Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

సమాచారానికి ప్రచ్ఛన్న సంకెళ్లు

ప్రజలపట్ల మరింత బాధ్యత జవాబుదారీతనాలకు పాలనలో పారదర్శకత ప్రోది చేస్తుందని, దానివల్ల పని సంస్కృతిలో మేలిమి మార్పులు వచ్చి ప్రభుత్వ పథకాలు సత్ఫలితాలు ఇస్తాయంటూ సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి నిరుడు మార్చిలో ప్రధాని మోదీ గొడుగు పట్టారు. ఆర్టీఐ చట్టంపై శ్రద్ధ పెట్టినట్లే సక్రమంగా వ్యవహరించడం(యాక్ట్‌ రైట్లీ)పైనా దృష్టి సారించాలనీ హితబోధ చేశారు. ప్రధాని మాటల్లో మాయా మర్మం ఏదో ఉందని సందేహించినవారి భయాందోళనల్ని నిజం చేస్తూ నిరుడీ రోజుల్లో ఆర్టీఐ సవరణ బిల్లును కేంద్రం ప్రతిపాదించింది. ప్రతిపాదిత సవరణలు చట్టం మౌలిక స్ఫూర్తినే కాలరాస్తాయంటూ విపక్షాలు సహా భిన్న వర్గాలనుంచి నిరసనలు పోటెత్తిన నేపథ్యంలో ఎన్‌డీఏ సర్కారు నాడు వెనక్కి తగ్గింది. తాజాగా అవే ప్రతిపాదనలతో కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో తీవ్రాందోళన వ్యక్తమవుతోంది. సహ చట్టం ద్వారా సేవలను సరళీకరించి, క్రమబద్ధీకరించి, వ్యవస్థీకృతం చేసేందుకంటూ కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలు- ఉన్న నాలుకను ఊడ్చేందుకే కొండనాలుక్కి మందేస్తున్నట్లుగా ద్యోతకమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర స్థాయుల్లోని సమాచార కమిషన్ల స్వతంత్రత, స్వయంప్రతిపత్తికి ఎలాంటి ముప్పూ వాటిల్లజేయకుండా వాటి సభ్యుల సర్వీసు నిబంధనలు, జీతనాతాలపై నిర్ణయాధికారాన్ని కేంద్రానికి దఖలు పరచడమే తాజా బిల్లు పరమోద్దేశమని సంబంధిత మంత్రి చెబుతున్నారు. రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి సమాన స్థాయిలో చట్టబద్ధ సంస్థలైన సమాచార కమిషన్లను పెట్టి, వాటి సారథులకు ఇతర సభ్యులకు పదవీకాలం, జీత భత్యాలు సమకూర్చడం సరికాదన్నవి కేంద్రం చేస్తున్న వాదనలు! తాటి చెట్టు ఎక్కింది దూడ మేత కోసమేనన్న చందంగా కేంద్ర సర్కారు ఎన్ని చెప్పినా, సహ చట్టం స్వతంత్రతపై అది పెనుదాడేనని మాజీ కమిషనర్లు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పద్నాలుగేళ్లుగా సహ చట్టం స్ఫూర్తిని అక్షరాలా గాలిలో దీపం చేసిన నేతాగణాల నిర్వాకాల్ని పరికిస్తే- తాజాగా సవరణలతో మరింత చెరుపు జరిగే ప్రమాదాన్ని ఏ మాత్రం తోసిపుచ్చే వీల్లేదు!

సమాచార స్వేచ్ఛ అసలెందుకన్న మౌలిక ప్రశ్నకు 2005లో వెలువడిన రాజపత్రంలోనే సవివర సమాధానం ఉంది. ప్రజాస్వామ్యం మనుగడకు సమాచార పారదర్శకత ఎంతో కీలకం కనుక; అవినీతిని కట్టడి చెయ్యడానికే కాదు, ప్రభుత్వాన్ని దాని విభాగాల్నీ జవాబుదారీ చేస్తుంది కాబట్టి... సమాచార హక్కు పౌరులందరికీ దఖలుపడాలని చట్టం ఆశించింది. బ్రిటిషర్ల కాలం నాటి అధికార రహస్యాల చట్టాన్నే రక్షా కవచంగా మలచుకొని ప్రజల కంటపడకుండా అవినీతి గడ్డి కరిచే నేతాగణాలు బ్యూరోక్రాట్ల అక్రమాల చీకట్లను పటాపంచలు చేసే సమాచార కాంతిపుంజంగా ఆ చట్టాన్ని అశేష జనావళి స్వాగతించింది. అసలు సమాచార సంఘాల స్థాయీ ప్రమాణాలు ఏ తీరుగా ఉండాలన్నదానిపై చట్టం రూపకల్పన దశలోనే విస్తృతంగా చర్చలు జరిగాయి. అర్ధరాత్రి స్వాతంత్య్రాన్ని పారదర్శకత, జవాబుదారీతనాల వేకువకు తోడ్కొని వెళ్ళే విశిష్ట వ్యవస్థలుగా సమాచార సంఘాలకు స్వతంత్రత, స్వయంప్రతిపత్తి ఉండి తీరాలంటూ వాటికీ ఎన్నికల సంఘంతో సమాన హోదా కల్పించాలన్న ప్రతిపాదనను పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జీతం ఎన్నికల సంఘం సభ్యులకు ఉందని, ఈసీతో సమాన హోదాలో సహ కమిషన్‌ సభ్యులకు అవే జీతాలు ఉండటం హేతుబద్ధం కాదంటున్న కేంద్ర ప్రభుత్వం- కేంద్ర సమాచార సంఘం ఉత్తర్వుల్ని హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉన్నప్పుడు దానికి సుప్రీం న్యాయమూర్తితో సమాన హోదా ఉండరాదంటోంది. ‘రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల ఉత్తర్వుల్నీ హైకోర్టుల్లో సవాలు చేసే వీలున్నందున- ఇప్పుడు కేంద్రం వాదనే ప్రాతిపదికైతే వారందరి హోదాల స్థాయినీ తగ్గించాలి కదా’ అన్న సహేతుక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పౌరుల చేతి పాశుపతంగా ఉన్నది ఒకే ఒక చట్టం- దాన్నీ పని కట్టుకొని అరగదీయాలనుకోవడమే దురదృష్టం!

అవినీతి మహిషాసుర మర్దినిగా 2005లో విజయ దశమినుంచి అమలులోకి వచ్చిన సహ చట్టానికి పురిట్లోనే సంధి కొట్టించే దుస్తంత్రాలు యూపీఏ జమానాలోనే మొదలయ్యాయి. ప్రపంచంలోనే మేలిమి చట్టాన్ని రూపొందించామని భుజకీర్తులు తగిలించుకొన్న నేతాగణాలే- దస్త్రాలపై అధికారులు రాసే అభిప్రాయాలు (ఫైల్‌ నోటింగ్స్‌) సహ చట్టం పరిధిలోకి రావంటూ అడ్డగోలు వాదనలతో తెగబడ్డాయి. సహచట్టంపై జన జాగృతి కార్యక్రమాల్ని పూర్తిగా అటకెక్కించి, సమాచార కమిషన్లను రాజకీయ అంతేవాసుల పునరావాస కేంద్రాలుగా మార్చి, కాలానుగుణ నియామకాలు చేపట్టకుండా కమిషన్లను నీరుగార్చి, వాటి తీర్పులపై సమాచార కమిషనర్లనే ప్రతివాదులుగా చేర్చి, కోర్టులకెక్కి- చట్టం స్ఫూర్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా దెబ్బతీస్తూనే ఉన్నాయి. చట్టప్రకారం సమాచార కమిషనర్లు, ప్రధాన కమిషనర్‌ నియామకం ఎన్నికల సంఘంలో సభ్యుల నియామక ప్రక్రియ మాదిరిగానే జరగాలని మొన్న ఫిబ్రవరిలో స్పష్టం చేసిన న్యాయపాలిక- నియామక విధానంలో పారదర్శకత తీసుకురావాలని సూచించింది. ఆ ఆదేశాలకు గండికొట్టేలా కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణలతో- సమాచార సంఘాల్లో అరుదుగా వినిపిస్తున్న స్వతంత్ర గళాలూ పంజరంలో చిలుకల్లా మారిపోయే ముప్పు పొంచి ఉంది. అవినీతి మదగజాల పాలిట అంకుశంలా సహ చట్టాన్ని ప్రభావాన్వితం చెయ్యాలంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవ ఏ తీరుగా ఉండాలో వివరించే సంస్కరణల అజెండా భారీగా పోగుపడి ఉంది. దాన్ని గాలికొదిలేసి పౌరుల సమాచార స్వేచ్ఛకే అదృశ్య శృంఖలాలు బిగిస్తే- సర్వే సర్వత్రా అవినీతికి వరద గేట్లు ఎత్తినట్లవుతుంది!


Posted on 22-07-2019