Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

ఆదివాసీ హక్కులకు తూట్లు

* అటవీబిల్లు- 2019 ముసాయిదా

దేశంలో అత్యంత వెనకబడిన వర్గాలకు చెందినవారు ఆదివాసులు. 2011 లెక్కల ప్రకారం 10.4 కోట్ల ఆదివాసుల్లో సుమారు 705 తెగలు ఉన్నాయి. జనాభాలో 8.6 శాతం గల వీరు దేశవ్యాప్తంగా 90 జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. మూడింట రెండొంతులు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, మహారాష్ట్ర్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ల్లో నివసిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో వీరి సంఖ్య ఎక్కువ.

ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ముందు ఎన్‌డీఏ సర్కారు ఆదివాసీ హక్కులను హరించే రీతిలో అటవీ బిల్లు- 2019 ముసాయిదాను రూపొందించింది. ఇది వారి హక్కులను కబళించడమే కాకుండా, అటవీ అధికారులకు మరిన్ని అధికారాలను కట్టబెడుతోంది. కేంద్ర ప్రభుత్వం 2006లో అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటివరకు 1927 నాటి బ్రిటిష్‌ చట్టమే అమలులో ఉండేది. ఈ రెండు చట్టాలు వారి హక్కులను హరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. సర్కారు తాజాగా తెచ్చిన ముసాయిదా బిల్లు మరింత దారుణంగా ఉందని ఆదివాసీ సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అడవిబిడ్డల హక్కులకు గండికొడుతూ, అటవీ అధికారులకు మరిన్ని అధికారాలను కట్టబెడుతోంది. అటవీ అధికారులకు శిక్షించే అధికారాలు కల్పించింది. వారికి తుపాకులు వినియోగించే అధికారాన్నీ కల్పించింది. ఈక్రమంలో తప్పు చేసిన అధికారులను దండించే విషయంలో కఠిన నిబంధనలు లేవు. గతంలో కొన్నిచోట్ల కొంతమంది సిబ్బంది ఆదివాసులపై దుర్మార్గంగా ప్రవర్తించడం తీవ్రవాదానికి పునాదులు వేసిన విషయాన్ని విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ముసాయిదా బిల్లుపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి 2006లో కేంద్రం తీసుకువచ్చిన చట్టంలోనే ఆదివాసులకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. ఏళ్లతరబడి అడవుల్లో నివసిస్తున్న వారికి శాశ్వత నివాస హక్కులను ఆ చట్టం తిరస్కరించింది. వంటచెరకు కోసం చిన్నచెట్టు కొమ్మ కొట్టినా తీవ్రంగా శిక్షించేవారు. అడవుల్లో యాజమాన్య హక్కులు లేకుండా కేవలం నివసించే హక్కును మాత్రమే కల్పించారు. అటవీ సిబ్బందిలో అవినీతి తారస్థాయిలో ప్రబలింది. తరతరాల నుంచి అడవుల్లో నివసిస్తున్న వారి హక్కులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అడవుల్లో నివసిస్తున్న గిరిజనేతరుల హక్కులను గుర్తించే విధానం లోపభూయిష్ఠంగా మారింది.

ముసాయిదా బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే ఆదివాసుల హక్కులకు భంగం వాటిల్లడం ఖాయమన్న వాదనను తేలిగ్గా తోసిపుచ్చలేం. బిల్లు ప్రకారం అధికారులకు అపరిమిత అధికారాలు దఖలు పడతాయి. గిరిజనుల నివాస, అటవీ ఉత్పత్తులు అమ్ముకునే హక్కులకు ఈ బిల్లు ముకుతాడు వేయనుంది. ఏ విషయంలో అయినా అధికారుల మాటే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. గ్రామసభలు నిర్వీర్యమై గిరిజనుల బతుకులు అటవీ అధికారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే దుస్థితి ఏర్పడనుంది.

బిల్లు అడవి బిడ్డల హక్కులతో పాటు రాష్ట్రాలనూ దెబ్బతీయనుంది. అధికారాలన్నీ కేంద్రం చేతిలో కేంద్రీకృతం కానున్నాయి. అంతేకాక కేంద్రం కొత్తగా మరికొన్ని అధికారాలు తనకు తాను కల్పించుకుంది. అటవీ భూముల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉంది. అటవీ సంపదకు సంబంధించి రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను తిరగదోడే హక్కు కేంద్రానికి ఉంటుంది. అటవీ భూముల్లోని ఏ ప్రాంతం అయినా వాణిజ్య మొక్కల పెంపకానికి అనువుగా ఉందని భావిస్తే అక్కడ అటవీశాఖ, ప్రైవేట్‌ ఏజెన్సీలకు సదరు మొక్కలు పెంచే అధికారాన్ని కల్పిస్తుంది. అటవీ సంరక్షణ పేరుతో అధికారులకు ఆయుధాలను అందజేయనుంది. నిందితులకు జామీనుకు సంబంధించి నిబంధనలు కఠినతరం చేశారు. తాము నిర్దోషులమని నిరూపించుకునే బాధ్యత గిరిజనులదేనని బిల్లు ప్రతిపాదిస్తోంది. అటవీ నేరాలను అరికట్టే ప్రక్రియలో భాగంగా అధికారులకు మరిన్ని కీలక అధికారాలు కల్పిస్తోంది. ఇవి దుర్వినియోగమవుతాయని, వీటిని అడ్డం పెట్టుకుని అధికారులు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉందన్న వాదనను కొట్టిపారేయలేం. అధికారులు తప్పుచేసినా ఏదో పేరుతో తప్పించుకునే సౌలభ్యం ఉందన్న వాదన వినపడుతోంది. గిరిజనులు నేరానికి పాల్పడితే, ఊరిలోని వారందరినీ బాధ్యులుగా చేసే అవకాశం ఉంది. అటవీ సంపదకు, ఉత్పత్తులకు నష్టం వాటిల్లినా, పశువులు అడవిలో గడ్డి మేసినా రాష్ట్ర ప్రభుత్వాలకు చర్యలు తీసుకునే అధికారాలను కల్పిస్తోంది. తమకున్న అధికారాలను ఉపయోగించి ఆ ప్రాంతంలో కొన్నాళ్లు గిరిజనుల హక్కులను అధికారులు రద్దుచేయవచ్చు. బిల్లు చట్టరూపం దాల్చితే అది ఆదివాసుల హక్కులకు భంగం కలిగిస్తుందనడంలో సందేహం లేదు.

ఐక్యరాజ్యసమితి 1994లో గిరిజనుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసి ఆగస్టు తొమ్మిదో తేదీని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణకు విద్య, వైద్యరంగాల్లో వారి అభివృద్ధికి కృషి చేయాలని సభ్యదేశాలను కోరింది. అడవుల్లో నివసించడం ఆదివాసుల హక్కు. అటవీ భూములతో వారి అవినాభావ సంబంధాన్ని ఎవరూ విడదీయలేరు. ఏ చట్టమైనా అడవి బిడ్డల సంక్షేమాన్ని, అభ్యున్నతిని కాంక్షించాలే తప్ప వారి హక్కులకు భంగం కలిగించరాదు. ఈ పరిస్థితుల్లో బిల్లులోని నిబంధనలను సరళతరం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది!- పి.వెంకటేశ్వర్లు
(రచయిత- ఆంధ్ర విశ్వవిద్యాలయ వాణిజ్య విభాగ ఆచార్యులు)
Posted on 19-07-2019