Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

చట్టసభల్లోనూ మైనారిటీయే!

* హక్కుల సాధనలో వెనకబాటు

ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాల వారికి సమాన భాగస్వామ్యం, హక్కులు ఉండాలి. మతాలతో నిమిత్తం లేకుండా అందరికీ తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. మన దేశంలో ప్రస్తుతం ఈ సమతూకం లోపించినట్లు కనపడుతోంది. మైనార్టీలైన ముస్లిముల భాగస్వామ్యం రాజకీయాల్లో తక్కువగా ఉంటోంది. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం తగినంతగా లేదు. ద్వితీయశ్రేణి పౌరులుగా జీవించాల్సిన దుస్థితిలో వారున్నారు. 2011 లెక్కల ప్రకారం దేశంలో ముస్లిం జనాభా 17.22 కోట్లు. అంటే మొత్తం జనాభాలో దాదాపు 14.2 శాతం. వారు ప్రతి ఎన్నికలో ఓటుహక్కు వినియోగించుకుంటూనే ఉన్నారు. అయితే ఆ వర్గం నుంచి చట్టసభలకు తగినంత మంది ఎన్నిక కాలేకపోతున్నారు. దీంతో వారు రాజకీయాల్లో మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతున్నారు.


అధికార భారతీయ జనతా పార్టీలో ఆ వర్గానికి చెందిన ఒకే ఒక లోక్‌సభ సభ్యుడు ఉన్నారు. ఆ పార్టీ తరఫున ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో 303 మంది గెలుపొందారు. వారిలో ఏకైక ముస్లిం ఎంపీ సౌమిత్రాఖాన్‌. ఆయన పశ్చిమ్‌బంగలోని బిష్ణుపూర్‌ నియోజకవర్గం నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిపై 78వేలకు పైగా మెజార్టీతో ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని మొత్తం 42 నియోజకవర్గాలకుగాను భారతీయ జనతా పార్టీ 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేసింది. ఈ దఫా భాజపా దేశవ్యాప్తంగా కేవలం ఆరుగురు ముస్లిములనే ఎన్నికల బరిలోకి దించింది. ముస్లిములకు ఇది సరైన ప్రాతినిధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వక మానదు.


రాజకీయ సిద్ధాంతాలు, ప్రాధాన్యాలు ఎలా ఉన్నప్పటికీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా మరో అయిదేళ్లపాటు పాలించేందుకు భాజపా ప్రజల తీర్పు పొందిన మాట వాస్తవం. కేరళ, అసోం, బిహార్, గుజరాత్, రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ వంటి ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఆ పార్టీ పోటీకి దించకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు కనపడుతోంది. హిందూ ఓటర్లు దూరమవుతారన్న భయంతో లౌకికవాద పార్టీలు సైతం ముస్లిం అనుకూల పార్టీగా కనపడేందుకు ఇష్టపడటం లేదు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఆరుగురు, దేశవ్యాప్తంగా 27 మంది ముస్లిములు వివిధ పార్టీల తరఫున ఎన్నికయ్యారు. వీరిలో అయిదుగురు కాంగ్రెస్, మరో అయిదుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఎన్నికయ్యారు. యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీల నుంచి ముగ్గురు వంతున చట్టసభకు ఎన్నికయ్యారు. పదహారో లోక్‌సభలో 22, పదిహేనో లోక్‌సభలో 33 మంది ముస్లిం ఎంపీలు ఉండేవారు. అత్యధికంగా 1980 ఎన్నికల్లో 49 మంది చట్టసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత లోక్‌సభలో 14.36 శాతం మహిళా ఎంపీలున్నారు. మహిళల జనాభా ప్రాతిపదికన చూసినట్లయితే వారి ప్రాతినిధ్యమూ దిగదుడుపే!


ముస్లిములను రాజకీయాలకు దూరం చేయడం నేడు కళ్లకు కడుతున్న వాస్తవం. ఈ పరిస్థితుల్లో తమ వంతు న్యాయబద్ధమైన వాటా పొందేందుకు వారు ముందుకు రావాలి. ముందుగా ఉదాసీన, ఆత్మరక్షణ ధోరణిని విడనాడాలి. తమ భవిష్యత్తును తామే నిర్మించుకునేందుకు క్రియాశీలకంగా వ్యవహరించడం అవసరం. రాజ్యాంగ పీఠికలో పేర్కొన్నట్లు లౌకిక, సామ్యవాద, గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో తమ వంతు వాటా పొందేందుకు చొరవగా వ్యవహరించాలి. ఆత్మశోధన చేసుకుని ముందుకు సాగాలి. సామాజిక, ఆర్థిక న్యాయంతోపాటు రాజకీయ హక్కులను గురించీ రాజ్యాంగ పీఠిక ప్రస్తావిస్తోంది. ప్రతి వర్గానికీ రాజకీయ హక్కులు ముఖ్యం.


ముస్లిములు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏడు దశాబ్దాల క్రితం జరిగిన దేశ విభజనకు తాము బాధ్యులమన్న భావన నుంచి వారు ముందుగా బయటకు రావాలి. విభజన సమయంలో పాకిస్థాన్‌లో ఉండాలనుకున్న వారు అక్కడకు వెళ్లిపోయారు. భారత్‌లో ఉండాలనుకున్న వారు ఇక్కడే స్థిరపడిపోయారు. రెండోది- ఓటుబ్యాంకు రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని, కొన్ని పార్టీలు అవలంబిస్తున్న బుజ్జగింపు విధానాల వల్ల ముస్లిములకు ఒరిగిందేమీ లేదన్న విషయాన్ని గుర్తించాలి. నిజానికి ఎస్సీ, ఎస్టీలకన్నా ముస్లిముల సామాజిక పరిస్థితులు ఏమీ బాగా లేవు. అక్షరాస్యత, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎస్సీ, ఎస్టీలకన్నా వీరి పరిస్థితి దయనీయంగా ఉంది. సచార్‌ కమిటీ ఈ విషయాన్ని కళ్లకు కట్టింది. వారు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలను ఈ కమిటీ సవివరంగా ప్రస్తావించింది. వారి అభ్యున్నతికి విలువైన సిఫార్సులు చేసింది. సచార్‌ నివేదికపై పాలకులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. మూడోది- ఉగ్రవాద ఘటనలకు సంబంధించి తమను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న విషయాన్ని ముస్లిములు తోటి పౌరులకు తెలియజేయాలి. ఈ ఘటనల్లో అరెస్టయిన ముస్లిం యువకుల్లో కొందరు నిర్దోషులుగా విడుదలవుతున్నారు. శిక్షించేందుకు తగిన ఆధారాలు లేకపోవడంతో కొంతమంది జైళ్లలోనే మగ్గిపోతున్నారు. అరెస్టయ్యే వారిలో ఎక్కువ మంది అమాయకులే. జైళ్లల్లో మగ్గుతున్న వారిలో ముస్లిములతో పాటు దళితులు, గిరిజనులే ఎక్కువ మంది ఉంటున్నారు. మూకహత్యల ఘటనల్లోనూ చాలామంది అమాయకులు బాధితులుగా మిగిలిపోతున్నారు.


ముస్లిములు ప్రజాస్వామ్య ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించి తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని మెరుగుపరచుకోవడం అవసరం. ఇందుకోసం రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించాలి. ఈ దేశ పౌరులుగా తమ రాజకీయ హక్కుల సాధన కోసం పోరాడాలి. తద్వారా తామూ ఈ దేశ ప్రజల్లో భాగమని చాటాలి!

- సందీప్‌ పాండే (రచయిత- రామన్‌ మెగసెసే పురస్కార గ్రహీత)
Posted on 16-07-2019