Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

చొరబాట్ల నిరోధానికి సమర్థ వ్యూహం

* కార్గిల్‌ యుద్ధం... పాఠాలు

నమ్మకద్రోహానికి, నయవంచనకు పాల్పడటం పాకిస్థాన్‌ నైజం. స్నేహహస్తం చాచడం, తరవాత చిచ్చుపెట్టడం దాయాది దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఇరవయ్యేళ్ల నాటి కార్గిల్‌ యుద్ధమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఈ యుద్ధానికి మూడు నెలల ముందు 1999 ఫిబ్రవరిలో నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయీ లాహోర్‌కు బస్సు యాత్ర ద్వారా ఇస్లామాబాద్‌కు స్నేహహస్తం అందించారు. అందుకు ప్రతిగా కార్గిల్‌లోకి చొరబాటుదాదారులను పంపి పాక్‌ తన వక్రబుద్ధిని చాటుకుంది. పాక్‌ ముష్కరులను తరిమికొట్టడంలో భారత సైన్యం అసమాన పోరాట పటిమను ప్రదర్శించింది. దేశానికి ఘనమైన విజయాన్ని అందించింది. 1999 జూన్‌ మూడున ప్రారంభమైన యుద్ధం జులై 26న ముగిసింది. నేటితో ఈ యుద్ధానికి ఇరవై సంవత్సరాలు నిండాయి. ఈ విజయానికి గుర్తుగా ఏటా ‘విజయ్‌ దివస్‌’ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కార్గిల్‌ విజయం అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. ఇందుకు భారత సైన్యం భారీ మూల్యమే చెల్లించింది. 522 మంది వీర జవాన్లు మాతృభూమి కోసం తృణప్రాయంగా ప్రాణాలను త్యాగం చేశారు. పాక్‌తో మొత్తం నాలుగు యుద్ధాలు చోటుచేసుకున్నాయి. స్వాతంత్య్రానంతరం 1947 అక్టోబరులో రెండు దేశాల మధ్య తొలి సమరంలో 1,100 మందికి పైగా సైనికులు అమరులయ్యారు. 1965 నాటి రెండో యుద్ధంలో 3,264, 1971నాటి మూడో యుద్ధం (బంగ్లాదేశ్‌ విమోచనోద్యమం)లో 3,843 మంది సైనికులు నిహతులయ్యారు. నాలుగోదైన కార్గిల్‌ యుద్ధం దాదాపు మూడు నెలలు సాగింది. నాటి సైన్యాధిపతి వేద్‌ప్రకాశ్‌ మాలిక్‌ సైన్యాన్ని విజయపథంలో నడిపించారు. యుద్ధంలో నాటి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కన్నా సైన్యాధిపతి పర్వేజ్‌ ముషారఫ్‌ పాత్రే కీలకం.

క్లిష్టమైన కీలక సరిహద్దు
జమ్ము-కశ్మీర్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దుకు ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన, కీలకమైన సరిహద్దుగా పేరుంది. ఇక్కడ పనిచేయడం కత్తిమీద సామే. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలకు ఎదురొడ్డి పని చేయాల్సి ఉంటుంది. సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) పహరా కాస్తుంటాయి. కానీ పాక్‌ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద మాత్రం సైన్యమే ఈ పని చేస్తుంటుంది. వారికి బీఎస్‌ఎఫ్‌ సహాయకారిగా ఉంటుంది.

కార్గిల్‌ యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఏ దేశ రక్షణ వ్యవస్థ అయినా దీటుగా ఉండాలంటే సైనిక దళాల ఆధునికీకరణ, అధునాతన ఆయుధాలు, నిఘా వర్గాల మధ్య సమన్వయం తప్పనిసరి. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఇవి లోపించాయన్నది చేదునిజం! ఈ ఇరవయ్యేళ్లలో కొంతమేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. రక్షణరంగ బలోపేతానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అవి పూర్తిస్థాయిలో లేవన్నది నిపుణుల వాదన. దీనిని తోసిపుచ్చడం కష్టమే! బడ్జెట్‌లో కేటాయింపులు అరకొరగా ఉంటున్నాయి. ఏటా పెంపు ఉన్నా అది నామమాత్రంగానే ఉండటం గమనార్హం. గత ఏడాది బడ్జెట్‌ రూ.2.98 లక్షల కోట్లు కాగా, ఈ ఏడాది రూ.3.18 లక్షల కోట్లకు పెంచారు. మధ్యంతర బడ్జెట్‌లో కేటాయించిన రూ.3.18 లక్షల కోట్లనే ఇప్పుడూ కొనసాగించారు. గణాంకాల ప్రాతిపదికన చూస్తే కేటాయింపుల్లో పెంపు ఉన్నట్లు కనపడుతుంది. కానీ ఇందులో సింహభాగం జీతాలు, పింఛన్లు, నిర్వహణ వ్యయాలకే సరిపోతుంది. సైనిక దళాల ఆధునికీకరణ, ఆయుధాల కొనుగోలుకు కొద్దిపాటి మొత్తమే మిగులుతుంది. ప్రపంచంలో రక్షణరంగంపై ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో అమెరికా, చైనా, సౌదీ అరేబియా, భారత్‌, ఫ్రాన్స్‌ మొదటి అయిదు స్థానాల్లో ఉన్నాయి. మనకన్నా ఎంతో చిన్న దేశమైన సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్‌ కేటాయింపులు భారీగా చేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఈ ఏడాది పాక్‌ సైన్యం బడ్జెట్‌ను స్వచ్ఛందంగా తగ్గించుకుంది. సైనిక దళాలను యుద్ధ అవసరాల కోసమే వాడాలన్నది అలిఖిత సంప్రదాయం. కానీ ఉగ్రవాద కార్యకలాపాల అణచివేత, ప్రత్యేక పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణకూ సైన్యాన్ని వినియోగిస్తున్నారు. ఈ పనులకు ఇతర బలగాలను వాడాలన్నది నిపుణుల సూచన.

రోజువారీ వ్యవహారాలకు అవసరమయ్యే రైఫిళ్లు తగినన్ని లేక సైన్యం సతమతమవుతోంది. ఇందుకు నిధుల కొరత వెంటాడుతోంది. అందుకే ఆధునిక రైఫిళ్ల కోసం పెట్టిన ఆర్డరును 2.5 లక్షలకే పరిమితం చేయాలని గత ఏడాది జూన్‌లో సైన్యం నిర్ణయించింది. ఆయుధ వ్యవస్థల నిర్వహణ తీరు అధ్వానంగా ఉందంటూ 2017 మార్చిలో ‘కాగ్‌’ తప్పుపట్టింది. రాడార్లు, యుద్ధట్యాంకులతో సహా ఆయుధ వ్యవస్థలను సమర్థంగా నిర్వహించడం లేదంటూ ధ్వజమెత్తింది. చైనా సరిహద్దుల్లో రహదారుల నిర్మాణంలో సాచివేత ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌ఓ)కు అక్షింతలు వేసింది.

మరోపక్క సైన్యంలో అంతర్గత పరిస్థితులు సజావుగా లేవు. తమకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడం లేదని 2017 జనవరిలో బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ తేజ్‌బహదుర్‌ యాదవ్‌ ఆరోపించడం ఇందుకు నిదర్శనం. ఆయన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చలేం. గుత్తేదారులతో లాలూచీ కారణంగా సైనికులకు తగిన పరిమాణంలో, నాణ్యమైన పదార్థాలు అందడం లేదన్న ఆరోపణలను కొట్టిపారేయలేం. గతంలో ఎప్పుడూ సైన్యాధిపతి నియామకం వివాదాస్పదం కాలేదు. రాజకీయంగా విమర్శలూ చెలరేగలేదు. 2016 డిసెంబరులో సైన్యాధిపతిగా జనరల్‌ బిపిన్‌ రావత్‌ నియామకం వివాదాస్పదమైంది. ముగ్గురు సీనియర్లు ప్రవీణ్‌ బక్షి, హరీజ్‌, బి.ఎస్‌.నేగీలను కాదని రావత్‌ను నియమించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. సైన్యాధిపతి నియామకంపై ప్రభుత్వానికి విశేష అధికారం ఉందని రక్షణమంత్రిత్వ శాఖ సమర్థించుకుంది. ఈ వాదన వాస్తవమే అయినప్పటికీ అత్యున్నత నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. లేనట్లయితే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది.

కార్గిల్‌ అనుభవాల నేపథ్యంలో భారత్‌ తన అమ్ముల పొదిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వివిధ దేశాల నుంచి అధునాతన ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుల్లో భారత్‌ ఒకటి. అమెరికా నుంచి ఆరువేల కోట్ల రూపాయల వ్యయంతో నాసామ్స్‌-2, సుమారు రూ.40 వేల కోట్ల వ్యయంతో రష్యా నుంచి ఎస్‌-400, ఇజ్రాయెల్‌ నుంచి రూ.29,512 కోట్ల వ్యయంతో బరాక్‌-8 క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు చర్యలు చేపట్టింది. ఫ్రాన్స్‌ నుంచి రూ.58 వేల కోట్లతో రఫేల్‌ యుద్ధ విమానాలు, అమెరికా నుంచి రూ.700 కోట్లతో 73 వేల సిగ్‌ సౌవర్‌ రైఫిళ్ళ కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యాధునిక ‘నావల్‌ ఎంఆర్‌శామ్‌’ (ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మధ్యశ్రేణి క్షిపణి) వ్యవస్థలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇజ్రాయెల్‌ వీటిని సరఫరా చేయనుంది. రూ.345 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇటీవల సంతకాలు జరిగాయి. ఆయుధాల ఉత్పత్తిలో స్వావలంబన సాధించే క్రమంలో భాగంగా 2001 తరవాత రక్షణ రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను అనుమతించింది.

సూచనలకు మన్ననేదీ?
కార్గిల్‌ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు, భవిష్యత్తులో పునరావృతం కాకుండా తీసుకోవలసిన చర్యలపై అప్పట్లో వాజపేయీ ప్రభుత్వం రక్షణ వ్యవహారాల నిపుణుడు కె.సుబ్రమణ్యం అధ్యక్షతన కమిటీని నియమించింది. ఇందులో లెఫ్టినెంట్‌ జనరల్‌ (రిటైర్డు) కె.కె.హజారీ, బి.జి.వర్గీస్‌ సభ్యులు. వర్గీస్‌ ప్రముఖ పాత్రికేయులు. జాయింట్‌ ఇంటెలిజెన్స్‌ కమిటీ ఛైర్మన్‌ సతీశ్‌చంద్ర మెంబర్‌ సెక్రటరీ. దీని కాలావధి మూడు నెలలు. 2000 జనవరి 7న ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సైనిక దళాలకు అవసరమైన ఆధునిక ఆయుధ సామగ్రి అందుబాటులో లేదని, వివిధ నిఘా విభాగాల మధ్య సమన్వయం లోపించిందని కమిటీ కుండ బద్దలు కొట్టింది. గొర్రెల కాపరులు చెప్పేదాకా పాక్‌ జవాన్ల చొరబాటు గురించి తెలియకపోవడాన్ని ఇందుకు నిదర్శనంగా ఎత్తిచూపింది. సాధారణంగా వారానికి రెండుసార్లు ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌), నిఘా విభాగం (ఐబీ) అధిపతులు భద్రతాంశాలపై ప్రధానితో సమావేశమై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అంతరంగిక భద్రతపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సంబంధిత అధికారులు దేశీయాంగ మంత్రికి వివరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంత పకడ్బందీగా జరగడం లేదు. కమిటీ సూచనలను ప్రభుత్వాలు అటకెక్కిస్తున్నాయి.

బీఎస్‌ఎఫ్‌ సరికొత్త ప్రణాళిక
భారత సైనిక దళాల ఆధునికీకరణకు అమెరికా ముందుకు వచ్చింది. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడాలని, రక్షణ రంగంలో భాగస్వామ్యం పెరగాలని అగ్రరాజ్యం ఆశిస్తోంది. ఇటీవల సెనెట్‌ సాయుధదళాల కమిటీ సభ్యుల ముందు హాజరైన రక్షణ మంత్రి ప్రతినిధి మార్క్‌ టి ఎస్పర్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే రెండు దేశాల నౌకాదళాలు సంయుక్తంగా ‘మలబార్‌’ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో జపాన్‌ చేరింది. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా కూడా భాగస్వామి కావాలన్నది అమెరికా ఆలోచన. ఆధునికీకరణలో భాగంగా సైన్యానికి 2020 నాటికి 1.86 లక్షల బులెట్‌ప్రూఫ్‌ జాకెట్లు సమకూర్చాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.639 కోట్లు వెచ్చించనుంది. చొరబాట్లను సమర్థంగా నిరోధించేందుకు సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) ఈనెల ఒకటి నుంచి ఆపరేషన్‌ ‘సుదర్శన్‌’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా జమ్ములో 485, పంజాబ్‌లో 553 కిలోమీటర్ల సున్నితమైన పాక్‌ సరిహద్దులకు భారీగా బలగాలను తరలించింది. తమ దేశంలో ఇప్పటికీ 30 నుంచి 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారన్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశంతో సరిహద్దుల పరిరక్షణకు బహుముఖ కార్యాచరణ అవసరం. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. నిఘా, భద్రతా విభాగాల మధ్య నిరంతర సమన్వయం తప్పనిసరి. రక్షణశాఖకు నిధుల మంజూరులో ఉదారంగా వ్యవహరించాలి. అధునాత ఆయుధాల దిగుమతితోపాటు, ఈ రంగంలో స్వయం సమృద్ధికి వేగంగా అడుగులు వేయాలి. విధాన నిర్ణేతలు ఈ విషయంలో దూరదృష్టితో వ్యవహరించాలి!


- గోపరాజు మల్లపరాజు
Posted on 26-07-2019