Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

పురోగతి.. ఇసుమంత ఉన్నా ఘనమే!

భారత, అమెరికా సంబంధాలు గత దశాబ్దకాలంగా అనూహ్యంగా పురోగమించినా సరిగ్గా ఏడాది క్రితం.. ఇదే సమయంలో రెండు దేశాల మధ్యా లేనిపోని పంతాలు రేగాయి. ముఖ్యంగా అమెరికాలోని భారత దౌత్య అధికారి దేవయాని ఖోబ్రగడే విషయంలో ఇరుదేశాల మధ్యా రేగిన భేదాభిప్రాయాలు చాలా దూరం వెళ్లాయనే చెప్పాలి. దౌత్యాధికారి అని కూడా చూడకుండా అమెరికా దర్యాప్తు అధికారులు అమెకు బేడీలు వెయ్యటం, తనిఖీలు చేయటం వంటివి ఇరుదేశాల మధ్యా స్పర్థలకు దారి తీశాయి. ఇందుకు ఘాటుగా బదులు చెప్పాలంటూ భారత్‌ కూడా దిల్లీలోని అమెరికా దౌత్య అధికారులకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు తొలగించటం వంటి ప్రతిచర్యలకు దిగింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు జరగటం, ప్రజలు నరేంద్ర మోదీకి బ్రహ్మరథం పట్టటం, అప్పటికే గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీకి అమెరికా వీసా నిరాకరించిన నేపథ్యంలో ఇరుదేశాల సంబంధ బాంధవ్యాలు ఎటు పయనిస్తాయోనని అంతా ఆతృతగా ఎదురు చూడటం తదితర పరిణామాలన్నీ చోటుచేసుకున్నాయి. కానీ దేశప్రయోజనాలకే సమధిక ప్రాధాన్యం ఇచ్చే ప్రధాని మోదీ అమెరికా విషయంలో అత్యంత సానుకూల వైఖరి అవలంబించటమే కాదు.. ప్రధాని పగ్గాలు స్వీకరించిన కొద్ది నెలల్లోనే అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఏకంగా వైట్‌హౌస్‌ను సందర్శించి.. ఒబామాతో భేటీ అయ్యి.. ఇరుదేశాల మధ్యా సంబంధాలను ముందెన్నడూ లేనంతటి శిఖర స్థాయికి తీసుకువెళ్లారు. మన గణతంత్ర వేడుకలకు ఒబామా ముఖ్య అతిథిగా విచ్చేస్తుండటమే దీనికి పెద్ద నిదర్శనం! 'ఈ సందర్శన చరిత్రాత్మకం' అని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి టిమోతీ రోమర్‌ వంటి వారు కూడా అభిప్రాయపుడుతున్నారంటే దీనికున్న ప్రాశస్త్యం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం నెలకొన్న ఈ ఉత్సాహభరిత వాతావరణాన్ని ఇరుదేశాధినేతలూ విందులు, ఉపన్యాసాలకే పరిమితం చెయ్యకుండా.. కచ్చిత ఒప్పందాలతో బంధాలను దృఢతరం చేసేందుకు, ద్వైపాక్షిక పీటముడులను విడదియ్యటంలో ఎంతోకొంత పురోగతి సాధించేందుకే కృషి చేస్తారని భావిస్తున్నారు.

పరస్పరం ఆసక్తి!

ప్రస్తుతం ఐరోపా, చైనాలు కాస్త మందగమనంలో ఉన్నాయి. మరోవైపు ఉగ్రవాద భూతం యావత్‌ ప్రపంచాన్నీ వణికిస్తోంది. ఈ విషయంలో భారత్‌, అమెరికాలు రెండూ ఇప్పటికే భారీ మూల్యం చెల్లించి ఉన్నాయి. భారత్‌ దక్షిణాసియాలో అత్యంత ప్రభావవంతమై దేశంగా అవతరిస్తోంది. ఆర్థిక శక్తిగా కూడా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ బలంగా ఉండాలని, అలాగే భారత్‌తో తమ బంధాలు కూడా దృఢంగా ఉండటం అవసరమని అమెరికా భావిస్తోంది. ఇందుకోసం ప్రధానంగా ఆర్థిక, భద్రత-రక్షణ, సహకార రంగాల్లో ఇరుదేశాలూ కీలక ఒప్పందాల కోసం కృషి చెయ్యటం అనివార్యం. అందుకని ప్రధానంగా నాలుగు అంశాలు- ఆర్థిక బంధాలు, రక్షణ ఒప్పందాలు, పర్యావరణ లక్ష్యాలు, అణు సహకారం.. మోదీ-ఒబామా చర్చల్లో కీలకంగా నిలుస్తాయని, మున్ముందు భారత-అమెరికా బంధాలను నిలబెట్టేవి కూడా ఇవేనని భావిస్తున్నారు.నిజానికి ఇవన్నీ కూడా బృహత్‌ లక్ష్యాలు. ఒక్క భేటీలోనే అనూహ్య పురోగతి అంత తేలిక కాదు. అందుకే ప్రస్తుత భేటీలో ఇరువురు నేతలూ కొద్దిపాటి పురోగతి సాధించగలిగినా కూడా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాలు, ఫలితాలు చేకూరటం తథ్యమని భావిస్తున్నారు.

* ఆర్థిక అంశాలు: భారత ఆర్థిక వృద్ధికి అమెరికా ఎలా, ఎంతగా దోహదం చెయ్యగలదన్నదే ముఖ్యమైన అంశం. అణు రంగం నుంచి మౌలిక సదుపాయల వరకూ అన్ని రంగాల్లోనూ భారత్‌లో తన పెట్టుబడులు పెంచాలనే అమెరికా భావిస్తోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింతగా పెంచే దిశగా చర్చలు, చర్యలు.. రెండూ తథ్యమని భావిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'మేక్‌ ఇన్‌ ఇండియా' కార్యక్రమం ఫలవంతమవ్వాలంటే అమెరికా తోడ్పాటు చాలా అవసరం. మరోవైపు- ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు పన్ను విధానాలను సంస్కరించటం, విధానాలను సులభతరం చెయ్యటం అవసరమని ఒబామా నొక్కిచెప్పే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అమెరికా ఉత్సాహం కనబరుస్తోంది. ప్రధాని మోదీ లక్ష్యాలకు కూడా దగ్గరగా ఉండే అంశమిది.
* 'అణు' రంగంపై ఆశలు: భారత్‌కు అణు పరిజ్ఞానం అందించేందుకు అమెరికా ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతోంది. ఇంధన కొరత తీరి, విద్యుదుత్పాదన పెరిగేందుకు భారత్‌కూ ఇది అవసరమే. అయితే అణువిద్యుత్‌ ప్లాంట్లలో ఏదైనా ప్రమాదాలు జరిగితే దానికి పరికరాల సరఫరాదారులే బాధ్యత వహించాలన్న భారత చట్టం.. అమెరికాకు మింగుడుపడటం లేదు. అంతర్జాతీయంగా ఈ బాధ్యత ప్లాంట్లను నడుపుకొంటున్న వారిదే. దీనిపై భారత్‌ పట్టు సడలించాలని అమెరికా వాదిస్తోంది. భారత-అమెరికాల మధ్య 2008లోనే అణుసహకారానికి ఒప్పందం కుదిరినా ఈ చట్టం వల్ల అది ముందుకుపోవటం లేదు. ఈ పీటముడి ఛేదించేందుకు ఒబామా-మోదీల భేటీలో ఎంత వరకూ ముందడుగు పడుతుందో చూడాల్సిందే.
* పర్యావరణ హితం: ప్రపంచంలో కాలుష్య కారకమైన కర్బన ఉద్గారాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న అమెరికా, చైనాలు రెండూ ఇటీవలే పర్యావరణ సంక్షేమం దిశగా.. ఉద్గారాలను తగ్గించుకునేందుకు లక్ష్యాలను విధించుకుంటూ ఒప్పందానికి వచ్చాయి. ఇది గొప్ప పరిణామమని అంతా అభిప్రాయపడ్డారు. ఒబామా-మోదీ భేటీలో భారత్‌తో ఇలాంటి ఒప్పందం కుదిరే అవకాశమేదీ కానరావటం లేదు. అయితే ఈ ఏడాది చివర్లో ప్యారిస్‌లో జరిగే భారీ పర్యావరణ సదస్సులో అంతర్జాతీయ ఒడంబడిక కుదిరేందుకు భారత మద్దతు సాధించాలని ఒబామా భావిస్తున్నారు. కర్బన ఉద్గారాల సృష్టిలో మూడో అతిపెద్ద దేశం భారతే. కాబట్టి ఉద్గారాలను తగ్గించేందుకు కుదిరే ఏ అంతర్జాతీయ ఒడంబడికకైనా భారత్‌ మద్దతు, భాగస్వామ్యం, ముఖ్యంగా ఉద్గారాలను తగ్గించుకునేందుకు అంగీకారం.. అత్యంత కీలకం.
* రక్షణ-భద్రత: పాకిస్థాన్‌లో స్కూలు పిల్లలపై దాడుల నుంచి ప్యారిస్‌లో పత్రికా కార్యాలయంపై కాల్పుల వరకూ.. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న ప్రతి ఉగ్రవాద దుశ్చర్యకూ.. కొన్నిసార్లు ప్రత్యక్షంగా, కొన్నిసార్లు పరోక్షంగా భారత్‌, అమెరికాలు రెండూ ప్రభావితమవుతూనే ఉన్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు సంయుక్తంగా ఏం చెయ్యాలనే దానిపై మోదీ, ఒబామాలు విస్తృతంగా చర్చలు జరపబోతున్నారు. అలాగే రక్షణ తయారీ రంగంలో కలిసికట్టుగా కృషి చేసేందుకు కూడా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఇది భారత్‌లో ఉత్పాదన రంగాన్ని విస్తరించాలన్న ప్రధాని మోదీ లక్ష్యానికి కూడా అక్కరకొస్తుందని భావిస్తున్నారు.

(ఈనాడు ప్రత్యేక విభాగం)
Posted on 21-01-2015