Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఆలస్యం న్యాయం విషం

‘క్రిమినల్‌ కేసుల్లో వాదనలు జరిగే సమయానికి నిందితులు అప్పటికే తమ నేరం రుజువైతే పడే గరిష్ఠ శిక్షకు మించి కారాగారాల్లో మగ్గిపోతున్నారు. సివిల్‌ కేసుల్లో రెండు మూడు తరాలు గడచిపోయాక తీర్పులు వస్తున్నాయి. ఇది తీవ్రమైన సమస్య’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగొయ్‌ ఇటీవల ఆవేదన వ్యక్తంజేశారు. జాతీయ న్యాయ సమాచార నిధి వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట పోలీస్‌స్టేషన్‌లో 1979లో నమోదైన ఓ హత్యకేసు 1982లో న్యాయస్థానానికి వచ్చింది. రాజమండ్రి అదనపు జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి ముందు ఈ కేసులో జనవరి 31, 2018నాడు మొదటిసారి వాదనలు జరిగాయి. అంటే, నేరం జరిగిన నాలుగు దశాబ్దాలకు విచారణ ప్రక్రియ మొదలైందన్న మాట! కామారెడ్డి సీనియర్‌ సివిల్‌ న్యాయస్థానంలో 1988లో దాఖలైన వ్యాజ్యం- 2017, ఏప్రిల్‌ 19న తొలిసారి విచారణకు నోచుకుంది. ఇలా దేశవ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో 76 వేల వ్యాజ్యాలు కనీసం మూడు దశాబ్దాలకు పైబడి (వీటిలో 140 కేసులు అరవై ఏళ్ల కిందటివి) అపరిష్కృతంగా ఉన్నాయి. 24.27 లక్షల వ్యాజ్యాల విచారణ పది నుంచి ముప్ఫై ఏళ్లుగా సాగుతూనే ఉంది. మొత్తమ్మీద ఈ జులై 11నాటికి దేశ న్యాయస్థానాల్లో 3.13 కోట్ల కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి. దిగువ కోర్టుల్లో పెండింగు కేసులను పరిష్కరించడానికి సంస్కరణలు తీసుకువస్తే సులభతర వాణిజ్యంలో దేశం వడివడిగా అడుగులు వేయగలదని మొన్నటి ఆర్థిక సర్వే సైతం సూచించింది.

నేరానికి మించిన శిక్ష
న్యాయవిచారణలో చోటుచేసుకుంటున్న ‘ఆలస్యం’ అనేక దుష్పరిణామాలకు హేతువుతోంది. ముఖ్యంగా విచారణ ఖైదీల (అండర్‌ ట్రయిళ్ల) మానవ హక్కులను బుగ్గిచేస్తోంది. వాస్తవానికి మన దేశ కారాగారాలు 3.78 లక్షల మంది ఖైదీలకే సరిపోతాయి. కానీ, జాతీయ నేర గణాంకాల సంస్థ గణాంకాల మేరకు 2016 నాటికే దేశంలోని దాదాపు 1,400 కారాగారాల్లో 4.33 లక్షల మంది ఖైదీలున్నారు. వీళ్లలో 2.93 లక్షలు విచారణ ఖైదీలే! వీరి జీవితాల మీద అపరిష్కృత కేసులు చూపిస్తున్న దుష్ప్రభావం గురించి పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆందోళన వ్యక్తీకరించారు. నిరుడు జూన్‌ 25న ఆయన అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాస్తూ, అయిదేళ్లకు పైబడిన అపరిష్కృత కేసుల పరిష్కారానికి నిర్దేశిత గడువు తేదీలతో సహా ఓ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయమని కోరారు. దీనికి ఓ నెల తరవాత కేసుల సత్వర పరిష్కారమే అజెండాగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్‌ న్యాయమూర్తులతో ఓ సమావేశమూ నిర్వహించారు. అపరిష్కృత కేసులను తగ్గించడానికి సృజనాత్మక మార్గాలను అన్వేషించాలని, ఇందుకోసం ప్రతి హైకోర్టు పరిధిలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యావేత్తలతో మేధాబృందాలను ఏర్పాటుచేయాలని సూచించారు. నిరుడు డిసెంబరులో జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనమూ దేశంలోని మొత్తం ఖైదీల్లో 67 శాతం విచారణ ఖైదీలేనన్న సంగతిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కారాగారాల్లోని అమానవీయ పరిస్థితులపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ విషయాన్ని ధర్మాసనం పరిశీలించింది. ప్రస్తుత విచారణ ఖైదీల సంఖ్య ‘చాలా చాలా ఎక్కువ’ అని అభిప్రాయపడింది. వీళ్ల కేసులను సత్వరం పరిష్కరించాలని చెప్పింది. ‘దక్ష్’ సంస్థ అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా నిందితుల్లో 21 శాతం తమ నేరాలకు పడే గరిష్ఠ శిక్షలకు మించి కారాగారాల్లో గడుపుతున్నారు. నేరానికి మించిన శిక్ష ఎప్పటికీ న్యాయ సమ్మతం కాదు. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీల కేసులు ఎంత తొందరగా కొలిక్కి వస్తే అంత మంచిది!

ఆర్థిక నేరాల కేసులు సుదీర్ఘకాలం తేలకపోవడం వల్ల వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని 2018 ఆర్థిక సర్వే సైతం విస్పష్టంగా చెప్పింది. ప్రాజెక్టులు ఆగిపోవడం, కోర్టు ఖర్చులు పెరగడం, పన్ను వసూళ్లు వివాదాస్పదం కావడం, పెట్టుబడులు తగ్గిపోవడం తదితరాలతో ఆర్థిక వ్యవస్థకు చేటు కలుగుతోందని సర్వే నివేదిక విడమరచింది. న్యాయ వివాదాల కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టుల విలువ రూ.52 వేలకోట్లు అన్నది ఓ అంచనా. ‘దేశంలో సత్వర న్యాయం అందడం మీద పెట్టుబడిదారుల్లో అపనమ్మకం పెరుగుతున్న సమయంలో మేకిన్‌ ఇండియా పేరిట విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించి ఏం లాభం?’ అని 2016లో ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ సమక్షంలోనే అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు. మరోవైపు, కోట్లకొద్ది కేసుల్లో కక్షిదారులు కోర్టు వాయిదాలకు హాజరు కావడానికే ఏడాదికి రూ.30 వేలకోట్లు వెచ్చించాల్సి వస్తోందని ‘దక్ష్’ అధ్యయనంలో తేలింది. ఈ సొమ్ముకు కోర్టు ఖర్చులు, న్యాయవాదుల రుసుములు అదనం. క్రిమినల్‌ కేసుల్లో 45 శాతం కక్షిదారుల వార్షిక కుటుంబ ఆదాయం లక్ష రూపాయలలోపే. వీళ్ల సంపాదనలో పది శాతం కేవలం కోర్టు వాయిదాలకు వెళ్లి రావడానికే పోతోంది. కేసులు త్వరగా పూర్తికాకపోవడంతో కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండటంతో దేశం ఏడాదికి రూ.50,387 కోట్ల విలువైన ఉత్పాదకతను కోల్పోతోంది. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కాలుష్యం మీద దాఖలైన 21 వేల వ్యాజ్యాలు అపరిష్కృతంగా ఉన్నాయి. వీటి విచారణలో జాప్యం పర్యావరణానికే కాదు, ప్రజారోగ్యానికీ హాని చేస్తోంది!

వ్యాజ్యాల విచారణ తేదీలను నిర్ణయించడానికి సంబంధించి పక్కా వ్యవస్థ లేకపోవడం, డిజిటలీకరణ జరగకపోవడంతో దేశంలో అపరిష్కృత కేసుల సమస్య రాన్రానూ జటిలమవుతోంది. కేంద్రం, రాష్ట్రాలు తెచ్చే కొత్త చట్టాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థలో మానవ వనరులు పెరగకపోవడం, అర్థన్యాయ వేదికల ఆదేశాల మీద హైకోర్టులకు వచ్చే అప్పీళ్లు, న్యాయస్థానాల తీర్పుల మీద రివిజన్లు, అప్పీళ్లు, ప్రభుత్వ యంత్రాంగం విరివిగా దాఖలు చేసే వ్యాజ్యాలతో ఎప్పటికప్పుడు అపరిష్కృత కేసులు పెరుగుతున్నాయి. ట్రయిల్‌కోర్టుల ముందు సాక్ష్యాలను నమోదు చేయకపోవడం, దిగువ న్యాయస్థానాల తీర్పుల మీద హైకోర్టు, సుప్రీంకోర్టుల స్టేలు, ముఖ్యసాక్షుల గైర్హాజరు తదితరాలతో విచారణ ప్రక్రియ కుంటువడుతోంది. ‘వాయిదా కోరడాన్ని ఓ మినహాయింపుగా కాకుండా ఓ ప్రమాణంగా భావించే సంస్కృతి స్థిరపడింది. చాలా అనివార్యమైన పరిస్థితిలో తప్ప వాయిదాలు అడగకూడదు’ అని రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ కూడా న్యాయవాదులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఓ అధ్యయనం ప్రకారం ప్రస్తుతమున్న అపరిష్కృత కేసులు ఓ కొలిక్కి రావడానికి 324 సంవత్సరాలకు పైగా సమయం పడుతుంది! ఇదో అసాధారణ పరిస్థితి. దీన్ని మూడేళ్ల కిందటే గుర్తించిన అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ ‘మన రాజ్యాంగ మూలస్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థను రక్షించుకోవాల్సిన సమయమిదే’నని హెచ్చరించారు. న్యాయపాలన మీద రాష్ట్రాలు, కేంద్రం కలిసి చేస్తున్న వ్యయం జీడీపీలో 0.08-0.09 శాతమే ఉంటోంది. న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి గత రెండు బడ్జెట్లలో రూ.629.21, రూ.630 కోట్లతో సరిపెట్టిన కేంద్రం రూ.720 కోట్లు కేటాయించింది. ఇది కూడా అరకొర మొత్తమే.

న్యాయస్థానాల్లో కేసుల విచారణ మందకొడిగా సాగుతుండటానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్‌ ఇటీవల పార్లమెంటులో చెప్పిన కొన్ని కారణాలు...
* కేంద్ర రాష్ట్రాల స్థాయుల్లో చట్టాల సంఖ్య పెరగడం
* మొదటి అప్పీళ్లు అధికంగా పేరుకుపోవడం
* కొన్ని హైకోర్టుల్లో సాధారణ సివిల్‌ జ్యుడిషియరీ పరిధి కొనసాగుతుండటం
* పాక్షిక న్యాయవేదికల నిర్ణయాలపై హైకోర్టుల్లో అప్పీళ్లు దాఖలవడం
* రివిజన్‌ పిటిషన్లు, అభ్యర్థనలు ఎక్కువ కావడం
* తరచూ విచారణ వాయిదాలు
* రిట్‌ న్యాయపరిధిని విచ్చలవిడిగా వాడటం
* కేసుల విచారణకు సరైన సన్నాహాలు లేకపోవడం
* జడ్జీలకు పాలనపరమైన విధులు బదలాయించడం
* న్యాయస్థానాలకు సుదీర్ఘ విరామాలు

న్యాయమూర్తులేరి
నిధుల లేమితో పాటు న్యాయమూర్తుల పోస్టుల భర్తీలో జాప్యం న్యాయవ్యవస్థ పనితీరును దెబ్బతీస్తోంది. 2006-18 మధ్యకాలంలో దేశంలో అపరిష్కృత కేసులు 8.6 శాతం పెరిగాయి. ఇదే సమయంలో న్యాయమూర్తుల పోస్టుల్లో ఖాళీలు 23 శాతం నుంచి 35 శాతానికి చేరాయి. పార్లమెంటులో చర్చ కోసం కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ సిద్ధం చేసిన ఓ నివేదిక ప్రకారం 2018నాటికి దేశంలో ప్రతి పది లక్షల మందికి 19 మంది న్యాయమూర్తులున్నారు. ఆరువేల న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రజలకు సత్వర న్యాయం అందుబాటులోకి రావాలంటే ప్రతి పది లక్షల మందికి 50 మంది న్యాయమూర్తులు ఉండాలని జాతీయ న్యాయ సంఘం 1987లోనే సిఫార్సు చేసింది. ప్రభుత్వాలు దాన్ని ఆచరణలోకి తీసుకురాలేదు. న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి రాష్ట్రాలే చొరవ తీసుకోవాలని కేంద్రం చెబుతుంటే- కాదు, కేంద్రమే చర్యలు చేపట్టాలని రాష్ట్రాలు అంటున్నాయి. ఈ వాదప్రతివాదాల నడుమ ఎక్కడి సమస్య అక్కడే ఉండిపోతోంది. ఇదే విషయం మీద 2013లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్తమస్‌ కబీర్‌ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ఓ లేఖ రాశారు. అయిదేళ్ల కాలపరిమితిలో ప్రతి పది లక్షల మంది ప్రజలకు యాభై మంది న్యాయమూర్తులైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి మన్మోహన్‌ సమాధానమిస్తూ న్యాయమూర్తుల పోస్టుల సంఖ్యను కచ్చితంగా పెంచాలని చెబుతూనే, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఏమీ చేయట్లేదని నెపం వాటి మీదకు తోసేశారు. ఆపై వచ్చిన ఎన్డీయే ప్రభుత్వమూ న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి ప్రత్యేక చొరవ ఏమీ తీసుకోలేదు. ‘సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 1988లో 18 నుంచి 26కి పెంచారు. ఇరవై ఏళ్ల తరవాత 2009లో సీజేఐతో కలిపి 31 పోస్టులకు చేశారు. న్యాయస్థానం మరింత సమర్థంగా పనిచేయడం కోసం న్యాయమూర్తుల సంఖ్యను ఇంకా పెంచడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి’ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గగొయ్‌ ఇటీవల ప్రధాని మోదీకి లేఖ రాశారు.

వ్యవస్థీకృత ఇబ్బందులకు తోడు ప్రభుత్వాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో ఏటికేడాది న్యాయస్థానాల మీద అపరిష్కృత వ్యాజ్యాల భారం పెరుగుతోంది. ఈ పరిణామాలతో న్యాయవ్యవస్థపై సామాన్యుల్లో నమ్మకం పోతోంది. పేదలు, విచారణఖైదీల న్యాయహక్కులు నిరాకరణకు గురవుతున్నాయి. దేశాభివృద్ధికీ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ‘దీర్ఘకాల అపరిష్కృత కేసులు భారత న్యాయవ్యవస్థ సమర్థత మీద ప్రశ్నలు రేకిత్తించడమే కాదు, వ్యవస్థకు అపకీర్తి కూడా తెచ్చి పెడతాయి’ అన్న సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దంపడతాయి. ఈ నేపథ్యంలో 2018 ఆర్థిక సర్వే ఆశించినట్లుగా ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు, న్యాయస్థానాలు కలిసికట్టుగా కార్యాచరణకు ఉపక్రమించాలి.


- శైలేష్‌ నిమ్మగడ్డ
Posted on 13-07-2019