Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

వివాదాల సుడులు ఇంకానా?

మానవజాతికి ప్రకృతి మాత ప్రసాదించిన అపురూప వరాలు- గలగల పారే నదులు. వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించే జీవజలాల గరిష్ఠ వినియోగంపై శ్రద్ధ కొరవడ్డ ప్రభుత్వాలు నదిలో నీరు నీదా నాదా అన్న వ్యర్థ వివాదాల నెగళ్లు రగిలించడం, ఏళ్ల తరబడి ఉద్రిక్తతలు ప్రజ్వరిల్లడం- సంకుచిత భావజాల ఉరవళ్లకు దర్పణాలు. దేశంలో అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కరణ నిమిత్తం ప్రస్తుతం నెలకొన్న వేర్వేరు ట్రైబ్యునళ్ల స్థానే ఒకే ఒక శాశ్వత విచారణ వేదిక ఏర్పాటుకు ఉద్దేశించిన సవరణ బిల్లును కేంద్ర మంత్రివర్గం తాజాగా ఆమోదించింది. రెండేళ్ల క్రితం జలవనరుల మంత్రిగా ఉమాభారతి ఉన్నప్పుడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇటువంటి బిల్లుపై అప్పట్లో అడుగు ముందుకు పడలేదు. నదుల ప్రాతిపదికన రాష్ట్రాలవారీగా విడివిడి ట్రైబ్యునళ్ల పద్ధతికి చెల్లుకొట్టి జాతీయ స్థాయిలో అవతరింపజేయదలచిన ఉమ్మడి తీర్పరి సంఘం ఏ వివాద పరిష్కరణకైనా గరిష్ఠంగా నాలుగున్నరేళ్లే తీసుకుంటుందని నాడు హోరెత్తినా, అదంతా మూన్నాళ్ల ముచ్చటే అయింది. కొత్తగా తెరపైకి వచ్చిన ‘అంతర్రాష్ట్ర జల వివాదాల సవరణ బిల్లు-2019’ రెండేళ్లలోపే పరిష్కరణను లక్షిస్తోంది. రాష్ట్రాల మధ్య పీటముళ్లు పడిపోయిన జల జగడాలను సావకాశంగా ఒక కొలిక్కి తేవడానికి 17నుంచి 27 ఏళ్లదాకా పడుతున్న నేపథ్యంలో- అనర్థక జాప్యాన్ని, విపరీత వ్యయభారాన్ని నివారించే యత్నం ఈసారైనా ఫలప్రదమవుతుందేమో చూడాలి. జల వివాదాల్ని తాపీగా విచారించి చక్కదిద్దడంలో ఇప్పుడున్న ట్రైబ్యునళ్లు సివిల్‌ కోర్టు తరహాలో వ్యవహరిస్తున్నాయి. ఇకమీదట అన్ని జలవివాదాల పరిష్కార బాధ్యత దఖలుపడే శాశ్వత ట్రైబ్యునల్‌ చెప్పేదే అంతిమమని, సుప్రీంకోర్టు తీర్పుతో సమాన విలువ కలిగి అది గీసిన గీటుకు కక్షిదారులంతా కట్టుబడి ఉండాల్సిందేనన్న కేంద్ర వివరణ- మునుపటికి భిన్నమైన వాతావరణంపై ఆశలు రేపుతోంది.

దేశంలో అంతర్రాష్ట్ర జల వివాదాలను ఉపశమింపజేయడానికి రూపొందిన చట్టం 1956నాటిది. రెండు, అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య నదీజల వినియోగానికి సంబంధించి విభేదాలు ఉత్పన్నమైనప్పుడు సంప్రతింపుల ద్వారా పరిస్థితి కుదుటపడనట్లయితే- ఫిర్యాదు అందిన ఏడాదిలోగా కేంద్రం ప్రత్యేక ట్రైబ్యునల్‌ కొలువు తీర్చాలని ఆ శాసనం నిర్దేశిస్తోంది. కృష్ణ, గోదావరి, కావేరి, నర్మద, రావి-బియాస్‌ వంటి నదీజలాల వివాద పరిష్కరణ నిమిత్తం వివిధ ట్రైబ్యునళ్లు అలా ఏర్పాటైనవే. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వాన, అనుభవజ్ఞులైన జడ్జీలు సభ్యులుగా ట్రైబ్యునల్‌ నియామకం, దేశ రాజధాని నగరంలో కార్యాలయం ఏర్పాటు పూర్తయ్యాక మొదలయ్యే విచారణ ఏళ్లూ పూళ్లూ సాగడం ఆనవాయితీగా స్థిరపడింది. 1990లో ఆవిర్భవించిన కావేరీ జలసంఘం పూర్వాపరాలు పరిశీలించి తీర్పివ్వడానికి 17 ఏళ్లు పట్టింది. పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్ల నడుమ రావి- బియాస్‌ వివాదంపై 1986నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన మూడు దశాబ్దాల తరవాతా సమసిపోలేదు. కృష్ణా, వంశధార, మహాదాయి జల విచారణ సంఘాలదీ పనితనంలో నత్తలతో పోటీపడే వేగమే! పదహారేళ్ల క్రితం కావేరీ జగడంపై సర్వోన్నత న్యాయస్థానం- ‘రైతులు తమిళులా కన్నడిగులా అన్నది కాదు... సమస్త రైతాంగ ప్రయోజనాలూ ముఖ్య’మని నేతాగణానికి ఉద్బోధించింది. అదే సుప్రీంకోర్టు నిరుడు ఫిబ్రవరిలో ‘నదీజలాలపై ఏ రాష్ట్రమూ ప్రత్యేక యాజమాన్య హక్కును ప్రకటించుకోజాల’దంటూ చరిత్రాత్మక తీర్పిచ్చింది. న్యాయపాలిక సముచిత స్పందనల్లో జాతీయతా స్ఫూర్తి పరవళ్లెత్తుతున్నా, రాష్ట్రాల్లో సమైక్యతా భావనల ఊట అణగారిపోవడమే- సంకుచిత రాజకీయ సుడులకు, ప్రాంతీయ వైమనస్యాల అలజడులకు ఊతమిస్తోంది.

అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు ‘జల సామరస్యం’ చాటుకుంటూ ఉమ్మడి ప్రయోజనాలు ఒడిసిపడుతున్నాయి. కాంబోడియా, లావోస్‌, థాయ్‌లాండ్‌, వియత్నాం సుమారు ఆరు దశాబ్దాలుగా మెకాంగ్‌ నదీ సంఘ చట్ర పరిధిలో ఎవరి వాటాల్ని అవి చక్కగా వినియోగించుకుంటున్నాయి. అటువంటి స్ఫూర్తే నైలు నదీ పరీవాహక ప్రాంతానా పోటెత్తుతోంది. అందుకు విరుద్ధంగా, రాష్ట్రాల సమాఖ్యగా భాసిల్లాల్సిన భారత్‌లో జలవివాదాలు పెచ్చరిల్లడానికి- పటిష్ఠ యంత్రాంగాల కొరతే పుణ్యం కట్టుకుంటోంది. ఆంగ్లేయుల పరపాలన చెరవీడాక ఆరంభించిన నాలుగు వేలకుపైగా నీటి పథకాల్లో సగందాకా వివాదగ్రస్తమైన దుస్థితిని గర్హిస్తూ జాతీయ స్థాయిలో పటిష్ఠ చట్టం తేవాలని దశాబ్దం క్రితమే రెండో పరిపాలన సంస్కరణల సంఘం పిలుపిచ్చింది. ఆనాడే శాశ్వత ట్రైబ్యునల్‌ను సంఘ సారథిగా వీరప్ప మొయిలీ ప్రతిపాదించినా, మేలిమి సూచనకు యూపీఏ జమానాలో మన్నన దక్కలేదు. వాస్తవానికి అంతర్రాష్ట్ర నదీజలాల్ని ఆయా రాష్ట్రాలు ఎలా పంచుకోవాలో నిర్దేశించే స్వతంత్ర సంస్థ అవతరణకు సుప్రీంకోర్టు ఏనాడో గట్టిగా ఓటేసింది. జల వివాదాల సత్వర పరిష్కరణకు తలపెడుతున్న శాశ్వత ట్రైబ్యునల్‌ నిర్ణయాలు సర్వామోదయోగ్యంగా ఉండేలా సరైన ప్రాతిపదిక వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన మోదీ ప్రభుత్వం- అసలు ఘర్షణలే తలెత్తని వాతావరణ పరికల్పనలో భాగంగా రాష్ట్రాలన్నింటినీ కూడగట్టాలి. దేశంలో ప్రతి నీటిబొట్టునుంచీ గరిష్ఠ ప్రయోజనం పొందడమే లక్ష్యమంటున్న కేంద్రం- వృథాను అరికట్టి పొదుపు సంస్కృతిని ప్రోత్సహించడంలో స్వచ్ఛంద సంస్థల్ని, జన సామాన్యాన్ని భాగస్వాములు చేయాలి. వివాదాలు, విభేదాలకు తావులేని అటువంటి శ్రేయోరాజ్యంలోనే- జలగండంనుంచి జాతికి విముక్తి!


Posted on 12-07-2019