Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

అవినీతినీ ఊడ్చేయాల్సిందే!

‘అలాంటి వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమ్మీద తిరుగాడాడంటే భవిష్యత్తరాలు నమ్మడం కష్టం’ అని ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌ వంటి మేధావి సన్నుతులందుకున్న కర్మయోగి మహాత్మాగాంధీ. అహింసా సిద్ధాంతంతో విశ్వశాంతి జయకేతనమై ఎగసిన బాపూ 150వ జయంతి వత్సరమిది! స్వచ్ఛత, పరిసరాల పరిశుభ్రతల ప్రయోక్తగా జాతిపితకు ‘స్వచ్ఛభారత్‌’ ను నివాళిగా సమర్పించాలని మోదీ ప్రభుత్వం ప్రతినబూనింది. కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛతా ఉద్యమాన్ని కదం తొక్కించి గాంధీజీకి ఘననివాళి అర్పించే మహాసంకల్పం భేషుగ్గా ఉన్నా- సర్కారు కార్యాలయాలే కేంద్రబిందువులుగా అవినీతి కుళ్ళు కంపు సర్వవ్యాప్తమై సామాజిక అనర్థాలకు అంటుకడుతున్నప్పుడు స్వచ్ఛభారత్‌ లక్ష్యాలు పరిపూర్తి అయినట్లేనా? ఉన్నతాధికార శ్రేణుల్లోని అవినీతి మోతుబరుల్ని నిష్కర్షగా సాగనంపే ప్రక్రియకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, యూపీలో ఆదిత్యనాధ్‌ సర్కారు నాందీ వాచకం పలికిన నేపథ్యంలో- స్వచ్ఛపాలన దిశగా తక్కిన రాష్ట్రాలూ ఆ చొరవను అందిపుచ్చుకోవాల్సిన పని లేదా? సగటు పౌరుని మదిని తొలుస్తున్న ప్రశ్నలివి!

‘పాలన వ్యవస్థ ఉన్నది ఏదో ఒకటి సాధించడానికేగానీ, ఆత్మాశ్రయ ధోరణులతో సంతృప్తి పొందుతూ నిబంధనలు, విధివిధానాల గిరిగీసుకొని ఏకస్తంభం మేడలా కొనసాగడానికి కానే కాదు. దేశ పౌరులు వారి సంక్షేమమే దాని పనిపోకడలకు కొలబద్ద కావాలి’- 1954 మార్చిలో భారతీయ పౌర పాలన సంస్థను ప్రారంభిస్తూ తొలి ప్రధాని నెహ్రూ చేసిన వ్యాఖ్యలవి. సివిల్‌ సర్వీసుల అర్థం పరమార్థం- పౌర ప్రభుత్వాల అభివృద్ధి అజెండాకు సారథ్యం వహించడం, పీడనకు తావులేని విధంగా పాలన వ్యవస్థను నడిపించడం! కానీ ‘నిబద్ధతగల ఉద్యోగస్వామ్యం’ అంటూ ప్రధానిగా ఇందిర చేసిన ప్రబోధాలను తలకెక్కించుకుని, రాజకీయ బాసుల మాటే వేదంగా మీకిది-మాకిది (క్విడ్‌ప్రోకో) అంటూ అడ్డదారులు తొక్కే అవినీతి జలగలతో బ్యూరోక్రసీ లుకలుకలాడుతోందన్నది వాస్తవం! నీతిని నిలబెడతామంటూ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్తల్లో ‘గరమ్‌ గరమ్‌’ గా ఉండే ఉన్నతోద్యోగ వర్గ శ్రేణులు, కొన్నేళ్లు పోయాక ‘నరమ్‌ నరమ్‌’ గా నీరసించి చివరకు ‘బేషరమ్‌’ గా పరువుమాసి నిష్క్రమిస్తున్న తీరుకు ఎన్నో రుజువులు పోగుపడ్డాయి. ఎవరైనా సరే ‘తప్పు చేస్తే-తప్పించాల్సిందే’ అనేలా కచ్చితంగా వ్యవహరించే ప్రభుత్వాలేవీ ఇప్పటిదాకా లేకపోబట్టి అవినీతి మోతుబరులు ఆడింది ఆటగా రోజులు సాగిపోయాయి. తాజాగా మోదీ ఝళిపిస్తున్న కొరడాతో- తప్పనిసరి పదవీ త్యాగాలు నమోదవుతున్నాయి!

మొదటిసారి అధికారానికి వచ్చిన కొత్తల్లోనే మోదీ- కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి అనుచిత ప్రవర్తనను ఏ మాత్రం ఉపేక్షించకుండా సాగనంపారు. రూ.10వేల కోట్ల ప్రజాధనం కైంకర్యం అయిపోయిన శారదా కేసులో కేదస దర్యాప్తు జరుగుతుంటే- మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు మాతంగ్‌ సిన్హాకు వత్తాసుగా అనిల్‌ గోస్వామి రంగంలోకి దిగారు. తొందరపడి మాతంగ్‌ను అదుపులోకి తీసుకోవద్దని, అతను మర్యాదస్తుడైన రాజకీయ నాయకుడంటూ కేదసను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. కీలక దర్యాప్తులో అనుచిత జోక్యం 2015 ఫిబ్రవరిలో అనిల్‌ గోస్వామి పదవికి ఎసరు తెచ్చింది. ‘కొందరి జీవన విధానంగా మారిన అవినీతి దేశాన్ని నాశనం చేసింది...ఆ పాపాన్ని ప్రక్షాళన చెయ్యా’లని తొలినాళ్లలోనే చెప్పిన ప్రధాని అధికార శ్రేణులకు లక్ష్మణరేఖల్ని అప్పట్లోనే నిర్దేశించారు. వాటిని బేఖాతరు చేసిన వారిని శంకరగిరి మాన్యాలు పట్టించే కసరత్తు జోరందుకొందిప్పుడు! అవినీతిపరులు లేదా అసమర్థులు అని నిర్ధారించిన అధికారుల్ని ప్రభుత్వం బలవంతంగా ఇంటికి సాగనంపగలిగేలా 56(జె) లాంటి కఠిన నిబంధనలున్నాయి. వాటిని ఉపయోగించి 27 మంది సీనియర్‌ రెవిన్యూ అధికారుల్ని ప్రభుత్వం ఇప్పటికే సాగనంపింది. యూపీలో యోగి ఆదిత్యనాధ్‌ సర్కారు అయితే ఎకాయెకి 200 మంది అవినీతి అధికారులకు ఉద్వాసన పలికింది. మరో నాలుగొందల మంది జాతకాల్ని పరిశీలిస్తున్నామని, వారిపైనా కఠిన దండనలు తప్పవని స్పష్టీకరిస్తోంది. పాలనలో చురుకుదనాన్ని పెంచి అవినీతి కలుపును ఏరిపారేసేలా తక్షణ ప్రక్షాళన చేపట్టాలని దిల్లీ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ మొన్ననే ఆదేశించారు. ఇలాంటి చర్యలు పాలన సజావుగా సాగడానికి ఎంతో ఉపకరిస్తాయంటూనే అవినీతి చీడపురుగుల ఏరివేత అట్టడుగు స్థాయి అధికారులకే పరిమితం కాకుండా అత్యున్నత స్థాయిలోనూ చోటుచేసుకున్నప్పుడే సత్ఫలితాలు ఉంటాయని ఉన్నతాధికార గణమే చెబుతోంది. ఉత్తరాఖండ్‌ సైతం అదేబాటలో కదం తొక్కుతున్న తరుణంలో తక్కిన రాష్ట్రాలేం చేస్తాయో చూడాలి!

దాదాపు అరకోటికి చేరుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్‌దారులకు చెల్లింపులు కలిపి ఏటా రూ.3.45 లక్షల కోట్లు అవుతున్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు పింఛనుదారుల పద్దునూ కలుపుకొంటే ఆ లెక్క ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందో మరి! అదంతా పన్నుల రూపేణా జనం చెల్లిస్తున్న సొమ్మే! సివిల్‌ సర్వీసు అధికారులకు ప్రత్యేకంగా కల్పించిన ఉద్యోగ భద్రత- నీతి తప్పిన రాజకీయ నేతల వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికే! కానీ, రాజకీయ నేతల మోచేతి నీళ్లు తాగుతూ వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగుతున్న అధికారులకు తక్షణం ఉద్వాసన పలకడమే కాదు, అవినీతితో కూడబెట్టిన ఆస్తుల్నీ సత్వరం జప్తు చేసేలా నిబంధనల్ని కట్టుదిట్టం చెయ్యాలి!

ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు, స్థాయిని బట్టి అధికారుల అవినీతి ఎంతగా వెర్రితలలు వేసిందో, అంతర్జాతీయంగా దేశం పరువును ఎలా తీసిందో అందరికీ తెలిసిందే. రాజకీయ నేతలు- అధికారులు- నేర ముఠాల మధ్య బిగిసిన అక్రమ బాంధవ్యం అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందన్న ఎన్‌.ఎన్‌. వోరా కమిటీ నివేదికను ప్రభుత్వాలు అటకెక్కించినా, దాని దుష్ఫలితాలు కళ్లకు కడుతున్నవే! 2004 నాటి హోతా కమిటీ సివిల్‌ సర్వీసుల్లో మెరుగైన ప్రమాణాల కోసం చేసిన సూచనలుగానీ, మొయిలీ సారథ్యంలోని రెండో పరిపాలన సంస్కరణల సంఘం సిపార్సులుగానీ అమలుకు రానే లేదు. చట్టం ముందు అందరూ సమానులేనని భారత రాజ్యాంగం స్పష్టీకరిస్తున్నప్పుడు- కలుపు మొక్కల్ని ఏరిపారేయడానికి కమిటీలతో పనేముంది? పిల్లి గుడ్డిదైతే ఎలుక ఎకసెక్కాలాడిందన్నట్లుగా పాలన వ్యవస్థ అవినీతిపరులతో భ్రష్టుపట్టింది. దాన్ని సాంతం ప్రక్షాళించినప్పుడే జాతిపిత కలలుగన్న స్వచ్ఛభారత్‌ సాక్షాత్కరిస్తుంది. ఏమంటారు?


Posted on 07-07-2019