Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


జాతీయం

బేటీ బచావో- బేటీ పఢావో

ఆడపిల్లల్ని కాపాడటం, వారిని చదువుల తల్లులుగా తీర్చిదిద్ది సాధికారత కల్పించడమన్నది స్థూలంగా 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమ లక్ష్యం. వివిధ స్థాయుల్లో ఉద్యమపంథాలో దీని అమలు కోసం సర్కారు బహుముఖ వ్యూహాల్ని సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆరేళ్లలోపు ఆడపిల్లల సంఖ్య విషయంలో బాగా వెనకబడిపోయిన 100 జిల్లాల్లో ఒకేసారి ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమం- లక్ష్యసాధన దిశలో ఏ రీతిన సాగిపోతుందో చూడాలిప్పుడు!

ఇది ఇటీవలి ముచ్చటే. హరియాణా రాష్ట్రంలోని జింద్‌లో చోటుచేసుకొన్న ఒక ఘటన ప్రసార సాధనాల దృష్టిని అంతగా ఆకర్షించి ఉండకపోవచ్చు. కానీ, స్థానికంగా పెద్ద సంచలనమే సృష్టించింది. ఒకేరోజు జరిగిన రెండు పెళ్లిళ్లు, తరతరాల్లో స్ఫూర్తి రగిలించే గొప్ప సందేశమిచ్చాయి. పెళ్లంటే- మూడుముళ్లతో ఒక్కటయ్యే కొత్త జంట, కొంగు ముడి వేసుకొని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడవడం- నూరేళ్ల బంధంలో కీలక ఘట్టం. కానీ, అక్కడ ఇద్దరు పెళ్లికూతుళ్లూ తమ పరిపక్వ, వినూత్న ఆలోచన ధోరణితో మరో రెండడుగులు ముందుకు వేశారు. హోమగుండం చుట్టూ ఏడు కాదు, తొమ్మిదిసార్లు ప్రదక్షిణలు చేద్దామన్నారు. దాంతో పెళ్లికొడుకుల తరఫువారు మొదట్లో ఆశ్చర్యపోయినప్పటికీ, అందుకు సరైన, సహేతుకమైన కారణాలు ఉండటంతో అంగీకరించారు. తమకు పుట్టబోయే ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకొంటామంటూ ఎనిమిదో అడుగు, చెట్లను రక్షించుకొంటామంటూ తొమ్మిదో అడుగూ వేసి- ప్రతిజ్ఞలు చేశారు. రెండు పెను సంక్షోభాల బారినుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో ప్రయత్నించాల్సిన ఆవశ్యకతను చాటిచెప్పారు. ముఖ్యంగా హరియాణాలో ఈ ఘటన చోటు చేసుకోవడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మగపిల్లలతో పోలిస్తే దేశంలో అతి తక్కువగా ఆడపిల్లలు కలిగి ఉన్న రాష్ట్రం హరియాణా. దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి మగపిల్లలకు 943మంది ఆడపిల్లలు ఉంటే, తాజా గణాంకాల ప్రకారం హరియాణాలో అది 879. రెండు మూడేళ్లనాటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగుపడినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ విషయంలో ఆ రాష్ట్రం ఇంకెంతో దూరం పయనించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హరియాణాలోని పానిపట్‌లో 'బేటీ బచావో, బేటీ పఢావో' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. జన్‌ధన్‌ యోజన, స్వచ్ఛభారత్‌ అభియాన్‌ల తరవాత ప్రధానమంత్రి చేపడుతున్న అత్యంత ప్రభావాన్విత పథకమిది.

సామాజిక ఉద్యమం

మహిళలపై హింసను నిరోధించడంతోపాటు ఆడపిల్లలు, స్త్రీల హక్కుల మన్నన, పరిరక్షణ, అమలు కోసమే 'బేటీ బచావో, బేటీ పఢావో' పథకమని కేంద్ర మహిళలు, బాలల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వివరించింది. ఈ కార్యక్రమాన్ని అనుసరించి- ఆడపిల్లల సంఖ్య మగపిల్లలతో సమానస్థాయిలో పెరగడాన్ని అభివృద్ధి సూచికగా, సత్పరిపాలనకు గీటురాయిగా భావించేలా సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి భారీయెత్తున ప్రచారోద్యమాన్ని చేపట్టనున్నారు. స్థానిక, సామాజిక, మహిళా యువజన వర్గాలతో కార్యకర్తల బృందాల్ని ఏర్పాటు చేస్తారు. ఆడపిల్లలకు అనుకూలమైన విధానాలు చేపట్టేలా పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్ని నిర్దేశిస్తారు. లింగ నిర్ధారణ పరీక్షల్ని అరికట్టి, ఆడశిశువుల భ్రూణహత్యల్ని అడ్డుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఆడపిల్లల పట్ల ఎక్కడా ఎలాంటి విచక్షణకు తావు లేకుండా చూసి- పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, విద్యాబుద్ధుల ద్వారా వారి సర్వోన్నతికి కృషి చేస్తారు. వివిధ సామాజిక, ఆర్థిక, రాజకీయ వేదికల మీద స్వేచ్ఛగా తమ గొంతు వినిపించేందుకు, చురుగ్గా పాలు పంచుకొనేందుకు, సారథ్య స్థాయికి ఎదిగేందుకు ఆడపిల్లల్ని ప్రోత్సహిస్తారు. పరిణత సమాజంలో సహజసిద్ధంగా చోటు చేసుకోవాల్సిన పరిణామాలే ఇవన్నీ. ఈ ప్రాధాన్యాంశాల మీద ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేకంగా దృష్టి సారించడం సహర్షంగా స్వాగతించదగ్గది. ఈ దారిలో ఎదురయ్యే అవరోధాలు ఎంత త్వరితంగా, సమర్థంగా అధిగమిస్తే- గమ్యం అంత సునాయాసం!

అడుగడుగునా గండాలు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశ ప్రగతి గగనాంతర రోదసిని దాటి పైపైకి దూసుకెళుతున్నప్పటికీ, ఆడపిల్లకు బతికే హక్కు వంటి కీలక సామాజికాంశాల్లో మన కాళ్లకింది నేల కుంగిపోతోంది. మహిళలకు గౌరవం దక్కిన చోటే దేవతలు నడయాడతారన్న ఈ దేశంలో నేడు ఆడపిల్లగా పుట్టడం, పుట్టినా సురక్షితంగా మనుగడ సాగించడమే దుర్భరమవుతున్న దురవస్థ- ప్రపంచం ముందు తలదించుకొనేలా చేస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యుఈఎఫ్‌) విడుదల చేసిన 2014 లింగ వ్యత్యాస సూచిక- ఆడపిల్లల పట్ల ఇండియాలో విచక్షణ ఏ స్థాయిలో ఉందో కళ్లకు కట్టింది. 142 దేశాల సూచీలో 114వ స్థానంతో భారత్‌, అట్టడుగు స్థాయి దేశాల సరసన తలవంచుకుని నిలబడాల్సి వచ్చింది. స్వచ్ఛంద సంస్థ 'సేవ్‌ ద చిల్డ్రన్‌' కోసం టాటా సామాజిక శాస్త్రాల సంస్థ(టిస్‌) మేధావులు, 'భారత బాలికా ప్రపంచం-2014' పేరిట రూపొందించిన నివేదిక, దేశంలో ఆడపిల్లల సంఖ్య ఎంత ప్రమాదకరంగా దిగజారుతోందో, వారి పట్ల నిర్లక్ష్యం ఏ స్థాయిలో గూడుకట్టుకుందో వెల్లడించింది. దాని ప్రకారం- దేశంలో ఆరేళ్లలోపు ఆడపిల్లల సంఖ్య 1991లో మగపిల్లల సంఖ్యకన్నా 42 లక్షలు తక్కువ. 2011నాటికి ఆ వ్యత్యాసం 71 లక్షలకు చేరింది. చిన్నచూపు అన్నది ఆడపిల్లల ఆరోగ్యాన్ని, తద్వారా వారి మనుగడనూ ప్రభావితం చేస్తోంది. శారీరకంగా ఆడ శిశువులు, మగ శిశువులకన్నా బలంగా ఉంటారు.

అందువల్ల ప్రతి వెయ్యి జననాలకు, 28 రోజుల్లోపు మృతి చెందుతున్నవారిలో మగశిశువుల కన్నా, ఆడ శిశువులు తక్కువ. ఆ తరవాత పరిస్థితి మారిపోతోంది. పోషకాహార లోపం, ఆరోగ్య పరిరక్షణ, ప్రత్యేక శ్రద్ధాసక్తుల వంటి విషయాల్లో దుర్విచక్షణ ఆడపిల్లల పాలిట పెనుశాపంగా మారుతోంది. అయిదేళ్లలోపు నమోదవుతున్న మరణాల్లో ప్రతి వెయ్యికి బాలురు 69.7, బాలికలు 79.2. ఆ తరవాతా అదే దుస్థితి కొనసాగుతోంది. దేశ ఆర్థిక ప్రగతిని సమ్మిళిత అభివృద్ధిగా మలచుకోవడమన్నది ఈ తరహా అసమానతల కారణంగానే అసాధ్యంగా మారుతోందని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ గతేడాది నవంబరులో 'లింగ సమానత, మహిళా సాధికారత'లపై బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా-పసిఫిక్‌ సదస్సుకు సమర్పించిన నివేదికలో స్వయంగా పేర్కొంది. ఆడపిల్లను కాపాడుకోవడం దేశానికి ప్రాణావసరమని వేరే చెప్పాలా?

ఆడశిశువుల భ్రూణహత్యను మించిన మహాపాపం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న డిసెంబరు నెలాఖరులో బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. కానీ, దేశంలో ఆ పాపం నిత్యం, నిరంతరాయంగా జరుగుతూనే ఉంది. ఫలితంగానే ఆడశిశువుల సంఖ్య నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. దేశంలో ఏటా అయిదు లక్షల ఆడ శిశువుల భ్రూణహత్యలు జరుగుతున్నట్టు ఒక అంచనా. తల్లిగర్భంలోనే ఆడశిశువుల్ని ఈ స్థాయిలో పాశవికంగా చిదిమివేయడం సామూహిక హత్యాకాండగాక మరేమిటి? గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణను నిషేధించి, తద్వారా ఆడపిల్లల భ్రూణ హత్యల నివారణ కోసమంటూ ఇరవై ఏళ్లనాడు, 1994లోనే చట్టం తెచ్చినప్పటికీ, అది పకడ్బందీగా అమలుకాని దుష్ఫలితమే ఈ దారుణం. ఏదో ఒక వంకతో రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగిస్తున్న కొందరు వైద్యులు, గర్భంలో ఉన్నది ఆడ శిశువైతే 'పింక్‌' అని, మగ శిశువైతే 'బ్లూ' అని సంకేతమివ్వడం ద్వారా చట్టానికి దొరకకుండా తప్పించుకొంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇంటర్నెట్‌ సహా ఎక్కడా లింగ నిర్ధారణ పరీక్షకు సంబంధించిన ప్రకటనలు చేయరాదు. ఆ మేరకు సుప్రీంకోర్టు 2008లోనే ఉత్తర్వు జారీ చేసింది. అమెరికా, యూకే, దుబాయ్‌, థాయ్‌లాండ్‌ తదితర దేశాలకు చెందిన అనేక క్లినిక్కులు ప్రకటనలు జారీచేస్తూ మరీ అలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చట్టాల్ని కట్టుదిట్టంగా అమలుపరచడమే కాదు, సర్వోన్నత న్యాయస్థానమే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించినట్టు ఆడపిల్లను కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా పరిస్థితిలో సానుకూల మార్పు సాధించవచ్చు.

మోదీ సర్కారు చొరవ

ఆడపిల్లను కంటికి రెప్పలా కాపాడుకోవడం అతి ముఖ్యం. అందుకే 'బేటీ బచావో'. చక్కని విద్యాబుద్ధులు నేర్పిస్తే ఆమే సమాజానికి దారి దీపం కాగలదు. 'బేటీ పఢావో' అర్థమదే. కానీ, గండాల సుడిగుండాలెన్నో దాటి, బయటపడిన ఆడపిల్లకు చదువులమ్మ ఒడిలోనూ చోటుదక్కడం గగనమైపోతోంది. ప్రభుత్వ తాజా గణాంకాల ప్రకారం బడిలో చేరుతున్న ప్రతి పదిమంది బాలికల్లో ముగ్గురు మాత్రమే ఎనిమిదో తరగతి వరకు చదువుకోగలుతున్నారు. గడచిన కొన్నేళ్లలో పాఠశాలల్లో పేర్లు నమోదు చేసుకొంటున్న ఆడపిల్లల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, మధ్యలో చదువు మానేస్తున్న బాలికల సంఖ్యా ఆందోళనకర స్థాయికి చేరింది. 45శాతం బాలికలు అయిదో తరగతికి చేరుకొనేలోగానే బడి మానేస్తున్నారు. పదో తరగతి పూర్తిచేసుకొంటున్న బాలికలు ప్రతి పది మందిలో ఒక్కరైనా ఉండటం లేదని 'టిస్‌' అధ్యయనం సైతం ధ్రువీకరించింది. ఏకరూప దుస్తులు(యూనిఫాం), పుస్తకాలు సైతం కొనలేని పేదరికం; బాల్యవివాహాలు; ఇంటిచాకిరీ వంటివెన్నో ఈ దురవస్థకు దారితీస్తున్నా- మరుగుదొడ్లు లేకపోవడం అయిదో తరగతి తరవాత ఆడపిల్లలు బడి మానేయడానికి ప్రధాన కారణమవుతోంది. బడిలోనూ, బయటా ఆడపిల్లలకు రక్షణ కొరవడటం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. ఒక బాలికకు చదువు చెప్పడమంటే, ఒక దేశానికి విద్యాబుద్ధులు నేర్పడమే కనుక, బాలికల విద్యకు ఎదురవుతున్న అవరోధాలన్నీ తొలగించి, ప్రోత్సాహ ప్రోద్బలాలు అందించాలన్న మోదీ సర్కారు నిర్ణయం- దీర్ఘకాలంలో దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల్ని గణనీయంగా ప్రభావితం చేసేదే. నిరుటి బడ్జెట్లో, 'బేటీ బచావో, బేటీ పఢావో' పథకానికి రూ.100కోట్లు కేటాయించిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ- రానున్న బడ్జెట్లో మరింత దన్ను ద్వారా చిత్తశుద్ధిని చాటుకోవలసిన అవసరం ఉంది!

(రచయిత - పి.దత్తారాం ఖత్రీ)
Posted on 22-01-2015