుతోంది. ఇవాళ నా ప్రసంగానికి ఎంచుకున్న అంశానికి పునాదులు ప్రస్తుత సభకు ముందు జరిగిన 13వ ఎస్‌సీఓ షాంఘై సమావేశంలోనే పడినాయి. స్మార్ట్‌ కోర్టుల సృష్టిపై మన భావాలను ఆ సభలో పంచుకొన్న సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. మనం ఇచ్చిపుచ్చుకొన్న భావాలకు నిర్దిష్ట రూపమివ్వడానికి ప్రత్యేక సంఘాలు నెలకొల్పాలని మనవి చేస్తున్నాను. ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకునే ప్రక్రియ నిరంతరం సాగాలని వాంఛిస్తున్నాను.

ఆలస్యంతో అనర్థాలు
భారత రాజ్యాంగం జాతి ఆశల కలబోత. వలస పాలనకు తెరదించి సామాజిక సమానత్వం వెల్లివిరిసే నవయుగంలోకి భారత దేశం సాహసికంగా వేసిన ముందడుగు అది. సరైన విచారణతో సకాలంలో అందరికీ సమ న్యాయం జరుగుతుందని రాజ్యాంగం భరోసా ఇస్తున్నా, అది పూర్తిగా కార్యరూపం ధరించిందని చెప్పలేం. 130 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశంలో దీర్ఘకాలం నుంచి కోట్లాది కోర్టు కేసులు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. దిగువ న్యాయస్థానాల్లో మూడు కోట్లు, హైకోర్టులలో 40 లక్షల కేసులు అపరిష్కృతంగా మిగిలిపోగా, సుప్రీంకోర్టులో 60,000 కేసులు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాయి. ఈ అపరిష్కృత కేసుల పురోగతిపై జాతీయ న్యాయ సమాచార నిధి అనుదినం ఆరా తీస్తోంది.

న్యాయం జరగడంలో ఆలస్యమైతే, అసలు న్యాయం జరగనే లేదని అర్థం. ఆలస్యం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. దీన్ని నివారించాలంటే వేగంగా కేసుల పరిష్కారానికి ఒక కాలపరిమితి నిర్ణయించాలి. దాన్ని నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా పాటించాలి. న్యాయస్థానాలకు నైతిక ఆధిక్యత ఉందనే నమ్మకం ప్రజల్లో చెక్కుచెదరకుండా ఉండాలంటే కేసులను సత్వరం పరిష్కరించాలి. తీర్పు వచ్చేసరికి సమయం మించిపోయిందనే భావన జనంలో కలగకుండా జాగ్రత్త పడాలి. అలా చేసినప్పుడు తీర్పు చట్టపరంగా, నైతిక పరంగా శిరోధార్యమని వారు అంగీకరిస్తారు. విచారణ ప్రక్రియపట్ల నమ్మకం పెంచుకుంటారు. సత్వర న్యాయంవల్ల సహజసిద్ధంగా చేకూరే ప్రయోజనమిది. దీనికి తోడు ఆర్థిక ప్రయోజనాలూ సిద్ధిస్తాయి. ప్రస్తుతం కోర్టుల్లో దావాల పరిష్కారానికి ఏళ్లూపూళ్లూ పడుతోంది. దీన్ని అలుసుగా తీసుకుని కక్షిదారులు ఒప్పందాలను సక్రమంగా పాటించడం లేదు. కోర్టు ఖర్చులు అందరికీ తడిసిమోపెడవుతున్నాయి. వ్యాపారంలో పేచీలు ఎంతకూ తెమలకపోవడం వల్ల పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదు. ప్రాజెక్టులు ఎక్కడివక్కడ నిలిచిపోతున్నాయి. ఒక్కమాటలో- వ్యాపారం చేయడం ఎంతో కష్టమైన పనిగా మారిపోయింది. ఈ సమస్యలు ఒక్క రోజులో పరిష్కారం కావు కానీ, అందరి సలహాసంప్రదింపులతో వాటిని అధిగమించడం అసాధ్యమేమీ కాదు.

‘న్యాయ వ్యవస్థలోని వివిధ అంచెల్లో కేసుల విచారణలో జాప్యనివారణ, విచారణకు ముందే సామరస్యంగా వివాద పరిష్కారం- ఈ రెండు అంశాల్లో షాంఘై సహకార సంఘం (ఎస్‌సీఓ) సుప్రీం కోర్టులు ఘన విజయం సాధించాయి.’

          - జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (సుప్రీంకోర్టు న్యాయమూర్తి)

న్యాయమూర్తుల కొరతతో ఇక్కట్లు
న్యాయ వ్యవస్థలో భాషను, పదాలను కచ్చితమైన అర్థంలో ప్రయోగిస్తారు. అందువల్ల పెండెన్సీ (అపరిష్కృతం), డిలే (అనవసర ఆలస్యం), ఎరియర్‌ (అకారణ బకాయిలు), బ్యాక్‌ లాగ్‌ (పేరుకుపోయిన కేసులు) అనే న్యాయ పారిభాషిక పదాలకు నిర్దిష్ట అర్థాలను తెలుసుకోవాలి. ‘పెండెన్సీ’ అంటే న్యాయస్థానాల్లో అతీగతీ తెలియక అపరిష్కృతంగా ఉండిపోయిన కేసులు. ఇవి ఎంతకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్నాయో లెక్కాపత్రం ఉండదు. ‘డిలే’ అంటే అవసరమైనదానికన్నా ఎక్కువ కాలం విచారణలో ఉండటం. ఆలస్యమైన ప్రతి కేసునూ ‘ఎరియర్‌’ అనలేం. సాధారణంగా కొన్ని రకాల కేసుల్లో సహేతుక కారణాల వల్ల విచారణ ఆలస్యం కావచ్చు. సరైన కారణం లేకుండా జాప్యం జరిగితే మాత్రం ‘ఎరియర్‌’ (అకారణ బకాయి) అంటారు. ఇక పేరుకుపోయిన కేసులు (బ్యాక్‌ లాగ్‌) అంటే ఏమిటో చూద్దాం. ఒక కాలావధిలో పరిష్కారమైన కేసులకన్నా ఆ వ్యవధిలో దాఖలైన కేసులు ఎక్కువగా ఉంటే బ్యాక్‌లాగ్‌గా వ్యవహరిస్తారు. అకారణ బకాయిలను (ఎరియర్స్‌), పేరుకుపోయిన కేసులను (బ్యాక్‌లాగ్స్‌) తగ్గిస్తే కానీ, న్యాయ సాధనలో ఆలస్యాన్ని అధిగమించలేం.

భారతదేశంలో ప్రతి పది లక్షల జనాభాకు సగటున కేవలం 19మంది న్యాయమూర్తులు ఉన్నారు. మంజూరైన న్యాయమూర్తి పదవుల్లోనూ భర్తీ చేయని ఖాళీలు చాలానే ఉన్నాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్ర స్వభావాన్ని కాపాడటానికి భారత్‌ ఓ అద్వితీయ నియామక పద్ధతిని పాటిస్తోంది. న్యాయమూర్తుల నియామకంలో న్యాయ వ్యవస్థ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తే, ప్రభుత్వం భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అపరిష్కృత కేసుల (పెండెన్సీ)ను త్వరగా తేల్చడానికి సుప్రీం కోర్టు క్రమం తప్పకుండా ఖాళీలను భర్తీ చేస్తోంది. మంచి అర్హతలు ఉన్నవారిని తగిన సంఖ్యలో న్యాయమూర్తులుగా నియమించడానికి ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తోంది. మంచి పనితీరు కనబరచడం, కేసుల పరిష్కారానికి గడువులు నిర్ణయించడం, సకాలంలో నాణ్యమైన తీర్పులు వెలువరించడం, సాంకేతికత సాయంతో శీఘ్ర న్యాయపాలన సాధించడం- సమర్థ న్యాయ నిర్వహణకు గీటురాళ్లు! వీటిని పాటించగల న్యాయాధికారులను, సుశిక్షిత కేసు మేనేజర్లను కోర్టు నిర్వాహకులుగా నియమించాలి. అన్ని రాష్ట్రాల్లో, కేంద్రంలో కిందినుంచి పై అంచె వరకు ఈ ప్రమాణాలను పాటించినప్పుడు న్యాయ ప్రక్రియపై ప్రజలకు నమ్మకం పెరుగుతుంది.

దిగువ న్యాయస్థానాలకు ఎలక్ట్రానిక్‌ డేటా బేస్‌లను కల్పించి, కోర్టు గదులను నిర్మించి, తగిన సంఖ్యలో సహాయక సిబ్బందిని నియమిస్తే కేసులను వేగంగా పరిష్కరించవచ్చు. కోర్టులు, కేసుల నిర్వహణ సమర్థంగా ఉంటే న్యాయప్రక్రియ ఎంతగానో మెరుగు పడుతుంది. అనవసర ఆలస్యాన్ని నివారించాలంటే విచారణ ప్రక్రియలోని వివిధ అంచెలను నిర్దిష్ట కాలావధుల లోపల పూర్తిచేయాలని ఆదేశించే అధికారం న్యాయమూర్తులకు ఉండాలి. కేసుల నమోదు సమయంలోనే పకడ్బందీగా వ్యవహరించాలి. న్యాయ ప్రక్రియకు అడ్డంకులు గుర్తించడం, న్యాయస్థానాల్లో వకీళ్లు తప్పనిసరిగా లిఖితపూర్వక నివేదన ఇవ్వాలని ఆదేశించడం, మౌఖిక విచారణకు సమయాన్ని నిర్ణయించడం ద్వారా బ్యాక్‌లాగ్‌ (పేరుకుపోయిన కేసుల)ను బాగా తగ్గించవచ్చు. ఏకరూప ప్రమాణాలను నిర్దేశించే జాతీయ న్యాయస్థానాల నిర్వహణ నియమావళి అమలులోకి వచ్చాక పరిస్థితి మారుతుంది.

శక్తిమంతమైన దిద్దుబాటు చర్యలు
పైన చెప్పుకొన్న అంశాలను నిరంతర సమన్వయంతో అమలు చేస్తూనే ప్రత్యామ్నాయ పద్ధతుల్లో వివాదాల పరిష్కారానికి (ఏడీఆర్‌) చొరవ తీసుకోవాలి. ఏడీఆర్‌ పద్ధతులవల్ల అపరిష్కృత కేసుల (పెండెన్సీ) భారం తగ్గుతుంది. న్యాయస్థానాల సమయం, వనరులు ఆదా అవుతాయి. తమ వివాదాలను తామే పరిష్కరించుకునే వెసులుబాటు కక్షిదారులకు లభిస్తుంది. 2002లో పౌర శిక్షా స్మృతికి చేసిన సవరణ కక్షిదారులను కోర్టు వెలుపల వివాదాలు పరిష్కరించుకొమ్మని ఆదేశించే అధికారాన్ని న్యాయస్థానాలకు కట్టబెట్టింది. వివాదాలను కక్షిదారులు తమకుతామే కానీ, మధ్యవర్తుల సాయంతో కానీ పరిష్కరించుకోవాలని కోర్టులు ఆదేశించవచ్చు. ఈ పద్ధతుల్లో దాదాపు 20 శాతం దావాలు పరిష్కారమైనట్లు అంచనా. కోర్టు వెలుపల పరిష్కారానికి భారతదేశం లోక్‌ అదాలత్‌ అనే ప్రత్యామ్నాయ వేదికను ప్రవేశపెట్టింది. లోక్‌ అదాలత్‌ లో వివాదాల పరిష్కర్తలు న్యాయపరమైన పాత్రనేమీ పోషించరు. వారు చట్టబద్ధ సామరస్య సాధకులు మాత్రమే. కక్షిదారులు రాజీ కుదుర్చుకోవడానికి నిష్పాక్షికంగా తోడ్పడతారు. 2015 సెప్టెంబరుకల్లా దేశవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌ల ద్వారా 8.25 కోట్ల కేసులు పరిష్కారమయ్యాయి. గ్రామ న్యాయాలయ చట్టం అమలు ద్వారా 5,000 గ్రామీణ న్యాయాలయాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. వీటి ఏర్పాటు వల్ల సులభంగా సత్వర న్యాయం గ్రామీణులకు అందుబాటులోకి వస్తుంది. కోర్టుల వెలుపల వివాదాలు పరిష్కరించుకోవచ్చని చాలామందికి తెలియదు కాబట్టి, వారికి ఆ విషయం తెలియజెప్పడానికి విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి.

భారతదేశ న్యాయ వ్యవస్థ విపరీతంగా కాగితాలు వినియోగిస్తోంది. పాత దస్త్రాలను డిజిటలీకరించడంతోపాటు దావాలను కూడా ఎలక్ట్రానిక్‌ రూపంలో దాఖలు చేయాలని ఆదేశిస్తే, కాగితాన్ని బాగా ఆదా చేయవచ్చు. ఇదే పర్యావరణహితమైన పద్ధతి. దేశంలో 14,948 దిగువ కోర్టులను మూడు దశలుగా కంప్యూటరీకరించి చివరకు కాగితరహిత న్యాయాలయాలుగా మార్చాలని ఈ-కోర్టులు, ఈ-ఫైలింగ్‌ ప్రాజెక్టు ప్రతిపాదించింది. ఈ-ఫైలింగ్‌ ద్వారా డిజిటల్‌ దస్త్రాలను వేగంగా ఉన్నత న్యాయస్థానాలకు పంపవచ్చు. సమన్లు, నోటీసులను కూడా డిజిటల్‌ పద్ధతిలోనే పంపినట్లయితే వేగం, సామర్థ్యం పెరుగుతాయి. ఈ-ప్రాసెస్‌ ద్వారా కేసుల పురోగతిపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టవచ్చు. న్యాయ కార్యకలాపాలను విస్తృతంగా డిజిటలీకరిస్తే కక్షిదారుకు, న్యాయవాదులకు, న్యాయస్థానాలకు మధ్య సమాచార సంబంధాలు ఎంతో మెరుగవుతాయి. కేసులు వాయిదాల మీద వాయిదా పడటం తగ్గి పారదర్శకత పెరుగుతుంది. దిగువ కోర్టులు ఇచ్చే ప్రాథమిక తీర్పులు నిర్దేశిత రూపంలో ఉండేట్లు చూడటానికి కృత్రిమ మేధ (ఏఐ) తోడ్పడుతుంది.

‘ఆన్‌లైన్‌’ వివాద పరిష్కార యంత్రాంగాలు
కక్షిదారులు ఎక్కడెక్కడ ఉన్నా వారి మధ్య వివాదాలను ఆన్‌లైన్‌లోనే వేగంగా పరిష్కరించే అవకాశాన్ని సమాచార, కమ్యూనికేషన్‌ సాంకేతికతలు అందిస్తున్నాయి. వినియోగదారుల వివాదాలు, కుటుంబ వివాదాలు, వ్యాపార వివాదాల పరిష్కారానికి ఓడీఆర్‌ ఎంతో ఉపకరిస్తుంది. ఆన్‌లైన్‌ వివాద పరిష్కార సేవలు అందించగల సంస్థలు, విభాగాల జాబితాను కేంద్ర న్యాయశాఖ ఇటీవల విడుదల చేసింది. ఈ సేవలను వినియోగించుకోవాలని అన్ని ప్రభుత్వ విభాగాలను కోరింది. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సభ్యదేశాలు న్యాయ ప్రక్రియలో తాము గడించిన అనుభవాలను పరస్పరం పంచుకోవాలి. ఆ సమష్టి అనుభవంతో న్యాయపరమైన సమస్యలను అధిగమించాలి. ఇందుకు తోడ్పడే సంఘాలను ఎస్‌సీఓ సచివాలయం నెలకొల్పాలని కోరుతున్నాను.


Posted on 07-07-2019